సాక్షి, హైదరాబాద్: వచ్చే వానాకాలం సీజన్‌లో పండించే వరికి రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. జూన్‌లో నిర్వహించే ‘గ్లోబల్ రైస్ సమ్మిట్’ బ్రోచర్ ఆవిష్కరణ సందర్భంగా హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సమ్మిట్ నిర్వాహకులు డాక్టర్ జానయ్య, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, కమిషనర్ గోపి, విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు, మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతులు వరి తక్కువ వేయాలని, అందుకు ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటలు సాగు చేసి, పంటల సాగులో సమతుల్యత పాటించాలన్నారు. వరితోపాటు అన్ని పంటలకు కూడా కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం మద్దతుధర ఇవ్వాలని కోరారు. వివిధ దేశాలకు వరి ఎగుమతులపై కేంద్రం విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆంక్షలు రాష్ట్రానికి ప్రతిబంధకంగా ఉన్నాయని, రైస్ పాలసీపై కేంద్రం పునరాలోచించుకోవాలన్నారు.
కేరళ ప్రజలు దొడ్డు బియ్యం, కర్నాటక ప్రజలు సన్నబియ్యం, మరికొన్ని ఇతర రాష్ట్రాల్లో జనం చిట్టి ముత్యాలు వంటి రకాల బియ్యం వాడుతారని, ఆ ప్రకారం ఆయా రాష్ట్రాలకు తెలంగాణ నుంచి రైస్ అమ్ముకునేలా అవకాశం కల్పించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ఎంత అవసరమైతే అంతమేరకు వరి సాగు చేయాలని, ఎగుమతులు పెంచడం వల్ల రాష్ట్రంలో అదనపు వరిని విక్రయించడానికి వీలుకలుగుతుందని పేర్కొన్నారు. ఆ మేరకు కేంద్రం ఆలోచించి తెలంగాణ రైతులకు మేలు చేయాలన్నారు. ఇప్పటికే పేదలకు ఇస్తు న్న రేషన్‌రైస్ ఎవరూ వాడుకోవడం లేదని తుమ్మల అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment