Cotton prices
-
పత్తి రైతు గుండెలధర!
సాక్షి, అమరావతి : పత్తి ధరలు చూసి రైతుల గుండెలు గుభేల్మంటున్నాయి. మూడేళ్లుగా సిరులు కురిపించిన పత్తికి ఈ ఏడాది పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కానరావడం లేదు. ప్రకృతి ప్రకోపానికి ప్రభుత్వ నిర్లక్ష్యం తోడవడం పత్తి రైతులు గగ్గోలు పెడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌ను సాకుగా చూపి వ్యాపారులు సిండికేట్‌గా మారి ధర లేకుండా చేయడంతో డీలాపడిపోతున్నారు. ఏపీలో పత్తి సాధారణ విస్తీర్ణం 14.91 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది 9.72 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. వర్షాభావ పరిస్థితులతో రాయలసీమ జిల్లాల్లో పంట ఎండిపోగా, వర్షాలు, వరదల కారణంగా కోస్తాంధ్రలో వేలాది ఎకరాల్లో ఎందుకూ పనికి రాకుండా పోయింది. మరో పక్క ఉధృతంగా వ్యాపిస్తున్న గులాబీ తెగులు రైతులను కోలుకోలేని దెబ్బ తీస్తోంది. దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ తెగులు నివారణా చర్యలపై రైతులకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. పది రోజుల్లోనే పతనం గతేడాది పత్తి ధర క్వింటా గరిష్టంగా రూ.12 వేల వరకూ పలికింది. మధ్యస్థ రకం పత్తి క్వింటా ధర రూ.7,121, పొడవు రకం రూ.7,521గా కేంద్రం నిర్ణయించింది. అయితే పది రోజుల కిందటి వరకూ రాష్ట్రంలో క్వింటా రూ.8 వేలకు పైగా పలికిన పత్తి.. ప్రస్తుతం రూ.6 వేల నుంచి రూ.7,100కు మించి పలకడం లేదు. కేవలం 10 రోజుల్లోనే క్వింటాకు వెయ్యికి పైగా ధర దిగజారడం రైతులను కలవరపెడుతోంది. అంతర్జాతీయంగా పత్తి విత్తనాలకు మార్కెట్ లేదనే సాకుతో వ్యాపారులంతా సిండికేట్‌గా మారి ధర లేకుండా చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇదే రీతిలో గతంలో రెండేళ్ల (2019–21) పాటు ధర లేని సందర్భంలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద జోక్యం చేసుకుని రూ.1,789 కోట్ల విలువైన 31 లక్షల క్వింటాళ్ల పత్తిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసిన విషయాన్ని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ రైతు పేరు తలారి అయ్యప్ప. కర్నూలు జిల్లా కరేకల్కు చెందిన ఈయన రెండెకరాల్లో పత్తి వేశారు. ఎకరాకు రూ.30 వేల వరకూ పెట్టుబడి పెట్టారు. గులాబీ తెగులు చాలా ఎక్కువగా ఉంది. 5–7 క్వింటాళ్లకు మించి దిగుబడి రావడం లేదు. తొలి తీతలో 3 క్వింటాళ్లు వచి్చంది. అమ్ముదామని పోతే తేమ శాతం ఎక్కువగా ఉందని, ఎర్రగా ఉందని సాకులు చెబుతూ రూ.6,500కు మించి రాదన్నారు. మొన్నటి వరకు రూ.8 వేలకు పైగా ధర పలికింది. అలాంటిది ఈ ఏడాది కనీస «మద్దతు ధర కంటే తక్కువగా అడుగుతున్నారు. ఏం చేయాలో పాలుపోవడం లేదు.ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి.. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకొని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి.. కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి. –కె.ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ రైతు సంఘం -
హోమ్ టెక్స్టైల్ పరిశ్రమకు పునరుజ్జీవం
ముంబై: హోమ్ టెక్స్టైల్ పరిశ్రమ ఈ ఏడాది 7–9 శాతం మధ్య ఆదాయ వృద్ధిని నమోదు చేయనుంది. దేశీయంగా కాటన్ ధరలు తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయంగా తిరిగి తన వాటాను పెంచుకుందని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో హోమ్ టెక్స్టైల్ కంపెనీల ఆదాయం 15 శాతం వరకు తగ్గడం గమనార్హం. పరిశ్రమ నిర్వహణ లాభం 1.5–2 శాతం వరకు మెరుగుపడి 14–14.5 శాతానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేరుకోవచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. ముడి సరుకుల ధరలు తక్కువలో ఉండడం, నిర్వహణ పరమైన అనుకూలతలను పేర్కొంది. అయితే ఇప్పటికీ కరోనా ముందు నాటి కంటే తక్కువలోనే ఉన్నట్టు తెలిపింది. దీంతో పరిశ్రమ రుణ భారం స్థిరంగా కొనసాగొచ్చని అంచనా వేసింది. హోమ్ టెక్స్‌టైల్‌లో 40–45 శాతం మార్కెట్ వాటా కలిగిన 40 కంపెనీలను అధ్యయనం చేసిన తర్వాత క్రిసిల్ రేటింగ్స్ ఈ నివేదికను విడుదల చేసింది. ఎగుమతులు పెరుగుతాయి.. భారత హోమ్ టెక్స్టైల్స్ పరిశ్రమ మొత్తం ఆదాయంలో 70–75 శాతం ఎగుమతుల నుంచే వస్తోంది. ఇందులో యూఎస్ వాటా అధికంగా ఉంది. భారత ఎగుమతుల్లో సగం అమెరికాకే వెళుతుంటాయి. కాటన్ ధర క్యాండీకి గతేడాది మే నెలలో రూ.