పత్తి క్వింటాల్‌కు రూ.5 వేలు చెల్లించాలి
ఖమ్మం వ్యవసాయం: పత్తి క్వింటాల్‌కు రూ.5 వేల చొప్పున ధర చెల్లించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రభుత్వాల ను డిమాండ్ చేశారు. గురువారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పత్తికి క్వింటాల్‌కు రూ.4,100 మద్దతు ధర ప్రకటించిందని, ఆ ధర రైతుకు గిట్టుబాటు కాదన్నారు. ప్రస్తుతం పంట సాగుకు పెట్టే పెట్టుబడుల ప్రకారం కనీసం క్వింటాలుకు రూ.5,000 మద్దతు ధర ఇవ్వాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రస్తుత మద్దతు ధరకు తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత చేయూతనివ్వాలని కోరారు. రైతు సంక్షేమ నిధి నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించి క్వింటాల్‌కు మరో వెయ్యి రూపాయలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మూడురోజుల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బు జమఅయ్యేలా సీసీఐ ఉన్నతాధికారులు చూడాలన్నారు. పత్తి మద్దతు ధరపై కేంద్ర మంత్రులతో మాట్లాడుతానని, పార్లమెంట్‌లో కూడా ప్రస్తావిస్తానని పొంగులేటి పేర్కొన్నారు.
పత్తి కొనుగోళ్లలో సీసీఐ, మార్కెటింగ్ శాఖ నిబంధనల పేరిట రైతులను ఇబ్బందులకు గురిచేయరాదన్నారు. పత్తి పండించిన ప్రాంతాల్లో వెంటనే సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. రైతులు దళారుల బారిన పడకుండా ప్రభుత్వ శాఖలు చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులు పత్తి చేను నుంచి తీసిన తరువాత ఆరబెట్టి అమ్మకానికి తీసుకువచ్చి సీసీఐ కేంద్రలో అమ్ముకోవాలన్నారు. సీసీఐ కేంద్ర ప్రారంభ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.