Chilli crops
-
తెలంగాణ రైతుకు షాకిచ్చిన సైంటిస్టు
సాక్షి, మహబూబాబాద్/కురవి శాస్త్రవేత్త: మీ పేరేంటి..? రైతు: నాపేరు కుంట యాదగిరి శాస్త్రవేత్త: ఏం విత్తనాలు వేశారు రైతు : రెండు ఎకరాల్లో 001 విత్తనాలు వేశాను శాస్త్రవేత్త: ఎన్నిసార్లు మందులు కొట్టారు రైతు: వారానికోసారి, పురుగు ఎక్కువ ఉన్నప్పుడు రెండుసార్లు కూడా కొట్టాను శాస్త్రవేత్త: ఏం మందులు కొట్టారు రైతు: మోనో, బయోరీటా, పోలీసు ఇలా ఒక్కటా రెండా.. ఎవరు ఏం చెబితే అది కొట్టినా రోగం పోలేదు. ఇప్పుడు ఏం చేస్తే రోగం పోతుంది సార్.. శాస్త్రవేత్త: ఇప్పటివరకు తామర పురుగు నివారణకు మందు లేదు. పరిశోధన స్థాయిలోనే ఉంది. వచ్చే ఏడాది వరకు మందులు కనుగొనే అవకాశం ఉంది. రైతు: ఇప్పుడు ఏం చేయాలి సార్.. హార్టికల్చర్ అధికారి: ఏం మందులు కొట్టినా లాభం లేదు. చేను దున్నేసి వేరే పంటలు సాగుచేసుకోవడమే ఉత్తమం. ఇదీ మహబూబాబాద్ జిల్లా కురవి మం డలం మోదుగులగూడెం గ్రామరైతు కుంట యాదగిరి, ఢిల్లీ శాస్త్రవేత్త రాఘవేంద్ర, మహబూబాబాద్ జిల్లా హార్టికల్చర్ అధికారి సూర్యనారాయణ మధ్య సాగిన సంభాషణ. రాష్ట్రవ్యాప్తంగా మిర్చి పంటను నాశనం చేసిన తామర పురుగు తీరును పరిశీలించేందుకు మహబూబాబాద్ జిల్లా కురవి, డోర్నకల్ మండలాల్లో ఢిల్లీ శాస్త్ర వేత్తల బృందం గురువారం పర్యటించింది. ఈ సందర్భంగా రైతుల చేలకు వెళ్లి పంటకు తెగులు ఆశించిన తీరు, రైతులకు జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ముందే చెబితే బాగుండేది: కాత, పూత దశలో మిర్చి పంటను నాశనం చేస్తున్న తామర పురుగును గత ఏడాదే గుర్తించినట్లు ఢిల్లీ శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. ఏపీలోని గుంటూరు, పిడుగురాళ్ల ప్రాంతంలో ఈ తామర పురుగు వచ్చిందని తెలిపారు. అయితే ఈ తెగుళ్ల గురించి ఈ ఏడాది ప్రారంభంలో తమకు అవగాహన కల్పిస్తే బాగుండేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నవంబర్‌లో బెంగళూరు శాస్త్రవేత్తల బృందం వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో పర్యటించి తామర పురుగు తీవ్రతను గుర్తించింది. అప్పుడు కూడా ఈ పురుగుకు మందు లేదనే విషయం తెలపలేదు. దీంతో అప్పటినుంచి ఇప్పటివరకు ఎకరాకు రైతులు రూ. 20వేల నుంచి రూ. 30వేల విలువచేసే మందులు కొట్టారు. అప్పుడు చెబితే ఈ అప్పులైనా తప్పేవని రైతులు అంటున్నారు. నట్టేట మునిగిన రైతులు గత ఏడాది మిర్చి సాగుచేసిన రైతులకు అధిక లాభాలు వచ్చాయి. దీంతో చాలా మంది రైతులు మిర్చి పంటవైపు మొగ్గారు. గత ఏడాది రాష్ట్రంలో 2.40 లక్షల ఎకరాల్లో మిర్చి సాగవగా, ఈ ఏడాది 3.58 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. అత్యధికంగా ఖమ్మంలో 1,02,853 ఎకరాలు సాగు చేశారు. మహబూబాబాద్‌లో 82,482 ఎకరాలు, జోగుళాంబలో 34,873, వరంగల్‌లో 27,479, జయశంకర్ భూపాలపల్లిలో 30,330, భద్రాద్రి కొత్తగూడెంలో 26,185, సూర్యాపేట జిల్లాలో 21,472 ఎకరాల్లో సాగుచేశారు. ఇందులో 2 లక్షల ఎకరాలు తామర పురుగు బారిన పడి మిర్చి రైతులు నష్టపోయారని, ఒక్కొక్క ఎకరానికి రూ.70 వేల మేరకు రైతులకు నష్టం వాటిల్లిందని అంచనా. ఎన్ని మందులు కొట్టినా పోవడం లేదు ఎకరంలో మిర్చి సాగు చేశాను. మూడు రకాల విత్తనాలను తీసుకొచ్చి వేశాను. ఎకరానికి రూ.40వేల పెట్టుబడి పెట్టాను. వారానికి రెండు సార్లు మందులు కొట్టాను. ఎన్ని మందులు కొట్టినా పురుగు పోవడంలేదు. పురుగు పోవడానికి మందు లేదు.. చేను మొత్తం దున్నుకోమన్నరు. – కొత్త వెంకన్న, మోదుగులగూడెం, కురవి -
తెగులు తినేసింది.. దిగులే మిగిలింది
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మిర్చి సాగు లాభాలు తెచ్చి పెడుతుందనుకుంటే నష్టాల పాలు జేసింది. లక్షల్లో పెట్టుబడులు పెట్టిన రైతుల పుట్టి ముంచింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మిర్చి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. గుబ్బ, తామర, ఎండు తెగుళ్లతో పూత, కాత లేకపోవడం, కాయకాసిన తర్వాత ఎండిపోవడం వంటి లక్షణాలతో పంట చేతికందకుండా పోయింది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఖమ్మం.. తర్వాత మహబూబాబాద్, వరంగల్, జోగుళాంబ గద్వాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఈసారి మిర్చి సాగైంది. రాష్ట్రంలో గతేడాది 2.40 లక్షల ఎకరాల్లో సాగైతే.. ఈ ఏడాది 3.58 లక్షల ఎకరాల్లో వేశారు. అయితే తెగుళ్ల దాడితో దిగుబడి తగ్గి రైతులకు దిగులు మిగిలింది. ఒక్క మహబూబాబాద్ జిల్లాలో 50 వేల ఎకరాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 40 వేల ఎకరాల పంటపై తెగుళ్లు ప్రభావం చూపాయి. మిగతా జిల్లాల్లోనూ రైతులు పంట నష్టపోయారు. తామర దాడితో తీవ్ర నష్టం మిర్చి పైరు ఎదుగుదల దశలో తొలుత జెమిని (గుబ్బ తెగులు) వైరస్ ఆశించింది. దీంతో రైతులు వివిధ రకాల క్రిమిసంహారక మందులను పిచికారీ చేస్తుండగానే.. పలు ప్రాంతాల్లో ఎండు తెగులు కూడా ఆశించింది. ఫలితంగా వేరు కుళ్లడం, కొమ్మలు ఎండిపోవడంతో పైరు వడబడింది. అంతలో ఎప్పుడూలేని విధంగా తామర పురుగు పంటపై దాడి చేసింది. గతంలో ఇండోనేషియాలో గుర్తించిన తామర పురుగు, గడిచిన జనవరిలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో గుర్తించారు. ఈసారి తెలుగు రాష్ట్రాల్లో విస్తరించగా.. పూత రాలిపోవడం రైతులను కలవర పరిచింది. ఆకు తినేస్తుండటంతో రైతులు ఎర్రనల్లి, నల్లనల్లిగా భావించి క్రిమి సంహారక మందులను పిచికారీ చేశారు. తర్వాత తామర పురుగు ఆశించినట్లు నిపుణులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే బెంగళూరుకు చెందిన ప్రత్యేక బృందం నవంబర్ చివరి వారంలో వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో పర్యటించి పూత, కాత, ఆకు, మట్టి నమూనాలను సేకరించింది. క్రిమిసంహారక మందులు మార్చిమార్చి పిచికారీ చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో పంట తొలగించేందుకు రైతులు నిర్ణయించుకున్నారు. చాలాచోట్ల ట్రాక్టర్లు, యంత్ర పరికరాలతో తోటలను దున్నేసి మరో పంట సాగుకు సిద్ధమవుతున్నారు. లక్షల్లో లాస్.. పలువురి రైతుల ఆత్మహత్య మిగిలిన పంటలతో పోలిస్తే మిర్చి సాగుకు పెట్టుబడి ఎక్కువ. ఎకరం భూమిలో మిర్చి సాగుకు దాదాపు రూ.లక్ష వరకు ఖర్చవుతుంది. అయితే ఈ ఏడాది తెగుళ్లతో అంతకుమించి ఖర్చయింది. తెగుళ్లు ఆశించకపోతే ప్రస్తుతమున్న ధరతో మిర్చి లాభదాయకంగానే ఉండేది. కానీ తెగుళ్లతో పంట చేతికందకుండా పోవడంతో రూ.లక్షల్లో నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో ఈ ఏడాది 16 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. మొత్తం పంటలో 80 శాతం మేర తెగుళ్ల బారిన పడినట్లు వ్యవసాయశాఖ అంచనా. ఈ క్రమంలోనే పలువురు రైతులు పంట నష్టం మిగిల్చిన బాధతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 10 లక్షలు తెగుళ్ల పాలు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోయచె లక గ్రామానికి చెందిన మేళ్లచెర్వు రాంప్రసాద్ తన ఐదెకరాలకు తోడు మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని మిర్చి సాగుచేశాడు. ఎకరానికి రూ.90 వేల వరకు ఖర్చు పెడితే.. కాపు దశలో నల్లిపురుగు, దోమ, ఎండుతెగుళ్లతో పచ్చని తోట ఎండిపోయి మోళ్లు వచ్చాయి. సాగుకు రూ.10 లక్షలకు పైగా ఖర్చు చేశానని రాంప్రసాద్ వాపోతున్నాడు. మందులకే రూ.3.50 లక్షల ఖర్చు జోగుళాంబ గద్వాల జిల్లా గోగులపాడు గ్రామానికి చెందిన రైతు సుధాకర్ తన మూడెకరాలకు తోడు మరో ఏడెకరాలు కౌలుకు తీసుకుని మిర్చి సాగు చేశాడు. ఎకరాకు రూ.20 వేల చొప్పున కౌలుకే రూ.1.40లక్షలు చెల్లించాల్సి వస్తోంది. ఇక తెగుళ్లతో పంట వ్యయమూ పెరిగింది. ఎకరాకు రెండు బస్తాల చొప్పున నాలుగుసార్లు మందులు పిచికారీ చేయగా రూ.3.50 లక్షలు ఖర్చయ్యాయి. కూలీలు, ఇతరత్రా ఖర్చులన్నీ కలిపి 10 ఎకరాలకు రూ.13 లక్షల పెట్టుబడైంది. కానీ అకాల వర్షాలు, తెగుళ్లతో పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేకుండా పోయిందని సుధాకర్ అంటున్నాడు. పంట పీకి కాల్చివేసి.. ఈ రైతు మహబూబాబాద్ జిల్లా పకిరా తండాకు చెందిన గుగులోత్ వశ్య. రెండున్నర ఎకరాల్లో మిర్చి సాగుకు రూ.1.70 లక్షలు ఖర్చు చేశాడు. ఏపుగా పెరిగిన పంటను చూసి సంబరపడ్డాడు. కానీ తామర పురుగు ఆశించడంతో 15 రోజుల్లోనే పంటంతా నాశనమైంది. దిగుబడి రాదని భావించి ఈ పంటను పీకి కాల్చేస్తున్నాడు. ఇతర తెగుళ్లకు తామర తోడయ్యింది మిర్చి పైరుకు ఈ ఏడాది తామర పురుగు ఆశించింది. జెమిని వైరస్, ఎండు తెగులు వంటి తెగుళ్లూ ఆశించాయి. పూతదశలో తామర పురుగు ఆశించింది. కేంద్ర పరిశోధక బృందం నిపుణుల సూచనలతో యాజమాన్య పద్ధతులపై రైతులకు సూచనలిస్తున్నాం. –జె.హేమంతకుమార్,కో ఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం, వైరా, ఖమ్మం జిల్లా -
తామర పురుగు నివారణకు ఆర్బీకే సైన్యం
సాక్షి, అమరావతి: మిరప పంటపై తామర పురుగు దాడి చేయడంతో రైతులకు కంటిమీద కునుకు కరువైంది. దీంతో వారికి బాసటగా నిలిచేలా.. పంటను సంరక్షించేలా రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీకే సిబ్బందిని రంగంలోకి దించింది. ఖరీఫ్‌లో మిరప సాధారణ విస్తీర్ణం 3.40 లక్షల ఎకరాలు కాగా.. ఈ ఏడాది అనూహ్యంగా 4.75 లక్షల ఎకరాల్లో రైతులు మిరప వేశారు. గడచిన రెండేళ్లలో ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా మిరప ధర క్వింటాల్ ధర రూ.12 వేల నుంచి 15 వేల వరకు పలికింది. దీంతో పత్తి, వేరుశనగ రైతులు మిరప సాగువైపు మళ్లారు. పూత, పిందెల్ని పీల్చేస్తున్నాయ్ ప్రస్తుతం 60 శాతం పంట ఏపుగా ఎదిగే దశలో, 25 శాతం పూత దశలో, 10–15 శాతం పిందె దశలో ఉంది. ముదురు–నలుపు రంగులో ఉండే కొత్త రకం తామర పురుగులు మిర్చి పూత, పిందెల్లోకి చేరి రసాన్ని పీల్చేస్తూ పంటను నాశనం చేస్తున్నాయి. 10–15 రోజుల్లో గుడ్డు నుంచి తల్లి దశకు చేరుకునే ఈ పురుగు తన 35 రోజుల జీవిత కాలంలో 150 నుంచి 300 గుడ్లు పెడుతుంది. వీటి నివారణ కోసం రైతులు పెద్దఎత్తున పురుగు మందులు వాడుతున్నా ఉధృతి ఏమాత్రం తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఉద్యాన శాఖ అంచనా ప్రకారం ఇప్పటికే 1.50 లక్షల ఎకరాల్లో పంటపై ఈ పురుగు వ్యాపించినట్టు అంచనా. రంగంలోకి శాస్త్రవేత్తల బృందాలు తామర పురుగు నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 1వ తేదీ నుంచి ఆర్బీకే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి గ్రామ స్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తోంది. నివారణ చర్యలపై ప్రత్యేకంగా కరపత్రాలను ముద్రించి రైతులకు పంపిణీ చేస్తోంది. ఆడియో, వీడియో సందేశాలను వాట్సాప్ ద్వారా రైతులకు చేరవేస్తోంది. తాజాగా ఉద్యాన వర్సిటీ శాస్తవేత్తలతో బృందాలను ఏర్పాటు చేసి రంగంలోకి దింపింది. మిరప ఎక్కువగా సాగయ్యే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పరిధిలోని 1,580 ఆర్బీకేల పరిధిలో ప్రచార జాతాలు సైతం మొదలయ్యాయి. అవసరమైన మందులను ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచుతున్నారు. నివారణ ఇలా తామర పురుగు నలుపు, ముదురు గోధుమ రంగుల్లో కండె ఆకారంలో కోడి పేను లక్షణం కలిగి ఉంటుందని ఉద్యాన పరిశోధన కేంద్రం (లాం) ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సి.శారద తెలిపారు. ఆశించిన వారం పది రోజుల్లోనే పంటను పూర్తిగా నాశనం చేస్తుందన్నారు. వీటి నివారణకు ఆమె ఈ దిగువ సూచనలు చేశారు. ► తామర పురుగు సోకిన మిరప చేలపై ప్రతి నాలుగైదు రోజులకోసారి వేపనూనె పిచికారీ చేయాలి. ఇది గుడ్లను పొదగనివ్వదు. పొదిగిన గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు వేప నూనె చేదు వల్ల ఆహారం తీసుకోలేక చనిపోతాయి. ► పొలంలో 25నుంచి 30 వరకు నీలి రంగు జిగురు అట్టలు ఏర్పాటు చేసుకుంటే పురుగు వ్యాప్తిని కొంతవరకైనా అరికట్టవచ్చు. ► పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉంటే పెగాసిస్ 1.25 గ్రాములు లేదా ఇంట్రీప్రిడ్ 2 ఎం.ఎల్. లేదా ఫిప్రోనిల్ 2 ఎం.ఎల్. వేపనూనె (10 వేల పీ.పీ.