నిర్మల్‌జిల్లా: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా టేకు ఆకులు రాలి... చెట్లు ఎండిపోతున్నాయి. వర్షాకాలంలో పచ్చగా ఉండాల్సిన ఆకులు గోధుమ రంగులోకి మారి ఎండుటాకుల్లా నేల రాలుతున్నాయి.ఒక్కసారిగా చెట్లు ఎండిపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అడవుల జిల్లా ఆదిలాబాద్‌లో ఇప్పుడు ఎటుచూసినా టేకుచెట్లన్నీ మోడువారి కనిపిస్తున్నాయి. సాధారణంగా ఈ సమయంలో పచ్చగాఉండాల్సిన అడవులు...ఎరుపు రంగులోకి మారిపోతున్నాయి.
యూటెక్టోనా మాచెరాలిస్ తెగులుతోనే
టేకు ఆకు అస్థిపంజరంగా మారడానికి యూటెక్టోనా మాచెరాలిస్ తెగులు కారణమని వృక్షశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. టేకుఆకుల్లో ఉన్నరసాలను చీడ పురుగులు పీల్చడంతో నిర్విర్యమైపోతుంది. సూర్యరశ్మిసమక్షంలో కిరణజన్య సంయోగక్రియ జరపకుండా అడ్డుకుంటాయి.అంతేకాకుండా టేకు ఆకులు ఎదగకుండా ఈ చీడపురుగులు సన్నని జాలీల వంటి వలయాలు ఏర్పరుస్తాయి. ఫలితంగా ఆకులన్నీ ఎండిపోయి చెట్టు మొత్తం ఎరుపు రంగులోకి మారుతుంది.
కళ తప్పుతున్న అడవులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అడవుల విస్తీర్ణం ఎక్కువ. వర్షాలు మొదలైన తర్వాత జూలై, ఆగస్టు మాసాల్లో అడవులన్నీ పచ్చదనంతో నిండిపోయాయి. కానీ పక్షం రోజులుగా అడవుల్లోని టేకుచెట్లు పూర్తిగా ఎర్రబారడంతో అడవులు కళ తప్పుతున్నాయి. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దులను కలిపే సహ్యద్రి పర్వత పంక్తుల్లోని మహబూబ్‌ఘాట్స్‌లో దట్టమైన టేకు చెట్లు కనిపిస్తాయి. ఈ సంవత్సరం మాత్రం ఈ టేకు చెట్లన్నీ ఎర్రబారి కనిపిస్తున్నాయి. దగ్గరికి వెళ్లి చూస్తే చెట్టులోని ఆకులన్నీ అస్థిపంజరంలా మారి జల్లెడను తలపిస్తున్నాయి.
వేగంగా వ్యాప్తి..
యూటెక్టోనా మాచెరాలిస్ అనే తెగులు కారణంగా టేకుచెట్ల ఆకులు ఎండిపోయినట్టుగా మారుతున్నాయి. ఈ తెగులు వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఒక అంగుళం పొడవు ఉండే చిన్న చీడ పురుగులే ఇందుకు కారణం. ఇవి వెడల్పాటి టేకు ఆకులోని రసాన్ని మొత్తం పీల్చి పిప్పి చేస్తాయి. ఆకులు ఎదగకుండా వలయాలను నిర్మిస్తాయి. దీనివల్ల ఆకు క్రమంగా రంగు మారుతుంది. వీటిని టేకు స్కెలిటోనైజర్‌గా పిలుస్తారు. వాతావరణ పరిస్థితుల ద్వారా దానికదే అదుపులోకి వస్తుంది.
– డాక్టర్ వెల్మల మధు, వృక్షశాస్త్ర నిపుణుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్
Comments
Please login to add a commentAdd a comment