Chilli prices
-
ఘాటు తగ్గుతున్న మిర్చి!
ఖమ్మం వ్యవసాయం: మిర్చి ధర గణనీయంగా పతనమవుతోంది. రెండు, మూడు రోజులుగా ధర బాగా పడిపోయింది. గత ఏడాది పంట సీజన్లో గరిష్టంగా క్వింటాలుకు రూ.22,300 పలికిన మి ర్చి.. ప్రస్తుతం రూ.16 వేలకు దిగజారింది. మోడల్ ధర రూ.19 వేల నుంచి ఉండగా.. ప్రస్తుతం రూ.12 వేల నుంచి రూ.13 వేలకు మించి పలకడం లేదు. పంట సీజన్‌తో ధరతో పోలిస్తే ప్రస్తుతం దాదాపు రూ.10 వేల మేర ధర పడిపోయింది. ప్రస్తుతం గరిష్ట ధరలు రూ.16,700 నుంచి రూ.16 వేలు గా, మోడల్ ధర రూ.15 వేలు మొదలు రూ.13 వేల వరకు పలుకుతున్నాయి. దీంతో అధిక ధరలు ఆశించి మిర్చిని కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకొన్న వ్యాపారులు, రైతులు లబోదిబోమంటున్నారు. నాణ్యత లోపం.. ఎగుమతుల మందగమనం కొత్త పంట సీజన్ ప్రారంభం కావడంతో ఇప్పుడు మార్కెట్‌కు వస్తున్న మిర్చి అంత నాణ్యంగా లేకపోవడం.. విదేశాలకు ఎగుమతులు మందగించడం వల్లనే ధర క్షీణిస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. ఖమ్మంతోపాటు చుట్టుపక్కల జిల్లాలు, ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో పండించే ‘తేజ’రకం మిర్చిని చైనా, బంగ్లాదేశ్, సింగపూర్, మలేసియా, థాయ్‌లాండ్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రధానంగా చైనాకు ఎగుమతులు అధికంగా ఉంటాయి.ఏటా జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు చైనాలో పండుగ సీజన్. ఈ సమయంలో అక్కడ పరిశ్రమలు మూతపడతాయి. ఫలితంగా అక్కడి వ్యాపారులు పంటలను కొనుగోలు చేయరు. మిర్చి ధర పతనానికి ఇది ప్రధాన కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. మిర్చి మొదటి కోతను మైలకాయ అంటారు. సాధారణంగా మైలకాయ నాణ్యత తక్కువగా ఉండడంతో ధర కూడా తక్కువ పలుకుతుంది. ఇది ఎగుమతులకు పనికిరాదు. కొత్త పంట రాకతో కోల్డ్› స్టోరేజీల్లో నిల్వచేసిన మిర్చికి డిమాండ్ తగ్గుతుంది. దానిని పాత మిర్చిగానే లెక్కిస్తారు. నిల్వ చేసి నష్టాల పాలు గడిచిన పంట సీజన్లో సగటున క్వింటా మిర్చి ధర రూ.20 వేల వరకు పలకగా.. అన్ సీజన్లో రూ.25 వేలకు చేరుతుందని అంతా ఆశించారు. దీంతో ధర మరింత పెరిగిన తర్వా త అమ్ముకోవచ్చన్న ఆశతో వ్యాపారులు, రైతులు పంటను కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేశారు. కానీ వారి అంచనాలు తలకిందులయ్యాయి. రూ.22 వేలు మొదలు రూ.19 వేల వరకు ధర పలికిన సమయాన కోల్డ్ స్టోరేజీల్లో నిల్వచేయగా.. ఇప్పుడు ధర క్ర మంగా పతనమవుతుండడంతో దిక్కుతో చని స్థితిలో పడ్డారు. ఖమ్మం జిల్లాలోని కో ల్డ్ స్టోరేజీల్లో ఇంకా 30 శాతం వరకు మిర్చి నిల్వలు ఉండిపోయాయి. తక్కువ ధరకు అమ్ముదామనుకున్నా కొనేవారు లేరు అని వ్యాపారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. -
మిర్చి ధర పతనం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: మిర్చి ధరలు తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది మే చివరి నాటికి క్వింటాల్ మిర్చి కనీస ధర రూ.9 వేలు, గరిష్ట ధర రూ.26,500 ఉండగా.. ఈ ఏడాది కనీస ధర రూ.8 వేలు, గరిష్ట ధర 20,700 పలుకుతోంది. ప్రస్తుతం తేజ మంచి రకానికి రూ.19,500 మాత్రమే అత్యధిక ధర లభిస్తోంది. మిగిలిన అన్నిరకాల మిర్చి ధరలు గణనీయంగా తగ్గాయి. మరోవైపు ఎగుమతులు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోవడంతో కోల్డ్ స్టోరేజీలలో 75 లక్షల మిర్చి బస్తాలు నిల్వ ఉండిపోయాయి. ధరలు తగ్గడంతో మిర్చి రైతుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు ఎగుమతులు ఎప్పుడు ప్రారంభమవుతాయో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇంకోవైపు వర్షాలు ప్రారంభం కావడంతో మిరప నాట్లు వేసేందుకు రైతులు సన్నద్ధం అవుతున్నారు.ఎగుమతుల్లో ఏపీదే మొదటి స్థానం 2022–23 సంవత్పరంలో రికార్డు స్థాయిలో రూ.10,440 కోట్ల విలువైన మిర్చి విదేశాలకు ఎగుమతులయ్యాయి. మిర్చి ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. దీంతో రెండేళ్లుగా రైతులు మిర్చి పంట వేయడంపైనే దృష్టి పెడుతున్నారు. మరోవైపు కర్ణాటకలోనూ మిర్చి దిగుబడి ఎక్కువగా రావడంతో అక్కడ కోల్డ్ స్టోరేజీలు సరిపోక ఏపీకి తీసుకొచ్చి నిల్వ చేస్తున్నారు. గుంటూరు పరిసర ప్రాంతాల్లో 100 వరకూ కోల్డ్‌స్టోరేజీలు ఉండగా.. 3.21 లక్షల టన్నులకు పైగా మిర్చిని నిల్వ చేశారు. ఇందులో 2.71 లక్షల మెట్రిక్ టన్నుల సరుకు రైతులది కాగా.. 52 వేల మెట్రిక్ టన్నుల సరుకు వ్యాపారులది. ఇవికాకుండా పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఉన్న కోల్డ్ స్టోరేజీలలో మొత్తం 75 లక్షల బస్తాల ( బస్తా 40 కిలోలు) సరుకు నిల్వ ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఉత్పత్తి గణనీయంగా రావడం వల్ల ధర రోజురోజుకీ తగ్గుతుండటం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది.20 దేశాలకు ఎగుమతి మన దేశం నుంచి సుమారు 20 దేశాలకు మిర్చి ఎగుమతి అవుతోంది. ముఖ్యంగా చైనా, శ్రీలంక, మలేసియా, థాయ్‌లాండ్, స్పెయిన్, అమెరికా, ఇంగ్లాండ్, నేపాల్, నెదర్లాండ్స్, నైజీరియా, ఇండోనేషియా, బంగ్లాదేశ్ తదితర దేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. ఆయా దేశాలకు కారం, విత్త నాలను సైతం ఎగుమతి చేస్తున్నారు. -
మిర్చి అ‘ధర’హో !
