సాక్షి ప్రతినిధి, గుంటూరు: పత్తి ధర మునుపెన్నడూ లేనివిధంగా పరుగులు పెడుతోంది. రికార్డు స్థాయిలో క్వింటాల్ ధర రూ.11 వేలకు చేరింది. కనీస మద్దతు ధరకు రెట్టింపు ధర పలుకుతుండటంతో రైతుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. మరోవైపు పత్తి గింజల ధరలు సైతం క్వింటాల్‌కు సుమారు రూ.వెయ్యి వరకు పెరిగాయి. పొట్టి పింజ పత్తికి రూ.5,255, పొడవు పింజ రకానికి 5,550 చొప్పున కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించగా.. సీజన్ ప్రారంభంలోనే క్వింటాల్ రూ.7 వేల వరకు పలికింది. ధర క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం రూ.11 వేలకు చేరింది.
పత్తి గింజలకు సైతం ఈ ఏడాది డిమాండ్ పెరిగింది. సీజన్ మొదట్లో క్వింటాల్ పత్తి గింజల ధర రూ.3 వేల వరకు పలకగా.. ప్రస్తుతం రూ.4 వేల వరకు ధర పలుకుతోంది. ధరలు పెరగటంతో వచ్చే సీజన్‌లో పత్తి సాగు విస్తీర్ణం భారీగా పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు ఈ ఏడాది మిర్చి పంట రైతుల్ని నష్టాలకు గురి చేయడంతో ఆ రైతులు పత్తి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే గ్రామాల్లో పత్తి సాగు చేసేందుకు రైతులు కౌలు భూముల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పత్తి విత్తనాలకు సైతం డిమాండ్ పెరిగే పరిస్థితి ఉంది.
దిగుబడి తగ్గినా ధర ఆదుకుంది
గత సీజన్‌లో గుంటూరు జిల్లాలో పత్తి సాగు సాధారణ విస్తీర్ణం 4,23,750 ఎకరాలు కాగా, 2,73,950 ఎకరాల్లో మాత్రమే పంట సాగయ్యింది. ఇందులోనూ అధిక వర్షాలు, గులాబీ రంగు పురుగు కారణంగా కొంత పంట దెబ్బతింది. దాంతో దిగుబడులు కూడా తగ్గాయి. ఇలాంటి పరిస్థితుల నడుమ సీజన్ ప్రారంభంలో క్వింటాల్ ధర రూ.7 వేలు పలకగా.. తరువాత పెరుగుతూ వచ్చింది.
పరిస్థితి ఆశాజనకంగా ఉండటంతో క్వింటాల్ ధర రూ.10 వేల వరకు పెరుగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. అయితే, సీజన్ ముగింపు దశలో ఏకంగా రూ.11 వేలకు చేరింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయి ధరగా నమోదైంది. ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. కనీస మద్దతు ధర కంటే మార్కెట్‌లో ధరలు అధికంగా ఉండటంతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఈ ఏడాది రైతుల నుంచి కొనుగోళ్లు జరపలేదు.
సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం
జిల్లాలో గత ఏడాది గులాబీ రంగు పురుగు కారణంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో కేవలం 2,73,950 ఎకరాల్లోనే రైతులు పత్తి సాగు చేశారు. పత్తి రైతుల్లో ఎక్కువ మంది మిర్చి పంట వైపు మొగ్గుచూపారు. మిర్చి సాధారణ సాగు విస్తీర్ణం 1,84,442 ఎకరాలు కాగా ఖరీఫ్‌లో 2,66,640 ఎకరాల్లో మిర్చి వేశారు. అయితే, మిర్చికి తామర తెగులు సోకడంతో పంట సుమారు 80 శాతం వరకు దెబ్బతింది.
మిర్చి పంట దెబ్బతినడం, పత్తి ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఈ ఏడాది పత్తి సాగు భారీగా పెరుగుతుందని ఆశిస్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాకు 13 లక్షల హైబ్రిడ్ పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయని ప్రభుత్వానికి నివేదికలు పంపాం. ఏప్రిల్ 6న గుంటూరులో విత్తన కంపెనీల ప్రతినిధులతో రాష్ట్రస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నాం.
– ఎం.విజయ భారతి, జాయింట్ డైరెక్టర్, వ్యవసాయ శాఖ
దరలు ఇంకా పెరగొచ్చు
ఈ ఏడాది పత్తి సాగు తగ్గింది. దీనివల్ల మార్కెట్‌కు పంట పెద్దగా రాలేదు. మరోవైపు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. ఫలితంగా పత్తి గింజలకు డిమాండ్ ఏర్పడింది. క్వింటాల్ రూ.4,000 పైగా పలుకుతోంది. జిన్నింగ్ పత్తికి కూడా డిమాండ్ ఉండటంతో మార్కెట్‌లో ధర పెరుగుతోంది. ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది.
– ప్రగతి శ్రీనివాసరావు, పత్తి వ్యాపారి
Comments
Please login to add a commentAdd a comment