ఖమ్మం జిల్లా బాణాపురంలో పూత, కాత లేని మిరప తోట
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మిర్చి సాగు లాభాలు తెచ్చి పెడుతుందనుకుంటే నష్టాల పాలు జేసింది. లక్షల్లో పెట్టుబడులు పెట్టిన రైతుల పుట్టి ముంచింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మిర్చి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. గుబ్బ, తామర, ఎండు తెగుళ్లతో పూత, కాత లేకపోవడం, కాయకాసిన తర్వాత ఎండిపోవడం వంటి లక్షణాలతో పంట చేతికందకుండా పోయింది.
రాష్ట్రంలోనే అత్యధికంగా ఖమ్మం.. తర్వాత మహబూబాబాద్, వరంగల్, జోగుళాంబ గద్వాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఈసారి మిర్చి సాగైంది. రాష్ట్రంలో గతేడాది 2.40 లక్షల ఎకరాల్లో సాగైతే.. ఈ ఏడాది 3.58 లక్షల ఎకరాల్లో వేశారు. అయితే తెగుళ్ల దాడితో దిగుబడి తగ్గి రైతులకు దిగులు మిగిలింది. ఒక్క మహబూబాబాద్ జిల్లాలో 50 వేల ఎకరాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 40 వేల ఎకరాల పంటపై తెగుళ్లు ప్రభావం చూపాయి. మిగతా జిల్లాల్లోనూ రైతులు పంట నష్టపోయారు.
తామర దాడితో తీవ్ర నష్టం
మిర్చి పైరు ఎదుగుదల దశలో తొలుత జెమిని (గుబ్బ తెగులు) వైరస్ ఆశించింది. దీంతో రైతులు వివిధ రకాల క్రిమిసంహారక మందులను పిచికారీ చేస్తుండగానే.. పలు ప్రాంతాల్లో ఎండు తెగులు కూడా ఆశించింది. ఫలితంగా వేరు కుళ్లడం, కొమ్మలు ఎండిపోవడంతో పైరు వడబడింది. అంతలో ఎప్పుడూలేని విధంగా తామర పురుగు పంటపై దాడి చేసింది. గతంలో ఇండోనేషియాలో గుర్తించిన తామర పురుగు, గడిచిన జనవరిలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో గుర్తించారు. ఈసారి తెలుగు రాష్ట్రాల్లో విస్తరించగా.. పూత రాలిపోవడం రైతులను కలవర పరిచింది.
ఆకు తినేస్తుండటంతో రైతులు ఎర్రనల్లి, నల్లనల్లిగా భావించి క్రిమి సంహారక మందులను పిచికారీ చేశారు. తర్వాత తామర పురుగు ఆశించినట్లు నిపుణులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే బెంగళూరుకు చెందిన ప్రత్యేక బృందం నవంబర్ చివరి వారంలో వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో పర్యటించి పూత, కాత, ఆకు, మట్టి నమూనాలను సేకరించింది. క్రిమిసంహారక మందులు మార్చిమార్చి పిచికారీ చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో పంట తొలగించేందుకు రైతులు నిర్ణయించుకున్నారు. చాలాచోట్ల ట్రాక్టర్లు, యంత్ర పరికరాలతో తోటలను దున్నేసి మరో పంట సాగుకు సిద్ధమవుతున్నారు.
లక్షల్లో లాస్.. పలువురి రైతుల ఆత్మహత్య
మిగిలిన పంటలతో పోలిస్తే మిర్చి సాగుకు పెట్టుబడి ఎక్కువ. ఎకరం భూమిలో మిర్చి సాగుకు దాదాపు రూ.లక్ష వరకు ఖర్చవుతుంది. అయితే ఈ ఏడాది తెగుళ్లతో అంతకుమించి ఖర్చయింది. తెగుళ్లు ఆశించకపోతే ప్రస్తుతమున్న ధరతో మిర్చి లాభదాయకంగానే ఉండేది. కానీ తెగుళ్లతో పంట చేతికందకుండా పోవడంతో రూ.లక్షల్లో నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో ఈ ఏడాది 16 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. మొత్తం పంటలో 80 శాతం మేర తెగుళ్ల బారిన పడినట్లు వ్యవసాయశాఖ అంచనా. ఈ క్రమంలోనే పలువురు రైతులు పంట నష్టం మిగిల్చిన బాధతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
10 లక్షలు తెగుళ్ల పాలు ఖమ్మం జిల్లా
రఘునాథపాలెం మండలం కోయచె లక గ్రామానికి చెందిన మేళ్లచెర్వు రాంప్రసాద్ తన ఐదెకరాలకు తోడు మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని మిర్చి సాగుచేశాడు. ఎకరానికి రూ.90 వేల వరకు ఖర్చు పెడితే.. కాపు దశలో నల్లిపురుగు, దోమ, ఎండుతెగుళ్లతో పచ్చని తోట ఎండిపోయి మోళ్లు వచ్చాయి. సాగుకు రూ.10 లక్షలకు పైగా ఖర్చు చేశానని రాంప్రసాద్ వాపోతున్నాడు.
మందులకే రూ.3.50 లక్షల ఖర్చు
జోగుళాంబ గద్వాల జిల్లా గోగులపాడు గ్రామానికి చెందిన రైతు సుధాకర్ తన మూడెకరాలకు తోడు మరో ఏడెకరాలు కౌలుకు తీసుకుని మిర్చి సాగు చేశాడు. ఎకరాకు రూ.20 వేల చొప్పున కౌలుకే రూ.1.40లక్షలు చెల్లించాల్సి వస్తోంది. ఇక తెగుళ్లతో పంట వ్యయమూ పెరిగింది. ఎకరాకు రెండు బస్తాల చొప్పున నాలుగుసార్లు మందులు పిచికారీ చేయగా రూ.3.50 లక్షలు ఖర్చయ్యాయి. కూలీలు, ఇతరత్రా ఖర్చులన్నీ కలిపి 10 ఎకరాలకు రూ.13 లక్షల పెట్టుబడైంది. కానీ అకాల వర్షాలు, తెగుళ్లతో పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేకుండా పోయిందని సుధాకర్ అంటున్నాడు.
పంట పీకి కాల్చివేసి..
ఈ రైతు మహబూబాబాద్ జిల్లా పకిరా తండాకు చెందిన గుగులోత్ వశ్య. రెండున్నర ఎకరాల్లో మిర్చి సాగుకు రూ.1.70 లక్షలు ఖర్చు చేశాడు. ఏపుగా పెరిగిన పంటను చూసి సంబరపడ్డాడు. కానీ తామర పురుగు ఆశించడంతో 15 రోజుల్లోనే పంటంతా నాశనమైంది. దిగుబడి రాదని భావించి ఈ పంటను పీకి కాల్చేస్తున్నాడు.
ఇతర తెగుళ్లకు తామర తోడయ్యింది
మిర్చి పైరుకు ఈ ఏడాది తామర పురుగు ఆశించింది. జెమిని వైరస్, ఎండు తెగులు వంటి తెగుళ్లూ ఆశించాయి. పూతదశలో తామర పురుగు ఆశించింది. కేంద్ర పరిశోధక బృందం నిపుణుల సూచనలతో యాజమాన్య పద్ధతులపై రైతులకు సూచనలిస్తున్నాం.
–జె.హేమంతకుమార్,కో ఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం, వైరా, ఖమ్మం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment