సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/న్యూస్‌లైన్ నెట్‌వర్క్: మెతుకు సీమ రైతును అకాల వర్షాలు నట్టేట ముంచాయి. కాలం కలిసి రాకున్నా.. కరెంట్ సక్రమంగా లేకున్నా మొక్క ఎదిగే దశ నుంచి చెమటోడ్చి పండించిన పంట చేతికి అందే సమయంలో నీటిపాలైంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో భారీగా పంటనష్టం వాటిల్లింది. మొత్తం ఐదువేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లినట్లు అంచనా. వరి పంట భారీగా దెబ్బతినగా మొక్కజొన్న, జొన్న పంటలు నేలవాలాయి. సుమారు 1,500 ఎకరాల్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నట్లు తెలుస్తోం ది. దీనికితోడు ఈదురుగాలులతో కూడిన వర్షాల వల్ల మామిడి పంట సైతం దెబ్బతింది. రెండు రోజులుగా జిల్లావ్యాప్తంగా 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యధికంగా మెదక్‌లో 5.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
సంగారెడ్డిలో 3.8 వర్షపాతం నమోదైంది. రామచంద్రాపురం మండలంలో 29 మిల్లీమీటర్లు, జిన్నారం, కౌడిపల్లి మండలాల్లో 21, సదాశివపేటలో 18, పటాన్‌చెరులో 17, అందోలు, పుల్కల్ మండలాల్లో 16, జహీరాబాద్‌లో 15, కోహీర్, సదాశివపేట, రేగోడ్ మండలాల్లో 13, మనూరులో 11 మి.మీటర్ల వర్షం కురిసింది. మిగతా మండలాల్లో 10 మిల్లీమీటర్లలోపు వర్షపాతం నమోదైంది. అధికారుల సమాచారం ప్రకారం జిన్నారం, సిద్దిపేట, మిరుదొడ్డి, దుబ్బాక, దౌల్తాబాద్, కొల్చారం మండలాల్లో సుమారు 3 వేల ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. అలాగే సంగారెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గాల్లో 70 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. మిగతా నియోజకవర్గాల్లో సుమారు రెండువేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. నర్సాపూర్ నియోజకవర్గంలో అత్యధికంగా సుమారు వెయ్యి ఎకరాల్లో వరి, మొక్కజొన్నతోపాటు కూరగాయల పంటలు దెబ్బతిన్నట్లు అంచనా.
అలాగే అత్యధిక వర్షపాతం నమోదైన మెదక్‌లో సుమారు 350 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అత్యధికంగా మెదక్ మండలంలో వరిపంట దెబ్బతింది. జహీరాబాద్ నియోజకవర్గంలో 200 ఎకరాల్లో జొన్నపంట దెబ్బతింది. నారాయణఖేడ్ నియోజకవర్గంలో అకాల వర్షాల కారణంగా 500 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, జొన్న, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. అందోలు నియోజకవర్గంలో 300 ఎకరాల్లో వరి, జొన్న పంటలు దెబ్బతిన్నట్లు అంచనా. గజ్వేల్ నియోజకవర్గంలో వరి, మొక్కజొన్న పంటలు 500 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. అలాగే కూరగాయల సాగు ఎక్కువగా చేసే గజ్వేల్, జిన్నారం మండలాల్లో భారీగా కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. గజ్వేల్ ప్రాంతంలో సుమారు 800 ఎకరాల్లో టమాటా, కీర, సొర, బీరకాయ, మరికొన్ని కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. జిన్నారం మండలంతోపాటు ఇతర ప్రాంతాల్లో 700 ఎకరాల్లో కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది.
నోటికాడి కూడు.. నీటిపాలు
Published Fri, May 9 2014 11:54 PM | Last Updated on Sat, Sep 2 2017 7:08 AM
Advertisement
Advertisement