మార్కాపురం : పొలంలో సాగు చేసిన టేకు కర్ర నరికేందుకు అనుమతి కోరిన రైతు నుంచి అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి దప్పిలి రఘురామిరెడ్డి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు బుధవారం రాత్రి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ ఆర్‌వీఎస్‌ఎన్ మూర్తి కథనం ప్రకారం.. మార్కాపురం పట్టణం పూలసుబ్బయ్య కాలనీలో నివాసం ఉంటున్న షేక్ మహబూబ్‌బాషా తర్లుపాడు మండలం మీర్జాపేటలో ఓ రైతు సాగు చేసిన టేకు చెట్లను కొనుగోలు చేశాడు. వాటిని నరికి అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ స్థానిక అటవీశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. ఆ తర్వాత డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రఘురామిరెడ్డిని సంప్రదించి చెట్లను నరికేందుకు అనుమతి కావాలని కోరగా రూ.55 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
అంత ఇచ్చుకోలేనని చెప్పినా రఘురామిరెడ్డి వినిపించుకోకపోవటంతో మహబూబ్‌బాషా ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో రఘురామిరెడ్డి తన కార్యాలయం నుంచి బయటకు వచ్చి బైకుపై మహబూబ్ బాషాను ఎక్కించుకుని ఇంటికి వెళ్లాడు. అక్కడ మహబూబ్‌బాషా నుంచి రూ. 20 వేలు తీసుకుని ఇంట్లోకి వెళ్లిపోయాడు. ఆ వెంటనే రఘురామిరెడ్డి ఇంటికి ఏసీబీ డీఎస్పీ మూర్తి, ఇన్‌స్పెక్టర్లు కృపానందం, వెంకట సుబ్బారావు వచ్చారు.
వీరిని చూడి రఘురామిరెడ్డి కంగారు పడి నగదును దుస్తుల బుట్టలో పడేశాడు. ఏసీబీ అధికారులు ఆయన్ను చుట్టుముట్టి నగదు స్వాధీనం చేసుకున్నారు. తమ విచారణలో రఘురామిరెడ్డి లంచం తీసుకున్నట్లు రుజు వైందని, నగదుపై ఆయన వేలిముద్రలు గుర్తించామని డీఎస్పీ మూర్తి తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు చెప్పారు. అనంతరం రఘురామిరెడ్డి బావమరిది ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. రైతు ఇచ్చిన రూ.20 వేలతో తనకు సంబంధం లేదని అటవీ అధికారి రఘురామిరెడ్డి తెలిపారు.
ఉద్యోగుల్లో కలకలం
ప్రభుత్వ ఉద్యోగి రఘురామిరెడ్డి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడని తెలియడంతో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో కలకలం రేగింది. తర్వాత టార్గెట్ ఎవరోనంటూ చర్చించుకున్నారు. గత నెల 24న యర్రగొండపాలెంలో విద్యుత్‌శాఖ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. అంటే 15 రోజుల వ్యవధిలో ఒకే ప్రాంతంలో ఇద్దరు అధికారులు ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు.
ఏసీబీ వలలో అవినీతి చేప
Published Thu, Dec 11 2014 2:44 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement
Advertisement