pests
-
ఆకు అస్థిపంజరమై.. ‘టేకు’ ఎర్రబారి
నిర్మల్‌జిల్లా: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా టేకు ఆకులు రాలి... చెట్లు ఎండిపోతున్నాయి. వర్షాకాలంలో పచ్చగా ఉండాల్సిన ఆకులు గోధుమ రంగులోకి మారి ఎండుటాకుల్లా నేల రాలుతున్నాయి.ఒక్కసారిగా చెట్లు ఎండిపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అడవుల జిల్లా ఆదిలాబాద్‌లో ఇప్పుడు ఎటుచూసినా టేకుచెట్లన్నీ మోడువారి కనిపిస్తున్నాయి. సాధారణంగా ఈ సమయంలో పచ్చగాఉండాల్సిన అడవులు...ఎరుపు రంగులోకి మారిపోతున్నాయి. యూటెక్టోనా మాచెరాలిస్ తెగులుతోనే టేకు ఆకు అస్థిపంజరంగా మారడానికి యూటెక్టోనా మాచెరాలిస్ తెగులు కారణమని వృక్షశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. టేకుఆకుల్లో ఉన్నరసాలను చీడ పురుగులు పీల్చడంతో నిర్విర్యమైపోతుంది. సూర్యరశ్మిసమక్షంలో కిరణజన్య సంయోగక్రియ జరపకుండా అడ్డుకుంటాయి.అంతేకాకుండా టేకు ఆకులు ఎదగకుండా ఈ చీడపురుగులు సన్నని జాలీల వంటి వలయాలు ఏర్పరుస్తాయి. ఫలితంగా ఆకులన్నీ ఎండిపోయి చెట్టు మొత్తం ఎరుపు రంగులోకి మారుతుంది. కళ తప్పుతున్న అడవులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అడవుల విస్తీర్ణం ఎక్కువ. వర్షాలు మొదలైన తర్వాత జూలై, ఆగస్టు మాసాల్లో అడవులన్నీ పచ్చదనంతో నిండిపోయాయి. కానీ పక్షం రోజులుగా అడవుల్లోని టేకుచెట్లు పూర్తిగా ఎర్రబారడంతో అడవులు కళ తప్పుతున్నాయి. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దులను కలిపే సహ్యద్రి పర్వత పంక్తుల్లోని మహబూబ్ఘాట్స్లో దట్టమైన టేకు చెట్లు కనిపిస్తాయి. ఈ సంవత్సరం మాత్రం ఈ టేకు చెట్లన్నీ ఎర్రబారి కనిపిస్తున్నాయి. దగ్గరికి వెళ్లి చూస్తే చెట్టులోని ఆకులన్నీ అస్థిపంజరంలా మారి జల్లెడను తలపిస్తున్నాయి. వేగంగా వ్యాప్తి.. యూటెక్టోనా మాచెరాలిస్ అనే తెగులు కారణంగా టేకుచెట్ల ఆకులు ఎండిపోయినట్టుగా మారుతున్నాయి. ఈ తెగులు వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఒక అంగుళం పొడవు ఉండే చిన్న చీడ పురుగులే ఇందుకు కారణం. ఇవి వెడల్పాటి టేకు ఆకులోని రసాన్ని మొత్తం పీల్చి పిప్పి చేస్తాయి. ఆకులు ఎదగకుండా వలయాలను నిర్మిస్తాయి. దీనివల్ల ఆకు క్రమంగా రంగు మారుతుంది. వీటిని టేకు స్కెలిటోనైజర్గా పిలుస్తారు. వాతావరణ పరిస్థితుల ద్వారా దానికదే అదుపులోకి వస్తుంది. – డాక్టర్ వెల్మల మధు, వృక్షశాస్త్ర నిపుణుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ -
వేరుశనగలో ‘విశిష్ట’మైనది
సాక్షి, అమరావతి: వేరుశనగ రైతులకు తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తీపి కబురు అందించింది. బెట్ట పరిస్థితులు.. ఆకుమచ్చ తెగులును తట్టుకోవడమే కాకుండా.. 15 శాతం అదనంగా గింజ దిగుబడినిచ్చే కొత్త వంగడం టీసీజీఎస్–1694 (విశిష్ట) రకాన్ని రానున్న ఖరీఫ్ నుంచి అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటించింది. గతేడాది విడుదల చేసిన టీసీజీఎస్–1694 (విశిష్ట) ప్రయోగాత్మక సాగు విజయవంతం కావడంతో ఖరీఫ్ నుంచి పూర్తి స్థాయిలో రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాధారం కింద కదిరి–6 (కే–6), నారాయణి, ధరణి, నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో టీఏజీ–24, కే–6 రకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కానీ.. ఈ రకాలు బెట్ట (నీటి ఎద్దడి)ని తట్టుకోలేకపోతున్నాయి. మరోవైపు వీటి దిగుబడులపై టిక్కా ఆకుమచ్చ తెగులు తీవ్ర ప్రభావం చూపుతోంది. తెగుళ్ల నివారణకు రెండు, మూడుసార్లు ఖరీదైన శిలీంధ్ర నాశిని మందులను పిచికారీ చేయాల్సి రావడం రైతులకు భారంగా పరిణమించింది. గింజ శాతంలో కదిరి లేపాక్షిని మించి.. రాష్ట్రంలో ఖరీఫ్‌లో 16.85 లక్షల ఎకరాలు, రబీలో 2.35 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగవుతోంది. వర్షాధార భూముల్లో బెట్ట, తెగుళ్లను తట్టుకునే వంగడాలను అభివృద్ధి చేయడంలో భాగంగా.. అధిక దిగుబడి ఇచ్చేలా తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం టీసీజీఎస్–1694 (విశిష్ట) వంగడాన్ని రూపొందించింది. కదిరి–6, ఐసీజీ (ఎఫ్డీఆర్ఎస్)–79 రకాలను సంకరపరచడం ద్వారా దీనిని అభివృద్ధి చేశారు. 2022లో విడుదల చేసిన ఈ విత్తనాన్ని ప్రయోగాత్మకంగా సాగు చేసి సత్ఫలితాలను సాధించారు. ఇది 25 రోజుల వరకు బెట్టను తట్టుకోగలదు. జాతీయ స్థాయిలో విశేష ప్రాచుర్యం పొందిన కదిరి లేపాక్షి హెక్టార్‌కు 20నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా.. గింజ దిగుబడి 60 శాతం దాటడం లేదు. కొత్తగా అభివృద్ధి చేసిన విశిష్ట రకం మాత్రం బెట్ట, ఆకుమచ్చ తెగులును తట్టుకోవడంతోపాటు గింజ దిగుబడి శాతం 72నుంచి 75 శాతం నమోదవడం రైతులకు లాభించే అంశం. దీని విశిష్టతలివీ ♦ పంటకాలం 100–105 రోజులు (ఖరీఫ్), 105–110 రోజులు (రబీ). ♦పొడవు 31–37 సెం.మీ. (ఖరీఫ్), 28–30 సెం.మీ. (రబీ). ♦హెక్టారుకు సగటు దిగుబడి 22–25 క్వింటాళ్లు (ఖరీఫ్), 25–30 క్వింటాళ్లు (రబీ). ♦ 100 గింజల బరువు 42–45 గ్రాములు. గింజ శాతం 72–75.. నూనె శాతం 50. ♦ పైరు లేత ఆకుపచ్చ రంగులో సన్నగా పొడవుగా ఉంటుంది. ♦ఊడలు ఒకేసారి దిగడం వల్ల కాయలు ఒకేసారి పక్వానికి వస్తాయి. ♦ గింజలు లేత గులాబీ రంగులో గుండ్రంగా నున్నగా ఉంటాయి. బెట్ట, తెగుళ్లను తట్టుకుంది మాది సముద్ర తీర ప్రాంతం. ఇప్పటివరకు టీఏజీ–24 రకాన్ని ఎక్కువగా సాగు చేశా. కాయల దిగుబడి 16–20 క్వింటాళ్లకు మించి రాలేదు. దాదాపు ప్రతి సీజన్లో ఆకుమచ్చ తెగులు బారినపడటంతో సాగు ఖర్చులు భారంగా ఉండేవి. విశిష్ట రకాన్ని ప్రయోగాత్మకంగా సాగు చేశా. టీఏజీ–24తో పోలిస్తే పంట కాలం 7నుంచి 10 రోజులు ఆలస్యమైనా బెట్ట, తెగుళ్లను తట్టుకుంది. గింజ నాణ్యత చాలా బాగుంది. సగటు దిగుబడి 22 క్వింటాళ్లు వచ్చింది. – మధుసూదనరావు, రామతీర్థం, నెల్లూరు జిల్లా గింజ దిగుబడి 75 శాతం నమోదైంది కే–6 రకం సాగు చేస్తే ఎకరాకు 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉండేది. కదిరి లేపాక్షి రకాన్ని కూడా సాగు చేశా. అది ఎకరాకు 13 æక్వింటాళ్లు వచ్చింది. చీడపీడల ఉధృతి కాస్త తట్టుకున్నప్పటికీ గింజ శాతం తక్కువగా నమోదైంది. ఇప్పుడు విశిష్ట రకాన్ని సాగు చేశా. ఎకరాకు 13 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. కానీ.. గింజ శాతం 75గా నమోదైంది. గింజ నాణ్యత కే–6 రకాన్ని పోలి ఉండడంతో మార్కెట్ ధరకు ఢోకా లేదు. – అల్లాబక్షు, తోపుదుర్తి, అనంతపురం వర్షాభావ ప్రాంతాలకు అనుకూలం టీసీజీఎస్–1694 (విశిష్ట) వర్షాభావ ప్రాంతాల్లో సాగుకు ఎంతో అనువైనది. ఎకరాకు 50 కేజీల విత్తనం సరిపోతుంది. శాస్త్రవేత్తల సిఫార్సు మేరకు ఎరువులు, పురుగుల మందులు వినియోగిస్తే పెట్టుబడి ఎకరాకు రూ.25 వేలకు మించదు. పంటకాలంలో రెండుసార్లు ఎకరాకు అరకిలో సూక్ష్మ ధాతువులు వేస్తే మంచి ఫలితాలను రాబట్టవచ్చు. మదర్ సీడ్ ఉత్పత్తి చేస్తున్నాం. వచ్చే ఖరీఫ్ నుంచి పూర్తిస్థాయి విత్తనం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏపీ సీడ్స్ కృషి చేస్తోంది. – డాక్టర్ ఎ.ప్రసన్న రాజేష్, ప్రధాన శాస్త్రవేత్త, వేరుశనగ పరిశోధనా కేంద్రం -
పంటను తినేస్తున్న ఆ పురుగు జాడ తెలిసింది
సాక్షి, అమరావతి: మిరపను చిదిమేసింది.. మామిడి పూతను ఆశించింది.. చింతను తాకింది.. ఇక కందులు, పెసలు, శనగతో పాటు పత్తి, వంగ, మునగ, దోస, సొర, కాప్సికమ్, బంతి, చామంతి.. ఇలా పలు పంటలను ఆశిస్తోంది. రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కూడా విధ్వంసం సృష్టిస్తోంది. తొలుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి.. కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో ఈ పురుగు ఉధృతిని కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జాతీయ పరిశోధనా సంస్థలు రంగంలోకి దిగి అధ్యయనం చేస్తున్నాయి. ఇలా ఒక్కసారిగా దాదాపు అన్ని రకాల పంటలపై దాడి చేసి, నాశనం చేస్తున్న దీనిని వ్యవసాయ శాస్త్రవేత్తలు ‘త్రిప్స్ పార్విస్పైనస్’ అని చెబుతున్నారు. అంటే అదో కొత్త రకం తామర పురుగు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా మూడేళ్లుగా మిరప ధరలు మార్కెట్లో నిలకడగా ఉన్నాయి. ఈ ఏడాది ఏకంగా క్వింటాల్ రూ.16 వేల నుంచి రూ.20 వేలకు పైగా పలుకుతోంది. ఈ కారణంగానే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రికార్డు స్థాయిలో మిరప సాగైంది. అయితే అనూహ్యంగా ఈ ఏడాది ఈ పంటను ఈ కొత్త తామర పురుగు చిదిమేసింది. తొలుత సాధారణ తామర పురుగు (స్కిప్టో ట్రిప్స్ డార్సాలిస్) గానే భావించారు. సాధారణ పురుగు ఆకుల మీద చేరి రసాన్ని పీలిస్తే, ఈ కొత్త రకం పురుగు పూత, పిందెల్లోకి చేరి రసాన్ని పీల్చి.. కనీస దిగుబడి కూడా రానీయకుండా నాశనం చేస్తుందని గుర్తించారు. యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు – ఈ పురుగు ఉధృతిని ఆదిలోనే గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టింది. ఏపీ ఎన్జీ రంగా వ్యవసాయ, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ శాస్త్రవేత్తలతో ఏర్పాటు చేసిన బృందాలను తొలుత రంగంలోకి దింపింది. శాంపిల్స్ సేకరించి నేషనల్ బ్యూరో ఫర్ అగ్రికల్చర్ ఇన్సెట్ రీసోర్సెస్ (ఎన్బీ ఎఐఆర్)కు పంపించింది. – ఇది సాధారణ తామర పురుగు కాదని సౌత్ ఈస్ట్ ఏషియన్ ట్రిప్స్‌లో ఒకటైన ట్రిప్స్ పార్విస్పైనస్గా, ఇండోనేషియా నుంచి 2015లో మన దేశంలోకి చొరబడినట్టుగా గుర్తించారు. రాష్ట్ర ఉద్యాన శాస్త్రవేత్తలు సూచించిన యాజమాన్య పద్ధతులు పాటించేలా ఆర్బీకేల ద్వారా రైతులకు అవగాహన కల్పించడంతో 20–30 శాతం పంటను కాపాడగలిగారు. రంగంలోకి జాతీయ పరిశోధనా సంస్థలు – భవిష్యత్‌లో పెనువిపత్తుగా మారబోతుందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్)తో పాటు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకు లేఖలు రాసి కేంద్రంపై ఒత్తిడి తీసు కొచ్చింది. – ఫలితంగా ఐసీఎఆర్కు అనుబంధంగా పని చేస్తోన్న డైరెక్టరేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటక్షన్ క్వారంటైన్ అండ్ స్టోరేజ్ (డీపీపీక్యూఎస్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్ మెంట్ (ఎన్ఐపీహెచ్ఎం), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ (ఐఐహచ్ఆర్), నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ (ఎన్‌సీఐపీఎం), సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెస్ట్ కంట్రోల్ (సీఐపీసీ)లతో పాటు ఎన్బీ ఏఐఆర్లకు చెందిన సీనియర్ శాస్త్రవేత్తల బృందాలు.. ఏపీ, తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించాయి. – ఇండోనేషియా, మలేషియా దేశాల్లో పుట్టిన ఈ కీటక ఉధృతిని ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, చత్తీస్ఘడ్æ, గుజరాత్, మహారాష్ట్రలో గమనించారు. మిరపతో పాటు ఇతర పంటలకూ వ్యాపిస్తున్నట్టు గుర్తించారు. సాధారణంగా తామర పురుగు బలహీన పడి సంతతి తగ్గిపోవడంతో.. దాని స్థానంలో బలమైన ఈ కొత్త రకం తామర పురుగు వ్యాపిస్తున్నట్టుగా గుర్తించారు. – ఈ బృందాలు గత నెల రోజుల్లో మూడు విడతలుగా పర్యటించాయి. ప్రస్తుతం ఏపీ–తెలంగాణాలో పర్యటిస్తున్నాయి. ప్రస్తుతం మిగిలి ఉన్న పంటను ఏ విధంగా కాపాడాలి? రానున్న సీజన్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇతర పంటలకు వ్యాపించకుండా ఏం చేయాలి? అనే అంశాలపై సమగ్ర నివేదిక రూపొందించి త్వరలో కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు. ఏపీ ప్రభుత్వ చొరవ వల్లే.. 2015లో దేశంలో గుర్తించిన ఈ పురుగు 2021లో ఉధృతంగా వ్యాపించింది. ఇందుకు గల కారణాలపై లోతుగా అధ్యయనం చేస్తున్నాం. దీని ఉధృతిని ఏపీ ప్రభుత్వమే ముందుగా గుర్తించింది. కేంద్రానికి లేఖలు రాయడం వల్లే ఐసీఏఆర్ బృందాలను పంపింది. గ్రామ స్థాయిలో యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల ఇంత ఉధృతిలో కూడా 20–30 శాతం పంటను కాపాడగలిగారు. దీని కట్టడికి షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్‌లో అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతులపై వారంలోగా కేంద్రానికి నివేదిక సమర్పించ బోతున్నాం – డాక్టర్ రచన ఆర్ఆర్, సీనియర్ శాస్త్రవేత్త, ఎన్‌బీఎఐఆర్, బెంగళూరు పంట నష్టం అపారం ఈ పురుగు మిరపపై ఉధృతంగా వ్యాపించింది. 60 శాతానికి పైగా పంటను దెబ్బతీసింది. నష్ట తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఏపీ, తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో మిరపతో పాటు ఇతర పంటలపై కూడా ఎక్కువగా కన్పిస్తోంది. సాధ్యమైనంత త్వరగా దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మా బృందాలు ఇచ్చే నివేదిక ఆధారంగా వచ్చే సీజన్లో విత్తు నుంచి కోత వరకు అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతులపై కేంద్రం త్వరలో ప్రొటోకాల్‌ను రూపొందిస్తుంది. – డాక్టర్ రాఘవేంద్ర కే.వీ, ఎంటమాలజీ శాస్త్రవేత్త, ఎన్‌సీఐపీఎం, న్యూఢిల్లీ ప్రారంభ దశలోనే గుర్తించాం ఈ పురుగు ఉధృతిని ప్రారంభ దశలోనే గుర్తించాం. ఎన్బీఏఐఆర్కు శాంపిల్స్ పంపించాం. వాటి తీవ్రతను గుర్తించగలిగాం. ఆర్బీకే స్థాయిలో యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించాం. రాష్ట్ర ప్రభుత్వ చొరవతోనే జాతీయ స్థాయిలో అధ్యయనం జరుగుతోంది. – డాక్టర్ ఎస్ఎస్ శ్రీధర్, కమిషనర్, ఏపీ ఉద్యాన శాఖ -
పురుగు సోకి.. రైతు రాలి!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/ సాక్షి ప్రతినిధి, వరంగల్: మిర్చి సాగు ఈ ఏడాది రైతులను అతలాకుతలం చేసింది. తెగుళ్లు సోకడంతో లాభాలు పక్కనపెడితే చాలాచోట్ల పెట్టుబడులు కూడా దక్కలేదు. అప్పటికే ఉన్న అప్పులకు కొత్త అప్పులు తోడయ్యాయి. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన రైతులు బతుకు చాలిస్తున్నారు. తెగుళ్లను నివారించలేని ఆ పురుగుల మందులనే తాగి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఉమ్మడి వరంగల్‌లో ఏడుగురు, ఖమ్మం జిల్లాలో ఐదుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది. 50 శాతానికి పైగా దెబ్బతిన్న పంటలు తెలంగాణలో 3,58,558 ఎకరాల్లో రైతులు మిర్చి పంటలు వేశారు. అత్యధికంగా వరంగల్, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో 2,82,598 ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నట్లు ఉద్యానవన శాఖ అధికారుల గణాంకాలు చెప్తున్నాయి. అయితే అంతుబట్టని తెగులుతో 50 శాతానికి పైగా పంటలు దెబ్బతిన్నాయి. ఎకరాకు రూ.1.72 లక్షల మేర పెట్టుబడి ఖర్చు చేస్తుండగా.. తెగుళ్ల కారణంగా దిగుబడి గణనీయంగా పడిపోయింది. పంటను కాపాడుకునేందుకు విపరీతంగా పురుగుల మందులు వాడినా ఫలితం లేకపోవడంతో ఎకరాకు 35 క్వింటాళ్ల మేర దిగుబడి రావాల్సి ఉండగా ఐదు క్వింటాళ్లు కూడా రాని పరిస్థితి నెలకొంది. లొంగని తెగుళ్లతో తీవ్ర నష్టాలు రాష్ట్రవ్యాప్తంగా సాగైన పంటలో 2 లక్షల ఎకరాలకు పైగా తెగుళ్లు ఆశించాయి. ఇందులో 1.70 లక్షల ఎకరాల్లో పూర్తిగా పంట నష్టం జరిగింది. జెమిని (గుబ్బ తెగులు), తామర, వేరు కుళ్లు వంటి తెగుళ్ల దాడితో పంట రైతుల చేతికి అందడం లేదు. ఈ తెగుళ్లు వదిలించేందుకు రైతులు రూ.వేలు వెచ్చించి పురుగుల మందు పిచికారీ చేస్తున్నా ఫలితం కానరాలేదు. మిర్చి సాగుకు ప్రసిద్ధి చెందిన వరంగల్ జిల్లాలో 30 నుంచి 40 బస్తాలు దిగుబడి వస్తుందని భావిస్తే తెగుళ్ల కారణంగా 8 నుంచి 10 బస్తాలకు పడిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్, జనవరి మాసాల్లో వచ్చిన తీవ్ర చలిగాలులు కూడా కొంత దెబ్బతీశాయి కేరింతల ఇల్లు రోదిస్తోంది! మహబూబాబాద్ మండలం పర్వతగిరి గ్రామానికి చెందిన నారమళ్ల సంపత్ (25)కు మూడేళ్ల కూతురు ఉండగా ఇటీవలే మరో పాప పుట్టింది. చిన్నారి కేరింతలు కుటుంబాన్ని ఆనందంలో ముంచెత్తాయి. అంతలోనే ఆ యువరైతు సాగు చేసిన మిర్చికి తెగులు సోకింది. పంట దెబ్బ తినడంతో అప్పటికే ఉన్న అప్పుల భారం ఆత్మహత్యకు ప్రేరేపించింది. మిరప చేనులోనే కలుపు మందు తాగి బలవన్మరణం చెందాడు. సంపత్‌కు మూడున్నర ఎకరాల భూమి ఉంది. ఇందులో అర ఎకరంలో వరి సాగు చేశాడు. మిగతా మూడెకరాలతో పాటు, మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని మిర్చి సాగు చేశాడు. గతంలోనే ఇతనికి పంట కోసం చేసిన రూ.3 లక్షల అప్పు ఉంది. తాజాగా మిర్చి సాగు చేసి అప్పు తీర్చేద్దామనుకున్నాడు. మరో రూ.5 లక్షలు అప్పు చేశాడు. కానీ తామర తెగులు సోకి పంటంతా దెబ్బతినడం, అప్పులు మీద పడడంతో తీవ్ర ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ కుటుంబం తీరని విషాదంలో మునిగిపోయింది. ఈసారైనా లాభం వస్తుందని.. ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని నెమలిపురి గ్రామానికి చెందిన భూక్య వాగ్యా తనకున్న మూడెకరాలతోపాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని మిర్చి సాగు చేశాడు. గత ఏడాది ఇదే పంట సాగు రూ.3.50 లక్షల నష్టం మిగిల్చింది. ఈసారైనా లాభం వస్తుందని ఆశించాడు. తొలుత రూ.40 వేల విలువైన విత్తనాలు విత్తినా నారు చేతికి రాలేదు. దీంతో రూ.లక్ష పెట్టి నారు కొనుగోలు చేశాడు. పంట చేతికి వచ్చే సమయానికి తెగుళ్లు, తామర పురుగు, వైరస్ సోకడంతో దెబ్బతింది. ఎన్ని మందులు పిచికారీ చేసినా పంట చేతికి రాలేదు. మొత్తం మీద ఈ ఏడాది రూ.4 లక్షలు, గత ఏడాది ఉన్న అప్పు మొత్తం రూ.8 లక్షల వరకు అప్పులయ్యాయి. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన వాగ్యా తన తోటలోనే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయనకు ఒక కూతురు, కొడుకు ఉన్నారు. అల్లుడు గత నాలుగేళ్ల క్రితం విద్యుత్ షాక్‌తో మృతి చెందడంతో కూతురూ పుట్టింట్లోనే ఉంటోంది. వాగ్యా మృతితో ఈ కుటుంబం ఇప్పుడు దిక్కులేనిదైంది. రూపాయి వచ్చే పరిస్థితి లేక.. ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు దగ్గు సంపత్‌రావు (48). ఈయనది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి మండలం శ్యాంనగర్ గ్రామం. భార్య సుమతి, కుమార్తెలు దివ్య, నవ్య ఉన్నారు. తనకున్న ఏడెకరాల భూమిలో నాలుగెకరాలు మొదటి కుమార్తె దివ్యకు ఇచ్చి 2011లో వివాహం చేశాడు. మిగిలిన మూడెకరాలతో పాటు కుమార్తె భూమిని సైతం తానే సాగు చేస్తున్నాడు. గతేడాది ఈ ఏడెకరాలతో పాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని, ఎనిమిదెకరాల్లో మిర్చి, రెండెకరాల్లో వరి సాగు చేశాడు. అకాల వర్షాలతో మిర్చి దిగుబడి తగ్గడంతో సుమారు రూ. 4 లక్షల నష్టం వాటిల్లింది. ఈ ఏడాది తనకున్న ఏడెకరాల్లో మిర్చి పంట వేశాడు. పూతదశలో పంటను తామర పురుగు ఆశించింది. ఎన్ని రకాల క్రిమి సంహారక మందులు కొట్టినా ఫలితం లేకపోయింది. అన్నీ కలిపి పెట్టుబడికి సుమారు రూ.7 లక్షల ఖర్చు అయింది. పంటతో రూపాయి వచ్చే అవకాశం కూడా కన్పించలేదు. అప్పు చెల్లిం చడం ఎలా అన్న ఆవేదనతో ఈ నెల 20న మిర్చి తోటలోనే పురుగుమందు తాగాడు. ఈ రెండు పట్టికలూ చాలు.. తెగుళ్ల కారణంగా మిర్చి దిగుబడి ఎంత దారుణంగా తగ్గిపోతోందో, రైతులు భారీ నష్టాలు ఎలా మూట గట్టుకుంటన్నారో తెలుసుకునేందుకు. -
తెగులు తినేసింది.. దిగులే మిగిలింది
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మిర్చి సాగు లాభాలు తెచ్చి పెడుతుందనుకుంటే నష్టాల పాలు జేసింది. లక్షల్లో పెట్టుబడులు పెట్టిన రైతుల పుట్టి ముంచింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మిర్చి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. గుబ్బ, తామర, ఎండు తెగుళ్లతో పూత, కాత లేకపోవడం, కాయకాసిన తర్వాత ఎండిపోవడం వంటి లక్షణాలతో పంట చేతికందకుండా పోయింది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఖమ్మం.. తర్వాత మహబూబాబాద్, వరంగల్, జోగుళాంబ గద్వాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఈసారి మిర్చి సాగైంది. రాష్ట్రంలో గతేడాది 2.40 లక్షల ఎకరాల్లో సాగైతే.. ఈ ఏడాది 3.58 లక్షల ఎకరాల్లో వేశారు. అయితే తెగుళ్ల దాడితో దిగుబడి తగ్గి రైతులకు దిగులు మిగిలింది. ఒక్క మహబూబాబాద్ జిల్లాలో 50 వేల ఎకరాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 40 వేల ఎకరాల పంటపై తెగుళ్లు ప్రభావం చూపాయి. మిగతా జిల్లాల్లోనూ రైతులు పంట నష్టపోయారు. తామర దాడితో తీవ్ర నష్టం మిర్చి పైరు ఎదుగుదల దశలో తొలుత జెమిని (గుబ్బ తెగులు) వైరస్ ఆశించింది. దీంతో రైతులు వివిధ రకాల క్రిమిసంహారక మందులను పిచికారీ చేస్తుండగానే.. పలు ప్రాంతాల్లో ఎండు తెగులు కూడా ఆశించింది. ఫలితంగా వేరు కుళ్లడం, కొమ్మలు ఎండిపోవడంతో పైరు వడబడింది. అంతలో ఎప్పుడూలేని విధంగా తామర పురుగు పంటపై దాడి చేసింది. గతంలో ఇండోనేషియాలో గుర్తించిన తామర పురుగు, గడిచిన జనవరిలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో గుర్తించారు. ఈసారి తెలుగు రాష్ట్రాల్లో విస్తరించగా.. పూత రాలిపోవడం రైతులను కలవర పరిచింది. ఆకు తినేస్తుండటంతో రైతులు ఎర్రనల్లి, నల్లనల్లిగా భావించి క్రిమి సంహారక మందులను పిచికారీ చేశారు. తర్వాత తామర పురుగు ఆశించినట్లు నిపుణులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే బెంగళూరుకు చెందిన ప్రత్యేక బృందం నవంబర్ చివరి వారంలో వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో పర్యటించి పూత, కాత, ఆకు, మట్టి నమూనాలను సేకరించింది. క్రిమిసంహారక మందులు మార్చిమార్చి పిచికారీ చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో పంట తొలగించేందుకు రైతులు నిర్ణయించుకున్నారు. చాలాచోట్ల ట్రాక్టర్లు, యంత్ర పరికరాలతో తోటలను దున్నేసి మరో పంట సాగుకు సిద్ధమవుతున్నారు. లక్షల్లో లాస్.. పలువురి రైతుల ఆత్మహత్య మిగిలిన పంటలతో పోలిస్తే మిర్చి సాగుకు పెట్టుబడి ఎక్కువ. ఎకరం భూమిలో మిర్చి సాగుకు దాదాపు రూ.లక్ష వరకు ఖర్చవుతుంది. అయితే ఈ ఏడాది తెగుళ్లతో అంతకుమించి ఖర్చయింది. తెగుళ్లు ఆశించకపోతే ప్రస్తుతమున్న ధరతో మిర్చి లాభదాయకంగానే ఉండేది. కానీ తెగుళ్లతో పంట చేతికందకుండా పోవడంతో రూ.లక్షల్లో నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో ఈ ఏడాది 16 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. మొత్తం పంటలో 80 శాతం మేర తెగుళ్ల బారిన పడినట్లు వ్యవసాయశాఖ అంచనా. ఈ క్రమంలోనే పలువురు రైతులు పంట నష్టం మిగిల్చిన బాధతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 10 లక్షలు తెగుళ్ల పాలు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోయచె లక గ్రామానికి చెందిన మేళ్లచెర్వు రాంప్రసాద్ తన ఐదెకరాలకు తోడు మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని మిర్చి సాగుచేశాడు. ఎకరానికి రూ.90 వేల వరకు ఖర్చు పెడితే.. కాపు దశలో నల్లిపురుగు, దోమ, ఎండుతెగుళ్లతో పచ్చని తోట ఎండిపోయి మోళ్లు వచ్చాయి. సాగుకు రూ.10 లక్షలకు పైగా ఖర్చు చేశానని రాంప్రసాద్ వాపోతున్నాడు. మందులకే రూ.3.50 లక్షల ఖర్చు జోగుళాంబ గద్వాల జిల్లా గోగులపాడు గ్రామానికి చెందిన రైతు సుధాకర్ తన మూడెకరాలకు తోడు మరో ఏడెకరాలు కౌలుకు తీసుకుని మిర్చి సాగు చేశాడు. ఎకరాకు రూ.20 వేల చొప్పున కౌలుకే రూ.1.40లక్షలు చెల్లించాల్సి వస్తోంది. ఇక తెగుళ్లతో పంట వ్యయమూ పెరిగింది. ఎకరాకు రెండు బస్తాల చొప్పున నాలుగుసార్లు మందులు పిచికారీ చేయగా రూ.3.50 లక్షలు ఖర్చయ్యాయి. కూలీలు, ఇతరత్రా ఖర్చులన్నీ కలిపి 10 ఎకరాలకు రూ.13 లక్షల పెట్టుబడైంది. కానీ అకాల వర్షాలు, తెగుళ్లతో పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేకుండా పోయిందని సుధాకర్ అంటున్నాడు. పంట పీకి కాల్చివేసి.. ఈ రైతు మహబూబాబాద్ జిల్లా పకిరా తండాకు చెందిన గుగులోత్ వశ్య. రెండున్నర ఎకరాల్లో మిర్చి సాగుకు రూ.1.70 లక్షలు ఖర్చు చేశాడు. ఏపుగా పెరిగిన పంటను చూసి సంబరపడ్డాడు. కానీ తామర పురుగు ఆశించడంతో 15 రోజుల్లోనే పంటంతా నాశనమైంది. దిగుబడి రాదని భావించి ఈ పంటను పీకి కాల్చేస్తున్నాడు. ఇతర తెగుళ్లకు తామర తోడయ్యింది మిర్చి పైరుకు ఈ ఏడాది తామర పురుగు ఆశించింది. జెమిని వైరస్, ఎండు తెగులు వంటి తెగుళ్లూ ఆశించాయి. పూతదశలో తామర పురుగు ఆశించింది. కేంద్ర పరిశోధక బృందం నిపుణుల సూచనలతో యాజమాన్య పద్ధతులపై రైతులకు సూచనలిస్తున్నాం. –జె.హేమంతకుమార్,కో ఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం, వైరా, ఖమ్మం జిల్లా -
టమాటాకు రక్షణ బంతి
తెల్లదోమ టమాటా పంటకు తీవ్రనష్టం కలిగిస్తుంటుంది. ఈ తెల్లదోమ ద్వారా వైరస్లు, మోల్డ్ వంటి తెగుళ్లు టమాటాకు సోకి తీవ్ర నష్టం కలిగిస్తూ ఉంటాయి. అయితే, టొమాటా మొక్కల పక్కన బంతి మొక్కలు పెంచితే చాలు తెల్లదోమ బెడద తీరిపోతుందని పెద్దలు చెబుతుంటారు. బంతి మొక్క ఆకులు, పూల ద్వారా వెలువరించే వాసనలు తెల్లదోమను పారదోలుతుంటాయని కూడా మనకు తెలుసు. ఇంతకీ బంతి చెట్లు వెలువరించే వాసనల్లో ఏ రసాయనం ఉంది? అన్నది ఆసక్తికరమైన ప్రశ్న. దీనిపై గతంలో పెద్దగా అధ్యయనాలు జరగలేదు. ఇటీవల ఇంగ్లండ్‌లోని న్యూక్యాజిల్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ నేచురల్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్‌లో అధ్యయనం జరిగింది. లిమొనెనె అనే రసాయనాన్ని బంతి మొక్కలు గాలిలోకి వదులుతూ ఉంటాయని, ఈ వాసన తెల్లదోమకు నచ్చక దూరంగా వెళ్లిపోతాయని తేలింది. ఈ వాసన పీల్చిన తెల్లదోమలు చనిపోవు. దీని వల్ల టమాటాల నాణ్యత కూడా ఏ మాత్రం తగ్గడం లేదని గుర్తించారు. రసాయనిక పురుగుమందులకు ప్రత్యామ్నాయంగా ఇదే తరహాలో తెల్లదోమను పారదోలే స్ప్రేను తయారు చేయడానికి అవకాశం ఉందా అన్న అంశంపై అధ్యయనానికి సారధ్యం వహించిన డా. కొలిన్ టోష్, నియల్ కాన్బాయ్ దృష్టి సారిస్తున్నారు. బత్తాయి, నారింజ, నిమ్మ పండ్ల తొక్కల్లో కూడా లిమొనెనె పుష్కలంగా ఉంటుందట. ఉద్యాన తోటల్లో బంతి మొక్కలు వేసుకుంటే తేనెటీగలు కూడా వస్తాయి. ఉద్యాన తోటల సాగులో ఒకే రకం పంటను సాగు చేయడానికి బదులు.. కలిసి పెరుగుతూ పరస్పరం చీడపీడల నుంచి రక్షించుకునే రకరకాల పంటలను పక్క పక్కన నాటుకోవడం మేలన్న విషయాన్ని ఈ అధ్యయనం తేల్చిచెప్పడం విశేషం. -
చివరికి నష్టాలే..!
ఆశలు ఆవిరయ్యాయి. ఆరుగాలం కష్టించినా ఫలితం లేకుండా పోయింది. పంట చేతికందక.. పెట్టుబడీ రాక నష్టాలు మూటగట్టుకోవాల్సి వచ్చింది. మదనపల్లె డివిజన్ పరిధిలో ఇప్పుడు ఏ వరి రైతును కదిలించినా ఇవే గాథలు. పంట పచ్చగా ఉన్నా గింజ పట్టలేదని ఆవేదన చెందుతున్నారు. నకిలీ విత్తనాలు, వాతావరణ ప్రభావం వల్లే నష్టపోయామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సుమారు రెండువేల హెక్టార్లలో పంట సర్వనాశనమైందని, రూ.8 కోట్లకుపైగా నష్టపోయామని గుండెలు బాదుకుంటున్నారు. పలమనేరు: కరువుకు మారుపేరైన మదనపల్లె డివిజన్ పరిధిలో ఈసారి వరి భారీగా దెబ్బతింది. తెగుళ్లకోర్చి, కష్టాలకెదురొడ్డినా ఫలితం లేకపోయిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా రబీలో 4వేల హెక్టార్లలో వరి సాగయ్యేది. మూడేళ్లుగా వర్షాలు ఆశాజనకంగా కురవడంతో భూగర్భజలాలు పెరిగాయి. రైతులు వరిసాగుపై ఆసక్తి చూపారు. మొత్తం మీద చెరువులు, బావులు, కుంటలు, బోర్ల కింద 6,600 హెక్టార్లలో వరి సాగుచేశారు. స్థానికంగా లభించే నర్మద, కావేరి, బీపీటీ, నెల్లూరు ఎన్‌ఎల్‌ఆర్ తదితర రకాలు సాగుచేశారు. పంట ఏపుగా పెరిగింది. బాగానే పిలకలు వేసింది. ప్రస్తుతం వరి వెన్ను, కోతదశల్లో ఉంది. సగం పంటకు గింజ పట్టకుండా జల్లుబోయింది. తెగుళ్లకు తట్టుకుని.. నెల క్రితం వరి పైరు పసుపు రంగులోకి మారింది. ఆకుల కొనలు మాడిపోయాయి. సుడిదోమ, ఆకు ముడత సోకాయి. వాటికి అవసరమైన మందులు పిచికారీ చేసినా కొందరు రైతులు పంట కాపాడుకోలేకపోయారు. మరికొందరు భారీగా పెట్టుబడులు పెట్టి కొంతమేర నిలబెట్టుకున్నారు. ముంచిన మంచు.. వరి పంట చూసేందుకు పచ్చగా.. ఏపుగానే ఉంది. పిలకల్లో గింజపట్ట లేదు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని బాధిత రైతులు చెబుతున్నారు. గింజ పట్టకపోవడానికి గల కారణాలు వ్యవసాయ అధికారులకే అంతుచిక్క డం లేదు. పంటను పరిశీలించిన అధికారులు తిరుపతి పరిశోధన కేంద్రానికి చెందిన సైంటిస్టులను పిలిపించారు. వారు కుప్పం, పుంగనూరు ప్రాంతాల్లో వరి పంటను పరిశీలించి తగిన పరీక్షలు చేశాక ఫలితం వెల్లడిస్తామని చెప్పారు. గత నవంబరులో నాటిన వరికి ఎఫెక్టు ఎక్కువగా ఉందని తేల్చారు. మామూలుగా వరి పంటకు 15 డిగ్రీ లకంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండరాదు. కానీ నవంబరు, డిసెంబరు మాసాల్లో ఈ దఫా రాత్రిపూట చలిఎక్కువై ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పడిపోయాయి. గింజపట్టని పరిస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు. అదును తెలియక.. అందుబాటులో లేక రబీ సీజన్లో వరి ఎప్పుడు సాగుచేయాలి.. అప్పటి వాతావరణ పరిస్థితుల మేరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో రైతులకు తెలియదు. ముఖ్యమైన విత్తన ఎంపిక ఎలా చేసుకోవాలో వారికి అవగాహన లేదు. హైబ్రిడ్ రకాల పేరిట కర్ణాటక నుంచి అందిన రకాలు, లోకల్ కంపెనీ సీడ్స్‌ను ఇక్కడి దుకాణాల్లో విక్రయించారు. ఏవి మేలో తెలియని రైతులు అందుబాటులో ఉన్న వరి విత్తనాలు కొని నారు పోశారు. వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం.. వరి వంగడాలు, వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాల్సిన వ్యవసాయ శాఖ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. దుకాణాల్లో నిబంధనల మేరకు విత్తనాలను విక్రయిస్తున్నారా..? లేదా..? అని తనిఖీలు చేయలేదు. సంబంధిత పంచాయతీల్లోని ఎంపీఈఓ (మల్టిపర్ఫస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్)లు పొలాలవైపు కన్నెత్తి చూడలేదు. ఫలితం రైతులు నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. రూ.8కోట్లకుపైగా నష్టం.. మదనపల్లె డివిజన్ పరిధిలో వరి సాగుకోసం హెక్టారుకు రూ.40 వేల దాకా వెచ్చించారు. ప్రస్తుతం సాగులో ఉన్న రెండు వేల హెక్టార్లలో పంట దెబ్బతింది. ఈ లెక్కన డివిజన్ పరిధిలో రూ.8 కోట్లకుపైగా పంటకు నష్టం వాటిల్లింది. కనీసం ప్రభుత్వమైనా స్పందించి గింజపట్టని వరిచేలకు నష్ట పరిహారం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. మొత్తం పోయింది నర్మద రకం వరిని ఎకరా పొలంలో సాగుచేశా. పంట చూసేందుకు భలే ఉంది. కానీ వెన్నులో గింజలేదు. నేను ఎన్నో ఏళ్లుగా వరిని సాగుచేస్తున్నా. ఎప్పుడూ ఇలాలేదు. ఎకరా పంటకు 20 వేలదాకా ఖర్చుపెట్టా. మొత్తం పోయింది. – కృష్ణప్ప, నాగిరెడ్డిపల్లె, వికోట మండలం ముందు నుంచి అనుమానంగానే ఉంది నేను ఈ దఫా కావేరి రకం వరిని మూడెకరాల్లో సాగుచేశా. ఇందుకు 90 వేలు ఖర్చయింది. నెల ముందు పంట పసుపు వర్ణంలోకి మారింది. రూ.12వేలు ఖర్చుబెట్టి మందులు పిచికారీ చేశా. పంట కుదరుకుంది. కానీ గింజపట్ట లేదు. అధికారులకు చూపిస్తే మాకు తెలియదన్నారు. సైంటిస్ట్ చూస్తే తెలుస్తుందన్నారు. ఇంట్లో తినేకి గింజకూడా లేదు. – కిచ్చరాజు, హనుమంత్‌నగర్, వీకోట మండలం అతిశీతల వాతావరణమే.. మంచుతో పాటు అతిశీతల వాతావరణంలో గింజ పట్టని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే శాస్త్రవేత్తలు పంటను పరిశీలించారు. దీనికి కారణాలు త్వరలో తేలనున్నాయి. రైతులకు జరిగిన నష్టంపై ఉన్నతాధికారులకు ఇప్పటికే నివేదించాం. – బషీర్ అహ్మద్, వ్యవసాయశాఖ ఏడీ, పలమనేరు -
సేంద్రియ చిట్కా
కూరగాయలు, బొప్పాయి వంటి పంటలకు విత్తనం ద్వారా వైరస్ తెగుళ్లు సంక్రమించే అవకాశం ఉంది. వీటి నివారణకు– విత్తనాలను అరగంట పచ్చి దేశీ ఆవు పాలలో నానబెట్టి.. తర్వాత 20 నిమిషాలు నీడలో ఆరబెట్టి విత్తడం గాని లేదా నారు పోసుకోవడం గానీ చేసినట్లయితే విత్తనం ద్వారా వచ్చే వైరస్ తెగుళ్లను సమర్థవంతంగా అరికట్టవచ్చు. దీనితో పాటు ప్రతి 10 రోజులకు ఒకసారి పచ్చి దేశీ ఆవు పాలు 5% పిచికారీ చేయడం ద్వారా కూడా వైరస్ తెగుళ్లను అరికట్టవచ్చు. -
కలసిరాని కాలం
► ఆశ నిరాశల మధ్య పొగాకు సాగు ► అక్కరకురాని లేత తోటలు ► ఆకు నాణ్యతపై రైతుల బెంగ ► ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు కొనకనమిట్ల : వాణిజ్య పంటగా పేరుపొందిన పొగాకు సాగు ఈ ఏడాది రైతులకు కలిసి రాలేదు. రెండేళ్లుగా లక్షల్లో నష్టాలు చవిచూసిన రైతులు ఇక సాగుకు దూరమయ్యే పరిస్థతి నెలకొంది. ప్రకృతి వైపరీత్యాలు ఒక వైపు, నిలకడ లేని ధరలు మరోవైపు రైతుల ఆశల్ని నీరుగార్చాయి. ఈ ఏడాది అదునుకు వర్షాలు కురిస్తే అరకొరగానైనా పొగాకు నాట్లు పడతాయని భావించిన పలువురు స్థానికంగా నారుమళ్లు పెంచారు. పెరిగిన పొగనారును కొనేవారు లేక మడుల్లోనే ముదిరి ఎండిపోయింది. దీంతో కొందరు రైతులు ప్రత్యామ్నయ పంటలవైపు మొగ్గు చూపగా మరికొందరు ఆశ నిరాశలతో పొగాకు సాగు చేపట్టారు. క్యూరింగ్ పనుల్లో రైతన్నలు..: జిల్లా వ్యాప్తంగా గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది పొగాకు సాగు విస్తీర్ణం సగానికి సగం తగ్గించారు. సాగైన పొలాల్లో ముదురు తోటలు ప్రస్తుతం ఆకు కొట్టుడుకు రావడంతో పలు గ్రామాల్లో క్యూరింగ్ పనులు ప్రారంభమయ్యాయి. క్యూరింగ్ చేసిన ఆకు నాణ్యత వస్తుందో రాదో అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లేత తోటలకు పేనుబంక తెగుళ్లు..: బోర్ల కింద సాగు చేసిన లేత తోటలకు తెగుళ్లు ఆశించడంతో పంట దెబ్బతినే ప్రమాదం ఉందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిగుబడుల మాట అటుంచి, నాణ్యత తగ్గితే పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం లేదని ఆందోళన చెందుతున్నారు. ఖర్చులకు వెనుకాడకుండా నీటి తడులు అందిస్తున్నారు. ముదురు తోటలు దెబ్బతిన్నా, లేత తోటలుతోనైనా పంట ఉత్పత్తి సాధించగలమన్న ఆశతో రైతులు ఉన్నారు. ఇతర పంటలదీ అదే దారి..: పొగాకు సాగుకు ప్రత్యామ్నాయంగా రైతులు మిర్చి, కంది, మినుము, అలసంద, పప్పుశనగ పంటలు సాగు చేపట్టారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆ పంటలు కూడా అనుకున్న మేర ఉపయోగ పడలేదని పలువురు రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. పదెకరాలు సాగు చేశాను.: గత సంవత్సరం 30 ఎకరాలలో పొగతోట సాగు చేశాను. ఎక్కువగా మాడు ఆకు వచ్చింది. ధరల్లేక నష్టం వచ్చింది. అయినా పంట మీద ఉన్న ఆశతో ఈ ఏడాది మళ్లీ పదెకరాల్లో సాగు చేశా. ఆకు కొట్టుడు, క్యూరింగ్ పనులు జరుగుతున్నాయి. వర్షాభావం, తెగుళ్ల బెడదతో పంట దిగుబడి బాగా తగ్గింది. ---పొదిలి తిరుపతయ్య, రైతు,గొట్లగట్టు -
తెగుళ్లతో వి‘పత్తి’
పత్తికి పురుగుల బెడద సమయానుకూలంగా మందుల పిచికారి సస్యరక్షణ చర్యలు పాటిస్తే మేలు వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలి టేక్మాల్ వ్యవసాయ విస్తరణాధికారి సునీల్‌కుమార్ టేక్మాల్: పత్తికి పురుగులు ఆశిస్తే ఎటువంటి దిగులు చెందాల్సిన అవసరం లేదని టేక్మాల్ వ్యవసాయ విస్తరణాధికారి సునీల్‌కుమార్ (99499 68674) తెలిపారు. మోతాదుకు మించి మందులను వాడకుండా సమయానుకూలంగా మందులను పిచికారి చేయాలన్నారు. వ్యవసాయాధికారుల సలహా సూచనలు పాటిస్తూ సస్యరక్షణ చర్యలు పాటిస్తే మేలు చేకూరుతుందన్నారు. పత్తిని ఆశించే పురుగుల నివారణకు ఆయన అందించిన సలహా సూచనలు.. పురుగులు సాధారణంగా పత్తి విత్తిన 45-50 రోజుల వరకు రసం పీల్చే పురుగులైన పేనుబంక, పచ్చదోమ, తామరపురుగు అలాగే పైరు పూత, పిందె, కాయదశల్లో తెల్లదోమ, కాయతొలిచే పురుగులైన నల్లమచ్చల పురుగు, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, గులాబీరంగు పురుగులు ఆశించి ఎక్కువ నష్టం కలుగజేస్తాయి. రసంపీల్చే పురుగులు: పేనుబంక పురుగు ఆశించిన మొక్కలు 10-20 శాతం, పచ్చదోమలు ఆకుకు 2, తెల్లదోమ తల్లి పురుగులు ఆకుకు 6, పిల్ల పురుగులు 20, తామరపురుగులు తల్లి పురుగులు ఆకుకు 10 ఉంటే ఆయా పురుగుల వలన పంటకు నష్టం అధికంగా ఉంటుంది. రసంపీల్చే పురుగుల నివారణ: పచ్చ, తెల్లదోమలను తట్టుకొనే రకాలను సాగుచేయాలి. కిలో విత్తనానికి తగినంత జిగురు కలిపి 5 గ్రా. ఇమిడాక్ల్రోపిడ్ 70 డబ్ల్యూఎస్ లేక 4 గ్రా, థయోమి«థాక్సామ్తో విత్తనశుద్ధి చేసి విత్తితే 40-45 రోజుల వరకు రసంపీల్చే పురుగులను నివారించవచ్చు. కిలో విత్తనానికి పైవిధంగా 40-50 గ్రా కార్బోసల్ఫాన్తో శుద్ధిచేసి విత్తితే 30 రోజుల వరకు రసంపీల్చే పురుగుల నుండి రక్షణ ఉంటుంది. మోనోక్రోటోఫాస్ లేదా మిథైల్ డెమటాన్, నీరు 1ః4 నిష్పత్తిలో లేక ఇమిడాక్ల్రోపిడ్ 200 ఎస్ఎల్, నీరు 1ః20 నిష్పత్తిలో కలిపిన ద్రావణం విత్తిన 20, 40, 60 రోజుల్లో (పురుగు నష్ట పరిమాణాన్ని దృష్టిలో వుంచుకోని) మొక్క లేత కాండానికి బ్రష్‌తో పూస్తే రసం పీల్చే పురుగులను అదుపులో వుంచవచ్చు. ఈ పద్ధతి వలన పురుగు మందు ఖర్చు తగ్గటమే కాక వాతావరణ కాలుష్యం కూడ తగ్గుతుంది. ప్రత్యేక సూచనలు: ఇమిడాక్ల్రోపిడ్తో విత్తనశుద్ధి చేసిన విత్తనాలను విత్తటానికి ముందు నీళ్లలో నానబెట్టరాదు. రసంపీల్చే పురుగుల నివారణకు తొలిదశలో ఎక్కువ సార్లు పురుగు మందులు పిచికారి చేయరాదు. తెల్లదోమ ఉధృతి ఎక్కువగా వుంటే పసుపురంగు డబ్బాలను జిగురు పూసి వుంచితే అవి ఆకర్షింపబడి జిగురుకు అంటుకుంటాయి. తెల్లదోమ ఆశించినప్పుడు పైరితాయిడ్ మందులు వాడడం వెంటనే నిలిపి వేయాలి. ఎర్రనల్లిని అదుపులో వుంచటానికి లీటరు నీటికి 3 గ్రా, 50 శాతం నీళ్లలో కరిగే గంధకం లేక 5 మి.లీ డైకోఫాల్ కలిపి పిచికారి చేయాలి. పిండినల్లి ఆశించినప్పుడు తొలిదశలోనే గుర్తించి, కాండానికి మందు పూత ద్వారా నివారించుకోవాలి. లీటరు నీటికి 1 మి.లి డైక్లోర్వాస్తో పాటు 2 మి.లీ మిథైల్ పెరాథియాన్ లేక మలాథియన్ లేదా 3 మి.లీ క్వినాల్ఫాస్ కలిపి పిచికారి చేయాలి. కాయతొల్చు పురుగులు 10 శాతం పూతకు నష్టం వాటిల్లినప్పుడు, మొక్కకు ఒక పచ్చ పురుగు గుడ్డు లేదా లార్వా ఉన్నప్పుడు, 10 మొక్కలకు ఒక లద్దె పురుగు, గుడ్ల సముదాయం గమనించినప్పుడు, 10 శాతం గులాబీ రంగు పురుగు ఆశించిన గుడ్డి పూలు గుర్తించినప్పుడు కాయతొల్చు పురుగుల వలన పంటకు నష్టం అధికంగా ఉంటుంది. కాయతొల్చు పురుగుల సమగ్ర సస్యరక్షణ పంట మార్పిడి పద్ధతి అవలంబించాలి. వేసవి దుక్కులు లోతుగా దున్నాలి. 25 శాతం సేంద్రియ ఎరువులు, 75 శాతం రసాయన ఎరువులు వాడాలి. బొబ్బర (అలసంద), కొర్ర, సోయాచిక్కుడు, పెసర, మినుము, గోరుచిక్కుడు 1ః2 నిష్పత్తిలో అంతరపంటలుగా వేయాలి. చేనుచుట్టూ నాలుగు వరుసల జొన్న లేక కంచె పంటగా వేయాలి. లద్దెపురుగును ఆకర్షించడానికి ఎకరాకు 50 ఆముదపు మొక్కలు చేనంతా అక్కడక్కడ పెట్టి, ఆముదపు మొక్కలపై పెట్టిన లద్దెపురుగు గుడ్లను, జల్లెడ ఆకులను ఏరి నాశనం చేయాలి. శనగపచ్చపురుగును ఆకర్షించడానికి ఎకరాకు 100 పసుపు రంగు పూలు పూచే బంతిమొక్కలు పెట్టి మొగ్గలు, పూలలో వున్న పురుగులను ఏరివేయాలి. లద్దెపురుగు వలసను నియంత్రించడానికి చేను చుట్టూ అడుగు లోతున చాలు తీసి ఫాలిడాల్ లేక లిండేన్ పొడి మందు చల్లుకోవాలి. శనగపచ్చ పురుగు, లద్దెపురుగుల ఉనికిని, ఉధృతిని అంచనా వేయటానికి ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలు పెట్టాలి. ప్రతి బుట్టలో కొన్ని రోజులు వరుసగా రోజుకు గులాబి రంగు పురుగులు 8, శనగపచ్చ పురుగులు 10, పొగాకు లద్దె పురుగులు 20, మచ్చల పురుగులు 15 పడిన ఎడల సస్యరక్షణ చర్యలు చేపట్టాలి అక్టోబరు- నవంబరులో శనగపచ్చ పురుగు ఆశించిన యెడల ఎకరాకు 200 లార్వాలను సమానమైన పచ్చపురుగు వైరస్ ద్రావణం, లద్దె పురుగు ఆశిస్తే..200 ఎ.ఇ. లద్దెపురుగు వైరస్ ద్రావణంకు, కిలో బెల్లం ,100 మి.లీ శాండోవిట్ లేదా 50 గ్రా , రాబిన్బ్లూ పౌడరు కలిపి సాయంత్రం వేళల్లో పిచికారి చేయాలి. పురుగులను తినే పక్షులు వాలటానికి వీలుగా ’టి’ ఆకారపు కర్రలను లేక పంగల కర్రలను ఎకరాకు సూమరు 15-20 పెట్టాలి. పచ్చపురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నపుడు మూడవదశ దాటిన పచ్చపురుగును చేతితో ఏరివేసి ఇండాక్సాకార్బ్ లీటరు నీటికి 1 మి.లీ లేదా స్ఫైనోశాడ్ 0.3 మి.లీ లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రా కలిపి పిచికారి చేయాలి. పురుగుల మందు విషప్రభావం పెంచటానికి నువ్వులనూనెను, క్లోరిపైరిఫాస్ లేదా ఫెన్వలొరేటు లేదా సైపర్మెత్రిన్ మందులతో 1ః4 నిష్పత్తిలో కలిపి పిచికారి చేయాలి. పురుగుల నష్ట పరిమాణం దృష్టిలో వుంచుకోని లీటరు నీటికి క్వినాల్ఫాస్ 2.5 లేదా క్లోరిఫైరిఫాస్ 3 మి.లి లేదా ఎసిఫేట్ 1.5 గ్రా పిచికారి చేయాలి. పచ్చపురుగు గుడ్లు ఎక్కువగా వుంటే ప్రొపినోఫాస్ 2 మి.లి లేదా థయోడికార్బ్ 1.5 గ్రా లీటరు నీటి మోతాదులో కలిపి పిచికారి చేయాలి. ఒకేమందు ఎక్కువసార్లు పిచికారి చేయకుండా మందులు మార్చి వాడుకోవాలి. ప్రత్యేక సూచనలు మొక్క లేత ఆకులపైన, మొగ్గలపైన పెట్టే పచ్చపురుగు గుడ్లను గుర్తించి నాశనం చేయాలి. మూడవదశ దాటిన పచ్చపురుగు మీద పురుగు మందులు ఆశించినంత సమర్ధవంతంగా పనిచెయ్యవు. కాబట్టి చేతితో ఏరివేసి సస్యరక్షణ చేపట్టాలి. పంటకాలంలో సింథటిక్ పైరితాయిడ్ మందులు ఒకటి లేక రెండుసార్లు అవసరాన్ని బట్టి పిచికారి చెయ్యాలి. పచ్చపురుగు, తెల్లదోమ ఆశించినప్పుడు సింథటిక్ పైరితాయిడ్ మందులు పిచికారి చేయరాదు. గులాబి రంగు పురుగును మందుల ద్వారా సమర్ధవంతంగా అదుపుచేయుట కష్టతరం కాబట్టి గుడ్డిపూలను ఏరి నాశనం చేయాలి. మందు ద్రావణాన్ని సిఫారసు చేసిన మోతాదులో సిఫార్సు చేసిన సస్యరక్షణ పరికరాలతో సరైన పద్ధతిలో పిచికారి చేయాలి. -
