quintal
-
వరికి రూ. 500 బోనస్
సాక్షి, హైదరాబాద్: వచ్చే వానాకాలం సీజన్లో పండించే వరికి రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. జూన్‌లో నిర్వహించే ‘గ్లోబల్ రైస్ సమ్మిట్’ బ్రోచర్ ఆవిష్కరణ సందర్భంగా హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సమ్మిట్ నిర్వాహకులు డాక్టర్ జానయ్య, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, కమిషనర్ గోపి, విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు, మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతులు వరి తక్కువ వేయాలని, అందుకు ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటలు సాగు చేసి, పంటల సాగులో సమతుల్యత పాటించాలన్నారు. వరితోపాటు అన్ని పంటలకు కూడా కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం మద్దతుధర ఇవ్వాలని కోరారు. వివిధ దేశాలకు వరి ఎగుమతులపై కేంద్రం విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆంక్షలు రాష్ట్రానికి ప్రతిబంధకంగా ఉన్నాయని, రైస్ పాలసీపై కేంద్రం పునరాలోచించుకోవాలన్నారు. కేరళ ప్రజలు దొడ్డు బియ్యం, కర్నాటక ప్రజలు సన్నబియ్యం, మరికొన్ని ఇతర రాష్ట్రాల్లో జనం చిట్టి ముత్యాలు వంటి రకాల బియ్యం వాడుతారని, ఆ ప్రకారం ఆయా రాష్ట్రాలకు తెలంగాణ నుంచి రైస్ అమ్ముకునేలా అవకాశం కల్పించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ఎంత అవసరమైతే అంతమేరకు వరి సాగు చేయాలని, ఎగుమతులు పెంచడం వల్ల రాష్ట్రంలో అదనపు వరిని విక్రయించడానికి వీలుకలుగుతుందని పేర్కొన్నారు. ఆ మేరకు కేంద్రం ఆలోచించి తెలంగాణ రైతులకు మేలు చేయాలన్నారు. ఇప్పటికే పేదలకు ఇస్తు న్న రేషన్‌రైస్ ఎవరూ వాడుకోవడం లేదని తుమ్మల అభిప్రాయపడ్డారు. -
పత్తి రైతుకు ‘ధర’హాసం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పత్తి రైతులకు మంచి ధర దక్కాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఏటా నవంబర్ మొదటి వారంలో కొనుగోళ్లకు శ్రీకారం చుడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ ఏడాది పత్తి ధరల్లో హెచ్చుతగ్గుల నేపథ్యంలో ఈ నెల 25వ తేదీ నుంచే కొనుగోలు కేంద్రాలు తెరవాలని నిర్ణయించింది. రాష్ట్రంలో పత్తి పండించిన ఏ ఒక్క రైతు నష్టపోకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా ముందుగానే పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయిస్తోంది. 12.85 లక్షల టన్నుల దిగుబడులు రాష్ట్రంలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 14.13 లక్షల ఎకరాలు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 13.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా.. 12.85 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా. ఇటీవలే కనీస మద్దతు ధరలను ప్రభుత్వం ప్రకటించింది. ఏటా క్వింటాల్‌కు రూ.200 నుంచి రూ.300 వరకు పెంచుతుండగా, తొలిసారి ఏకంగా రూ.640 మేర పెంచింది. పొడుగు పింజ రకానికి క్వింటాల్‌కు రూ.7,020, మీడియం రకానికి రూ.6,620 చొప్పున కనీస మద్దతు ధర నిర్ణయించింది. ప్రస్తుతం ఆదోని మార్కెట్‌కు రోజుకు 3 నుంచి 5 వేల క్వింటాళ్ల పత్తి వస్తుండగా.. క్వింటాల్‌కు రూ.7 వేల నుంచి రూ.7,400 వరకు పలుకుతోంది. అప్రమత్తమైన ఫ్రభుత్వం కనీస మద్దతు ధరకు కాస్త అటూ ఇటుగా మార్కెట్ ధరలు ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా కొనుగోళ్లకు ఏర్పాట్లు చేసింది. 34 ఏఎంసీలతో పాటు 50 జిన్నింగ్ మిల్లుల వద్ద కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా క్వింటాల్‌కు రూ.13 వేల వరకు ధర లభిస్తుందని అంచనా వేస్తున్నారు. నిబంధనలు ఇవీ తేమ 8 లేదా అంతకంటే తక్కువ శాతం ఉండాలి. 8 శాతం కంటే పెరిగిన ప్రతి ఒక్క శాతం తేమకు ఒక శాతం చొప్పున మద్దతు ధరలో రూ.70.20 చొప్పున తగ్గిస్తారు. 12 శాతానికి మించి తేమ ఉన్న పత్తిని కొనుగోలు చేయరు. పత్తి పింజ పొడవు 29.50 ఎంఎం నుంచి 30.50 ఎంఎం వరకు ఉండవచ్చు. మైక్రో నైర్ విలువ నిర్ణీత పరిధి కంటే తక్కువ లేదా ఎక్కువ ఉంటే ప్రతి 0.2 విలువకు క్వింటాల్‌కు రూ.25 తగ్గిస్తారు. పత్తిలో దుమ్ము, ధూళి, చెత్తా, చెదారం లేకుండా చూసుకోవాలి. గుడ్డు పత్తికాయలు, రంగుమారిన, పురుగు పట్టిన కాయలను వేరు చేసి శుభ్రమైన పత్తిని మాత్రమే తీసుకురావాలి. నీళ్లు జల్లిన పత్తిని కొనుగోలు చేయరు. కౌడు పత్తి, ముడుచుకుపోయిన పత్తిని మంచి పత్తిలో కలపరాదు. గోనె సంచుల్లో కానీ లేదా లూజు రూపంలో మాత్రమే తీసుకు రావాలి. ప్లాస్టిక్ సంచుల్లో తీసుకొస్తే కొనుగోలుకు అనుమతించరు. ఆర్బీకేల్లో నమోదుకు శ్రీకారం ఈ–పంట నమోదు ఆధారంగా సీఎం యాప్ ద్వారా వాస్తవ సాగుదారుల నుంచి నేరుగా పత్తి కొనుగోలు చేయనున్నారు. రైతులు తమ సమీపంలోని ఆర్బీకే కేంద్రంలో ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకాల నకలుతో పేరు నమోదు చేసుకొని టోకెన్ తీసుకోవాలి. ఆ టోకెన్‌లో పేర్కొన్న తేదీన పత్తిని నిర్ధేశించిన యార్డు లేదా జిన్నింగ్ మిల్లుకు తీసుకెళితే.. నిర్ధేశిత గడువులోగా రైతు ఖాతాలకు నగదు జమ చేస్తారు. తొందరపడి అమ్ముకోవద్దు మార్కెట్లో ధరలు ఎమ్మెస్పీకి కాస్త అటూఇటుగా ఉండడంతో ముందుజాగ్రత్త చర్యగా ఈ నెల 25వ తేదీ నుంచి కొనుగోలు కేంద్రాలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పంట నమోదు ప్రామాణికంగా ఆర్బీకేల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు కొనుగోలు చేస్తాం. మార్కెట్లో ధరలు పెరిగే అవకాశం ఉన్నందున తొందరపడి రైతులెవరూ అమ్ముకోవద్దని చెబుతున్నాం. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా మంచి ధరలు వచ్చే అవకాశాలున్నాయి. – రాహుల్ పాండే, కమిషనర్, మార్కెటింగ్ శాఖ -