లక్షకు చేరుకోగా, అది ఇప్పుడు రూ.55,000కు తగ్గినట్టు క్రిసిల్ రేటింగ్స్ నివేదిక వెల్లడించింది. అమెరికాలో బడా రిటైల్ సంస్థల వద్ద నిల్వలు తగ్గిపోవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత కంపెనీలకు ఆర్డర్ల రాక పెరుగుతుందని అంచనా వేసింది. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో సవాళ్లు నెమ్మదించడంతో గడిచిన కొన్ని నెలలుగా అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నట్టు తెలిపింది. ‘‘దేశీయ ముడి సరుకులు ఇప్పుడు పోటీనిచ్చే స్థాయికి తగ్గాయి. అంతర్జాతీయ కొనుగోలు దారులు చైనా ప్లస్ వన్‌కు ప్రాధాన్యం ఇస్తుండడం, యూఎస్ రిటైలింగ్ సంస్థలు తిరిగి స్టాక్ పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తుండడడంతో ఆదాయం పుంజుకుంటుంది’’అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ మోహిత్ మఖీజా తెలిపారు. దీనికి నిదర్శనంగా 2022లో భారత కంపెనీల వాటా 44 శాతం నుంచి తిరిగి 47 శాతానికి చేరుకోవడాన్ని ప్రస్తావించారు. 2021లో ఈ వాటా 48 శాతంగా ఉంది. -
ఆందోళనలో పత్తి రైతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి ధరలు తగ్గుతు న్నాయి. గత నెల క్వింటాలుకు రూ.8 వేలకు పైగా పలికిన ధర.. ఇప్పుడు మార్కెట్లో రూ.7 వేల వరకు పడిపోయింది. దళారులు రోజుకో రేటు ఖరారు చేస్తూ అన్నదాతలను ఆగం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. పత్తి భారీగా మార్కెట్లోకి వస్తున్న సమయంలో దళారులు ధరల జిమ్మిక్కులు చేస్తు న్నారు. ఈ ఏడాది పత్తికి కాలం కలసి రాక, ఆశించిన దిగుబడి వచ్చే పరిస్థితి లేని సమయంలో కనీ సం మంచి ధర వచ్చినా పెట్టుబడి దక్కుతుందని రైతులు భావిస్తున్నారు. కానీ దళారులు, వ్యాపా రులు పత్తి ధరలను ఇష్టారీతిగా ఖరారు చేస్తున్నా రన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే అంతర్జాతీ యంగా ఇంకా ధర పెరిగే అవకాశం ఉందని, రైతు లు తొందరపడి పత్తిని విక్రయించొద్దని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది దేశవ్యాప్తంగా పత్తి దిగుబడులు తగ్గే అవకాశం ఉన్నందున మున్ము ందు మంచి ధరలు వస్తాయని చెబుతున్నారు. ఈ విషయంలో రైతులు మార్కెట్ సరళిని ఎప్పటికప్పుడు గమనించాలని కోరుతున్నారు. తగ్గిన పత్తి దిగుబడులు.. ఈ ఏడాది వానాకాలం సీజన్లో 1.40 కోట్ల ఎకరా ల్లో అన్ని పంటలు కలిపి సాగు చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేపట్టాలని నిర్దేశించింది. అయితే జూలై నెల నుంచి కురిసిన తీవ్రమైన వర్షాల కారణంగా అనేకచోట్ల వేసిన పత్తి పంట మునిగిపోయింది. దీంతో పత్తి సాగు కేవలం 50 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అధిక వర్షాల కార ణంగా ఆశించిన స్థాయిలో పూత, కాత రాలేదు. కీల కమైన పూత, కాత దశలోనూ వర్షాలు కురవడంతో పత్తి రంగు మారింది. దీంతో పత్తి దిగుబడులు తగ్గు తున్నాయి. గతేడాది పత్తి పంటను 46.25 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, 69.46 లక్షల బేళ్ల ఉత్పత్తి వస్తుందని అంచనా వేశారు. కానీ ఈసారి 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, కేవలం 53.28 లక్షల బేళ్ల ఉత్పత్తి జరుగుతుందని రాష్ట్ర అర్థగణాంకశాఖ అంచనా వేసింది. దిగుబడులు తగ్గడం వల్ల రైతులు భారీగా నష్టపోయే పరిస్థితి నెలకొంది. అయితే ధరలు గతేడాది మాదిరిగా క్వింటాలకు రూ.10 వేలకు పైగా ఉంటే, దిగుబడి తగ్గినా ఎంతోకొంత నష్టాలను పూడ్చుకోవచ్చని రైతులు భావిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.6,380 ఉంది. కానీ ఈ ఏడాది మద్దతు ధర కంటే పత్తికి బహిరంగ విపణిలో ధర ఎక్కువే ఉన్నా, గతేడాది కంటే ధర తగ్గుతుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం పత్తి సీజన్ ప్రారంభానికి ముందు క్వింటాలుకు రూ.8 వేలకు పైగా పలికిన ధర, రైతులు పెద్ద ఎత్తున విక్రయానికి తీసు కువచ్చే సమయానికి తగ్గిపోవడం కలవరపరుస్తోంది. ఆదిలాబాద్ మార్కెట్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభించిన రోజు క్వింటాలు పత్తి ధర రూ.8,300 ఉంది. తర్వాత రోజురోజుకూ తగ్గుతూ గత నెల 29నాటికి క్వింటాలుకు రూ.7,330 పడిపోయింది. -
పత్తి ధర క్వింటాల్‌కు రూ.11 వేలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: పత్తి ధర మునుపెన్నడూ లేనివిధంగా పరుగులు పెడుతోంది. రికార్డు స్థాయిలో క్వింటాల్ ధర రూ.11 వేలకు చేరింది. కనీస మద్దతు ధరకు రెట్టింపు ధర పలుకుతుండటంతో రైతుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. మరోవైపు పత్తి గింజల ధరలు సైతం క్వింటాల్‌కు సుమారు రూ.వెయ్యి వరకు పెరిగాయి. పొట్టి పింజ పత్తికి రూ.5,255, పొడవు పింజ రకానికి 5,550 చొప్పున కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించగా.. సీజన్ ప్రారంభంలోనే క్వింటాల్ రూ.7 వేల వరకు పలికింది. ధర క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం రూ.11 వేలకు చేరింది. పత్తి గింజలకు సైతం ఈ ఏడాది డిమాండ్ పెరిగింది. సీజన్ మొదట్లో క్వింటాల్ పత్తి గింజల ధర రూ.3 వేల వరకు పలకగా.. ప్రస్తుతం రూ.4 వేల వరకు ధర పలుకుతోంది. ధరలు పెరగటంతో వచ్చే సీజన్లో పత్తి సాగు విస్తీర్ణం భారీగా పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు ఈ ఏడాది మిర్చి పంట రైతుల్ని నష్టాలకు గురి చేయడంతో ఆ రైతులు పత్తి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే గ్రామాల్లో పత్తి సాగు చేసేందుకు రైతులు కౌలు భూముల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పత్తి విత్తనాలకు సైతం డిమాండ్ పెరిగే పరిస్థితి ఉంది. దిగుబడి తగ్గినా ధర ఆదుకుంది గత సీజన్లో గుంటూరు జిల్లాలో పత్తి సాగు సాధారణ విస్తీర్ణం 4,23,750 ఎకరాలు కాగా, 2,73,950 ఎకరాల్లో మాత్రమే పంట సాగయ్యింది. ఇందులోనూ అధిక వర్షాలు, గులాబీ రంగు పురుగు కారణంగా కొంత పంట దెబ్బతింది. దాంతో దిగుబడులు కూడా తగ్గాయి. ఇలాంటి పరిస్థితుల నడుమ సీజన్ ప్రారంభంలో క్వింటాల్ ధర రూ.7 వేలు పలకగా.. తరువాత పెరుగుతూ వచ్చింది. పరిస్థితి ఆశాజనకంగా ఉండటంతో క్వింటాల్ ధర రూ.10 వేల వరకు పెరుగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. అయితే, సీజన్ ముగింపు దశలో ఏకంగా రూ.11 వేలకు చేరింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయి ధరగా నమోదైంది. ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. కనీస మద్దతు ధర కంటే మార్కెట్లో ధరలు అధికంగా ఉండటంతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఈ ఏడాది రైతుల నుంచి కొనుగోళ్లు జరపలేదు. సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం జిల్లాలో గత ఏడాది గులాబీ రంగు పురుగు కారణంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో కేవలం 2,73,950 ఎకరాల్లోనే రైతులు పత్తి సాగు చేశారు. పత్తి రైతుల్లో ఎక్కువ మంది మిర్చి పంట వైపు మొగ్గుచూపారు. మిర్చి సాధారణ సాగు విస్తీర్ణం 1,84,442 ఎకరాలు కాగా ఖరీఫ్‌లో 2,66,640 ఎకరాల్లో మిర్చి వేశారు. అయితే, మిర్చికి తామర తెగులు సోకడంతో పంట సుమారు 80 శాతం వరకు దెబ్బతింది. మిర్చి పంట దెబ్బతినడం, పత్తి ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఈ ఏడాది పత్తి సాగు భారీగా పెరుగుతుందని ఆశిస్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాకు 13 లక్షల హైబ్రిడ్ పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయని ప్రభుత్వానికి నివేదికలు పంపాం. ఏప్రిల్ 6న గుంటూరులో విత్తన కంపెనీల ప్రతినిధులతో రాష్ట్రస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. – ఎం.విజయ భారతి, జాయింట్ డైరెక్టర్, వ్యవసాయ శాఖ దరలు ఇంకా పెరగొచ్చు ఈ ఏడాది పత్తి సాగు తగ్గింది. దీనివల్ల మార్కెట్‌కు పంట పెద్దగా రాలేదు. మరోవైపు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. ఫలితంగా పత్తి గింజలకు డిమాండ్ ఏర్పడింది. క్వింటాల్ రూ.4,000 పైగా పలుకుతోంది. జిన్నింగ్ పత్తికి కూడా డిమాండ్ ఉండటంతో మార్కెట్లో ధర పెరుగుతోంది. ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. – ప్రగతి శ్రీనివాసరావు, పత్తి వ్యాపారి -
ధర పెరిగి తగ్గింది!