పాడి పంట
వర్మీవాష్‌తో తెగుళ్ల నివారణ సేంద్రియ ఎరువుతో తయారీ క్రిమిసంహార ఎరువులకు బదులుగా.. ఏఓ రెబల్సన్ సలహాలు, సూచనలు వ్యవసాయశాఖ అధికారులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. పంటలకు తెగుళ్లుసోకితే వాడే రసాయనాలకు (పురుగు మందు) బదులుగా ‘వర్మీవాష్’ను ప్రోత్సహిస్తున్నారు. పేడ, ఎండుగడ్డి, కుళ్లిపోయే చెత్తాచెదారంలో వానపాములు వేసి సహజసిద్ధమైన వర్మీవాష్ అనే ద్రవపదార్థాన్ని తయారు చేస్తున్నారు. దీన్ని రైతులకు పరిచయం చేస్తున్నారు. దీనివల్ల కలిగే లాభాలను వివరిస్తున్నారు. అధికారుల సూచనలు పాటిస్తోన్న ఎంతోమంది రైతులు వర్మివాష్ తయారీకి మొగ్గుచూపుతున్నారు. వర్మీవాష్ తయారీ విధానం, దానివల్ల కలిగే ప్రయోజనాలు మండల వ్యవసాయ అధికారి రెబల్సన్ మాటల్లో... మెదక్:అధిక దిగుబడుల కోసం రైతులు పంటపొలాల్లో దుక్కిదున్నడం మొదలుకుని పంట నూర్పిళ్లవరకు విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడుతున్నారు. పంటకు తెగుళ్లు సోకితే మోతాదుకు మించి క్రిమిసంహారక మందులు వినియోగిస్తున్నారు. దీంతో పంట సాగుకు విపరీతమైన ఖర్చువస్తుంది. కొన్ని సందర్భాల్లో పంట దిగుబడిలో వచ్చేకన్నా అధికంగా రసాయన ఎరువులు వాటడం, క్రిమిసంహార మందుల కోసమే ఖర్చు చేస్తున్నారు. దీంతో తీవ్ర నష్టాలను చవిచూడక తప్పడం లేదు. భూసారం కూడా తగ్గిపోయి పొలాల్లో ఆశించిన మేర దిగుబడులు రావటంలేదు. ఏ పంట సాగుచేసినా విపరీతమైన తెగుళ్లు సోకడ, దీనంతటికి ముఖ్యకారణం విచ్చలవిడిగా రసాయన ఎరువుల వినియోగమే. పాతికేళ్ల క్రితం రసాయన ఎరువులు లేవు. అప్పట్లో చెట్ల కొమ్మలు, ఆకులు, మురిగిపోయే గడ్డిజాతులను పొలాలను బురద, బురదగా దున్ని అందులో వీటిని వేసి బాగా మురగబెట్టేవారు. అవి మురిగి అసలు పంటకు తెగుళ్లే సోకేవికావు. చెరువుల్లోని నల్లమట్టి, పశువుల పేడను అధికంగా వేసేవారు. కేవలం పేడకోసమే అప్పట్లో పశువులను ప్రతి ఇంటిముందు పోషిచేవారు. దీంతో సాగు ఖర్చులు రైతులకు ఏ మాత్రం భారం అయ్యేది కాదు. పొలాల్లో సైతం భూసారం గణనీయంగా ఉండేది. ఏ పంటను సాగు చేసినా మంచి దిగుబడులు వచ్చేవి. ఈ మధ్య రసాయన ఎరువుల వినియోగం బాగా పెరిగిపోయింది. దీంతో అటు రైతుకు ఖర్చు పెరిగి పోగా, పొలాల్లో భూసారం తగ్గుతుంది. రసాయన ఎరువులకు చెక్ పెట్టేందుకు సేంద్రియ ఎరువులను వినియోగించాల్సిన అవసరం ఉంది. సేంద్రియ ఎరువుతో తయారు చేసిన వర్మీవాష్ అనే ద్రవ పదార్థం తయారు చేసి వినియోగించాలి. వర్మీవాష్ తయారు విధానం.. 20 నుంచి 30 లీటర్లు నీరు నిల్వ ఉండే పెద్ద కుండీని లేదా ప్లాస్టిక్ డబ్బాను తీసుకోవాలి. అందులోని అడుగు భాగంలో ఒక ఇంచువరకు గుళికరాళ్లు వేయాలి. దానిపై మరో ఇంచు మేర ఇసుక వేయాలి. దానిపై 40 సెంటీమీటర్ల మేర మట్టిని వేయాలి. దానిపై కుళ్లిపోయే చెత్తాచెదారంతో పాటు ఆకులు, గడ్డి వంటివి వేయాలి. దానిపై 5 ఇంచుల మేర ఎండిన పశువుల పేడను వేయాలి. దానిపై 2000 వానసాములు(ఎర్రలు) వేయాలి. వీటన్నింటిని ఆ పాత్రలో వేశాక దాని అడుగు భాగాన ఒక రంధ్రం చేసి దాని కింద ఓ పాత్రను పెట్టాలి. ఆ డబ్బా పైన ఎత్తులో మరో చిన్నపాటి డబ్బాను కట్టి అందులో నీటిని నింపి ఆ డబ్బాకు చిన్నపాటి రంధ్రం కొట్టాలి. ఒక్కో చుక్కనీరు ఆ డబ్బాలో పడేలా చూడాలి. దీంతో ఆ డబ్బాలోని ఎరువు, చెత్తాచెదారం మురిగిపోతుంది, వాటిని వానపాములు తింటుంటాయి. ఆ డబ్బాకు అడుగు భాగంలో వేసిన చిన్నపాటి రంధ్రం నుంచి నీటి బొట్లు వస్తుంటాయి. వాటిని మరో చిన్నపాటి డబ్బాలో మనం పట్టుకుంటే అదే వర్మీవాష్. పిచికారీ ఇలా... పంటలకు ఎలాంటి తెగుళ్లు సోకినా 20 లీటర్ల నీటిలో లీటరు వర్మీవాష్‌ను కలిపి పిచికారీ చేయాలి. అప్పుడు తెగుళ్లు మటుమాయమవుతాయి. ఇందులో లీటరు ఆవుమూత్రం, లీటరు వర్మీవాష్లో 20 లీటర్ల నీటిలో కలిపి స్ప్రేచేస్తే ఎలాంటి తెగుళ్లైన పోతాయి. పంట ఎదుగుదల బాగా ఉంటుంది. అజొల మొక్కతో పంటకు మేలు.. ఒక రకమైన (మొక్క) అజొల పంటలకు విపరీతమైన లాభాలున్నాయి. వరి నాట్లు వేశాక కొద్దిపాటి అజొల తెచ్చి పొలంలో వేస్తే అది విపరీతంగా పెరుగుతుంది. దీంతో పంటకు నత్రజని బాగా లభిస్తుంది. యూరియా, బాస్పరం వంటి రసాయన ఎరువులను తగ్గించుకోవచ్చు. సేంద్రియ ఎరువుగా బాగా పంటకు ఉపయోగ పడుతుంది. దీన్ని పశువుల దాణగా, కోళ్లకు సైతం దాణాగా వేయవచ్చు. నీటిలో కొద్దిపాటి అజొల వేస్తే 15 రోజుల్లో అది పొలం అంతటా అవుతుంది. -
పత్తి, వరిలో...తెగుళ్ల నివారణ ఇలా..
కందుకూరు: జిల్లా పరిధిలో సాగులో ఉన్న పత్తి, వరి పైర్లలో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో తెగుళ్లు ఆశించి రైతులు సతమతమవుతు న్నారు. ఆ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల్ని గురించి జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు ఎన్.ప్రవీణ్, సీహెచ్.చిరంజీవి, పి.అమ్మాజీ రైతులకు సూచనలు, సలహాలు అందించారు. పత్తిలో.. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పత్తి పంటలో నల్లమచ్చ తెగులు ఆశించినట్లు గుర్తించడమైంది. ఈ తెగులు ఆశిస్తే కోణాకారంలో నూనె రంగు మచ్చలు ఏర్పడి తర్వాత మూడవ దశలో ఆకుల ఈనెల ద్వారా తెగులు వ్యాపించి నల్లగా మారుతుంది. దీనిని బ్లాక్ ఆర్మ్ అని పిలుస్తారు. ఉద్ధృతిని బట్టి 3, 4 పర్యాయాలు 15 రోజుల వ్యవధిలో 10 లీటర్ల నీటికి 1 గ్రా. పౌషామైసిన్ లేదా ప్లాంటోమైసిన్ మరియు కాపర్ ఆక్సిక్లోరైడ్ 30 గ్రా. కలిపి పిచికారీ చేయాలి. పలు చోట్ల పత్తిలో బూడిద తెగులు ఆశించింది. ఆకుల మీద కోణాకారపు మచ్చలు ఏర్పడి బూడిద తెగులు బీజాలు ఆకుల అడుగు భాగాన ఏర్పడతాయి. క్రమేపీ ఆకుల పై భాగాలకు కూడా వ్యాపించి ఆకులు పసుపు రంగులోకి మారి పండు బారి రాలిపోతాయి. దీని నివారణకు లీటర్ నీటికి నీటిలో కరిగే గంధకం 3 గ్రా. లేదా 1 గ్రా. కార్బండిజం కలిపి పిచికారీ చేయాలి. పత్తిలో రసం పీల్చే పురుగుల నివారణకు 1 గ్రా. ఎసిఫెట్ లేదా 2 మి.లీ. ప్రిఫోనిల్ మందును కలిపి పిచికారీ చేయాలి. వరిలో... చాలా ప్రాంతాల్లో వరిలో కంకినల్లి మరియు గింజమచ్చ తెగులు ఆశించింది. నివారణ చర్యలు చేపట్టకపోతే గింజ పట్టే దశలో ఉన్న పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దీని నివారణకు 2 మి.లీ ప్రొఫినోఫాస్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. వరిలో కాండం తొలుచు పురుగు నివారణకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ లేదా 0.4 మి.లీ. క్లోరాజోన్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో సుడి దోమ బాగా ఆశిస్తోంది. నివారణకు పొలాన్ని అడపాదడపా ఆరబెట్టాలి. ప్రతి 2 మీటర్లకు 20 సెం.మీ. కాలి బాటలు వదలాలి. ముందుగా పొలంలో నీటిని తీసి వేసి మొదలు తడిచే విధంగా ఇథోపెన్ ప్రాక్ట్ 1.5 మి.లీ. లేదా ఎసిఫెట్ 1.5 గ్రా. మరియు డైక్లోరోవాస్ 1.0 మి.లీ. లేదా బుప్రొజిన్ 1.6 మి.లీ. లీటర్ నీటికి కలిపి అవసరం మేరకు 7 నుంచి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. -
పత్తి రైతు చిత్తు!
కామారెడ్డి: వర్షాల్లేక పత్తి రైతు కళ్లు తేలేస్తున్నాడు. ఆపై తెగుళ్లు దాడి చే స్తుండడంతో పంట చేతికొచ్చే పరిస్థితులు కానరావడం లేదు. గడచిన 45 రోజులుగా వర్షాలు లేకపోవడంతో తెగుళ్లు పట్టుకుంటున్నాయి. తెగుళ్ల నుంచి పంటను రక్షించుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నా కనీసం పెట్టుబడులు కూడా దక్కే పరిస్థితులు కనిపించడం లేదు. వర్షాలపై ఆధారపడి పత్తి సాగు చేసిన రైతులు తమ కళ్లముందే పంట నాశనమవుతుండడంతో కంటతడి పెడుతున్నారు. ఎకరా పత్తి సాగుకు రూ. 20 వేలకు పైగా రైతులు ఖర్చు చేశారు. ఈ యేడు జిల్లాలో 20 వేల ఎక రాల్లో పత్తిపంట సాగైంది. విత్తనం నాటిన నుంచి ఎంతో శ్రద్ధతో పంటను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ముఖ్యంగా విత్తనం మొలకెత్తిన తరువాత కలుపు మొక్కలు తీసేయడం నుంచి మొక్కకు కావలసిన ఎరువులు, పురుగు మందులను క్రమం తప్పకుండా అందించారు. అయితే సరైన వర్షాలు లేకపోవడం వల్ల పంటకు రకరకాల తెగుళ్లు సోకుతున్నాయి. పత్తి చెట్టు ఆకులు ఎర్రబడి రాలిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తికి సోకిన తెగుళ్లను పోగొట్టడానికి రైతులు రకరకాల క్రిమిసంహారక మందులను పిచికారి చేశారు. అయినా లాభం లేకుండాపోయింది. చాలా చోట్ల మొక్కలు కాయ కాసే దశలో వర్షాలు కురవకపోవడంతో తెగుళ్లు దాడి చేస్తున్నాయి. వర్షాలు పడి ఉంటే తెగుళ్లు తక్కువగా ఉండేవని రైతులు పేర్కొంటున్నారు. దిగుబడిపై ప్రభావం.. పత్తికి అవసరమైన సమయంలో వర్షాలు కురవకపోవడం వల్ల దిగుబడిపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. పంట బాగుంటే ఎకరాకు 12 క్వింటాళ్ల నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేది. క్వింటాళుకు పత్తి ధర రూ. 4 వేల వరకు పలుకుతుండడంతో కనీసం ఎకరాకు రూ. 50 వేల వరకు ఆదాయం వచ్చేది. పెట్టుబడులకు అన్ని కలిపి ఎకరాకు రూ. 30 వేలు ఖర్చయినా తక్కువలో తక్కువ రూ. 20 వేలు మిగిలేవి. అయితే ఈ సారి వర్షాభావ పరిస్థితులతో తెగుళ్లు దాడి చేస్తుండడంతో దిగుబడిపై ప్రభావం చూపుతోంది. కొన్ని గ్రామాల్లో పత్తి పంట బాగానే ఉన్నా కాయకాసే సమయంలో వర్షాలు లేక కాయ రాలిపోయే ప్రమాదం ఉంది. -
క(న)ష్టాలను జయించిన ఆత్మవిశ్వాసం
మహారాష్ట్ర నుంచి మొక్కలు మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా మహాత్మాపూలే రావూర్ విద్యాపీఠ్ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి 3,200 దానిమ్మ మొక్కలు తీసుకువచ్చాడు. ఒక్కో మొక్కకు రూ.15 చొప్పున చెల్లించాడు. వీటిని తన పొలానికి తరలించే సరికి రవాణా కోసం రూ.80,000 వరకు ఖర్చు అయ్యింది. దానిమ్మ రకం ‘బగువా’ సాగు కోసం ‘బగువా’ రకానికి చెందిన మొక్కలను ఎంచుకున్నాడు. ఒక్కో దానిమ్మ పండు 150 నుంచి 400 గ్రాముల వరకు బరువు తూగుతాయి. ఒక్కో చెట్టుకు 300ల వరకు కాయలు వస్తాయి. మొదటి కాతలో ఒక్కో చెట్టుకు 80 కాయలు కాసి పండ్లుగా మారుతున్నాయి. తెగుళ్లు దానిమ్మ తోటలకు అత్యధికంగా మ చ్చతెగుళ్లు వస్తాయి. దీంతో దానిమ్మ పండ్లు నేలరాలిపోతాయి. అయితే మొక్కలకు ఎలాంటి తెగుళ్లు రాకుండా ఎథ్రిల్ అనే మందును పిచికారీ చేశాడు. తోట పర్యవేక్షణ కోసం పూణెకు చెందిన హార్టికల్చర్ అధికారి గణేశ్ కడాయ్‌ను నియమించుకున్నాడు. ప్రతీ 20 రోజుల కోసారి అతను వచ్చి మొక్క ఎదుగుదలను పర్యవేక్షిస్తున్నాడు. దీనికోసం అతనికి ప్రతీసారి రూ.10వేలు చెల్లిస్తున్నాడు. ఎరువుల వాడకం వెంకటరాంరెడ్డి సాగు చేసిన తోటలో అత్యధికంగా సేంద్రియ ఎరువులను వాడాడు. పచ్చిరొట్ట ఎరువుతో పాటు ప్రతీ మొక్కకు రెండుగంపల పశువుల పేడ ఎరువును మొక్కకు నాలుగు వైపులా వేశాడు. మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఇదే పద్ధతిలో ఎరువులు వాడారు. ఏపుగా పెరిగిన తోట మూడో ఏడాది వరకు ఒక్కో మొక్క 12 ఫీట్ల వరకు పెరిగింది. ఏపుగా పెరిగిన మొక్కల కొమ్మలను పూత రాకముందే కత్తిరించాడు. అనంతరం ప్రతీ మొక్కకు వెదురు కట్టెలతో ప్రత్యేక పందిరి వేయించాడు. దీనికోసం రూ.2లక్షల వరకు ఖర్చు చేశాడు. ఈ పందిరి ద్వారా మొక్కల కొమ్మల బరువు వెదురు కట్టెలపై పడుతుంది. దీంతో చెట్టు కొమ్మలు విరిగిపోకుండా కాయలు ఏపుగా ఎదగడంతో పాటు మొక్కకు అవసరమైన వాతావరణం లభిస్తుంది. దానిమ్మ తోట చుట్టూ రూ.60వేలతో 5 లైన్ల సోలార్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశాను. దీంతో తోటకు అడవి జంతువుల నుంచి రక్షణ లభించింది. మొక్కలు నాటే ముందు... 12 ఎకరాల భూమిలో 14-11 ఫీట్ల మేర జేసీబీతో 3,200ల గోతులు తీయిం చాడు. దీనికోసం రూ.1.5లక్షల వరకు పెట్టుబడి వచ్చింది. అనంతరం ప్రతీ గోతిలో చెత్తను నింపి కాల్చేశాడు. ఇలా చేయడం వల్ల గోతిలోని హానికారక క్రిములు (బాక్టీరియా, వైరస్ వంటివి) చనిపోతాయి. అనంతరం ఒక్కో గోతి లో పచ్చిరొట్ట వేసి మొక్కను పెట్టి మట్టితో పూడ్చాడు. అంతకు ముందే డ్రి ప్పు ఏర్పాటు చేసుకుని ప్రతీ గోతి నీటి చుక్కలు పడేలా పైపులు బిగించాడు. మొదటిసారి దిగుబడి పంట వేసి మూడేళ్లైంది. ఈ ఏడాది కాపుగా ఒక్కో మొక్కకు 80 వరకు కాయలు కాశాయి. వీటిని పదిహేను రోజుల క్రితం హైదరాబాద్ మార్కెట్‌కు తరలించాడు. ఒక్కో కాయకు రూ.5 నుంచి రూ.8 వరకు ధర లభించింది. దీంతో 12 ఎకరాల దానిమ్మ తోటలో మొదటి సారి కాసిన పండ్ల విలువ రూ.12లక్షలు. కూలీలు, రవాణా చార్జీలకు గాను రూ.3 లక్షలు ఖర్చయ్యాయి. వచ్చే ఏడాది నుంచి వచ్చే కాతంతా లాభాల పంటే. చాలా కష్టపడ్డా నాకు 12 ఎకరాల బీడు భూమి ఉంది. దాన్ని ఎలాగైనా సాగులోకి తేవాలని చాలా కష్టపడ్డా. రెండేళ్ల క్రితం వేసిన బోరులో అంగుళంన్నర నీరు రావడంతో దానిమ్మ తోటను సాగు చేయాలని నిర్ణయించుకున్నా. దీనికోసం మహారాష్ట్రలోని షిర్డీ ప్రాంతంలో సాగవుతున్న దానిమ్మ తోటలను సందర్శించా. అక్కడి రైతుల కష్టమే నాకు స్ఫూర్తిదాయకంగా మారింది. - వెంకటరమణారెడ్డి -
బిర బిరా.. లాభాలు
ఏడాదంతా సాగు ఏడాది పొడవునా ఈ పంటను సాగు చేయవచ్చు. విత్తిన మూడు వారాలకే కాతకు రావడం దీని విశిష్టత. కాయలు తెంపడం, మార్కెట్‌కు తరలించడం తేలికగా ఉంటుంది. దీనివల్ల ఎక్కువ మంది కూలీల అవసరం ఉండదు. ఫలితంగా ఖర్చు కలిసొస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న హైబ్రిడ్ విత్తనాలతో ఉత్పత్తి అయ్యే బీరకాయలపై వినియోగదారులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే తీగజాతి కూరగాయల పంటలకు తెగుళ్లు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. వీటిని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు తీసుకోకపోతే నష్టాలు తప్పవు. డ్రిప్ పద్ధతిలో పంటలు సాగు చేస్తే మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. విత్తన రకాలు.. పలు కంపెనీలకు చెందిన హైబ్రిడ్ రకాల విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. రెండు వరుసల మధ్య దూరం ఒకటిన్నర నుంచి రెండున్నర మీటర్లు, రెండు పాదుల మధ్య దూరం 0.6 నుంచి 0.9మీటర్లు ఉండేలా చూసుకోవాలి. ఎకరాకు ఒకటిన్నర కిలోల నుంచి రెండు కిలోల వరకు విత్తనం అవసరమవుతుంది. విత్తనశుద్ధి కిలో విత్తనానికి మూడు గ్రాముల చొప్పున థైరం, ఐదు గ్రాముల చొప్పున ఇమిడాక్లోప్రిడ్ కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. ఎరువులు విత్తే ముందు ఎకరాకు 6నుంచి 8టన్నుల పశవుల ఎరువు, 40కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ ఎరువులను గుంతల్లో వేసుకోవాలి. విత్తిన 25 రోజులకు పూత, పిందె దశలో 40 కిలోల నత్రజని ఎరువులు వేసుకోవాలి. మొక్కకు దగ్గరగా ఎరువులు వేయకూడదు. ఒకవేళ వేసినట్లయితే వెంటనే నీటి తడి అందించాలి. కలుపు నివారణ పంటల సాగులో కలుపు మొక్కల నివారణ అతిముఖ్యమైన అంశం. బీర తోటలోని కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. విత్తనం నాటిన మరుసటి రోజున తేలిక నేలల్లో లీటరు మెటాక్లోర్ (డ్యుయల్) మందును 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేయాలి. బరువు నేలల్లో1.5 లీటర్ల చొప్పున స్ప్రే చేసుకోవాలి. మొక్కలు రెండు, నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు లీటర్ నీటికి 3 గ్రాముల బోరాక్స్ పౌడర్ కలిపి ఆకులపై పిచికారీ చేస్తే పూత ఎక్కువగా వచ్చి దిగుబడి పెరుగుతుంది. రెండుమూడు తడులు అందించిన తర్వాత మట్టిని గుళ్ల చేయాలి. నీటి యాజమాన్యం పాదు చుట్టూ 3-5సెంటీమీటర్ల మందం మట్టి ఎండినట్లుగా ఉన్నప్పుడు నీరు ఇవ్వాలి. వారానికో తడి అందిస్తే పంట ఆరోగ్యవంతంగా ఉంటుంది. నీరు ఎక్కువకాలం పాదు చుట్టూ నిల్వకుండా జాగ్రత్తపడాలి. తెగుళ్లు తీగజాతి రకం పంటలపై తెగుళ్లు ఎక్కువగా ఆశించే అవకాశాలున్నాయి. వీటిలో ముఖ్యమైనవి బూజు తెగులు, బూడిద తెగులు, వేరు కుళ్లు తెగులు, పక్షికన్ను తెగులు ప్రధానమైనవి. వీటిని సకాలంలో గుర్తించి వ్యవసాయ శాఖ అధికారుల సలహా మేరకు తగిన మందులు పిచికారీ చేయాలి. సస్యరక్షణ చర్యలు ఎండాకాలంలో లోతుగా దుక్కి దున్నుకోవాలి. పంటమార్పిడి తప్పనిసరిగా చేపట్టాలి. కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వంద గ్రాముల విత్తనానికి రెండు గ్రాముల డెర్మా విరిడి మందును వాడి విత్తన శుద్ధి చేసుకోవాలి. అల్లి రెక్కల పురుగులను మొక్కకు రెండు చొప్పున విడుదల చేయాలి. పెరుగుదల దశ నుంచి పూతకు వచ్చే వరకు వేపగింజల కషాయాన్ని తగిన మోతాదులో 15 రోజులకోసారి పిచికారీ చేయాలి. -
మందు పిచికారీ చేస్తున్నారా..? జాగ్రత్త..