పత్తి ధర క్వింటాల్‌కు రూ.11 వేలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: పత్తి ధర మునుపెన్నడూ లేనివిధంగా పరుగులు పెడుతోంది. రికార్డు స్థాయిలో క్వింటాల్ ధర రూ.11 వేలకు చేరింది. కనీస మద్దతు ధరకు రెట్టింపు ధర పలుకుతుండటంతో రైతుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. మరోవైపు పత్తి గింజల ధరలు సైతం క్వింటాల్‌కు సుమారు రూ.వెయ్యి వరకు పెరిగాయి. పొట్టి పింజ పత్తికి రూ.5,255, పొడవు పింజ రకానికి 5,550 చొప్పున కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించగా.. సీజన్ ప్రారంభంలోనే క్వింటాల్ రూ.7 వేల వరకు పలికింది. ధర క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం రూ.11 వేలకు చేరింది. పత్తి గింజలకు సైతం ఈ ఏడాది డిమాండ్ పెరిగింది. సీజన్ మొదట్లో క్వింటాల్ పత్తి గింజల ధర రూ.3 వేల వరకు పలకగా.. ప్రస్తుతం రూ.4 వేల వరకు ధర పలుకుతోంది. ధరలు పెరగటంతో వచ్చే సీజన్లో పత్తి సాగు విస్తీర్ణం భారీగా పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు ఈ ఏడాది మిర్చి పంట రైతుల్ని నష్టాలకు గురి చేయడంతో ఆ రైతులు పత్తి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే గ్రామాల్లో పత్తి సాగు చేసేందుకు రైతులు కౌలు భూముల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పత్తి విత్తనాలకు సైతం డిమాండ్ పెరిగే పరిస్థితి ఉంది. దిగుబడి తగ్గినా ధర ఆదుకుంది గత సీజన్లో గుంటూరు జిల్లాలో పత్తి సాగు సాధారణ విస్తీర్ణం 4,23,750 ఎకరాలు కాగా, 2,73,950 ఎకరాల్లో మాత్రమే పంట సాగయ్యింది. ఇందులోనూ అధిక వర్షాలు, గులాబీ రంగు పురుగు కారణంగా కొంత పంట దెబ్బతింది. దాంతో దిగుబడులు కూడా తగ్గాయి. ఇలాంటి పరిస్థితుల నడుమ సీజన్ ప్రారంభంలో క్వింటాల్ ధర రూ.7 వేలు పలకగా.. తరువాత పెరుగుతూ వచ్చింది. పరిస్థితి ఆశాజనకంగా ఉండటంతో క్వింటాల్ ధర రూ.10 వేల వరకు పెరుగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. అయితే, సీజన్ ముగింపు దశలో ఏకంగా రూ.11 వేలకు చేరింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయి ధరగా నమోదైంది. ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. కనీస మద్దతు ధర కంటే మార్కెట్లో ధరలు అధికంగా ఉండటంతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఈ ఏడాది రైతుల నుంచి కొనుగోళ్లు జరపలేదు. సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం జిల్లాలో గత ఏడాది గులాబీ రంగు పురుగు కారణంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో కేవలం 2,73,950 ఎకరాల్లోనే రైతులు పత్తి సాగు చేశారు. పత్తి రైతుల్లో ఎక్కువ మంది మిర్చి పంట వైపు మొగ్గుచూపారు. మిర్చి సాధారణ సాగు విస్తీర్ణం 1,84,442 ఎకరాలు కాగా ఖరీఫ్‌లో 2,66,640 ఎకరాల్లో మిర్చి వేశారు. అయితే, మిర్చికి తామర తెగులు సోకడంతో పంట సుమారు 80 శాతం వరకు దెబ్బతింది. మిర్చి పంట దెబ్బతినడం, పత్తి ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఈ ఏడాది పత్తి సాగు భారీగా పెరుగుతుందని ఆశిస్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాకు 13 లక్షల హైబ్రిడ్ పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయని ప్రభుత్వానికి నివేదికలు పంపాం. ఏప్రిల్ 6న గుంటూరులో విత్తన కంపెనీల ప్రతినిధులతో రాష్ట్రస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. – ఎం.విజయ భారతి, జాయింట్ డైరెక్టర్, వ్యవసాయ శాఖ దరలు ఇంకా పెరగొచ్చు ఈ ఏడాది పత్తి సాగు తగ్గింది. దీనివల్ల మార్కెట్‌కు పంట పెద్దగా రాలేదు. మరోవైపు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. ఫలితంగా పత్తి గింజలకు డిమాండ్ ఏర్పడింది. క్వింటాల్ రూ.4,000 పైగా పలుకుతోంది. జిన్నింగ్ పత్తికి కూడా డిమాండ్ ఉండటంతో మార్కెట్లో ధర పెరుగుతోంది. ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. – ప్రగతి శ్రీనివాసరావు, పత్తి వ్యాపారి -
పత్తి ధర క్వింటా రూ.12 వేలు
ఖమ్మం వ్యవసాయం: పత్తికి రికార్డు ధర పలుకుతోంది. పంట ఉత్పత్తులకు జాతీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడంతో పత్తి ధరకు రెక్కలొచ్చాయి. శనివారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర క్వింటా రూ.12,001గా నమోదైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు మొత్తం 506 బస్తాల పత్తిని విక్రయానికి తీసుకురాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రానికి చెందిన గోకినపల్లి సైదులు అనే రైతు తీసుకొచ్చిన 29 బస్తాల పత్తికి వ్యాపారి రామా శ్రీను గరిష్టంగా రూ.12,001 ధర పెట్టారు. మిగిలిన లాట్లకు నాణ్యత ఆధారంగా మోడల్ ధర రూ.10,500 పలకగా, కనిష్ట ధర రూ.9,000 వచ్చింది. 15 రోజుల వ్యవధిలో పత్తి ధర క్వింటాకు రూ.2 వేలు పెరిగింది. -
వరికి ‘మద్దతు’ రూ.200 పెంపు!
సాక్షి, న్యూఢిల్లీ: వరికి కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.200 పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 2019 సాధారణ ఎన్నికల నేపథ్యంలో రైతుల ‘మద్దతు’ పొందేందుకు ఈ నిర్ణయం తీసుకోనుంది. ఖరీఫ్ సీజన్లో ప్రధాన పంట అయిన వరికి 2018–19లో 13 శాతం పెంపుతో క్వింటాలుకు రూ.1,750 చెల్లించనుంది. మరో 13 రకాల ఖరీఫ్ పంటల మద్దతు ధరను కూడా స్వల్పంగా పెంచాలని కేంద్రం యోచిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మద్దతు ధర పెంపుపై కేంద్రం ఈ వారంలోనే నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుత ఏడాదిలో వరికి క్వింటాలుకు రూ.1,550 (సాధారణ రకం) కనీస మద్దతు ధరను కేంద్రం చెల్లిస్తోంది. గ్రేడ్–ఏ పంటకు రూ.1,590 చెల్లిస్తోంది. ‘ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర వివరాలను ఇప్పటికే ప్రకటించాల్సి ఉన్నా.. కేంద్రం ఆలస్యం చేసింది. -
పత్తి క్వింటాల్‌కు రూ.5 వేలు చెల్లించాలి
ఖమ్మం వ్యవసాయం: పత్తి క్వింటాల్‌కు రూ.5 వేల చొప్పున ధర చెల్లించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రభుత్వాల ను డిమాండ్ చేశారు. గురువారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పత్తికి క్వింటాల్‌కు రూ.4,100 మద్దతు ధర ప్రకటించిందని, ఆ ధర రైతుకు గిట్టుబాటు కాదన్నారు. ప్రస్తుతం పంట సాగుకు పెట్టే పెట్టుబడుల ప్రకారం కనీసం క్వింటాలుకు రూ.5,000 మద్దతు ధర ఇవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రస్తుత మద్దతు ధరకు తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత చేయూతనివ్వాలని కోరారు. రైతు సంక్షేమ నిధి నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించి క్వింటాల్‌కు మరో వెయ్యి రూపాయలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మూడురోజుల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బు జమఅయ్యేలా సీసీఐ ఉన్నతాధికారులు చూడాలన్నారు. పత్తి మద్దతు ధరపై కేంద్ర మంత్రులతో మాట్లాడుతానని, పార్లమెంట్లో కూడా ప్రస్తావిస్తానని పొంగులేటి పేర్కొన్నారు. పత్తి కొనుగోళ్లలో సీసీఐ, మార్కెటింగ్ శాఖ నిబంధనల పేరిట రైతులను ఇబ్బందులకు గురిచేయరాదన్నారు. పత్తి పండించిన ప్రాంతాల్లో వెంటనే సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. రైతులు దళారుల బారిన పడకుండా ప్రభుత్వ శాఖలు చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులు పత్తి చేను నుంచి తీసిన తరువాత ఆరబెట్టి అమ్మకానికి తీసుకువచ్చి సీసీఐ కేంద్రలో అమ్ముకోవాలన్నారు. సీసీఐ కేంద్ర ప్రారంభ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఉడకని పప్పు
మేలురకం కందిపప్పు కిలో రూ.110 పై మాటే హోల్‌సేల్ షాపుల్లో కూడా క్వింటాల్ కందిపప్పు రూ.10 వేలు సామాన్యుడు కంది పప్పు రుచికి దూరమైనట్లే బళ్లారి : సాధారణంగా ప్రతి ఒక్కరి ఇళ్లలోను ప్రతి రోజు, ప్రతి పూటకు కొంచెం పప్పు లేకుండా ముద్ద దిగని నేటి రోజుల్లో కంది పప్పు ధరలు రోజు రోజుకు పైపైకి చేరుకుంటుండటంతో సామాన్య, మధ్య తరగతి జనం అల్లాడిపోతున్నారు. గతంలో కిలో గరిష్ట ధర రూ.60లకు దాటని కందిపప్పు ప్రస్తుతం ఏకంగా దాదాపు రెండింతలు అంటే రూ.110లకు పైగా ధరతో రిటైల్ షాపుల్లో అమ్ముతుండటంతో జనం కంది పప్పు కొనలేక, పప్పుకూర లేకుండా తినలేక నానా అవస్థలు పడుతున్నారు. అన్ని కూరల కంటే రుచికరమైన కంది పప్పు చారు, పప్పు అంటేనే ప్రతిఒక్కరికీ నోరూరిస్తుంది. అలాంటిది కంది పప్పు కొనేందుకు అంగడికి వెళితే జనానికి కందిపప్పు ధర విని దడ పుట్టిస్తోంది. ప్రతి రోజు కంది పప్పుతో వంట చేసే వారు ప్రస్తుతం వారం, 10 రోజులైనా కందిపప్పుతో కూరలు చేయడం లేదని పలువురు మహిళలు పేర్కొంటున్నారు. కందిపప్పు కొనాలంటే భయం వేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది కంది పంట పూర్తిగా తగ్గిపోవడంతో ధర భారీగా పెరిగినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. అయితే వాస్తవానికి ప్రస్తుతం కంది పంట రావడం లేదు. అయితే వ్యాపారులు ముందుగానే రైతులతోతక్కువ ధరకు కొనుగోలు చేసి నిల్వలు ఉంచుకుని ఏకంగా కంది పప్పు ధరలను పెంచినట్లు రైతులు పేర్కొంటున్నారు. రైతుల పొలాల్లో కంది ఉన్నప్పుడు క్వింటాల్‌కు రూ.3 వేల నుంచి రూ.4 వేల చొప్పున కొనుగోలు చేశారని, అయితే అవే కందులు ప్రస్తుతం రూ.8 వేల నుంచి రూ.10 వేల దాకా క్వింటాల్ చొప్పున అమ్ముతున్నారని వినియోగదారులు పేర్కొంటున్నారు. మార్కెట్ మాయజాలంతో కందిపప్పు ధర అపారంగా పెరిగిపోవడంతో వినియోగదారులకు కొనడానికి వీలుకాకుండా పోతోంది. కేజీ కంది పప్పుకు రూ.110లు చెల్లిస్తే అందులోకి అవసరమయ్యే పచ్చి మిర్చి ధర కూడా ఆకాశాన్నంటుతోంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పచ్చిమిర్చి, మిగతా కూరగాయల ధరలకు కూడా రెక్కలు వచ్చాయి. పప్పులోకి కావాల్సిన అన్ని రకాలు కూరగాయలు, కంది పప్పుకు భారీగా ధరలు పెరగడంతో గట్టి పప్పు కాదు నీళ్ల పప్పును కూడా వారం రోజులకొకసారి వండుకుంటామా లేదా అని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కంది పంట వచ్చే వరకు అంటే డిసెంబర్ లేదా జనవరి నెల వచ్చే వరకు ఇదే ధరతో పాటు ఇంతకన్నా భారీగా ధర పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. వర్షాలు బాగా కురిసి కంది పంట పండితే డిసెంబర్ తర్వాత కంది పప్పు ధర తగ్గే అవకాశం ఉందని సమాచారం. -
ధాన్యం..దైన్యం
- ధాన్యం కొనేనాథుడు కరువు - మళ్లీ పెట్టుబడులు లేక అవస్థలు - రుణ మాఫీపై స్పష్టతేదీ పంట చేతికందే దాకా రైతుకు ఒక రకమైన శ్రమ.. తీరా ధాన్యపు రాశులు ఇంటికి చేరాక వాటిని అమ్ముకోవడం అన్నదాతకు పెద్ద పనవుతోంది. కష్టించి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక ధాన్యాన్ని పురుల్లోనే నిల్వ చేసుకుంటున్నారు. జిల్లా ధాన్యాగారంగా పేరొందిన కారంచేడు ప్రాంతంలో సరైన ధర లేక ధాన్యపు నిల్వలు పేరుకుపోయాయి. కారంచేడు: అన్నదాతలు వరిసాగంటే భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పండించిన వరిధాన్యంను పురులు కట్టుకొని గిట్టుబాటు ధరల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. గతంలో కొంత కాలం ఆశాజనకంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం కొనే వారు లేక నానా అవస్థలు పడుతున్నారు. మండలంలోని కారంచేడు, స్వర్ణ, కుంకలమర్రు, ఆదిపూడి, రంగప్పనాయుడువారిపాలెం, స్వర్ణపాలెం ప్రాంతాల్లో ఎక్కువగా వరి సాగు చేస్తుంటారు. మండలంలో మొత్తం 40 వేల ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా 15 వేల ఎకరాలు ఖరీఫ్‌లో, 10 వేల ఎకరాలు రబీలో వరి సాగు చేస్తుంటారు. ఈ ప్రాంతంలో కారంచేడు మండలంలోనే వరి ఎక్కువగా సాగవుతుంది. గత సంవత్సరం అక్టోబరులో వచ్చిన వరదలతో వేసిన పంటలు తుడిచిపెట్టుకుపోవడంతో నాట్లు ఆలస్యంగా వేశారు. అష్ట కష్టాలు పడి పండించిన పంటలను ఇళ్ల ముంగిట పెట్టుకొని కొనే వారి కోసం దైన్యంగా ఎదురు చూస్తున్నారు. కొనేనాథుడే కరువయ్యాడు.. - మండలంలో ఏటా సుమారు 8 లక్షల క్వింటాళ్ల ధాన్యం పండిస్తుంటారు. ప్రస్తుతం వీటిలో సుమారు 98 శాతం ధాన్యం రైతుల ముంగిట పురుల్లో మూలుగుతోంది. - ఈ ప్రాంతంలో 92 రకం, 2270 రకం, జీలకర రకం ధాన్యం సాగు చేస్తుంటారు. - 92, 2270 రకం ధాన్యం క్వింటా రూ.1200-రూ.1300 వరకు మాత్రమే కొనుగోలు చేశారు. జిలకర రకం ధాన్యం క్వింటా 1050-రూ.1100 మాత్రమే పలుకుతోంది. ప్రస్తుతం అవి కూడా కొనేవారు లేకపోవడంతో రైతులు నిరాశలో ఉన్నారు. - మళ్లీ సాగు సీజన్ ప్రారంభం కావడంతో వాటికి అవసరమైన పెట్టుబడులకు సన్న, చిన్నకారు రైతులతో పాటు, కౌలు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. - కౌలు ఎకరానికి 18-20 వేలు వరకు ఉంది. వీటిలో ఎక్కువ మంది డబ్బు కౌలుకే మొగ్గు చూపడంతో కౌలు రైతులు అప్పులు చేసి కౌలు కట్టుకున్నారు. ఇవి కాకుండా దుక్కులు, విత్తనాలు, ఎరువులకు అవసరమైన పెట్టుబడులకు అవసరమైన డబ్బు కోసం నానా అవస్థలు పడుతున్నారు. రుణమాఫీపై స్పష్టత లేదు.. అధికారంలోకి రాగానే రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇంకా దానిపై ఏ విధమైన ప్రకటన చేయకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. గత ఏడాది తీసుకున్న రుణాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న అన్నదాతలు రుణమాఫీలు చేస్తారా.. లేదా, ఒకవేళ చేసినా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేస్తారు అనే సందిగ్ధంలో ఉన్నారు. మళ్లీ అప్పుల కోసం బ్యాంకులకు ఎలా వెళ్లాలి, వెళ్తే ముందు తీసుకున్న రుణాలు చెల్లించాలని వారు ఒత్తిడి చేస్తే పరిస్థితి ఏంటని అన్నదాతలు తర్జనభర్జన పడుతున్నారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో మళ్లీ సాగు ప్రశ్నార్థకమేనని రైతులంటున్నారు. -
రూ. 5 వేలు పలికిన పత్తి ధర
- బేళ్లు, గింజలకు పెరిగిన డిమాండ్ - మరింత పెరిగే అవకాశం! వరంగల్ : వరంగల్ వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పత్తి క్వింటాల్‌కు రూ.5వేలు పలికింది. తొమ్మిదినెలల క్రితం పత్తి క్వింటాల్‌కు రూ.4850 వరకు వచ్చింది. తాజాగా మంగళవారం వరంగల్ మార్కెట్‌కు 5992 బస్తాల పత్తి రాగా క్వింటాల్‌కు రూ.5వేలు పలికింది. అయితే పత్తి సీజన్ పూర్తిగా అయిపోరుుంది. పెట్టుబడుల కోసం రైతులు కొన్ని బస్తాలను మాత్రమే ఇంటివద్ద నిల్వ చేసుకున్నారు. ప్రస్తుతం పత్తి ధర రూ.5వేలు పలికినా పెద్దగా లాభపడేది లేదని పత్తి రైతులు వాపోతున్నారు. ఇప్పటికే 95 శాతం రైతులు పత్తిని అమ్ముకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బేల్‌కు రూ.43,500 ధర పలుకుతున్నదని, గింజలు క్వింటాల్‌కు రూ.1770 ధర పలుకుతున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపారుు. బేళ్లు, గింజల ధర మరికొద్దిగా పెరిగే అవకాశం ఉందని, పత్తి ధర సైతం మరో 500 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు తెలుపుతున్నాయి. మొత్తంగా పత్తి సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లో క్వింటాల్ పత్తి ధర గరిష్టంగా రూ.5వేలు పలకడం ఇదే మొదటిసారి. -
గోధుమకు రూ. 50 మద్దతు
సాక్షి, న్యూఢిల్లీ: గోధుమ పంట కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) క్వింటాలుకు రూ.50 మేర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో 2013-14 పంటకాలానికిగాను క్వింటాలు గోధుమ ఎంఎస్సీ రూ.1,400గా ఉండనుంది. కిందటేడాది ఇది రూ.1,350గా ఉంది. వాస్తవానికి గోధుమ మద్దతు ధరను రూ.100 మేర పెంచాలని వ్యవసాయశాఖ సిఫార సు చే సింది. అయితే వ్యవసాయ ధరల నిర్ణాయక కమిషన్ (సీఏసీపీ) అందులో రూ.50 కోత విధించింది. గురువారం జరిగిన కేబినెట్ భేటీలో సీఏసీపీ సిఫారసుకు ఆమోదముద్ర వేశారు. 2013-14 రబీలో సాగయ్యే ఇతర పంటల మద్దతు ధరలను కూడా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదించినట్లు ఆహార శాఖ మంత్రి కేవీ థామస్ వెల్లడించారు. శనగ మద్దతు ధరను పెంచేందుకు ఆమోదం తెలిపారు. పంట ఎంఎస్పీని రూ.100 మేర పెంచి క్వింటాలుకు రూ.3,100గా ఖరారు చేశారు. ఎర్రపప్పు (మసూర్) మద్దతు ధరను రూ.50 పెంచి క్వింటాలుకు రూ.2,950గా నిర్ణయించారు. హైదరాబాద్‌లో సెస్టాట్ బెంచ్.. కస్టమ్స్, ఎక్సైజ్, సర్వీస్ టాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (సెస్టాట్)కు దేశంలో కొత్తగా ఆరు అదనపు బెంచ్‌లు రానున్నాయి. వీటిలో ఒకటి హైదరాబాద్‌లో ఏర్పాటుకానుంది. సెస్టాట్ అదనపు బెంచ్‌ల ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా వచ్చే ఆరు అదనపు బెంచ్‌లలో మూడు ఇప్పటికే సెస్టాట్ బెంచ్‌లు ఉన్న ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాల్లోనే ఏర్పాటు చేయనుండగా, మిగతా మూడింటినీ హైదరాబాద్, చండీగఢ్, అలహాబాద్‌లో నెలకొల్పనున్నారు. సెస్టాట్ కొత్త బెంచ్‌ల ఏర్పాటు కేసుల సత్వర పరిష్కారం, పెండింగ్ కేసుల తగ్గుదలకు దోహదం చేస్తుందని, ఇది ఇటు ప్రభుత్వం, అటు పన్ను చెల్లింపుదారులకు లబ్ధి చేకూర్చుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. కొత్త బెంచ్‌ల ఏర్పాటుకు అయ్యే రూ.3.45 కోట్ల వ్యయంతోపాటు ఏటా రూ.10 కోట్ల ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. కస్టమ్స్ చట్టం, సెంట్రల్ ఎక్సైజ్ చట్టం, బంగారం (నియంత్రణ) చట్టం కింద కస్టమ్స్, ఎక్సైజ్ కమిషనర్ల ఉత్తర్వులు, నిర్ణయాలపై దాఖలయ్యే అప్పీళ్లను విచారించేందుకు 1982లో సెస్టాట్ను ఏర్పాటుచేశారు. ఢిల్లీ కేంద్రంగా దేశంలోని వివిధ నగరాల్లో సేవలు అందిస్తున్న సెస్టాట్కు... ఢిల్లీ, ముంబైల్లో మూడేసి చొప్పున, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్‌లో ఒక్కొక్కటి చొప్పున బెంచ్‌లు ఉన్నాయి. కొత్తగా వచ్చే ఆరు బెంచ్‌లను కలిపితే సెస్టాట్కు మొత్తం 16 బెంచ్‌లు ఉంటాయి. ఇదిలాఉండగా, చైనా జాతీయులకు వీసాల జారీలో నిబంధనలను సరళతరం చేయాలన్న ప్రతిపాదనలపై నిర్ణయాన్ని కేంద్రం వాయిదా వేసింది.