గతేడాది రూ.12 వేల దాకా పలికిన ధర
పది రోజుల కిందట వరకూ క్వింటా రూ.8 వేలు పైనే..
ప్రస్తుతం రూ.6 వేల నుంచి 7 వేలే ధర
గులాబీ తెగులు, వరదలతో పడిపోయిన దిగుబడులు
సాక్షి, అమరావతి : పత్తి ధరలు చూసి రైతుల గుండెలు గుభేల్‌మంటున్నాయి. మూడేళ్లుగా సిరులు కురిపించిన పత్తికి ఈ ఏడాది పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కానరావడం లేదు. ప్రకృతి ప్రకోపానికి ప్రభుత్వ నిర్లక్ష్యం తోడవడం పత్తి రైతులు గగ్గోలు పెడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌ను సాకుగా చూపి వ్యాపారులు సిండికేట్‌గా మారి ధర లేకుండా చేయడంతో డీలాపడిపోతున్నారు. ఏపీలో పత్తి సాధారణ విస్తీర్ణం 14.91 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది 9.72 లక్షల ఎకరాల్లో సాగవుతోంది.
వర్షాభావ పరిస్థితులతో రాయలసీమ జిల్లాల్లో పంట ఎండిపోగా, వర్షాలు, వరదల కారణంగా కోస్తాంధ్రలో వేలాది ఎకరాల్లో ఎందుకూ పనికి రాకుండా పోయింది. మరో పక్క ఉధృతంగా వ్యాపిస్తున్న గులాబీ తెగులు రైతులను కోలుకోలేని దెబ్బ తీస్తోంది. దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ తెగులు నివారణా చర్యలపై రైతులకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది.
పది రోజుల్లోనే పతనం
గతేడాది పత్తి ధర క్వింటా గరిష్టంగా రూ.12 వేల వరకూ పలికింది. మధ్యస్థ రకం పత్తి క్వింటా ధర రూ.7,121, పొడవు రకం రూ.7,521గా కేంద్రం నిర్ణయించింది. అయితే పది రోజుల కిందటి వరకూ రాష్ట్రంలో క్వింటా రూ.8 వేలకు పైగా పలికిన పత్తి.. ప్రస్తుతం రూ.6 వేల నుంచి రూ.7,100కు మించి పలకడం లేదు.
కేవలం 10 రోజుల్లోనే క్వింటాకు వెయ్యికి పైగా ధర దిగజారడం రైతులను కలవరపెడుతోంది. అంతర్జాతీయంగా పత్తి విత్తనాలకు మార్కెట్ లేదనే సాకుతో వ్యాపారులంతా సిండికేట్‌గా మారి ధర లేకుండా చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
ఇదే రీతిలో గతంలో రెండేళ్ల (2019–21) పాటు ధర లేని సందర్భంలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీమ్ కింద జోక్యం చేసుకుని రూ.1,789 కోట్ల విలువైన 31 లక్షల క్వింటాళ్ల పత్తిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసిన విషయాన్ని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఈ రైతు పేరు తలారి అయ్యప్ప. కర్నూలు జిల్లా కరేకల్‌కు చెందిన ఈయన రెండెకరాల్లో పత్తి వేశారు. ఎకరాకు రూ.30 వేల వరకూ పెట్టుబడి పెట్టారు. గులాబీ తెగులు చాలా ఎక్కువగా ఉంది. 5–7 క్వింటాళ్లకు మించి దిగుబడి రావడం లేదు. తొలి తీతలో 3 క్వింటాళ్లు వచి్చంది. అమ్ముదామని పోతే తేమ శాతం ఎక్కువగా ఉందని, ఎర్రగా ఉందని సాకులు చెబుతూ రూ.6,500కు మించి రాదన్నారు. మొన్నటి వరకు రూ.8 వేలకు పైగా ధర పలికింది. అలాంటిది ఈ ఏడాది కనీస «మద్దతు ధర కంటే తక్కువగా అడుగుతున్నారు. ఏం చేయాలో పాలుపోవడం లేదు.
ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి..
వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకొని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి.. కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి.
–కె.ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ రైతు సంఘం
Comments
Please login to add a commentAdd a comment