సాక్షి, సంగారెడ్డి: అకాల వర్షాలతో రబీ పంటల భవితవ్యం దినదినగండంగా మారింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంట నష్టం రోజురోజుకు పెరిగిపోతోంది. పంటలు కోల్పోయి అన్నదాతలు దుఃఖంలో మునిగిపోయారు. గత నెల 27 నుంచి జిల్లా అంతటా భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వరి, గోధుమ, జొన్న, మినుము పంటలతో పాటు కూరగాయలు, మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
తాజాగా జిల్లాలో పంట నష్టం 3,632 హెక్టార్లకు ఎగబాకింది. దీంతో దిగుబడి రూపంలో రైతులు రూ.11.71 కోట్ల ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. పంట నష్టంపై సమగ్ర సర్వే జరిపి మరో వారం రోజుల్లో ప్రభుత్వానికి తుది అంచనా నివేదిక పంపించాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా..ప్రభుత్వం తక్షణమే పెట్టుబడి రాయితీని విడుదల చేసి ఆదుకోవాలని బాధిత రైతులు, రైతు సంఘాలు కోరుతున్నాయి.
రబీపై ‘అకాల’ దెబ్బ
రబీ సాధారణ విస్తీర్ణం 1.56 లక్షల హెక్టార్లని వ్యవసాయ శాఖ అంచనా వేయగా ఏకంగా 1.76 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. గతేడాది భారీ వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు పెరగడంతో రబీ సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. నెల రోజులు గడిస్తే పంటలు చేతికందనుండగా అకాల వర్షాలు అనూహ్యంగా దెబ్బతీశాయి. వరి సాధారణ సాగు 44,407 హెక్టార్లయితే రైతులు 65,263 హెక్టార్లలో పంట వేశారు. అదే విధంగా 20,029 హెక్టార్లలో చెరకు సాగైంది.
నెల రోజులుగా విద్యుత్ కోతలు తీవ్రం కావడంతో పంటలు క్రమంగా క్షీణిస్తున్న దశలో వర్షాలు ఆదుకుని కొంత వరకు ప్రాణం పోశాయి. అయితే, వడగళ్ల బీభత్సవానికి వందల ఎకరాల్లో వరి, చెరకు పంటలు సైతం ధ్వంసమయ్యాయి. 26,975 హెక్టార్లలో సాగైన మొక్కజొన్న, 10,149 హెక్టార్లలో సాగు చేసిన పొద్దుతిరుగుడు పంటలపై మాత్రం అకాల వర్షాలు దెబ్బతీస్తున్నాయి. మొక్కజొన్న పంట కంకు, పొద్దుతిరుగుడు పంటలు పువ్వూ ఏర్పడే దశలో ఉన్నాయి. పది రోజులుగా కురుస్తున్న వార్షిలకు వందల ఎకరాల్లో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, శనగ పంటలు దెబ్బతిన్నాయి.
పొంచి ఉన్న తెగుళ్లు
ఏకధాటిగా వర్షాలు కురుస్తుండడంతో పంటలకు తెగుళ్లు సోకే ప్రమాదముంది. గాలిలో తేమతో పాటు తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు, వరి పంటలకు చీడపీడలు ఆశించే అవకాశాలున్నాయి. చేలల్లో వర్షపు నీళ్లు నిల్వ ఉండనీయకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని సంగారెడ్డిలోని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. తెగుళ్ల నివారణ కోసం ఈ రసాయన మందులను నీటిలో కలిపి పిచికారి చేయాలని పలు రకాల మందులను సిఫారసు చేస్తున్నారు. మొక్కజొన్న పంటలకు ఆకుమచ్చ, తలకుళ్లు తెగుళ్లు ఆశించే అవకాశముంది.
ఆకుమచ్చ తెగుళ్ల నివారణ కోసం లీటర్ నీటిలో జినెట్ 2 గ్రాములు లేదా మంకోజిట్ 3 గ్రాములు కలిపి పిచికారి చేయాలి. అదే విధంగా తలకుళ్లు తెగుళ్ల నివారణ కోసం లీటర్ నీటిలో సెంథియాన్ ఒక మిల్లీలీటర్ లేదా నీటిలో కరిగే గందకం 3 గ్రామాలు కలిపి పిచికారి చేయాలి. జొన్న పంటకు సోకే తేనె బంక తెగుళ్లు నివారణకోసం లీటర్ నీటిలో గ్రాము భావిష్టిన్ లేదా 2.5 గ్రాముల మాంకోజెట్ కలిపి వారం రోజుల్లో రెండు సార్లు పిచికారి చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
ఆదుకోని రబీ
Published Fri, Mar 7 2014 11:40 PM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
Advertisement
Advertisement