ఖమ్మం వ్యవసాయం : పత్తి, మిర్చి ధరలు క్రమేణా పెరుగుతున్నాయి. క్వింటాలు పత్తి ధర రూ.5 వేలకు చేరుకుంది. మిర్చి కోల్డ్ స్టోరేజీలో నిల్వ(ఏసీ) ఉంచిన సరుకు ధర రూ.9,500, రైతులు ఇళ్లలో నిల్వ ఉంచుకొని అమ్మకానికి తెచ్చే సరుకు ధర రూ.8,400 వరకు పలుకుతోంది. ప్రస్తుతం వ్యవసాయ ఉత్పత్తులు లేకపోవడం, వర్షాబావ పరిస్థితులు నెలకొనడంతో ఈ పంట ఉత్పత్తులకు ధర పెరుగుతోందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది ప్రభుత్వం పత్తి మద్దతు ధర రూ.4వేలుగా ప్రకటించారు.
అక్టోబర్ నుంచి పత్తి అమ్మకానికి వచ్చింది. అక్టోబర్ తొలి రోజుల్లో క్వింటాలు పత్తి ధర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర వరకు మార్కెట్లలో వ్యాపారులు కొనుగోలు చేశారు. అయితే.. ఆ సమయంలో సరుకు తక్కువగా అమ్మకానికి వచ్చింది. అక్టోబర్ చివరి వారంలో ఆరు రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. దీంతో చేతికందిన పత్తి తడిసింది. రంగు మారిందని, నాణ్యత లేదనే సాకుతో రూ.2,300 నుంచి రూ.2,700 వరకు మాత్రమే కొనుగోలు చేశారు. వర్షం కారణంగా పంట ఉత్పత్తి కూడా తగ్గిపోయింది.
ఆ తర్వాత కూడా రెండు మూడు సార్లు వర్షాలు కురిశాయి. దీంతో పంట నాణ్యత లేదని జనవరి, ఫిబ్రవరి వరకు కూడా రూ.3 వేల వరకు మాత్రమే కొనుగోలు చేశారు. ఈ ధరలకు పంట ఉత్పత్తిని అమ్మకాలు చేయని రైతులు ఇళ్లలో, గోదాముల్లో సరుకును నిల్వ చేశారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో వేసిన పత్తి మొలకెత్త లేదు. ఈ పరిస్థితులను గుర్తించిన జిన్నింగ్ మిల్లుల యజమానులు పత్తి కొనుగోళ్లకు ఆసక్తి కనబరుస్తున్నారు. గత ఏడాది పండించిన పత్తిని కొనుగోలు చేసి, జిన్నింగ్ చేసి బేళ్లను నిల్వబెట్టే పనిలో ఉన్నారు. దీంతో పాటు కాటన్ ఆయిల్‌కు కూడా డిమాండ్ పెరిగింది.
దీంతో పత్తి ధర రూ.5 వేలకు పలుకుతోందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఖమ్మం మార్కెట్‌కు 2 వేల నుంచి 4 వేల బస్తాల పత్తి అమ్మకానికి వస్తోంది. రైతులు నిల్వ ఉంచుకున్న పత్తిని అమ్మకానికి తెస్తున్నారు. పత్తిలో తేమ ఉంటే రూ.4,700 వరకు కొనుగోలు చేస్తున్నారు. మిర్చి ధర కూడా సీజన్‌తో పోలిస్తూ బాగానే పెరిగింది. జనవరి నుంచి మార్చి వరకు మిర్చి పంట ఉత్పత్తి బాగా ఉన్న సీజన్‌లో క్వింటాలు ధర రూ.5 వేల నుంచి రూ.6,500 వరకు పలికింది.
మిర్చి సాగుకు పెట్టుబడులు పెరగడంతో అప్పటి రేట్లు గిట్టుబాటుగాక కొందరు రైతులు సరుకును కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేశారు. వ్యాపారులు సీజన్‌లో తక్కువ ధరలకు సరుకును కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజీల్లో పెట్టారు. ఈ సరుకును ప్రస్తుతం క్వింటాలుకు రూ.9,500 వరకు అమ్మకాలు చేస్తున్నారు. రైతులు ఇళ్లలో నిల్వ ఉంచిన సరుకును క్వింటాలుకు రూ.8,500 వరకు విక్రయిస్తున్నారు. జిల్లాలో సుమారు 30 కోల్డ్ స్టోరేజీలు ఉండగా వీటిలో 24.50 లక్షల క్వింటాళ్ల మిర్చి నిల్వలు ఉన్నాయని మార్కెటింగ్ శాఖకు చెందిన అధికారులు చెబుతున్నారు.
ఈ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యాపార వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక్కడ పండించే తేజా రకం కారానికి మలేషియాలో అధిక గిరాకీ ఉంటుందని కూడా వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న ధర కన్నా మరో వెయ్యి రూపాయలు మరి కొద్ది రోజుల్లో పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు వ్యాపారులు చర్చించుకుంటున్నారు. సరుకు నిల్వ పెట్టుకున్న రైతులకు, వ్యాపారులకు ఈ ధరలు కలిసి వచ్చే అవకాశం ఉంది.
పత్తి, మిర్చి ధరలు పైపైకి
Published Tue, Jul 8 2014 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM
Advertisement