కర్నూలు(అగ్రికల్చర్): మిర్చి ధర పరుగులు తీస్తున్నది. మంగళవారం కర్నూలు మార్కెట్‌కు 207 మంది రైతులు 295 క్వింటాళ్ల ఎండుమిర్చి తీసుకొచ్చారు. కనిష్ట ధర రూ.4,119, గరిష్ట ధర రూ.37,112, మోడల్ ధర రూ.18,009గా నమోదు అయ్యింది. కర్నూలు మార్కెట్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో రూ.37,112 ధర లభించడం విశేషం. ఈ నెల 24న మార్కెట్లో గరిష్ట ధర రూ.33,102 లభించింది. మూడు రోజుల్లోనే క్వింటాలుపై రూ.4,010 పెరగడం విశేషం. జిల్లాలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో 1.25 లక్షల ఎకరాల్లో ఎండుమిర్చి సాగయింది. కర్నూలు మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉండడంతో ఈ నెల 24న మార్కెట్‌కు 135 క్వింటాళ్లు మాత్రమే రాగా.. ఈ నెల 27న 295 క్వింటాళ్ల మిర్చి వచ్చింది. -
ఎర్ర బంగారం ధగధగ.. క్వింటా రూ. 16,000
కర్నూలు: ఎర్ర బంగారం ధగధగ మెరుస్తోంది. ఈ ఏడాది ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు ఊరట చెందుతున్నారు. కర్నూలు జిల్లాలో మిర్చి సాధారణ సాగు విస్తీర్ణం 17 వేల హెక్టార్లు కాగా.. ఈ ఏడాది అత్యధికంగా 23,670 హెక్టార్లలో సాగు చేశారు. ప్రత్యేకంగా ఎండు మిరప కోసం జిల్లా వ్యాప్తంగా 28,368 ఎకరాల్లో సాగు చేశారని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు, నంద్యాల, కోవెలకుంట్ల, రుద్రవరం, శిరివెళ్ల, సంజామల, జూపాడుబంగ్లా, నందికొట్కూరు, మిడ్తూరు, పగిడ్యాల, పాములపాడు, కొత్తపల్లి ప్రాంతాల్లో విస్తారంగా సాగు చేశారు. పంట సాగు చేసినప్పటి నుంచి బింగి, నల్ల తామర వైరస్ తెగుళ్లు వ్యాపించటంతో పంటను కాపాడుకునేందుకు రైతులు కష్టాలు పడ్డారు. చదవండి: వెంగమ్మ పేణీలు.. రుచి మామూలుగా ఉండదు! రసాయన మందుల పిచికారీతో పాటు ఎరువుల కోసం ఎకరాకు రూ. 80 వేల నుంచి రూ. లక్ష వరకు వెచ్చించారు. సాధారణంగా ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా చీడపీడలు, వాతావరణ పరిస్థితులు అనుకూలించగా 12 నుంచి 15 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ మొదటి కోత పూర్తయింది. దిగుబడి తగ్గినా ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు కొంత ఊరట చెందుతున్నారు. గతేడాది క్వింటా రూ.8,000 – రూ.10,000 వరకు మాత్రమే పలికింది. ప్రసుత్తం గుంటూరు మిర్చి మార్కెట్ యార్డులో సూపర్ –10 రకం ధర క్వింటా రూ.16,000, 116 రకం రూ. 15,000 పలుకుతోంది. బ్యాడిగ రకం క్వింటా రూ. 18,000 వరకు పలుకుతుందని రైతులు చెబుతున్నారు. జిల్లాలో మిర్చి కొనుగోలుకు ప్రత్యేక కేంద్రాలు లేకపోవడంతో గుంటూరు యార్డుకు, కర్ణాటకలోని బ్యాడిగ మార్కెట్‌కు తరలిస్తున్నారు. కర్నూలు మార్కెట్ యార్డులో కొంత మేర కొనుగోళ్లు జరుగుతున్నా ధరలో చాలా వ్యత్యాసం ఉండటంతో రైతులు వ్యయప్రయాసలతో గుంటూరు మార్కెట్‌కు తరలిస్తున్నారు. నంద్యాలకు మంజూరైన మిర్చి మార్కెట్ యార్డు త్వరలో అందుబాటులోకి వస్తే రైతుల కష్టాలు తొలగిపోతాయి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి నేను ఆరు ఎకరాల్లో పండు మిరప సాగు చేశాను. ప్రస్తుతం మొదటి కోత పండు మిరపను తెంపగా ఎకరాకు 6 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇంకా రెండు కోతలు పడే అవకాశం ఉంది. మొత్తంగా ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. పంటను అమ్మేందుకు గుంటూరు తీసుకెళ్లాలంటే చాలా కష్టంగా ఉంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. – వీరనారాయణ, రైతు, భాస్కరాపురం, కర్నూలు జిల్లా ధరలు నిలకడగా ఉంటే మేలు నేను రెండు ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశాను. మొదటి కోత కోయగా ఎకరాకు 7 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం క్వింటా ధర రూ.16 వేలు పలికింది. వ్యాపారులు స్థానికంగా ధరలు తగ్గించి అడుగుతున్నారు. పండించిన పంటను గుంటూరుకు తీసుకెళ్లి విక్రయించుకోవాల్సి ఉంది. ధరలు ఇలాగే నిలకడగా ఉంటే రైతులకు ఆదాయం వస్తోంది. – జూటూరు నారాయణ, రైతు, భాస్కరాపురం, కర్నూలు జిల్లా -
మిర్చి రైతు.. కాసుల వర్షం
సాక్షి, అమరావతి బ్యూరో: మిర్చి రైతులకు ఈ ఏడాది కాసుల వర్షం కురుస్తోంది. కరోనా నేసథ్యంలో కొన్నిరకాల పంట ఉత్పత్తుల ధరలు తగ్గినా, మిర్చి ధరలు మాత్రం ఆశాజనకంగా ఉన్నాయి. విదేశాలకు ఆర్డర్లు భారీగా ఉండటంతో ధరలు పెరిగాయి. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకున్న రైతులకు లబ్ధిచేకూరింది. గుంటూరు మార్కెట్లో మంగళవారం తేజ రకం మిర్చి క్వింటాల్ రూ.19,500 పలికింది. మిర్చి దిగుబడి వచ్చే సమయానికి కరోనా వ్యాప్తి చెందటంతో గుంటూరు మార్కెట్ యార్డులో లావాదేవీలు నిలిచిపోయాయి. దీంతో రైతులు మిర్చిని కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వ చేసుకున్నారు. గుంటూరు జిల్లాలో 118 కోల్డ్‌స్టోరేజీల్లో కోటి బస్తాలకు పైగా మిర్చిని నిల్వచేశారు. ఇంకా 25 లక్షలకు పైగా మిర్చి బస్తాలు కోల్డ్‌స్టోరేజీల్లో ఉన్నాయి. గత నెలతో పోలిస్తే మిర్చి ధర క్వింటాలుకు సగటున రూ.2000కు పైగా పెరిగింది. విదేశాలకు ఎగుమతి ఆర్డర్లు గణనీయంగా పెరగడంతోపాటు మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలకు మిర్చి పంట దెబ్బతింది. ఆ రాష్ట్రాల్లో దిగుబడి కూడా ఆలస్యం అయింది. బంగ్లాదేశ్, చైనా దేశాల్లో తేజ రకం మిర్చికి, మలేసియాలో సీజెంటా బాడిగ రకం మిర్చికి గిరాకీ ఉంది. శ్రీలంకకు 334 రకం మిర్చి ఆర్డర్లు ఉన్నాయి. ఇండొనేషియా, థాయ్‌లాండ్, సింగపూర్ వంటి దేశాలకు కూడా మిర్చి ఎగుమతి అవుతోంది. దేశంలోని పలు రాష్ట్రాలకు కూడా ఇక్కడి నుంచి సరఫరా అవుతుండటంతో ధరలు పెరిగి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో పెరిగిన క్రయవిక్రయాలు కరోనా సమయంలో గుంటూరు మార్కెట్లో రోజుకు 10 వేల బస్తాలలోపు మాత్రమే అమ్మకాలు జరిగేవి. ప్రస్తుతం మార్కెట్ యార్డులో 25 వేల బస్తాలకుపైగా అమ్మకాలు జరుగుతున్నాయి. కొత్త సరుకు జనవరి వరకు వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వ ఉంచుకున్న మిర్చిని రైతులు అమ్ముకుంటున్నారు. పత్తి ధరలు పతనం కావడం, గులాబీరంగు పురుగు నేపథ్యంలో పత్తి సాగు విస్తీర్ణం తగ్గింది. మిర్చి ధరలు ఆశించిన స్థాయిలో ఉండటం, సాగునీటికి సైతం ఢోకా లేకపోవడంతో ఈ ఏడాది మిర్చి సాగు విస్తీర్ణం పెరుగుతుందని వ్యవసాయరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి ఈ ఏడాది మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. తేజ రకం మిర్చి ధర క్వింటాలు రూ.19,500 పలికింది. కరోనా నేపథ్యంలో ఎక్కువ మంది రైతులు మిర్చిని కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వ చేసుకున్నారు. ధరలు పెరగడంతో వారికి లబ్ధికలుగుతోంది. యార్డుల్లో మిర్చి క్రయవిక్రయాలు పెరిగాయి. విదేశీ ఎగుమతులకు ఆర్డర్లు రావడంతో మిర్చి ధరలు పెరుగుతున్నాయి. – వెంకటేశ్వరరెడ్డి, ఉన్నతశ్రేణి యార్డు సెక్రటరీ, గుంటూరు -
తక్షణమే మిర్చి కొనుగోళ్లు చేపట్టాలి: జగన్
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రభుత్వరంగ సంస్థ అయిన మార్క్‌ఫెడ్ ద్వారా మిర్చి పంటకు మద్దతు ధర ప్రకటించి తక్షణమే కొనుగోళ్లు చేప ట్టాలని వైస్సార్ కాంగెస్ పార్టీ అధ్యక్షుడు, శాసనసభా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. మిర్చి ధరలు భారీగా పత నం అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటం దారుణమని వ్యాఖ్యా నించారు. ఎన్నికల సమయంలో రూ.5000 కోట్ల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని ఎందుకు అమలుచేయరంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయన శుక్రవారం ఉదయం గుంటూరు మిర్చి యార్డులో రైతులతో ముఖాముఖి నిర్వహించి, వారి సాధకబాధకాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులనుద్దేశించి మాట్లాడారు. -
పత్తి, మిర్చి ధరలు పైపైకి
ఖమ్మం వ్యవసాయం : పత్తి, మిర్చి ధరలు క్రమేణా పెరుగుతున్నాయి. క్వింటాలు పత్తి ధర రూ.5 వేలకు చేరుకుంది. మిర్చి కోల్డ్ స్టోరేజీలో నిల్వ(ఏసీ) ఉంచిన సరుకు ధర రూ.9,500, రైతులు ఇళ్లలో నిల్వ ఉంచుకొని అమ్మకానికి తెచ్చే సరుకు ధర రూ.8,400 వరకు పలుకుతోంది. ప్రస్తుతం వ్యవసాయ ఉత్పత్తులు లేకపోవడం, వర్షాబావ పరిస్థితులు నెలకొనడంతో ఈ పంట ఉత్పత్తులకు ధర పెరుగుతోందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది ప్రభుత్వం పత్తి మద్దతు ధర రూ.4వేలుగా ప్రకటించారు. అక్టోబర్ నుంచి పత్తి అమ్మకానికి వచ్చింది. అక్టోబర్ తొలి రోజుల్లో క్వింటాలు పత్తి ధర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర వరకు మార్కెట్లలో వ్యాపారులు కొనుగోలు చేశారు. అయితే.. ఆ సమయంలో సరుకు తక్కువగా అమ్మకానికి వచ్చింది. అక్టోబర్ చివరి వారంలో ఆరు రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. దీంతో చేతికందిన పత్తి తడిసింది. రంగు మారిందని, నాణ్యత లేదనే సాకుతో రూ.2,300 నుంచి రూ.2,700 వరకు మాత్రమే కొనుగోలు చేశారు. వర్షం కారణంగా పంట ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. ఆ తర్వాత కూడా రెండు మూడు సార్లు వర్షాలు కురిశాయి. దీంతో పంట నాణ్యత లేదని జనవరి, ఫిబ్రవరి వరకు కూడా రూ.3 వేల వరకు మాత్రమే కొనుగోలు చేశారు. ఈ ధరలకు పంట ఉత్పత్తిని అమ్మకాలు చేయని రైతులు ఇళ్లలో, గోదాముల్లో సరుకును నిల్వ చేశారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో వేసిన పత్తి మొలకెత్త లేదు. ఈ పరిస్థితులను గుర్తించిన జిన్నింగ్ మిల్లుల యజమానులు పత్తి కొనుగోళ్లకు ఆసక్తి కనబరుస్తున్నారు. గత ఏడాది పండించిన పత్తిని కొనుగోలు చేసి, జిన్నింగ్ చేసి బేళ్లను నిల్వబెట్టే పనిలో ఉన్నారు. దీంతో పాటు కాటన్ ఆయిల్‌కు కూడా డిమాండ్ పెరిగింది. దీంతో పత్తి ధర రూ.5 వేలకు పలుకుతోందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఖమ్మం మార్కెట్‌కు 2 వేల నుంచి 4 వేల బస్తాల పత్తి అమ్మకానికి వస్తోంది. రైతులు నిల్వ ఉంచుకున్న పత్తిని అమ్మకానికి తెస్తున్నారు. పత్తిలో తేమ ఉంటే రూ.4,700 వరకు కొనుగోలు చేస్తున్నారు. మిర్చి ధర కూడా సీజన్‌తో పోలిస్తూ బాగానే పెరిగింది. జనవరి నుంచి మార్చి వరకు మిర్చి పంట ఉత్పత్తి బాగా ఉన్న సీజన్లో క్వింటాలు ధర రూ.5 వేల నుంచి రూ.6,500 వరకు పలికింది. మిర్చి సాగుకు పెట్టుబడులు పెరగడంతో అప్పటి రేట్లు గిట్టుబాటుగాక కొందరు రైతులు సరుకును కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేశారు. వ్యాపారులు సీజన్లో తక్కువ ధరలకు సరుకును కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజీల్లో పెట్టారు. ఈ సరుకును ప్రస్తుతం క్వింటాలుకు రూ.9,500 వరకు అమ్మకాలు చేస్తున్నారు. రైతులు ఇళ్లలో నిల్వ ఉంచిన సరుకును క్వింటాలుకు రూ.8,500 వరకు విక్రయిస్తున్నారు. జిల్లాలో సుమారు 30 కోల్డ్ స్టోరేజీలు ఉండగా వీటిలో 24.50 లక్షల క్వింటాళ్ల మిర్చి నిల్వలు ఉన్నాయని మార్కెటింగ్ శాఖకు చెందిన అధికారులు చెబుతున్నారు. ఈ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యాపార వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక్కడ పండించే తేజా రకం కారానికి మలేషియాలో అధిక గిరాకీ ఉంటుందని కూడా వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న ధర కన్నా మరో వెయ్యి రూపాయలు మరి కొద్ది రోజుల్లో పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు వ్యాపారులు చర్చించుకుంటున్నారు. సరుకు నిల్వ పెట్టుకున్న రైతులకు, వ్యాపారులకు ఈ ధరలు కలిసి వచ్చే అవకాశం ఉంది. -
ఘాటు తగ్గిన మిరప
ఆళ్లగడ్డ, న్యూస్‌లైన్: నెల క్రితం వరకు మంచి ఓ మోస్తరుగా ఉన్న మిరపకాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. తీరా పంట చేతికొచ్చే సమయంలో ధరలు అమాంతం పడిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. అధిక వర్షాలు, తెగుళ్ల బెడదతో దిగుబడి తగ్గడంతో పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పరిధిలోని చాగలమర్రి, ఆళ్లగడ్డ, రుద్రవరం, శిరివెళ్ల మండలాల్లో దాదాపు ఐదు వేల ఎకరాల్లో రైతులు మిరప సాగు చేశారు. గతేడాది మిరపకాయలు క్వింటా రూ. 4వేల నుంచి రూ. 4,500 వరకు ధర పలికాయి. ఖరీఫ్‌లో క్వింటా రూ. 10 వేలకు పైగానే పలికింది. దీంతో రైతులు ఎక్కువ విస్తీర్ణంలో మిరప సాగు చేశారు. ఫిబ్రవరిలో గుంటూరు మార్కెట్లో ఇదే ధర ఉన్నట్లు నల్లగట్ల గ్రామానికి చెందిన రైతు విజయ్ న్యూస్‌లైన్‌కు తెలిపారు. ప్రస్తుతం మిరప కోతలు పూర్తికావడం తో రైతులు అమ్మకానికి సిద్ధం చేశారు. తీరా పంట చేతికొచ్చాక మిరపకాయల ధరలు తగ్గుముఖం పడుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉందని, అధిక వర్షాలు, తెగుళ్లతో ఎకరాకు 15 నుంచి 17 క్వింటాళ్లలోపు మాత్రమే దిగుబడి వచ్చిందని గూబగుండం గ్రామానికి చెందిన రైతు సుబ్బారెడ్డి వాపోయాడు. ప్రస్తుతం మిరపకాయ ధరలు క్వింటా రూ. 4,500 లోపు మాత్రమే ఉండటంతో తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ. 70వేల నుంచి రూ. 80వేల వరకు పెట్టుబడులు పెట్టినట్లు రైతులు తెలిపారు. ఎకరాకు 15 క్వింటాళ్ల దిగుబడి వస్తే పెట్టుబడులు మాత్రమే చేతికి వస్తాయని, అంతకు తగ్గితే నష్టం వస్తుందని రైతులు వాపోతున్నారు.