సాక్షి, సంగారెడ్డి: అకాల వర్షాలు రైతులను నిండా ముంచుతున్నాయి. మెట్ట పంటలను తుంచేస్తూ వర్షాధార పంటలకు ప్రాణం పోస్తున్నాయి. జిల్లాలో గత ఐదు రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి కూడా జిల్లా అంతటా వర్షం కురిసింది. వర్షాలతో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, శనగ, మిరప పంటలు నేలకొరిగాయి. మామిడి పిందెలు నేలరాలాయి. మరోవైపు విద్యుత్ కోతలతో క్షీణిస్తున్న వరి, చెరకు పంటలకు ఈ వర్షాలు మేలు చేస్తున్నాయి. ఆదివారం నాటికి జిల్లాలో 422.8 హెక్టార్లలో వ్యవసాయ, 280 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు ఆయా శాఖలు తేల్చాయి.
కాగా సోమవారం రాత్రి కూడా పలుచోట్ల వర్షాలు కురవడంతో ఈ నష్టం మరింత పెరిగింది. నర్సాపూర్ మండలంలో రెండు కోళ్లఫారాలు ధ్వంసమయ్యాయి. 500 కోళ్లు మృత్యువాత పడగా సుమారు రూ. 20 లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు సమాచారం. కాగా సంగారెడ్డిలో భారీగా వడగళ్ల వర్షం కురిసింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇదిలా ఉండగా తాజా నష్టం వివరాలు మంగళవారం అధికారికంగా వెల్లడికానున్నాయి. పంట నష్టంపై సమగ్ర సర్వే జరిపి బుధవారం ప్రభుత్వానికి తుది నివేదిక పంపించాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ శాఖలను ఆదేశించారు.
420 హెక్టార్లలో వ్యవసాయానికి దెబ్బ..
కల్హేర్ మండలంలోని మూడు గ్రామాల పరిధిలో 320 హెక్టార్ల మొక్కజొన్న, 2.8 హెక్టార్లలో గోధుమ పంటలు ధ్వంసమైనట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది.
చేగుంట మండలంలోని ఐదు గ్రామాల
పరిధిలో 20 హెక్టార్లలో మొక్కజొన్న, 4 హెక్టార్ల పొద్దుతిరుగుడు, 4 హెక్టార్ల శనగ పంటలు దెబ్బతిన్నాయి.
దుబ్బాక మండలంలో 8 హెక్టార్ల పొద్దుతిరుగుడు, 6 హెక్టార్లలో మొక్కజొన్న..
సిద్దిపేట మండలంలో 2 గ్రామాల పరిధిలో 40 హెక్టార్ల పొద్దుతిరుగుడు, 8 హెక్టార్ల మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. 280 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం చిన్నకోడూరులో 250 హెక్టార్లలో మిరప, సిద్దిపేటలో 14.4 హెక్టార్లలో మామిడి, దుబ్బాకలో 10 హెక్టార్లలో మామిడి, 4 హెక్టార్లలో మిరప పంటలు దెబ్బతిన్నట్టు ఉద్యాన శాఖ అధికారులు గుర్తించారు.
అన్నదాతకు అకాల దెబ్బ
Published Mon, Mar 3 2014 11:46 PM | Last Updated on Sat, Sep 2 2017 4:19 AM
Advertisement