మెట్ట పంటలే మేలు | betta crops best | Sakshi
Sakshi News home page

మెట్ట పంటలే మేలు

Published Mon, Aug 11 2014 1:50 AM | Last Updated on Sat, Sep 2 2017 11:41 AM

betta crops best

ఖమ్మం వ్యవసాయం: పత్తి జిల్లాలో పత్తి విస్తీర్ణం 1.62 లక్షల హెక్టార్లు, ఇప్పటి వరకు 1.33 లక్షల హెక్టార్లలో సాగు చేశారు. మిగిలిన విస్తీర్ణంలో సాలు పత్తిని విత్తుకోవచ్చు. పత్తి గింజలు పెట్టిన ఒకటి, రెండు రోజుల్లో పెండి మిథాలిన్ ఎకరాకు 1.2 లీటర్లు పిచికారీ చేస్తే కలుపు తొలగుతుంది. బి.టి పత్తికి ఎకరాకు 60 కిలోల నత్రజని, 24-30 కిలోల భాస్వరం, 24-30 కిలోల పొటాషియం ఎరువులను వాడుకోవాలి.

నత్రజని, పొటాష్ ఎరువులను నాలుగు దఫాలుగా వర్షాన్ని బట్టి 3, 4 సమభాగాలుగా 20 రోజుల వ్యవధిలో పత్తి విత్తిన 80 నుంచి 90 రోజులలోపు వేయాలి. బెట్ట పరిస్థితులు ఉంటే రెండు శాతం యూరియా, ఒకశాతం పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. పత్తిలో మెగ్నీషియం, బోరాన్  లోపం నివారణకు 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ విత్తిన 45, 75 రోజుల సమయంలో, 1.5 గ్రాముల బోరాన్‌ను విత్తిన 60 నుంచి 90 రోజుల వ్యవధిలో లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

బెట్ట పరిస్థితుల్లో రసం పీల్చు పురుగులు పచ్చదోమ, తామర, పేనుబంక ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా మోనోక్రోటోపాస్ 1.6 మి.లీ లేదా ఎసిటామాఫిడ్ 0.2 గ్రాములు థయోమథాక్సామ్ 0.2 గ్రాములు లేదా ఫెసోనిక్ 2 మి.లీ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. - తెల్లదోమ ఉధృతి ఉంటే ట్రైజోపాస్ రెండు మి.లీ లేదా ప్రోఫైనోపాస్ రెండు మి.లీ లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయాలి. పిండినల్లి ఉంటే ప్రొఫెనోపాస్ మూడు మి.లీ లీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

 కంది
 ఆగస్టు మొదటి వారం నుంచి పత్తికి బదులు కొందరు రైతులు కందిని విత్తుతున్నారు. సాళ్ల మధ్యలో 45-90 సెం.మీ. మొక్కల మధ్య దూరం 10 సెం.మీ ఉండేటట్లు విత్తుకోవాలి. కందిలో ఎంఆర్‌జీ-66, ఎల్‌ఆర్‌జీ-41, ఎంఆర్‌జీ-1004, ఎల్‌ఆర్‌జీ-30, 38, డబ్లూఆర్‌జీ-27, 55 వంటి రకాలు మేలు. ఎకరానికి 6-8 కిలోల విత్తనాలు నాటాలి. నేల స్వభావాన్నిబట్టి 10 సెం.మీ దూరంలో విత్తుకోవాలి. - విత్తిన మరుసటి రోజు 1.5 లీటర్ల పెండిమిథిలాన్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

రెండు కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం ఎరువులను పంట విత్తే సమయంలో వేయాలి. కంది పూత దశలో మరూక మచ్చలు ఆశించి నష్టపరిచే అవకాశం ఉన్నందున క్లోరీపైరిపాస్ 2.5 మి. లీ, డైక్లోరోపాస్ మి.లీ, లేదా స్పైనోసాడ్ 0.3 మి.లీ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

 జొన్న
 ఆగస్టు 15 తరువాత జొన్న సాగు చేసుకునే వీలుంది. మోతి, ఎన్‌టీజే-3, ఎం 35-1, సీఎస్‌హెచ్-5, 9, కిన్నెర, ఇతర ప్రైవేట్ హైబ్రిడ్ రకాలు అనుకూలం. జొన్న సాగుకు 3-4 కిలోల విత్తనం వాడాలి. సాళ్ల మధ్య దూరం 45 సెం.మీ, మొక్కల మధ్య దూరం 12-15 సె.మీ ఉండాలి. విత్తడానికి ముందు మూడు గ్రాముల థయోమిథాక్సిన్, మూడు గ్రాముల థైరామ్ లేదా కాస్టాన్‌తో విత్తన శుద్ధి చేయాలి. 24 నుంచి 32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్ ఎరువులు అవసరం.

నత్రజనిని పంట విత్తేటప్పుడు, విత్తిన 30-40 రోజుల్లో వేయాలి. భాస్వరం, పొటాష్‌లను ఆఖరి దుక్కిలో వేయాలి. పంట విత్తిన 48 గంటల్లో నాలుగు గ్రాముల అట్రాజిన్‌ను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తే కలుపు పోతుంది. మొక్క మొలిచిన 7, 14, 21 రోజుల వయసులో మువ్వ తొలిచే ఈగ వ్యాపిస్తుంది. దీని నివారణకు గ్రాము థమోడికార్బ్ లేదా 2 మి.లీ ల్యాంబ్డాసెహలోత్రిన్‌ను పిచికారీ చేయాలి. మొక్కలు పుష్పించు దశలో బంకగారు తెగులు, గింజబూజుల నివారణకు ప్రొఫికన్‌జోల్ 0.5 మి.లీ లీటరు నీటిని కలిపి పిచికారీ చేయాలి.

 నువ్వులు
 నువ్వులు ఆగస్టు 15 తేదీ వరకు విత్తుకోవచ్చు. శ్వేత, రాజేశ్వరి రకాలు శ్రేయస్కరం. కిలో విత్తనానికి మూడు గ్రాముల కాప్టాన్ లేదా మాంకోజెబ్‌ను కలిపి విత్తనశుద్ధి చేయాలి. ఎకరాకు రెండు కిలోల విత్తనాలను ఇసుకలో కలిపి 30 ఁ 15 సెం.మీ దూరంలో విత్తుకోవాలి. ఎరువుగా 16 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాష్ వాడాలి. పూత, గింజ దశలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి. నువ్వులో వెర్రి తెగులు (ఫిల్లోడి) ఆశిస్తే నివారణకు డైమిథోయేట్ మూడు మి.లీ లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

 పొద్దుతిరుగుడు
 మోర్డన్, డీఆర్‌ఎస్‌ఎఫ్-108, కేబీఎస్‌హెచ్-1, ఎన్‌డీఎస్‌హెచ్-1, డీఆర్‌ఎస్‌హెచ్-1 ఏపీఎస్‌హెచ్-66 రకాలను విత్తుకోవాలి. ఎకరాకు 3 నుంచి 4 కిలోలు, హైబ్రిడ్ రకాలు 2 నుంచి 2.5 కిలోల విత్తనం 60ఁ30 సెం.మీ దూరంలో విత్తుకోవాలి. నత్రజని 30 కిలోలు, భాస్వరం 36 కిలోలు, పొటాష్ 12 కిలోలు వాడాలి. నత్రజనిని మూడు దఫాలు వేయాలి. భాస్వరం, పొటాష్ ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి. పైరు పూత దశలో రెండు గ్రాముల బోరాక్స్‌ను లీటరు నీటిలో కలిపి ఎకరాకు 200 లీటర్లను పిచికారీ చేయాలి. మొగ్గ, పూత, గింజపోసుకునే దశలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి.

 మొక్కజొన్న
 ఆగస్టు మొదటి వారం వరకు స్వల్పకాలిక హైబ్రిడ్ మొక్కజొన్నను సాగు చేసుకోవచ్చు. ఎకరాకు 7-8 కిలోల విత్తనాన్ని వాడి 60ఁ20 సెం.మీ దూరంలో విత్తాలి. మూడు గ్రాముల క్యాప్టాన్ లేదా డైథీన్ ఎం-45తో విత్తన శుద్ధి చేయవచ్చు. విత్తిన 48 గంటల లోపు అట్రజిన్-14ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేస్తే కలుపు నివారించుకోవచ్చు.

 మొక్కజొన్నకు ఎకరాకు 60-80 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ వాడాలి. నత్రజనిని విత్తేటప్పుడు, మోకాలు ఎత్తు దశ, పూత దశలో మూడు సమభాగాల్లో వేయాలి. కాండం తొలిచే పురుగు సమస్య ఉంటే కార్బోఫిరాన్-34 గుళికలు ఎకరాకు మూడు కిలోలు వేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement