సాక్షి, అమరావతి బ్యూరో: మిర్చి రైతులకు ఈ ఏడాది కాసుల వర్షం కురుస్తోంది. కరోనా నేసథ్యంలో కొన్నిరకాల పంట ఉత్పత్తుల ధరలు తగ్గినా, మిర్చి ధరలు మాత్రం ఆశాజనకంగా ఉన్నాయి. విదేశాలకు ఆర్డర్లు భారీగా ఉండటంతో ధరలు పెరిగాయి. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకున్న రైతులకు లబ్ధిచేకూరింది. గుంటూరు మార్కెట్‌లో మంగళవారం తేజ రకం మిర్చి క్వింటాల్ రూ.19,500 పలికింది. మిర్చి దిగుబడి వచ్చే సమయానికి కరోనా వ్యాప్తి చెందటంతో గుంటూరు మార్కెట్ యార్డులో లావాదేవీలు నిలిచిపోయాయి. దీంతో రైతులు మిర్చిని కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వ చేసుకున్నారు. గుంటూరు జిల్లాలో 118 కోల్డ్‌స్టోరేజీల్లో కోటి బస్తాలకు పైగా మిర్చిని నిల్వచేశారు. ఇంకా 25 లక్షలకు పైగా మిర్చి బస్తాలు కోల్డ్‌స్టోరేజీల్లో ఉన్నాయి. గత నెలతో పోలిస్తే మిర్చి ధర క్వింటాలుకు సగటున రూ.2000కు పైగా పెరిగింది. విదేశాలకు ఎగుమతి ఆర్డర్లు గణనీయంగా పెరగడంతోపాటు మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలకు మిర్చి పంట దెబ్బతింది. ఆ రాష్ట్రాల్లో దిగుబడి కూడా ఆలస్యం అయింది. బంగ్లాదేశ్, చైనా దేశాల్లో తేజ రకం మిర్చికి, మలేసియాలో సీజెంటా బాడిగ రకం మిర్చికి గిరాకీ ఉంది. శ్రీలంకకు 334 రకం మిర్చి ఆర్డర్లు ఉన్నాయి. ఇండొనేషియా, థాయ్‌లాండ్, సింగపూర్ వంటి దేశాలకు కూడా మిర్చి ఎగుమతి అవుతోంది. దేశంలోని పలు రాష్ట్రాలకు కూడా ఇక్కడి నుంచి సరఫరా అవుతుండటంతో ధరలు పెరిగి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మార్కెట్‌లో పెరిగిన క్రయవిక్రయాలు
కరోనా సమయంలో గుంటూరు మార్కెట్‌లో రోజుకు 10 వేల బస్తాలలోపు మాత్రమే అమ్మకాలు జరిగేవి. ప్రస్తుతం మార్కెట్ యార్డులో 25 వేల బస్తాలకుపైగా అమ్మకాలు జరుగుతున్నాయి. కొత్త సరుకు జనవరి వరకు వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వ ఉంచుకున్న మిర్చిని రైతులు అమ్ముకుంటున్నారు. పత్తి ధరలు పతనం కావడం, గులాబీరంగు పురుగు నేపథ్యంలో పత్తి సాగు విస్తీర్ణం తగ్గింది. మిర్చి ధరలు ఆశించిన స్థాయిలో ఉండటం, సాగునీటికి సైతం ఢోకా లేకపోవడంతో ఈ ఏడాది మిర్చి సాగు విస్తీర్ణం పెరుగుతుందని వ్యవసాయరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి
ఈ ఏడాది మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. తేజ రకం మిర్చి ధర క్వింటాలు రూ.19,500 పలికింది. కరోనా నేపథ్యంలో ఎక్కువ మంది రైతులు మిర్చిని కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వ చేసుకున్నారు. ధరలు పెరగడంతో వారికి లబ్ధికలుగుతోంది. యార్డుల్లో మిర్చి క్రయవిక్రయాలు పెరిగాయి. విదేశీ ఎగుమతులకు ఆర్డర్లు రావడంతో మిర్చి ధరలు పెరుగుతున్నాయి. – వెంకటేశ్వరరెడ్డి, ఉన్నతశ్రేణి యార్డు సెక్రటరీ, గుంటూరు
Comments
Please login to add a commentAdd a comment