పెద్దపల్లి: చేలలో పత్తి తగ్గుతుండగా మార్కెట్లో ధర డిమాండ్ పెరుగుతుండేది. ఇది గతంలో ఎన్నో ఏళ్లుగా రైతులు చూసిన అనుభవం. నవంబర్‌లో రూ.4200 ధర పలికితే ఫిబ్రవరిలో 5 వేలకు పైగా పలికేది. పత్తి మార్కెట్లో ధరల ఆటుపోటు ఇలా ఉండగా, ప్రస్తుతం గతంలో కంటే ధరలు తగ్గుతూ రావడంతో పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 65వేల హెక్టార్లలో సాగు జిల్లాలో 65వేల పత్తి సాగుబడి కాగా, ఆశించిన దానిలో సగం కూడా దిగుబడి రాకపోవడంతో రైతుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లి ప్రాంతంలో రికార్డు స్థాయిలో పత్తి దిగుబడి వచ్చేది. ఒక్కో ఎకరానికి 12 నుంచి 15 క్వింటాళ్ల పత్తి దిగుబడి అవుతుండగా, ఈ ఏడాది 4 నుంచి 6 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. తీరా మార్కెట్‌కు వెళితే నిన్నటి ధర కంటే నేడు మరో రూ. 50 తగ్గుతూ విక్రయాలు కొనసాగిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. తగ్గిన ధర పెద్దపల్లి పత్తి మార్కెట్లో గత నెల 5200 క్వింటాల్ ధర పలికితే ప్రస్తుతం 4600 మేరకే పత్తి విక్రయాలు కొనసాగుతున్నాయి. కనిష్ట ధర రూ. 2500, సాధారణ ధర రూ. 4300గా నమోదవుతోంది. ఇది గతంతో పోలిస్తే పూర్తిగా దెబ్బతిన్న రికార్డుగానే చెప్పుకోవచ్చు. రైతులు తగ్గుతున్న ధరలను చూసి ఆవేదనకు గురవుతున్నారు. గడిచిన 15 రోజులుగా పత్తి ధరలు రోజుకు రూ. 100 నుంచి 50 తగ్గుతున్న సందర్భాలే ఎక్కువగా నమోదవు తున్నాయి. కనిష్ట ధర గురువారం రూ. 2500 మాత్రమే పలికితే శుక్రవారం కూడా అంతే పలికింది. ఇక సాధారణ ధర తగ్గుతూ రావడం ఇంట్లో పత్తి దాచుకున్న రైతులు మార్కెట్‌కు తీసుకువచ్చేందుకు వెనకంజ వేసేలా చేస్తోంది. దాచుకుంటే ధర పెరిగేది.. చిన్న, సన్నకారు రైతులు తమ అవసరాల కోసం ఏరోజుకారోజు పత్తిని మార్కెట్‌ను తరలిస్తూ విక్రయించేవారు. సంపన్నులైన రైతులు మాత్రం మార్కెట్ ధరల పరిస్థితిని గమనిస్తూ అమ్మకాలు చేపట్టేవారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి, మార్చిలో పత్తి ధరలకు రెక్కలు వచ్చేవి. అప్పటివరకు పత్తి అమ్ముకున్న రైతులు ఆ తర్వాత పెరుగుతున్న ధరలను చూసి దిగులుపడేవారు. ప్రస్తుతం పరిస్థితి తలకిందులై గతంలో కంటే క్వింటాల్‌కు రూ. 500కు పైగా ధర తగ్గి విక్రయాలు చేపట్టడం రైతులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ వ్యత్యాసాన్ని పూడ్చివేయడానికి మార్కెటింగ్ శాఖ జోక్యం చేసుకోవాలని పలువురు కోరుతున్నారు. బేళ్లకూ ప్రభావమే.. అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కో బేల్ ఖరీదు రూ. 42వేలు పలికేదని, ప్రస్తుతం రూ. 41వేలకు ధర పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. అలాగే పత్తి విత్తనాలకు టన్నుకు రూ. 22వేలు ఉండేదని, ప్రస్తుతం రూ. 19వేలకు ధర పడిపోవడంతో ఆ ప్రభావం పత్తి మార్కెట్‌పైన కొనసాగుతుందని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రైతులకు పంట దిగుబడితోపాటు ధరల రాబడి కూడా పడిపోతుందని అంటున్నారు. -
పత్తి ధర పైపైకి
క్వింటాల్‌కు రూ.5,350 నాలుగేళ్ల గరిష్ట ధరకు చేరువ పక్క రాష్ట్రాల్లో ధరను చూసి.. పెంచుతున్న జిల్లా వ్యాపారులు ఇప్పటికే 60 శాతం అమ్ముకున్న రైతులు మంచిర్యాల అగ్రికల్చర్ : పత్తి ధరలు రైతులను మరోసారి ఆందోళనలో పడేశాయి. అదునుదాటాక.. ఉన్నది అమ్ముకున్నాక వ్యాపారులు పెద్దఎత్తున ధరలు పెంచుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తి బేళ్లు, గింజలకు డిమాండు పెరగడంతోపాటు పక్క మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాల్లో ధరలు పెరుగుతుండటంతో ఆ ప్రభావం జిల్లాపై చూపుతోంది. దీంతో తప్పని పరిస్థితిలో వ్యాపారులు ధరలు పెంచుతున్నారు. బుధవారం జిల్లాలోని జిన్నింగ్ వ్యాపారులు క్వింటాలకు రూ.5,350 ధరతో కొనుగోలు చేశారు. జిల్లాలో నాలుగేళ్ల క్రితం గరిష్టంగా రూ.5,500 చేరుకున్న ధరలు ఇప్పుడు చేరువులో ఉన్నాయి. జిల్లాలోని రైతులు ఇప్పటికే 60 శాతం పత్తిని అమ్ముకున్నారు. పెరుగుతున్న ధరలు రైతుల కన్న వ్యాపారులకే ఎక్కువగా మేలు చేస్తున్నాయి. ఈసారి 47 వేల హెక్టార్లలో సాగు.. జిల్లాలో ఈ ఏడాది 47 వేల హెక్టార్లలో పత్తి సాగైంది. ఈ ఏడాది ఆశించిన వర్షాలు కురవడంతో మంచి దిగుబడి వచ్చింది. సెప్టెంబర్ నుంచి దిగుబడి వస్తున్న పంటను ఇప్పటికే రైతులు 60 శాతం అమ్ముకున్నారు. రెండేళ్లు అప్పుల పాలైన రైతులు ఈ ఏడాది కురిసిన వర్షాలు కొంత ఊరటనిచ్చాయి. ఇతర రాష్ట్రాల్లో ధరలు పెరుగుతుండటంతో రెండు నెలలుగా దళారులు గ్రామాల్లో తి రుగుతూ మద్దతు ధర రూ.4,160 కంటే ఎక్కువగా రూ. 4,600 నుంచి రూ.4,900 వరకు చెల్లించి కొనుగోలు చేశారు. రెండేళ్లు నష్టాలు ఎదుర్కొన్న రైతులు ప్రభుత్వ మద్దతు ధర కంటే రూ.450 నుంచి రూ.800 అధికంగా వస్తుండటంతో దళారులకే పత్తిని ముట్టజెప్పారు. పెరుగుతున్న డిమాండ్.. రెండేళ్ల కాలంలో పత్తి క్వింటాల్‌కు కనిష్టంగా రూ. 3,600, గరిష్టంగా రూ.4,500 ధరలు పలుకాయి. ఈ ఏ డాది ఆరంభంలో వ్యాపారులు గరిష్ట ధర రూ.4,450తో కొనుగోలు ప్రారంభించారు. రెండు నెలల్లో వంద రెండు వందలు పెంచుతూ తగ్గిస్తూ వస్తున్నారు. దీనికి కారణం గత సీజన్ «అంతర్జాతీయ మార్కెట్లో పత్తి బేళ్ల ధర పెరుగుతుండడమే. అందుకే.. ఇతర రాష్ట్రాల వ్యాపారులు జిల్లాలోకి ప్రవేశించి గ్రామాల్లో జీరో కొనుగోళ్లు చేపడుతున్నట్లు తెలిసింది. డిసెంబర్ 2 నుంచి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.5 వేలకు పైగా చెల్లిస్తున్నారు. అమ్మిన రైతులు ఆవేదనకు గురువుతుంటే ఇన్ని రోజులు నిల్వచేసిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ కొనుగోళ్లు సున్నా.. రైతులు పండించిన పంటలు నష్టపోకుండా ఉండేందు కు ఏర్పాటైన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తెల్లబోతోంది. ఒక్కరంటే ఒక్క పత్తి రైతు కూడా ఈ ఏడాది సీసీఐ కొనుగోలు కేంద్రాలకు వెళ్లలేదు. జిల్లాలో ఆరు సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు ఒక్క క్వింటాల్ పత్తిని కూడా అమ్మలేదు. కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4,160 నిర్ణయించడం, తేమ, పింజ పొడువు, తదితర నిబంధనలు దగ్గరకు రానివ్వకుండ చేశాయి. దీంతో రైతులంతా ప్రైవేటుగానే విక్రయించా రు. గతేడాది ఇదే సమయానికి లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసిన సీసీఐ.. ఈసారి మాత్రం ఒక్క క్వింటా పత్తిని కూడా కొనుగోలు చేయకపోవడం గమనార్హం. ‘పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరుగుతోం ది. దీంతో జిల్లాలో జిన్నింగ్ వ్యాపారులు ధరలు పెంచుతున్నారు. సీసీఐ ఒక్క క్వింటాల్ కూడా కొనలేదు’ అని మార్కెటింగ్ శాఖ అధికారి గజానంద్ తెలిపారు. -
సాగు తగ్గింది.. ధర పెరిగింది
సాక్షి, హైదరాబాద్: ‘ఈ ఏడాది అంతర్జాతీయంగా పత్తి ధరలు గణనీయంగా పడిపోనున్నాయి. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలోనూ రైతులకు పత్తి ధరలు గిట్టుబాటు అయ్యే పరిస్థితి ఏమాత్రం ఉండదు. అందువల్ల రైతులను ఇతర పంటల వైపు మళ్లించాలి’ అని ఈ ఏడాది ప్రభుత్వం వ్యవసాయశాఖను ఆదేశించింది. దీంతో వ్యవసాయశాఖ రైతులను పత్తికి ప్రత్యామ్నాయంగా సోయా, మొక్కజొన్న, పప్పుధాన్యాల పంటల వైపు మళ్లించడంలో సఫలమైంది. కానీ ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు రైతులకు సంకటంగా మారింది. గతేడాది కంటే ఈసారి పత్తి ధరలు రెట్టింపు స్థాయిలో ఉండటంతో రైతులు, అధికారులు కంగుతిన్నారు. పోనీ ప్రత్యామ్నాయంగా సాగు చేయాలని ప్రభుత్వం సూచించిన పంటల ధరల పరిస్థితి మార్కెట్లో బాగుందా అంటే అదీ లేదు. సోయా, కంది, పెసర పంటల ధరలు మార్కెట్లో ఢమాల్ అంటున్నాయి. గతేడాది కంటే 11 లక్షల ఎకరాలు తగ్గిన పత్తి సాగు... ఖరీఫ్‌లో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42.21 లక్షల ఎకరాలు కాగా... గతేడాది ఖరీఫ్‌లో 41.71 లక్షల ఎకరాల్లో సాగైంది. రాష్ట్రప్రభుత్వం పత్తి సాగు వద్దని చెప్పడంతో ఈ ఏడాది 30.52 లక్షల ఎకరాలకు పడిపోయింది. గతేడాదితో పోలిస్తే 11 లక్షల ఎకరాల పత్తి సాగు తగ్గింది. పత్తికి ప్రత్యామ్నాయంగా సోయాబీన్, మొక్కజొన్న, కంది, పెసర వంటి పంటల సాగును పెంచాలన్న నిర్ణయానికి తగ్గట్లుగా వాటి సాగు గణనీయంగా పెరిగింది. సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.98 లక్షల ఎకరాలు కాగా... గతేడాది 6.27 లక్షల ఎకరాల్లో సాగైంది. ప్రభుత్వ ప్రచారంతో ఈసారి 7.36 లక్షల ఎకరాల్లో సాగైంది. అలాగే ఖరీఫ్‌లో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 12.12 లక్షల ఎకరాలు కాగా... గతేడాది 10.44 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఇక ఈ ఖరీఫ్‌లో ఏకంగా 14.44 లక్షల ఎకరాల్లో సాగైంది. అన్ని రకాల పప్పుధాన్యాలను ఖరీఫ్‌లో సాధారణంగా 9.97 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారు. గతేడాది ఖరీఫ్‌లో 8.89 లక్షల ఎకరాల్లో సాగు చేస్తే... ఈ ఖరీఫ్‌లో ఏకంగా 15.75 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేశారు. పత్తికి ప్రత్యామ్నాయంగా ఈ పంటలన్నీ కూడా భారీగా సాగయ్యాయి. కానీ ప్రత్యామ్నాయ పంటల ధరలన్నీ కూడా మార్కెట్లో పడిపోయాయి. రెట్టింపైన పత్తి ధర... గతేడాది క్వింటాలు పత్తి తెలంగాణ మార్కెట్లో రూ. 4,050 వరకు గరిష్టంగా ధర పలుకగా... ఈ ఏడాది రూ.8 వేల నుంచి రూ. 10 వేల వరకు ధర పలుకుతుండటం గమనార్హం. గతేడాది పెసర క్వింటాలు రూ. 6,965 వరకు ధర పలుకగా... ఈసారి రూ. 4,500కు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. అంటే క్వింటాలుకు రూ. 2 వేలకు పైనే తగ్గడం గమనార్హం. సోయాబీన్‌కు గతేడాది క్వింటాలుకు రూ. 3,700 ధర ఉండగా... ఈ ఏడాది రూ. 2,800కు పడిపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. మొక్కజొన్న గతేడాది క్వింటాలుకు రూ. 1,419 ధర ఉండగా, ఈసారి రూ. 1,200కు పడిపోయింది. కంది గతేడాది క్వింటాలుకు రూ. 7 వేలుండగా... ఈసారి రూ. 5,827కు పడిపోయింది. దీంతోపాటు సోయా, మొక్కజొన్న, కంది పంటలకు ఇటీవల వచ్చిన కుండపోత వర్షాలకు భారీగా నష్టం వాటిల్లింది. -
పత్తి ధర తగ్గేవరకూ కొనకండి
- స్పిన్నింగ్ మిల్లులకు అసోసియేషన్ సూచన సాక్షి, అమరావతి పత్తి ధరలు దిగివచ్చే వరకు ఎగబడి పత్తిని కొనుగోలు చేయవద్దని స్పిన్నింగ్ మిల్లులను ఆంధ్రప్రదేశ్ స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ కోరింది. ఇదే సమయంలో భయపడి తక్కువ ధరకు ఉత్పత్తి చేసిన యార్న్ విక్రయించవద్దని సూచించింది. ఈ సమస్య కేవలం ఒక ప్రాంతానికి సంబంధించింది కాకపోవడంతో కేంద్ర స్థాయిలో తగు నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ చైర్మన్ ధర్మతేజ తెలిపారు. కేవలం మన రాష్ట్రంలో మిల్లులను మూసివేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదన్న ఉద్దేశంతో మూసివేత అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని బుధవారం రాత్రి జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వ్యక్తిగత ఆర్థిక స్థితిని బట్టి మిల్లులను నడపాలా? ఉత్పత్తిని తగ్గించాలా? లేక పాక్షికంగా కొన్ని రోజులు మూసివేయాలా అన్న నిర్ణయం మిల్లు యజమానులకే వదిలేసినట్లు తెలిపారు. ఈ సమస్యపై దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అసోసియేషన్లు శుక్రవారం కోయంబత్తూరులో సమావేశమవుతున్నాయని, దీని తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నదానిపై స్పష్టత వస్తుందన్నారు. ఈ జాతీయ సమావేశం తర్వాత సమస్యను కేంద్ర జౌళిశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. వారం రోజుల్లో మంత్రిని కలిసి సమస్యను వివరించనున్నట్లు ధర్మతేజ తెలిపారు. ఈ లోగా మిల్లులు తొందరపడి పత్తిని కొనుగోలు చేయడం, యార్న్ తక్కువ ధరకు అమ్మకూడదని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మూడు నెలల్లో కేజీ పత్తి ధర రూ. 100 నుంచి రూ. 130 దాటితే ఇదే సమయంలో యార్న్ ధర రూ. 210 నుంచి రూ. 170కి పడిపోయింది. దీంతో ప్రతి మిల్లు రోజుకి సుమారుగా రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలు నష్టపోతోంది. సుమారు 20 మిల్లులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి మూసివేసే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మన రాష్ట్రంలో 110 స్పిన్నింగ్ మిల్స్ ఉండగా.. వీటిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 8 లక్షలమంది ఆధారపడి జీవిస్తున్నారు. -
పింజ తక్కువట.. తేమ ఎక్కువట!
పత్తిరైతు చిత్తు మే వరకూ మార్కెట్లకుపత్తి వచ్చే అవకాశం మార్చి రెండో వారం నాటికే కొనుగోళ్లు నిలిపివేసిన సీసీఐ సీసీఐ కేంద్రాల మూతతో వ్యాపారుల ఇష్టారాజ్యం క్వింటాల్‌కు రూ. 400 వరకూ తగ్గింపు పత్తిరైతు నిలువునా దోపిడికీ గురవుతున్నాడు.. మార్కెట్ మాయాజాలంలో ఘోరంగా ఓడిపోతున్నాడు.. కొనుగోళ్లు చేసినంతకాలం ఏదో ఒక నిబంధన పేరుతో రైతులకు చుక్కలు చూపిన సీసీఐ.. మార్కెట్‌కు పత్తి రావడం ఇంకా ఆగిపోకముందే దుకాణం కట్టేసింది.. వ్యాపారులు, దళారులకు తలుపులు బార్లా తెరిచి, రైతన్న నోట మట్టి కొట్టేసింది. ఇదే అదనుగా వ్యాపారులు దగా దందా మొదలుపెట్టేశారు. క్వింటాల్ పత్తికి రూ. ఐదారు వందల వరకూ తక్కువ చెల్లిస్తూ నిలువునా దోపిడీ చేస్తున్నారు. దిక్కుతోచని రైతులు ఆవేదనలో మునిగిపోతున్నారు. కన్నీళ్లతోనే వచ్చినకాడికి అమ్ముకుంటున్నారు. - సాక్షి, హైదరాబాద్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోళ్లను నిలిపివేయడంతో... రాష్ట్రంలో పత్తి ధరలు భారీగా పడిపోయాయి. కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ. 4,050 కాగా.. వ్యాపారులు రూ. 3,600 నుంచి రూ. 3,700కు మించి చెల్లించడం లేదు. తక్కువ ధర వస్తుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. సాధారణంగా రైతులు మే నెల వరకు పత్తి విక్రయాలు చేస్తూనే ఉంటారు. ఈ లెక్కన కనీసం ఏప్రిల్ 15వ తేదీ వరకైనా సీసీఐ కొనుగోళ్లు చేయాల్సి ఉంటుంది. కానీ ఈసారి మార్చిలోనే సీసీఐ కేంద్రాలను ఎత్తివేయడం.. అసలే కరువుతో అల్లాడుతున్న రైతులకు శరాఘాతంగా మారింది. సింహభాగం పత్తిదే రాష్ట్రంలో పత్తిసాగు అధికం. ఈ ఖరీఫ్‌లో 8.173 లక్షల హెక్టార్లలో వరి సాగు కాగా.. పత్తిని ఏకంగా 16.763 లక్షల హెక్టార్లలో సాగుచేశారు. ఖరీఫ్‌లో ఆహారధాన్యాల సాగు 83 శాతానికి తగ్గగా... పత్తి సాగు 109 శాతానికి పెరిగింది. ప్రధానంగా ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పత్తిసాగు ఎక్కువ. సాధారణంగా పత్తి ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాలి. కానీ వర్షాలు సరిగా కురవక.. పత్తి దిగుబడి 3 నుంచి 7 క్వింటాళ్లకు పడిపోయింది. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 35 లక్షల టన్నుల వరకు పత్తిని రైతులు విక్రయించారు. మరో 10 లక్షల టన్నుల వరకు పత్తిని నిల్వ ఉంచారు. గత సీజన్లో ఇలా నిల్వ ఉంచిన రైతులకు కనీస మద్దతు ధరకు మించి క్వింటాల్‌కు రూ. 5,200 వరకు ధర పలికింది. ఈ సారి కూడా అలా జరుగుతుందని ఆశించారు. కానీ వారి ఆశలపై సీసీఐ నీళ్లు చల్లుతూ కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసింది. అంతర్జాతీయంగా ఎగుమతులు లేకపోవడంతో ధరలు తగ్గాయంటూ వ్యాపారులు తక్కువ ధర చెల్లిస్తున్నారు. దీంతో ఆదిలాబాద్ జిల్లా రైతులు తమ పత్తిని మహారాష్ట్రకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. పింజ పొడవు సాకు.. రైతులు పత్తి తీతను దాదాపు పూర్తిచేశారు. కానీ ధర ఎక్కువ వస్తుందన్న ఆశతో నిలువ ఉంచారు. కానీ పింజ పొడవు తక్కువగా ఉం దని పేర్కొంటూ వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా పింజ పొడవు 29.5 మిల్లీమీటర్ల నుంచి 30.5 మిల్లీమీటర్ల వరకు ఉన్న పత్తికి పూర్తిస్థాయి ధర చెల్లిస్తారు. కానీ పత్తి తీత పూర్తయిన తర్వాత వస్తున్న సరుకుకావడంతో... పూర్తి నాణ్యంగా ఉన్నా కూడా పింజ పొడవు తక్కువ ఉందం టూ వ్యాపారులు సాకులు చెబుతున్నారు. దీని కి తోడు తేమ శాతం పేరిట తక్కువ ధర చెల్లిస్తున్నారు. ఈ విషయంలో సీసీఐ వ్యాపారుల తో కుమ్మక్కు అయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముందుగానే కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసిందనే వాదన వినిపిస్తోంది. మేమేమీ ఆదేశాలు ఇవ్వలేదు ‘‘సీసీఐ కొనుగోలు కేంద్రాలను నిలిపివేయాలని మేం ఆదేశాలు ఇవ్వలేదు. సీసీఐ నేరుగా అలాంటి ఆదేశాలు ఇచ్చి ఉండవచ్చు. ఈ విషయం నాకు తెలియదు.’’ - ప్రియదర్శిని, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ కమిషనర్ -
పత్తి, మిర్చి ధరలు పైపైకి
ఖమ్మం వ్యవసాయం : పత్తి, మిర్చి ధరలు క్రమేణా పెరుగుతున్నాయి. క్వింటాలు పత్తి ధర రూ.5 వేలకు చేరుకుంది. మిర్చి కోల్డ్ స్టోరేజీలో నిల్వ(ఏసీ) ఉంచిన సరుకు ధర రూ.9,500, రైతులు ఇళ్లలో నిల్వ ఉంచుకొని అమ్మకానికి తెచ్చే సరుకు ధర రూ.8,400 వరకు పలుకుతోంది. ప్రస్తుతం వ్యవసాయ ఉత్పత్తులు లేకపోవడం, వర్షాబావ పరిస్థితులు నెలకొనడంతో ఈ పంట ఉత్పత్తులకు ధర పెరుగుతోందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది ప్రభుత్వం పత్తి మద్దతు ధర రూ.4వేలుగా ప్రకటించారు. అక్టోబర్ నుంచి పత్తి అమ్మకానికి వచ్చింది. అక్టోబర్ తొలి రోజుల్లో క్వింటాలు పత్తి ధర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర వరకు మార్కెట్లలో వ్యాపారులు కొనుగోలు చేశారు. అయితే.. ఆ సమయంలో సరుకు తక్కువగా అమ్మకానికి వచ్చింది. అక్టోబర్ చివరి వారంలో ఆరు రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. దీంతో చేతికందిన పత్తి తడిసింది. రంగు మారిందని, నాణ్యత లేదనే సాకుతో రూ.2,300 నుంచి రూ.2,700 వరకు మాత్రమే కొనుగోలు చేశారు. వర్షం కారణంగా పంట ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. ఆ తర్వాత కూడా రెండు మూడు సార్లు వర్షాలు కురిశాయి. దీంతో పంట నాణ్యత లేదని జనవరి, ఫిబ్రవరి వరకు కూడా రూ.3 వేల వరకు మాత్రమే కొనుగోలు చేశారు. ఈ ధరలకు పంట ఉత్పత్తిని అమ్మకాలు చేయని రైతులు ఇళ్లలో, గోదాముల్లో సరుకును నిల్వ చేశారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో వేసిన పత్తి మొలకెత్త లేదు. ఈ పరిస్థితులను గుర్తించిన జిన్నింగ్ మిల్లుల యజమానులు పత్తి కొనుగోళ్లకు ఆసక్తి కనబరుస్తున్నారు. గత ఏడాది పండించిన పత్తిని కొనుగోలు చేసి, జిన్నింగ్ చేసి బేళ్లను నిల్వబెట్టే పనిలో ఉన్నారు. దీంతో పాటు కాటన్ ఆయిల్‌కు కూడా డిమాండ్ పెరిగింది. దీంతో పత్తి ధర రూ.5 వేలకు పలుకుతోందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఖమ్మం మార్కెట్‌కు 2 వేల నుంచి 4 వేల బస్తాల పత్తి అమ్మకానికి వస్తోంది. రైతులు నిల్వ ఉంచుకున్న పత్తిని అమ్మకానికి తెస్తున్నారు. పత్తిలో తేమ ఉంటే రూ.4,700 వరకు కొనుగోలు చేస్తున్నారు. మిర్చి ధర కూడా సీజన్‌తో పోలిస్తూ బాగానే పెరిగింది. జనవరి నుంచి మార్చి వరకు మిర్చి పంట ఉత్పత్తి బాగా ఉన్న సీజన్లో క్వింటాలు ధర రూ.5 వేల నుంచి రూ.6,500 వరకు పలికింది. మిర్చి సాగుకు పెట్టుబడులు పెరగడంతో అప్పటి రేట్లు గిట్టుబాటుగాక కొందరు రైతులు సరుకును కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేశారు. వ్యాపారులు సీజన్లో తక్కువ ధరలకు సరుకును కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజీల్లో పెట్టారు. ఈ సరుకును ప్రస్తుతం క్వింటాలుకు రూ.9,500 వరకు అమ్మకాలు చేస్తున్నారు. రైతులు ఇళ్లలో నిల్వ ఉంచిన సరుకును క్వింటాలుకు రూ.8,500 వరకు విక్రయిస్తున్నారు. జిల్లాలో సుమారు 30 కోల్డ్ స్టోరేజీలు ఉండగా వీటిలో 24.50 లక్షల క్వింటాళ్ల మిర్చి నిల్వలు ఉన్నాయని మార్కెటింగ్ శాఖకు చెందిన అధికారులు చెబుతున్నారు. ఈ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యాపార వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక్కడ పండించే తేజా రకం కారానికి మలేషియాలో అధిక గిరాకీ ఉంటుందని కూడా వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న ధర కన్నా మరో వెయ్యి రూపాయలు మరి కొద్ది రోజుల్లో పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు వ్యాపారులు చర్చించుకుంటున్నారు. సరుకు నిల్వ పెట్టుకున్న రైతులకు, వ్యాపారులకు ఈ ధరలు కలిసి వచ్చే అవకాశం ఉంది.