ఎం)తో కలిపి మార్చి మార్చి పిచికారీ చేయాలి. ► అదేవిధంగా రెండు కేజీల పచ్చి మిరప, 500 గ్రాముల వెల్లుల్లిని కలిపి రుబ్బగా వచ్చిన పచ్చడిని ఒక గుడ్డలో చుట్టి 10 లీటర్ల నీటిలో ఉంచి, కషాయం దిగిన తరువాత వడకట్టి 1:10 పద్ధతిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ► రోజు మార్చి రోజు పురుగు ఉధృతిని గమనిస్తూ ఉండాలి. ► పొలంలో అక్కడక్కడా పొద్దు తిరుగుడు మొక్కలను ఆకర్షక పంటగా నాటాలి. ► విచక్షణా రహితంగా పురుగు మందుల వినియోగాన్ని తగ్గించాలి. నెలాఖరు వరకు అవగాహన కార్యక్రమాలు తామర పురుగు నివారణకు ఉద్యాన శాఖ స్పెషల్ డ్రైవ్ చేపడుతోంది. ఈ నెలాఖరు వరకు ఆర్బీకే స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. క్షేత్ర స్థాయి పరిశీలన కోసం శాస్త్రవేత్తల బృందాలను పంపించాం. సామూహిక నివారణ చర్యలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. తీవ్రతను బట్టి మరిన్ని చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ ఎస్ఎస్ శ్రీధర్, కమిషనర్, ఉద్యాన శాఖ -
రైతన్నలకు మరో 3 వరాలు!
సాక్షి, అమరావతి : అన్నదాతలకు మరో మూడు వరాలను ప్రకటించడంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో పండించే పలు పంటలకు గిట్టుబాటు ధరలు, శాశ్వత కొనుగోలు కేంద్రాలతోపాటు కేంద్రం కొనుగోలు చేయగా మిగిలిన పంటను రైతుల నుంచి కొనేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు మార్కెటింగ్‌శాఖ ఈమేరకు చర్యలను తీసుకుంటోంది. వీటికి సంబంధించి నూతన ఏడాదిలో ప్రకటన చేసే అవకాశం ఉంది. మిర్చి, పసుపు, ఉల్లి, మైనర్ మిల్లెట్లకు ‘మద్దతు’ కేంద్రం మద్దతు ధర ప్రకటించని మిర్చి, పసుపు, ఉల్లి, మైనర్ మిల్లెట్ల (కొర్రలు, అండుకొర్రలు, సామలు)కు మద్దతు ధర ఇచ్చి రైతులకు అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ పంటల సాగు ఖర్చులను పరిగణనలోకి తీసుకుని మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఏటా వరి, గోధుమలు, అపరాలు, పత్తి, కంది పంటలకు మద్దతు ధర ప్రకటిస్తోంది. అయితే రాష్ట్రంలో పండించే పలు పంటలకు కేంద్రం మద్దతు ధర ప్రకటించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అధిక దిగుబడి వచ్చిన సమయంలో వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని మిర్చి, పసుపు, ఉల్లి, మైనర్ మిల్లెట్లకు మద్దతు ధర ప్రకటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రైతు సంఘాలు, వ్యవసాయ రంగ నిపుణులు, వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్‌శాఖల అధికారులతో చర్చలు జరిపిన మార్కెటింగ్, సహకారశాఖల ప్రత్యేక కార్యదర్శి మధుసూధనరెడ్డి దీనిపై ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక ఇచ్చారు. శాశ్వత కొనుగోలు కేంద్రాలు ఇకపై సీజన్లవారీగా కాకుండా పంట ఉత్పత్తుల కొనుగోలుకు శాశ్వత కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పరిమిత కాలంలో ఏర్పాటవుతున్న కొనుగోలు కేంద్రాల వల్ల రైతులు పూర్తిగా పంటను అమ్ముకోలేకపోతుండటంతో శాశ్వత కేంద్రాలను నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. మార్కెట్ సబ్ యార్డుల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. బహిరంగ మార్కెట్లో పంటల ధరలు తగ్గినప్పుడు రైతులు తమ పంటలను ఎప్పుడైనా శాశ్వత కేంద్రాలకు తీసుకువెళ్లి విక్రయించే అవకాశం లభిస్తుంది. మార్కెటింగ్ శాఖ పర్యవేక్షణలో పౌరసరఫరాలశాఖ, మార్క్‌ఫెడ్, ఆయిల్‌ఫెడ్ నోడల్ ఏజెన్సీలుగా పంటలను కొనుగోలు చేయనున్నాయి. మిగతాది రాష్ట్రమే కొంటుంది ఏటా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిన పంటల దిగుబడిలో 25 శాతం మాత్రమే కొనుగోలు చేస్తుండటంతో రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం కొనగా మిగిలిన పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వీటిపై జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. -
అన్నదాతకు అకాల దెబ్బ
సాక్షి, సంగారెడ్డి: అకాల వర్షాలు రైతులను నిండా ముంచుతున్నాయి. మెట్ట పంటలను తుంచేస్తూ వర్షాధార పంటలకు ప్రాణం పోస్తున్నాయి. జిల్లాలో గత ఐదు రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి కూడా జిల్లా అంతటా వర్షం కురిసింది. వర్షాలతో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, శనగ, మిరప పంటలు నేలకొరిగాయి. మామిడి పిందెలు నేలరాలాయి. మరోవైపు విద్యుత్ కోతలతో క్షీణిస్తున్న వరి, చెరకు పంటలకు ఈ వర్షాలు మేలు చేస్తున్నాయి. ఆదివారం నాటికి జిల్లాలో 422.8 హెక్టార్లలో వ్యవసాయ, 280 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు ఆయా శాఖలు తేల్చాయి. కాగా సోమవారం రాత్రి కూడా పలుచోట్ల వర్షాలు కురవడంతో ఈ నష్టం మరింత పెరిగింది. నర్సాపూర్ మండలంలో రెండు కోళ్లఫారాలు ధ్వంసమయ్యాయి. 500 కోళ్లు మృత్యువాత పడగా సుమారు రూ. 20 లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు సమాచారం. కాగా సంగారెడ్డిలో భారీగా వడగళ్ల వర్షం కురిసింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇదిలా ఉండగా తాజా నష్టం వివరాలు మంగళవారం అధికారికంగా వెల్లడికానున్నాయి. పంట నష్టంపై సమగ్ర సర్వే జరిపి బుధవారం ప్రభుత్వానికి తుది నివేదిక పంపించాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ శాఖలను ఆదేశించారు. 420 హెక్టార్లలో వ్యవసాయానికి దెబ్బ.. కల్హేర్ మండలంలోని మూడు గ్రామాల పరిధిలో 320 హెక్టార్ల మొక్కజొన్న, 2.8 హెక్టార్లలో గోధుమ పంటలు ధ్వంసమైనట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. చేగుంట మండలంలోని ఐదు గ్రామాల పరిధిలో 20 హెక్టార్లలో మొక్కజొన్న, 4 హెక్టార్ల పొద్దుతిరుగుడు, 4 హెక్టార్ల శనగ పంటలు దెబ్బతిన్నాయి. దుబ్బాక మండలంలో 8 హెక్టార్ల పొద్దుతిరుగుడు, 6 హెక్టార్లలో మొక్కజొన్న.. సిద్దిపేట మండలంలో 2 గ్రామాల పరిధిలో 40 హెక్టార్ల పొద్దుతిరుగుడు, 8 హెక్టార్ల మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. 280 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం చిన్నకోడూరులో 250 హెక్టార్లలో మిరప, సిద్దిపేటలో 14.4 హెక్టార్లలో మామిడి, దుబ్బాకలో 10 హెక్టార్లలో మామిడి, 4 హెక్టార్లలో మిరప పంటలు దెబ్బతిన్నట్టు ఉద్యాన శాఖ అధికారులు గుర్తించారు. -
దంపతులను మింగిన ఒర్రె
మహదేవపూర్, న్యూస్‌లైన్ : వ్యవసాయమే జీవనాధారం... తెల్లారితే పనుల్లో మునిగిపోయేవారు.. రోజువారీలాగే పనులు ముగించుకుని ఇంటికి వస్తున్న ఆ దంపతులను ఒర్రె రూపంలో మృత్యువు కబళించింది. ఎడ్లను ఒర్రె నుంచి బయటకు తీసుకొస్తున్న క్రమంలో అందులో పడి దంపతులు మరణించిన ఘటన మహదేవపూర్‌లో చోటుచేసుకుంది. బంధువుల కథనం ప్రకారం... మండల కేంద్రానికి చెందిన రైతు దంపతులు బండారి గట్టయ్య(50), ప్రమీల(42) వ్యవసాయమే జీవనాధారంగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారికున్న ఐదెకరాల్లో పత్తి, మిర్చి పంటలు వేశారు. మంగళవారం గోదావరి ఒడ్డున ఉన్న తమ పత్తి చేనులోకి వెళ్లి సాయంత్రం ఇంటికి బయలుదేరారు. ఆ సమయంలో వారి ఎద్దులు ఒర్రెలోకి దిగారుు. ఒర్రెలో నీళ్లు బాగా ఉండడంతో వాటిని బయటకు తీసుకొచ్చే క్రమంలో భార్యాభర్తలిద్దరూ ప్రమాదవశాత్తు ఒర్రెలో పడి మృతిచెందారు. వారు రాత్రరుునా రాకపోవడం, ఎడ్లు మాత్రమే ఇంటికి చేరుకోవడంతో బంధువులు చేనులో వెతికారు. రాత్రి కావడంతో ఆచూకీ లభించలేదు. బుధవారం ఉదయం వెతికే క్రమంలో ఒర్రెలో మృతదేహాలు కనిపించాయి. సమాచారాన్ని పోలీసులకు అందించి మృతదేహాలను బయటకు తీసి మహదేవపూర్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై కృష్ణమూర్తి తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను గోదావరి ఒడ్డున ఖననం చేశారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు చంద్రశేఖర్, మహేశ్, కుమార్తె సుమ ఉంది. పంట చేలు మేస్తాయని... ఒర్రె ఆవల ఉన్న చేలల్లోకి వెళ్లి పంట మేస్తే ఆ రైతులు తిడతారనే ఉద్దేశంతోనే ఎద్దులు ఆపే క్రమంలో గట్టయ్య, అతడి భార్య ప్రమీల ఒర్రెలో పడినట్లు తెలుస్తోంది. ఇటీవల గోదావరికి వచ్చిన వరదతో ఒర్రె నిండడం, ఇద్దరికి ఈత రాకపోవడంతోనే వారు మరణించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇతర రైతులు తిడతారనే బాధతో ఎడ్లను పట్టుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయినట్లయింది. పంటను మింగింది.. వారిని మింగింది.. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నాలుగైదు సార్లు గోదావరి వరద నీరు చేలల్లోకి చేరి పంటలను ముంచెత్తింది. దీంతో పత్తి మొక్కలు కుళ్లి పనికి రాకుండా పోయూరుు. గట్టయ్య చేనును కూడా వరదనీరు ముంచెత్తడంతో నాలుగుసార్లు పత్తి గింజలు నాటాడు. ‘గోదావరి వరద నీరు పత్తి చేనునే కాదు.. మిమ్ముల్ని కూడా మింగిందా..’ అంటూ బంధువులు, కుటుంబసభ్యులు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. పలువురి పరామర్శ రైతు దంపతుల పిల్లలను వివిధ పార్టీల నాయకులు పరామర్శించారు. మహదేవపూర్ సర్పంచ్ కోట రాజబాబు, పీఏసీఎస్ చైర్మన్ శ్రీపతిబాపు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పుట్ట మధు, నాయకులు వామన్‌రావు, బాబోద్దీన్ పరామర్శించారు. అంత్యక్రియల కోసం తాత్కాలిక సాయంగా రెవెన్యూ శాఖ, ఐకేపీ రూ.5 వేల చొప్పున ఆర్థికసాయం అందించారు.