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో పంటల్లో చీడపీడల బెడద ఎక్కువైంది. వీటి నివారణకు రైతులు మందులు పిచికారీ చేయడంలో బిజీ బిజీగా ఉన్నారు. చీడపీడల నుంచి పంటలను కాపాడుకోవాలనే ప్రయత్నంలో మందులు పిచికారీ చేస్తూ స్వీయ రక్షణకు విస్మరిస్తున్నారు. కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇటీవల లోకేశ్వరం మండలం హవర్గా గ్రామానికి చెందిన యువ రైతు లస్మన్న రక్షణ చర్యలు లేకుండా మందు పిచికారీ చేస్తూ అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స పొందుతూ చనిపోయాడు. శనివారం నార్నూర్ మండలం కొత్తపల్లి(హెచ్) ఝాడే రాజ్‌కుమార్(25) పత్తి పంటకు మందు పిచికారీ చేస్తూ అస్వస్థతకు గురై చనిపోయాడు. ఈ క్రమంలో మందు పిచికారీ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏరువాక కోఆర్డినేటర్, శాస్త్రవేత్త రాజశేఖర్ వివరించారు. సూచనల మేరకే పిచికారీ చేయాలి.. పైరును ఆశించిన తెగుళ్లు, పురుగుల నిర్మూలనకు ఇష్టమొచ్చిన విధంగా పిచికారీ చేస్తే ఉపయోగం కన్నా నష్టమే అధికంగా ఉంటుంది. సూచనల మేరకు పిచికారీ చేయాలి. ఒక పంటకు పిచికారీ చేసిన మందు డబ్బాను మరో పంటకు ఇతర(కలుపు) మందును కలిపి పిచికారీ చేస్తే పంటలో ఏదైనా మార్పు, ఆకులు ముడుచుకుపోవడం కనిపిస్తే వెంటనే 20గ్రాముల యూరియా, 20గ్రాముల చక్కెర కలిపి పిచికారీ చేసి నివారించవచ్చు. మందులు అధికంగా వాడడం మూలంగా పంటకు మేలు చేసే సాలీడు, అక్షింతల పురుగులు, మిడతలు, తూనీగలు తదితర మిత్ర పురుగులు మృత్యువాత పడుతాయి. మిత్ర పురుగులు పొలంలో లేకుంటే పంటకు కీడు చేసే పురుగు పెరుగుతుంది. అవసరమైనవే.. పంటలకు పురుగు మందులు వాడడానికి వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు సూచించిన స్ప్రేలను జాగ్రత్తగా వాడాలి. పంటలో మొక్కల స్థాయిని బట్టి స్ప్రే డబ్బాలు ఉపయోగించాలి. పత్తిలో హ్యాండ్స్ప్రేయర్, పవర్ స్ప్రేయర్ల కంటే తైవాన్ స్ప్రేయర్ల ద్వారా మొక్కలకు నేరుగా మందు పిచికారీ చేసే వీలుంటుంది. అవగాహన అవసరం పంటలను ఆశించే చీడపీడల నివారణకు ఉపయోగించే పురుగు మందులపై రైతులు అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా దుకాణాల్లో పురుగు మందులు నాలుగు రంగుల్లో నీలి, పసుపు రంగులతో కూడిన డబ్బాలుంటాయి. పుర్రె గుర్తుతో కూడిన ఎర్ర రంగు ఉంటే అత్యంత విషపూరితమని గుర్తించాలి. ఆకుపచ్చ రంగు చిహ్నంతో ఉంటే తక్కువ విషపూరితమని గ్రహించాలి. మందు ప్రభావానికి గురైతే.. పురుగుల మందు ప్రభావానికి గురైన వ్యక్తికి ముందు నోటిలోకి వేలు పెట్టి వాంతి చేయించాలి. మూర్ఛపోయిన సందర్భంలో మూతికి గాయం కాకుండా రెండు దవడల మధ్య గుడ్డను ఉంచాలి. శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు తడిబట్టతో నెమ్మదిగా తుడవాలి. ఉష్ణోగ్రత తగ్గితే దుప్పటి కప్పి వెచ్చగా ఉంచాలి. సకాలంలో ఆస్పత్రికి తీసుకవెళ్లాలి, అనారోగ్యానికి కారణమైన రసాయనాల వివరాలు డాక్టర్‌కు తెలపాలి. -
వేరుశనగలో చీడ పీడలు నివారించుకుంటే మేలు
తామర పురుగులు : పిల్ల, పెద్ద పురుగులు ఆకులపై పచ్చదనాన్ని గోకి రసాన్ని పీలుస్తాయి. ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఆకులు ముడుచుకుని మొక్కలు గిడసబారిపోతాయి. ఆకుల అడుగు భాగంలో గోధమ వర్ణంలో మచ్చలు ఏర్పడతాయి. పేనుబంక : తల్లి, పిల్ల పురుగులు మొక్కలు, కొమ్మల చివర, లేత ఆకుల అడుగు భాగాన, కొన్ని సందర్భాలో పూతపై గుంపులు గుంపులుగా ఏర్పడి రసాన్ని పీలుస్తాయి. దీని వల్ల మొక్కలు గిడసబారతాయి. ఇది పూత దశలో ఆశిస్తే అంతా రాలిపోతుంది. ఈ పురుగులు తేనె వంటి జిగురు పదార్థం స్రవించడం వల్ల నల్లని బూజు ఏర్పడుతుంది. పచ్చదోమ : పిల్ల, తల్లి పురుగులు ఆకు అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చేస్తాయి. మొదట ఆకు అడుగు భాగాన వీ ఆకారంలో పసుపు పచ్చని మచ్చలు ఏర్పడి క్రమేపి ఆకులన్నీ పసుపు రంగులోకి మారతాయి. వీటి నివారణ డైమిథోయేట్ 400 మిల్లీలీటర్లు లేదా మిథైల్-ఓ-డెమటాన్ 400 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 320 మిల్లీలీటర్లు మందును 200 లీటర్ల నీటికి కలిపి ఎక రాకు పిచికారీ చేయాలి. అక్షింతల పురుగులు మొక్కకు 1,2 కన్నా ఎక్కువగా ఉంటే క్రిమిసంహారక మందుల వాడకం తగ్గించాలి. కాళహస్తి తెగులు(నులి పురుగులు) నులి పురుగులు కంటికి కనిపించవు. వీటిని మైక్రోస్కోప్‌తో మాత్రమే చూడగలం. ఇవి వేరుశనగ పంటపై పిందె, కాయ పెరిగే దశలో కాయలపై ఆశించ డం వల్ల నల్లని మచ్చలు ఏర్పడతాయి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నపుడు పిందెలు కాయలు నల్లగా మారి లోపలి గింజలు అభివృద్ధి చెందక ముడతలు పడతాయి. దీని నివారణకు చిరుధాన్యాలతో పంట మార్పిడి చేయాలి. పురుగును గమనించిన వెంటనే, నీటి తడిపెట్టిన తర్వాత అంతర వాహిక గులికల మందు వేయాలి. తిక్క ఆకుమచ్చ తెగులు త్వరగా వచ్చే ఆకుమచ్చ తెగులు పంట వేసిన 30 రోజుల తర్వాత కనిపిస్తుంది. ఈ మచ్చలు గుండ్రంగా ఉండి, ఆకు పైభాగాన ముదురు గోధుమ వర్ణం కలిగి ఉంటాయి. ఆకుమచ్చ ఆలస్యంగా వస్తే మచ్చలు చిన్నవిగా, గుండ్రంగా ఉండి, ఆకు అడుగు భాగాన నల్లని రంగు కలిగి ఉంటాయి. కాండం మీద, ఆకు కాడల మీద, ఊడల మీద కూడా మచ్చలు ఏర్పడతాయి. ఈ తెగులు నివారణకు మాంకోజెబ్ 400 గ్రాములు, కార్బండిజం 20 గ్రాములు లేదా క్లోరోథాల్‌నిల్ 400 గ్రాములు లేదా హెక్సాకోనజెల్ 400 మీల్లీలీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 15 రోజుల తర్వాత మరోసారి పిచికారీ చేయాలి. అంతర పంటగా సజ్జను 7:1 నిష్పత్తిలో వేయాలి. -
బత్తాయి రైతు చిత్తు
పీసీపల్లి: బత్తాయి తోటలకు తెగుళ్లు ఆశించి..వేల ఎకరాల్లో కాయలు నేలరాలుతున్నాయి. పీసీపల్లి మండలంలో 4 వేల హెక్టార్లలో బత్తాయి తోటలు సాగు చేశారు. ఈ ఏడాది తెగుళ్లు సోకడంతో దాదాపు 2 వేల హెక్టార్లలో రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో మరో 700 ఎకరాల్లో తోటలు నిలువునా ఎండిపోయాయి. వడపు తెగులు, దోమపోటుతో తీవ్ర నష్టం వడపు తెగులుకు తోడు, దోమపోటు బత్తాయి తోటలను నష్టపరుస్తున్నాయి. ఇవి సోకిన తోటల్లో ఒక్కరోజులోనే చెట్టుకున్న కాయలన్నీ పండుగా మారి రాలిపోతున్నాయి. దీంతో బత్తాయి రైతుల ఆశలు అడియాశలయ్యాయి. ఎకరాలకు ఎకరాలు తెగుళ్లు ఆశించి..రైతులు లబోదిబోమంటున్నారు. తగ్గిన బత్తాయి దిగుబడులు, ధరలు బత్తాయి చెట్లకు ఉడప తెగులు సోకడంతో దిగుబడి సగానికిపైగా తగ్గిపోయింది. ఎకరా తోటలో 20 టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా..పది టన్నులకు తగ్గింది. దీనికి తోడు ధరలు కూడా దిగజారి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. నెల క్రితం టన్ను బత్తాయి ధర రూ.25 వేలు పలకగా..ప్రస్తుతం రూ.8 నుంచి రూ.10 వేల వరకు తగ్గడంతో రైతులు అల్లాడుతున్నారు. దళారులు ధరలు దిగ్గోసి రైతులను ముంచుతున్నారు. కన్నెత్తి చూడని ఉద్యానవన శాఖ: తెగుళ్లు సోకిన బత్తాయి తోటలను ఉద్యానవనశాఖాధికారులు కన్నెత్తి చూడటం లేదు. సమస్యలపై ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. కనిగిరి ఉద్యానవనశాఖ కార్యాలయానికెళ్తే..ఎప్పుడూ ఆ కార్యాలయం మూసేసి ఉంటుందని..సమాధానం చెప్పేవారే కరువయ్యారని గోగడ వెంకటరమణయ్య అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఊసే లేని సబ్సిడీ పథకాలు: బత్తాయి రైతులకు అందాల్సిన సబ్సిడీ పరికరాలు, ఎరువులు ఎటుపోతున్నాయో..ఎవరికి ఇస్తున్నారో తెలియడం లేదని రైతులు చెబుతున్నారు. ఎండిన చెట్లకు నష్టపరిహారం అందిస్తామని రాసుకెళ్లిన అధికారులు ఏ ఒక్క రైతుకు ఇంత వరకు పరిహారం ఇవ్వలేదని విమర్శిస్తున్నారు. విద్యుత్ సక్రమంగా ఇవ్వాలి -వెన్నపూస మాలకొండయ్య, పీసీపల్లి వర్షాలు లేవు. బోర్లతో నీరు పెట్టుకుందామన్నా..సక్రమంగా కరెంటు ఉండటం లేదు. విద్యుత్ సక్రమంగా ఇచ్చి పండ్ల తోటల రైతులను ఆదుకోవాలి. నేను నాలుగు ఎకరాల్లో బత్తాయి తోటలు సాగుచేశాను. ఎటువంటి సబ్సిడీ పథకాలు, ఎరువులు అందలేదు. -
చెరకు రైతుకు చేదు గుళిక
అంతుచిక్కని తెగుళ్లు తగ్గిపోతున్న దిగుబడి వరివైపు మొగ్గుతున్న వైనం మునగపాక, న్యూస్‌లైన్ : ఒకవైపు చెరకు తోటలకు అంతుపట్టని తెగుళ్లు, మరోవైపు బెల్లం దిగుబడులు తగ్గిపోవడంతో చెరకు రైతు ఆవేదన చెందుతున్నాడు. గతంలో భారీ విస్తీర్ణంలో చెరకు పంట సాగు చేసే రైతులు ఇప్పుడు వాతావరణం అనుకూలించకపోవడంతో గత్యంతర లేక వరిసాగుపట్ల మక్కువ చూపుతున్నారు. శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కని తెగుళ్లు చెరకుకు సోకడంతో దిగుబడులు తగ్గుముఖం పట్టాయి. మునగపాక మండలంలోని చెరకు సాధారణ విస్తీర్ణం 2,476 హెక్టార్లు కాగా ఈ ఏడాది 2300 హెక్టార్లకు పడిపోయింది. అలాగే రబీలో వరి సాధారణవిస్తీర్ణం 55 హెక్టార్లు కాగా అదిప్పుడు రెట్టింపయింది. ముసిలితల్లి మూల సంఘంతోపాటు గెడ్డవతల అధిక విస్తీర్ణంలో తోటలకు తెగులు సోకుతున్నాయి. దీంతో తోటంతా ఎండిపోతుంది. ఇప్పటికే పలు మార్లు శాస్త్రవేత్తలు సైతం పర్యటించినా ఈ తె గుళ్లపై అంచనాకు రాలేకపోతున్నారు. సాధారణంగా ఎకరాకు 30-35 పాకాల వరకు బెల్లం దిగుబడి వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరల ప్రకారం ఈ లెక్కన సుమారు రూ.లక్ష వరకు ఆదాయం రావాల్సి ఉంటుంది. అయితే తోటలకు సోకిన తెగుళ్ల కారణంగా 6 పాకాలకు మించి దిగుబడులు రావడం లేదు.ప్రస్తుతం అనకాపల్లి బెల్లం మార్కెట్లో మొదటిరకం పదిమణుగులు రూ.2,600 కాగా రెండో రకం 2,400, మూడోరకం రూ.2,190 పలుకుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు తెగుళ్ల కారణంగా బెల్లం ఆరకపోవడం, సరిగా రంగు రాకపోవడం రైతులను కుంగదీస్తుంది. అంతేకాకుండా గత ఏడాది పలు మార్లు తుఫాన్లు సంభవించడంతో తోటలన్నీ నీటముంపునకు గురికావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. దీంతోబాటు నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి సర్కారు సైతం ముందుకురాకపోవడం గమనార్హం.