గత ఏడాది ఇదే సమయానికి క్వింటాల్ ధర రూ.26,500
ఈ ఏడాది రూ.20,700 మిర్చి రైతుల్లో ఆందోళన
ఇంకా ప్రారంభం కాని ఎగుమతులు
కోల్డ్ స్టోరేజీలలో 75 లక్షల బస్తాలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: మిర్చి ధరలు తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది మే చివరి నాటికి క్వింటాల్ మిర్చి కనీస ధర రూ.9 వేలు, గరిష్ట ధర రూ.26,500 ఉండగా.. ఈ ఏడాది కనీస ధర రూ.8 వేలు, గరిష్ట ధర 20,700 పలుకుతోంది. ప్రస్తుతం తేజ మంచి రకానికి రూ.19,500 మాత్రమే అత్యధిక ధర లభిస్తోంది. మిగిలిన అన్నిరకాల మిర్చి ధరలు గణనీయంగా తగ్గాయి.
మరోవైపు ఎగుమతులు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోవడంతో కోల్డ్ స్టోరేజీలలో 75 లక్షల మిర్చి బస్తాలు నిల్వ ఉండిపోయాయి. ధరలు తగ్గడంతో మిర్చి రైతుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు ఎగుమతులు ఎప్పుడు ప్రారంభమవుతాయో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇంకోవైపు వర్షాలు ప్రారంభం కావడంతో మిరప నాట్లు వేసేందుకు రైతులు సన్నద్ధం అవుతున్నారు.
ఎగుమతుల్లో ఏపీదే మొదటి స్థానం
2022–23 సంవత్పరంలో రికార్డు స్థాయిలో రూ.10,440 కోట్ల విలువైన మిర్చి విదేశాలకు ఎగుమతులయ్యాయి. మిర్చి ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. దీంతో రెండేళ్లుగా రైతులు మిర్చి పంట వేయడంపైనే దృష్టి పెడుతున్నారు. మరోవైపు కర్ణాటకలోనూ మిర్చి దిగుబడి ఎక్కువగా రావడంతో అక్కడ కోల్డ్ స్టోరేజీలు సరిపోక ఏపీకి తీసుకొచ్చి నిల్వ చేస్తున్నారు.
గుంటూరు పరిసర ప్రాంతాల్లో 100 వరకూ కోల్డ్‌స్టోరేజీలు ఉండగా.. 3.21 లక్షల టన్నులకు పైగా మిర్చిని నిల్వ చేశారు. ఇందులో 2.71 లక్షల మెట్రిక్ టన్నుల సరుకు రైతులది కాగా.. 52 వేల మెట్రిక్ టన్నుల సరుకు వ్యాపారులది. ఇవికాకుండా పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఉన్న కోల్డ్ స్టోరేజీలలో మొత్తం 75 లక్షల బస్తాల ( బస్తా 40 కిలోలు) సరుకు నిల్వ ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఉత్పత్తి గణనీయంగా రావడం వల్ల ధర రోజురోజుకీ తగ్గుతుండటం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది.
20 దేశాలకు ఎగుమతి
మన దేశం నుంచి సుమారు 20 దేశాలకు మిర్చి ఎగుమతి అవుతోంది. ముఖ్యంగా చైనా, శ్రీలంక, మలేసియా, థాయ్‌లాండ్, స్పెయిన్, అమెరికా, ఇంగ్లాండ్, నేపాల్, నెదర్లాండ్స్, నైజీరియా, ఇండోనేషియా, బంగ్లాదేశ్ తదితర దేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. ఆయా దేశాలకు కారం, విత్త నాలను సైతం ఎగుమతి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment