
ఖమ్మం వ్యవసాయం: పత్తికి రికార్డు ధర పలుకుతోంది. పంట ఉత్పత్తులకు జాతీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడంతో పత్తి ధరకు రెక్కలొచ్చాయి. శనివారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర క్వింటా రూ.12,001గా నమోదైంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు మొత్తం 506 బస్తాల పత్తిని విక్రయానికి తీసుకురాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రానికి చెందిన గోకినపల్లి సైదులు అనే రైతు తీసుకొచ్చిన 29 బస్తాల పత్తికి వ్యాపారి రామా శ్రీను గరిష్టంగా రూ.12,001 ధర పెట్టారు. మిగిలిన లాట్లకు నాణ్యత ఆధారంగా మోడల్ ధర రూ.10,500 పలకగా, కనిష్ట ధర రూ.9,000 వచ్చింది. 15 రోజుల వ్యవధిలో పత్తి ధర క్వింటాకు రూ.2 వేలు పెరిగింది.