శృంగవరపుకోట : విశాఖ జిల్లా అనంతగిరి రేంజ్‌లో అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శోభా సుబ్బారావును ఏసీబీ అధికారులు సోమవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ రామకృష్ణప్రసాద్ అందించిన వివరాలిలాఉన్నాయి. అనంతగిరి మండలం టోకురు గ్రామ పంచాయతీ పరిధి జాకరవలస గ్రామానికి చెందిన నరాజి ప్రసాద్ తన ఇంట్లో ఫర్నీచర్ తయూరీ కోసం హుద్‌హుద్ సమయంలో కూలిన టేకుచెట్లను రైతుల నుంచి కొనుగోలు చేశాడు.
విషయం తెలుసుకున్న ఫారెస్ట్ సెక్షన్ అధికారి శోభా సుబ్బారావు నిబంధనలకు విరుద్ధంగా కలప నిల్వ చేయడం నేరమని ప్రసాద్‌ను బెదిరించారు. కేసు లేకుండా చూడాలంటే తనకు రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు ఇద్దరి మధ్య రూ. 11 వేలకు ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో ఈ నెల 23న ప్రసాద్ సెక్షన్ ఆఫీసర్‌కు రూ. 2 వేలు ఇచ్చాడు. మిగిలిన తొమ్మిది వేల రూపాయలకు ఒత్తిడి చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రసాద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
ఏసీబీ అధికారుల పథకం ప్రకారం సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఎస్.కోట రైల్వేస్టేషన్ రోడ్డులో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సుబ్బారావు (అద్దెల్లు) ఇంటికి వెళ్లి ప్రసాద్ రూ. 9 వేలు సుబ్బారావుకు అందించాడు. సొమ్ము తీసుకుంటున్న సుబ్బారావును ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని విచారించారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో అతడిని అనంతగిరి మండలంలో ముళియాగూడ జంక్షన్‌కు విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ రామకృష్ణప్రసాద్ మాట్లాడుతూ, ఈ విషయమై రేంజర్, గార్డులను కూడా విచారిస్తామన్నారు.
ఏసీబీకి చిక్కిన సెక్షన్ ఆఫీసర్
Published Tue, Apr 26 2016 4:44 AM | Last Updated on Wed, Sep 26 2018 6:01 PM
Advertisement