నిజామాబాద్ వ్యవసాయం : ఎప్పుడూ ఒకేరకమైన పంటలు వేస్తూ ఉంటే దిగుబడులు తగ్గుతూ ఉంటాయి. చాలామంది రైతులు నేటికీ ఒకేరకమై పంటలను పండిస్తూ సరైన దిగుబడులు రాక ఆర్థికంగా చితికిపోతున్నారు. ఏటేటా పంట మార్పిడి చేస్తే నాణ్యమైన ఉత్పత్తులు వచ్చి దిగుబడులు రెట్టింపయ్యే వీలుంటుందని జేడీఏ నర్సింహా తెలిపారు. రబీలో ఆలస్యంగా సాగుచేస్తున్న రైతులకు ‘పంటమార్పిడి విధానం’పై పలు సూచనలు చేశారు.
అవగాహన అవసరం
పంట మార్పిడి విధానాన్ని అవలంబిస్తే తెగుళ్ల బెడద తగ్గుతుంది. దీనిపై చాలా మంది రైతులకు అవగాహన లేదు. ఒకరిని చూసి మరొకరు వేసిన పంటేనే వేస్తూ నష్టాలపాలవుతున్నారు. పంట మార్పు మూలంగా నేల భౌతిక స్థితి మెరుగుపడుతుంది. భూమిలో నీరు నిల్వ ఉండే శక్తి కలిగి భూసారం వృద్ధి చెందుతుంది. దీని వల్ల చీడపీడల బెడద అస్పలుండదు. ఫలితంగా సస్యరక్షణకు వినియోగించే మందుల ఖర్చు తగ్గించవచ్చు. శిలీంధ్ర తెగుళ్లను దూరం చేయవచ్చు. బీజాలు వాటి అవశేషాలు, వానపాముల అభివృద్ధి ఎక్కువవుతుంది. కీటకాల గుడ్లు వృద్ధి చెందవు. పంటలో నాణ్యత పెరిగి గిట్టుబాటు ఎక్కువగా పొందే అవకాశం ఉంది.
రైతులు గమనించాల్సినవి
భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ చేసే శక్తి ఉన్నప్పుడు పంట తర్వాత వేరే పంటను వేసి ఏడాదిలో రెండు పంటలు పండించుకోవాలి.
తేలికపాటి నేలలు, ఎర్ర ఇసుక నేలల్లో మిశ్రమ పంటలు వేసుకోవాలి.
వర్షాకాలం రోజులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ పంటకాలం కలిగిన కంది, నువ్వు, వేరుశనగ వంటి పంటలు వేసుకోవాలి.
బంకమన్ను శాతం ఎక్కువగా ఉంటే ఎర్రనేలలు, నల్లరేగడి నేలలు, పల్లపు ప్రాంతాల్లో పంట మార్పిడి చేసి ఏడాదిలో రెండు పంటలు పండించుకోవాలి.
జాగ్రత్తలు
పంట మార్పిడిలో నేల ఉపరితలాన్ని పూర్తిగా కప్పే పంటలను ఎంపిక చేసుకోవాలి.
ఇందులో శనగ, బబ్బెర, మినుము, ఉలువలు, పెసర పంటలను వేయడం వల్ల నేలను పూర్తిగా కప్పి ఉంచుతాయి.
దీని వల్ల కలుపు మొక్కలను నివారించవచ్చు.
పత్తి పైరు సాగు చేసిన నేలలో మినుము, పెసర వంటి పం టలతో మార్పు చేయడం వల్ల తెల్లదోమ ఉధృతి తగ్గించవచ్చు.
వేరుశనగ తర్వాత జొన్న, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు వంటి ఆరుతడి పంటలను పండించాలి.
దీని వల్ల వేరుశనగ పంటలను ఆశించే ఆకుముడత ఉధృతిని నివారించవచ్చు.
పసుపు తర్వాత వరి, జొన్న వంటి పైర్లను సాగు చేసుకోవాలి. దీని వల్ల నేలలో నెమటోడ్ల సంఖ్య తగ్గుతుంది.
వరి పైరు తర్వాత పప్పు ధాన్యాల పంటలు గానీ నూనె గింజల పైర్లనుగాని పండించడం వల్ల వరి పంటను ఆశించే టంగ్రో వైరస్, దోమ పోటులను సమర్ధంగా నివారించవచ్చు.
పెసర గాని పశుగ్రాసంగా జొన్నగాని సాగు చేస్తే తర్వాత వేరుశనగ పంటలు వేసుకోవాలి.
సూచనలు
జొన్న సాగు తర్వాత మళ్లీ అదే పంట వేయొద్దు.
దీని వల్ల ఎర్ర గొంగళి పురుగు, శనగపచ్చ పురుగు ఆశించవచ్చు.
వేరుశనగ తర్వాత ఆముదంతో పంట మార్పిడి చేసుకోవచ్చు.
నులిపురుగులు ఉన్న ప్రాంతాల్లో వంగ, బెండ, టమాట, మినుము, పెసర పంటలు వస్తే అవి వాటిని మరింత అభివృద్ధి చేస్తాయి.
పంటమార్పిడితో ప్రయోజనం
Published Sat, Nov 8 2014 2:57 AM | Last Updated on Sat, Sep 2 2017 4:02 PM
Advertisement
Advertisement