![Death By Debt Mirchi Farmer Drinks Pesticide In Warangal - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/16/WGL.jpg.webp?itok=WEtxqguF)
మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు
టేకుమట్ల: ఎన్నో ఆశలతో వేసిన మిర్చి పంటకు తెగులు సోకింది. తెచ్చిన అప్పులు మీద పడటంతో ఓ రైతు ఆ చేనులోనే పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా, టేకుమట్ల మండలం సుబ్బక్కపల్లిలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సిద్దూరి రవీందర్‌రావు (52) అనే రైతు గత ఏడాది తనకున్న రెండున్నరెకరాల భూమితోపాటు, మరో రెండెకరాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశాడు. దిగుబడులు రాకపోవడంతో రూ.8 లక్షల మేర అప్పు అలానే ఉండిపోయింది. ఈ సంవత్సరం తనకున్న రెండున్నరెకరాల్లో మిర్చి సాగు చేయగా కొన్ని రోజులుగా కుచ్చు తెగులు, తామర పురుగుతో పంట మొత్తం ఎదుగుదల లోపించింది.
ఈ పంట కోసం లక్షల్లో పెట్టుబడి పెట్టినా ఫలితం లేకపోగా, మరిన్ని అప్పులు పెరగడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి మిర్చి చేనులోకి వెళ్లి పురుగు మందు తాగాడు. తాను చనిపోతున్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే కుటుంబ సభ్యులు చేను వద్దకు చేరుకుని పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ వినయ్‌కుమార్ పంచనామా చేసి మృతదేహాన్ని చిట్యాల మార్చురీకి పంపించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
చదవండి: కేవలం వారాల వ్యవధిలోనే శర వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి: సీడీసీ హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment