గోధుమకు రూ. 50 మద్దతు
సాక్షి, న్యూఢిల్లీ: గోధుమ పంట కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) క్వింటాలుకు రూ.50 మేర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో 2013-14 పంటకాలానికిగాను క్వింటాలు గోధుమ ఎంఎస్‌సీ రూ.1,400గా ఉండనుంది. కిందటేడాది ఇది రూ.1,350గా ఉంది. వాస్తవానికి గోధుమ మద్దతు ధరను రూ.100 మేర పెంచాలని వ్యవసాయశాఖ సిఫార సు చే సింది. అయితే వ్యవసాయ ధరల నిర్ణాయక కమిషన్ (సీఏసీపీ) అందులో రూ.50 కోత విధించింది. గురువారం జరిగిన కేబినెట్ భేటీలో సీఏసీపీ సిఫారసుకు ఆమోదముద్ర వేశారు. 2013-14 రబీలో సాగయ్యే ఇతర పంటల మద్దతు ధరలను కూడా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదించినట్లు ఆహార శాఖ మంత్రి కేవీ థామస్ వెల్లడించారు. శనగ మద్దతు ధరను పెంచేందుకు ఆమోదం తెలిపారు. పంట ఎంఎస్‌పీని రూ.100 మేర పెంచి క్వింటాలుకు రూ.3,100గా ఖరారు చేశారు. ఎర్రపప్పు (మసూర్) మద్దతు ధరను రూ.50 పెంచి క్వింటాలుకు రూ.2,950గా నిర్ణయించారు.
హైదరాబాద్‌లో సెస్టాట్ బెంచ్..
కస్టమ్స్, ఎక్సైజ్, సర్వీస్ టాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (సెస్టాట్)కు దేశంలో కొత్తగా ఆరు అదనపు బెంచ్‌లు రానున్నాయి. వీటిలో ఒకటి హైదరాబాద్‌లో ఏర్పాటుకానుంది. సెస్టాట్ అదనపు బెంచ్‌ల ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా వచ్చే ఆరు అదనపు బెంచ్‌లలో మూడు ఇప్పటికే సెస్టాట్ బెంచ్‌లు ఉన్న ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాల్లోనే ఏర్పాటు చేయనుండగా, మిగతా మూడింటినీ హైదరాబాద్, చండీగఢ్, అలహాబాద్‌లో నెలకొల్పనున్నారు. సెస్టాట్ కొత్త బెంచ్‌ల ఏర్పాటు కేసుల సత్వర పరిష్కారం, పెండింగ్ కేసుల తగ్గుదలకు దోహదం చేస్తుందని, ఇది ఇటు ప్రభుత్వం, అటు పన్ను చెల్లింపుదారులకు లబ్ధి చేకూర్చుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. కొత్త బెంచ్‌ల ఏర్పాటుకు అయ్యే రూ.3.45 కోట్ల వ్యయంతోపాటు ఏటా రూ.10 కోట్ల ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది.
కస్టమ్స్ చట్టం, సెంట్రల్ ఎక్సైజ్ చట్టం, బంగారం (నియంత్రణ) చట్టం కింద కస్టమ్స్, ఎక్సైజ్ కమిషనర్ల ఉత్తర్వులు, నిర్ణయాలపై దాఖలయ్యే అప్పీళ్లను విచారించేందుకు 1982లో సెస్టాట్‌ను ఏర్పాటుచేశారు. ఢిల్లీ కేంద్రంగా దేశంలోని వివిధ నగరాల్లో సేవలు అందిస్తున్న సెస్టాట్‌కు... ఢిల్లీ, ముంబైల్లో మూడేసి చొప్పున, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్‌లో ఒక్కొక్కటి చొప్పున బెంచ్‌లు ఉన్నాయి. కొత్తగా వచ్చే ఆరు బెంచ్‌లను కలిపితే సెస్టాట్‌కు మొత్తం 16 బెంచ్‌లు ఉంటాయి. ఇదిలాఉండగా, చైనా జాతీయులకు వీసాల జారీలో నిబంధనలను సరళతరం చేయాలన్న ప్రతిపాదనలపై నిర్ణయాన్ని కేంద్రం వాయిదా వేసింది.