pests prevention
-
'ప్రకృతి' పద్ధతిలో చీడపీడల యాజమాన్యం మేలు!
సాక్షి, హైదరాబాద్: వాతావరణ మార్పుల నేపథ్యంలో మెట్ట పంటల సాగును తక్షణమే ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోకి మార్చుకోవటం అత్యవసరమని పులివెందులలోని ఇండో–జర్మన్ ఆగ్రోఎకాలజీ అకాడమీ సీనియర్ కన్సల్టెంట్, జాతీయ నూనెగింజల పరిశోధనా సంస్థ పూర్వ సంచాలకులు డాక్టర్ కె.ఎస్. వరప్రసాద్ అన్నారు. వర్షాధార ప్రాంతాల పొలాలకు సాగు నీటి సదుపాయం కల్పించటం కన్నా సాగు పద్ధతిని ప్రకృతికి అనుగుణంగా సమూలంగా మార్చటం అవశ్యమని, ఆయన శనివారం నొక్కిచెప్పారు. పంటల ఆరోగ్య యాజమాన్యం– నవ్యత, సుస్థిరత అనే అంశంపై రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నాలుగు రోజులుగా జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు శనివారం ముగిసింది. ఈ సదస్సులో డా. వరప్రసాద్ ఆసియా పసిపిక్ ప్రాంతంలో సుస్థిర చీడపీడల యాజమాన్యంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అనే అంశంపై ప్రసంగించారు. చీడపీడల యాజమాన్య పద్ధతులను పంటల వారీగా, పురుగుల వారీగా, తెగుళ్ల వారీగా వేర్వేరుగా చూస్తూ వేర్వేరు పరిష్కారాలను వెతకటం కన్నా.. స్థానిక వంగడాల జీవవైవిధ్యంతో కూడిన ప్రకృతి వ్యవసాయం ద్వారా వ్యవస్థాగత పరిష్కారం వెతకడమే మేలన్నారు. ఈ మేరకు నవీనీకరించిన సమీకృత సస్యరక్షణ సూత్రాలను అనుసరించాలని ఆయన సూచించారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో కలసి వాసన్ సంస్థ మన దేశంలోని వర్షాధార ప్రాంతాల్లో సంప్రదాయ సాగు పద్ధతులపై నిర్వహించిన అధ్యయనంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయ అనుభవాలు కూడా ఈ విషయాన్ని ధృవపరుస్తున్నాయన్నారు. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ తెగుళ్ల శాస్త్రవేత్త డాక్టర్ పప్పు హనుమంతరావు రసాయనిక వ్యవసాయ దృష్టికి అతీతంగా ఈ ఫలితాలను శాస్త్రవేత్తలు గమనించాలని సూచించారు. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని వర్షాధార ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయ ఫలితాలు కొత్త పాఠాలు నేర్పుతున్నాయని, అంతర్జాతీయ బృందాలు ఈ నెల 26–29 తేదీల్లో ఏపీలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నాయని డా. వరప్రసాద్ తెలిపారు. స్థానిక ప్రకృతి వ్యవసాయదారుల అనుభవాల ఆధారంగా శాస్త్రవేత్తలు సాగు పద్ధతుల నుంచి చీడపీడల యాజమాన్యం వరకు ఉన్న అంశాలను సరికొత్త దృష్టితో, ముఖ్యంగా వర్షాధార వ్యవసాయం విషయంలో, పరిశీలించాల్సిన తరుణం ఆసన్నమైందని డా. వరప్రసాద్ తెలిపారు. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ తెగుళ్ల శాస్త్రవేత్త డాక్టర్ పప్పు హనుమంతరావు జీనోమ్ ఎడిటింగ్(జన్యు సవరణ) వంటి అత్యాధునిక సాంకేతికతల ద్వారా చీడపీడల యాజమాన్యంలో ప్రతిబంధకాలను అధిగమించవచ్చని, అనేక పంటలకు సంబంధించి పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. జన్యు మార్పిడి సాంకేతికతపై మాదిరిగా జన్యు సవరణ సాంకేతికతపై అభ్యంతరాలు లేవన్నారు. పిజెటిఎస్ఎయు కీటక శాస్త్ర నిపుణుడు డా. ఎస్.జె. రహమాన్ ప్రసంగిస్తూ జీవన పురుగుమందులను క్షేత్రస్థాయిలో పునరుత్పత్తి చేసుకునే క్రమంలో నాణ్యతా ప్రమాణాలను పాటించటంలో ఖచ్చితత్వం కొరవడితే వ్యాధి కారక క్రిములతో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మార్కెట్లో నకిలీ పంచగవ్య వంటి ద్రావణాలను అధిక ధరలకు విక్రయిస్తున్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని, నియంత్రణ యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు. సుస్థిర వ్యవసాయాభివృద్ధే లక్ష్యం: సుస్థిర వ్యవసాయాభివృద్ధి లక్ష్యంగా పరిశోధనలకు శ్రీకారం చుట్టాలని, రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యంతో ప్రధాని మోదీ శాస్త్రవేత్తలకు ఈ మేరకు దిశానిర్దేశం చేశారని ఐసిఎఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డా. ఉదమ్ సింగ్ గౌతమ్ అన్నారు. పంటల ఆరోగ్య యాజమాన్యం– నవ్యత, సుస్థిరత అనే అంశంపై నాలుగు రోజులుగా జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు ముగింపు సభలో శనివారం సాయంత్రం ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. పిపిఎఐ అధ్యక్షులు డా. బి. శరత్‌బాబు, అటారి డైరెక్టర్ డా. షేక్ మీరా తదితరులు పాల్గొన్నారు. ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్వర్ణోత్సవాల సందర్భంగా వెటరన్ శాస్త్రవేత్తలు డా. కృష్ణయ్య, డా. వరప్రసాద్‌లకు జీవన సాఫల్య పురస్కారాలను ప్రదానం చేశారు. (చదవండి: మంచి వ్యవసాయం పద్ధతులే మేలు! ఐసిఎఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పిలుపు) -
ప్రకృతి సాగే పరిష్కారం!
మనం ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలను ఆరోగ్యంగా ఉంచాలి. 98% ప్రాణవాయువును మొక్కలే ఇస్తున్నాయి. 80% ఆహారం పంటల ద్వారానే వస్తోంది. భూతాపోన్నతి కారణంగా విజృంభిస్తున్న పురుగులు, తెగుళ్ల వల్ల దిగుబడి 40% మేరకు దెబ్బతింటున్నది. ఈ నష్టం విలువ ఏడాదికి 22,000 కోట్ల డాలర్లని ఎఫ్.ఎ.ఓ. లెక్కగట్టింది. మన దేశంలో కత్తెర పురుగు, నల్ల తామర పురుగు, రుగోస్ తెల్లదోమ.. వంటివి ఇందుకు ఉదాహరణలు. అయితే, పొలాలు, పర్యావరణ వ్యవస్థలకున్న ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యంపై ఈ నష్టం తీవ్రత ఆధారపడి ఉంటుందని ఎఫ్.ఎ.ఓ. స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో.. సాగు పద్ధతి మార్చుకుంటే వీటి తీవ్రత తగ్గినట్లు ఏపీ రైతు సాధికార సంస్థ అధ్యయనంలో తేలింది. రసాయనిక వ్యవసాయంలో పురుగుల తీవ్రత, దిగుబడి నష్టం 50 శాతం పైగా ఉంటే.. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో 10% మాత్రమే. ప్రధాన పంట సాగుకు ముందు 30 రకాల పచ్చిరొట్ట (నవధాన్య) పంటలు సాగు చేసే రైతుల జీవవైవిధ్య క్షేత్రాల్లో ఒక్కో ఏడాది గడిచేకొద్దీ చీడపీడల బెడద అంతకంతకూ తగ్గుతోందని కూడా ఈ అధ్యయనం చెబుతోంది. ఈ నెల 12న ‘అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక కథనం. మన దేశంలో ఇటీవల సంవత్సరాల్లో పంటలకు పెను నష్టం కలుగజేస్తున్న కత్తెర పురుగు, నల్ల తామర పురుగు, రుగోస్ తెల్లదోమ.. వంటి పురుగులే ఇందుకు ఉదాహరణలు. రసాయనిక వ్యవసాయం చేసే రైతులకు ఈ పురుగులు తీవ్ర నష్టం కలిగిస్తుండగా, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించే రైతుల పొలాల్లో ఈ పురుగుల తీవ్రత, నష్టం చాలా తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయాన్ని అమలుచేస్తున్న రైతు సాధికార సంస్థ అధ్యయన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. 30 రకాల పచ్చిరొట్ట పంటలు వేసిన తర్వాత ఆహార/వాణిజ్య పంటలు సాగు చేయటంయటం వల్ల వాతావరణ మార్పులను, చీడపీడలను తట్టుకొని నిలబడి మంచి దిగుబడులను ఇచ్చే శక్తి ప్రకృతి సేద్య క్షేత్రాలకు పెరుగుతున్నట్లు అర్థం అవుతున్నది. రైతులు వచ్చే ఖరీఫ్‌లో సాగు చేసే ప్రధాన పంటకు చీడపీడల బెడద తక్కువగా ఉండాలన్నా, భూసారం పెరగాలన్నా.. ఇప్పుడే పచ్చిరొట్ట పంటలు సాగు చేయాలి. ఏ జనుమో, జీలుగో వేస్తే చాలదు.. ముప్పై పంటల విత్తనాలను చల్లేయాలి అంటున్నది ఏపీ రైతు సాధికార సంస్థ. మిత్ర పురుగులే రైతుల సైన్యం ప్రకృతి సేద్యం దిగుబడి సాధించటంతో పాటు అనేక ఇతర ప్రయోజనాలు కూడా నెరవేరుతున్నాయి. జీవవైవిధ్యం. ఒకే పంట వేయటం కాదు. అనేక పంటలు కలిపి సాగు చేయటం అనేది ప్రకృతి సేద్యంలో ఓ ముఖ్యమైన మూలసూత్రం. బహుళ పంటలు ఉన్న పొలంలో పురుగులు గానీ, తెగుళ్లుగానీ అదుపులో ఉంటాయి. రకరకాల పంటలున్న చేనులో అనేక రకాల మిత్ర పురుగులు మనుగడ సాధ్యపడుతుంది. రసాయనిక పురుగుమందులు వాడే పొలాల్లో శత్రు పురుగులతో పాటు ఈ మిత్ర పురుగులు కూడా నాశనమవుతాయి. కాబట్టి, చీడపీడలు ఉధృతం అవుతున్నాయి. ప్రకృతి వ్యవసాయంలో మిత్ర పురుగులే రైతుల సైన్యం. ప్రకృతి సేద్యం చేయటంతోపాటు.. ఏడాది పొడవునా ఇటువంటి బహుళ పంటలతో భూమిని కప్పి ఉంచితే (365 డేస్ గ్రీన్ కవర్) ఇంకా మంచిది. ఈ పద్ధతులు పాటించే ప్రకృతి సేద్య క్షేత్రాల్లో చీడపీడల సమస్య చాలా తక్కువగా కనిపిస్తోందని ఏపీ రైతు సాధికార సంస్థ తెలిపింది. ముఖ్యంగా, కత్తెర పురుగు, నల్లతామర వంటి పురుగుల విషయంలో ఇది ప్రస్ఫుటంగా నమోదైంది. 90% తగ్గిన కత్తెర పురుగు విజయనగరం, ప.గో., గుంటూరు జిల్లాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్న 49 ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు, మరో 49 రసాయనిక వ్యవసాయ క్షేత్రాల్లో కత్తెర పురుగు తీవ్రతపై ఏపీ రైతు సాధికార సంస్థ అధ్యయనం చేసింది. కత్తెర పురుగు తీవ్రత పురుగుమందులు చల్లిన పొలాల్లో 5% మాత్రమే తగ్గితే, ప్రకృతి సేద్య పొలాల్లో 90% తగ్గిందని ఈ అధ్యయనంలో తేలింది. నల్ల తామర: ఇక్కడ 9.87% అక్కడ 57% లక్షల ఎకరాల్లో మిరప పంటకు గతంలో నష్టం కలిగింది. రసాయనిక పురుగుమందులు ఎన్ని వాడినా నల్లతామర తగ్గలేదు. కానీ ప్రకృతి వ్యవసాయంలో నియంత్రణలోకి వచ్చింది. ఏపీ రైతుసాధికార సంస్థ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లోని 70 ప్రకృతి వ్యవసాయ మిరప తోటల్లో, 73 రసాయనిక మిరప తోటల్లో అధ్యయనం చేసింది. నల్లతామర కలిగించిన నష్టం ప్రకృతి సేద్య మిరప పొలాల్లో 9.87% కాగా, రసాయనిక మిరప పొలాల్లో 57.53% వరకు ఉందని గుర్తించారు. ప్రకృతిసేద్యం చేస్తున్న మిరప పొలాల్లో అక్షింతల పురుగులు, క్రైసోపెర్ల అనే రెక్కల పురుగులు వంటి మిత్ర పురుగులు విస్తారంగా నల్లతామర పురుగుల్ని తింటూ నియంత్రించినట్లు కనుగొన్నారు. రసాయనిక పురుగుమందులు చల్లే మిరప పొలాల్లో ఇవి కనిపించలేదు. పంటలకొద్దీ మిత్రపురుగులు పీఎండీఎస్లో నవధాన్య పంటలుగా ఎన్ని ఎక్కువ పంటలు సాగు చేస్తే ఆ తర్వాత సీజన్లో మిత్రపురుగుల సంఖ్య ఎక్కువగా ఉండి చీడపీడల బెడద తగ్గినట్లు రైతు సాధికార సంస్థ గుర్తించింది. వేర్వేరు జిల్లాల్లో కొన్ని పొలాల్లో 27 రకాలు, మరికొన్ని పొలాల్లో 19 రకాలు, ఇంకొన్ని పొలాల్లో 9 రకాల నవధాన్య పంటలను సాగు చేయించారు. 9,19 రకాలు సాగు చేసిన పొలాల్లో కన్నా 27 రకాలు సాగు చేసిన పొలాల్లో మిత్ర పురుగుల సంఖ్య అత్యధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఎన్ని ఎక్కువ పంటలు సాగు చేస్తే అన్ని ఎక్కువ మిత్రపురుగులుంటాయి. పీఎండీఎస్‌తో తగ్గుతున్న చీడపీడల తీవ్రత ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో భాగంగా వానకు ముందే 30 రకాల ఆహార ధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు తదితర పంటల విత్తనాలను (ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్– పీఎండీఎస్) వానకు ముందే విత్తితే.. భూమి సారవంతం అవుతుంది. భూమి తేమగా ఉంటే నేరుగా విత్తనాలు వేస్తున్నారు. తేమ లేకపోతే విత్తనాలకు మట్టి, ఘనజీవామృతం తదితరాలను పట్టించి ‘విత్తన గుళికలు’ (సీడ్ పెల్లెట్స్) తయారు చేసి వేసవిలోనే వానకు ముందే విత్తుతున్నారు. ఇది ఏపీలో ముఖ్యంగా అనంతపురం జిల్లా కేంద్రంగా ప్రకృతి వ్యవసాయదారులు అనుసరిస్తున్న వినూత్న ఆవిష్కరణ. ఈ ఏడాది ఇతర జిల్లాల్లో కూడా ఈ పద్ధతిని రైతులకు ఆర్బీకేల ద్వారా కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు పరిచయం చేస్తున్నారు. వరుసగా రెండేళ్లు, అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు వేసవిలో 30 రకాల పీఎండీఎస్ పంటలు పండించిన పొలాల్లో ఆ తర్వాత సీజన్లో సాగు చేసిన 123 క్షేత్రాల్లో చీడపీడల బెడదపై అధ్యయనం చేశారు. మూడేళ్లుగా వేసవిలో పీఎండీఎస్ పంటలు సాగు చేసిన పొలాల్లో అన్ని రకాల చీడపీడల బెడద రసాయనిక పొలాలతో పోల్చినప్పుడు 66 శాతం తగ్గిపోయినట్లు గుర్తించటం విశేషం. రైతు దేవుళ్ల చేతుల్లోనే భవిత! 50–60 ఏళ్ల విషపూరిత వ్యవసాయం వల్ల మన భూములు, వాతావరణం, గాలి, నీరు నాశనమయ్యాయి. క్లైమెట్ ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి. ఆరో ప్రళయం రాబోతోంది. పోషకార/ఆహార భద్రతకూ ముప్పు రానుంది. దీని నుంచి రక్షించగల శక్తి ఒక్క రైతు చేతులోనే ఉంది. రసాయనిక వ్యవసాయం వల్ల వెలువడే కర్బన ఉద్గారాలను తగ్గించడంతో పాటు యావత్తు భూగోళాన్ని చల్లబరిచే శక్తి కూడా ప్రకృతి/పునరజ్జీవ వ్యవసాయానికి ఉంది. రసాయనాలు వాడకుండా పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేయటంతో పాటు.. 30 రకాల నవధాన్య (పీఎండీఎస్) పంటల సాగును వేసవిలో, పంట సీజన్లకు మధ్యలో ప్రతి పొలంలోనూ సాగు చేయాలి. ఇన్ని పంటలు ఎందుకంటే ప్రతి పంట మొక్క వేర్ల దగ్గర వేర్వేరు రకాల మేలు చేసే సూక్ష్మజీవరాశి పెరుగుతోంది. ఎన్ని ఎక్కువ పంటలు వేస్తే అన్ని ఎక్కువ రకాల సూక్ష్మజీవరాశి తిరిగి భూమిలోకి చేరుతున్నది. మట్టిలో సూక్ష్మజీవుల వైవిధ్యం ఎంత ఎక్కువగా ఉంటే మన భూమి అంత సారవంతమవుతోంది. అంత శక్తివంతమవుతోంది. అంతగా చీడపీడల బెడద తగ్గుతుంది. కరువును, ప్రతికూల పరిస్థితులను తట్టుకొని నిలబడి 20–30% అధిక దిగుబడులు వస్తున్నాయి. ప్రతి పొలంలో పీఎండీఎస్ పంటలు సాగు చేయాలి. వాన నీరు పూర్తిగా పొలాల్లో ఎక్కడికక్కడే పూర్తిగా ఇంకుతుంది. ఇది అనంతపురం రైతు దేవుళ్ల అద్భుత ఆవిష్కరణ. ఈ ఏడాది ఏపీలో ఇతర జిల్లాల్లో కూడా దీన్ని అమలు చేస్తున్నాం. 10 వేల మంది రైతులను మాస్టర్ ట్రైనర్లుగా తీర్చిదిద్దాలనేది లక్ష్యం. అనేక ఇతర రాష్ట్రాలతో పాటు ప్రపంచ దేశాలు కూడా మన వైపు చూస్తున్నాయి. – టి. విజయకుమార్, ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ, కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ చిరుధాన్యాల శుద్ధి, విలువ జోడింపు, మార్కెటింగ్‌పై ఈ నెల 18–19 తేదీల్లో పులివెందులలోని ఫుడ్‌సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీ ఆవరణలో ఔత్సాహికులకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ (ఐఐపిఎం) శిక్షణ ఇవ్వనుందని లైవ్లిహుడ్ ఇంక్యుబేషన్ సెంటర్ కోర్సు డైరెక్టర్ డా. నబీరసూల్ తెలిపారు. ఎఫ్.పి.ఓలు, వ్యవసాయ, ఉద్యాన అధికారులు, చిరుధాన్యాల వ్యాపారులు, గ్రామీణ యువతకు ఇది ఉపయోగకరం. భోజన వసతి సదుపాయాలు ఉన్నాయి. ఫీజు రూ. 5 వేలు. వివరాలకు.. డా. నబీరసూల్ – 630297 72210 -పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
నమ్మిన చేలోనే ‘రుణం’ తీరిపోయె..
టేకుమట్ల: ఎన్నో ఆశలతో వేసిన మిర్చి పంటకు తెగులు సోకింది. తెచ్చిన అప్పులు మీద పడటంతో ఓ రైతు ఆ చేనులోనే పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా, టేకుమట్ల మండలం సుబ్బక్కపల్లిలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సిద్దూరి రవీందర్రావు (52) అనే రైతు గత ఏడాది తనకున్న రెండున్నరెకరాల భూమితోపాటు, మరో రెండెకరాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశాడు. దిగుబడులు రాకపోవడంతో రూ.8 లక్షల మేర అప్పు అలానే ఉండిపోయింది. ఈ సంవత్సరం తనకున్న రెండున్నరెకరాల్లో మిర్చి సాగు చేయగా కొన్ని రోజులుగా కుచ్చు తెగులు, తామర పురుగుతో పంట మొత్తం ఎదుగుదల లోపించింది. ఈ పంట కోసం లక్షల్లో పెట్టుబడి పెట్టినా ఫలితం లేకపోగా, మరిన్ని అప్పులు పెరగడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి మిర్చి చేనులోకి వెళ్లి పురుగు మందు తాగాడు. తాను చనిపోతున్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే కుటుంబ సభ్యులు చేను వద్దకు చేరుకుని పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్ఐ వినయ్‌కుమార్ పంచనామా చేసి మృతదేహాన్ని చిట్యాల మార్చురీకి పంపించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: కేవలం వారాల వ్యవధిలోనే శర వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి: సీడీసీ హెచ్చరిక -
పూల తోటల్ని గట్టెక్కించుకోండిలా!
సాక్షి, అమరావతి: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలో పూల తోటలు దెబ్బతిన్నట్టు ఉద్యాన శాఖ గుర్తించింది. ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని పూల తోటల్లో ఇప్పటికీ నీళ్లు నిలిచి ఉండటంతో మల్లె, బంతి, గులాబీ తోటలను చీడపీడలు ఆశిస్తున్నాయి. అధిక తేమ కారణంగా తెగుళ్లు ప్రబలుతున్నాయి. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో పూల రైతులు చేపట్టాల్సిన సంరక్షణ చర్యలపై వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా అనంతరాజు పేటలో గల రైతు సలహా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్.నాగరాజు ఈ దిగువ సూచనలు, సలహాలు ఇచ్చారు. నీటిని తొలగించండి.. తేమను తగ్గించండి పూల తోటల్లో ఎక్కువ నీరు నిలిచి ఉండటం వల్ల చీడపీడల ఉధృతి పెరుగుతుంది. వేర్లు కుళ్లి మొక్కలు చనిపోతాయి. దీని నివారణకు తోటల్లోని నీరు బయటకు పోయేలా బోదెలు తవ్వాలి. చెట్ల మధ్య అంతర సేద్యం చేస్తూ తేమ శాతం తగ్గిపోయేలా చూడాలి. పాలీ హౌస్‌లో పూల సాగు చేస్తుంటే చుట్టుపక్కల తెరలను తొలగించాలి. గాలిలోని తేమ లోపలకు రాకుండా ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఉపయోగించవచ్చు. పాలీ హౌస్, షేడ్ నెట్ హౌస్‌ల దగ్గర గల పెద్ద చెట్ల కొమ్మలను కత్తిరించుకోవాలి. ఆరు బయట తోటల్లో అయితే గాలి బాగా ప్రసరించేందుకు అవసరమైతే కొన్ని మొక్కలను తీసివేయాలి. ఇంకా వర్షాలు పడుతుంటే.. ఇంకా వర్షాలు పడుతుంటే తోటల్లో పట్టాలు కప్పగలిగిన అవకాశాన్ని పరిశీలించాలి. లేదంటే మొక్కల మధ్య దిన పత్రికల కాగితాలు ఉంచినా వర్షం నీటిని ఆకుల మీద పడకుండా చేయవచ్చు. తద్వారా తెగుళ్లను నివారించుకోవచ్చు. మొదలు కుళ్లు సోకితే తగిన మందుల్ని పాదుల్లో పోసుకోవాలి. చామంతికి ఎక్కువగా వడలు తెగులు, తుప్పు తెగులు, ఆకుమచ్చ తెగులు, మొదలు కుళ్లు తెగులు ఆశించే అవకాశం ఎక్కువ. వడలు తెగులు, ఆకుమచ్చ తెగులు కనిపిస్తే కార్బండిజమ్ ఏదా థైరం మందును, తుప్పు తెగులు ఆశిస్తే సల్ఫర్ 0.2 శాతం మందును, మొదలు కుళ్లు తెగులు నివారణకు బావిస్టిన్, బూడిద తెగులు నివారణకు సల్ఫర్‌ను తగిన మోతాదులో నీళ్లతో కలిపి పిచికారీ చేయాలి. బంతి.. మల్లె తోటల్లో ఇలా చేయండి బంతి తోటల్లో బూడిద తెగులు నివారణకు సల్ఫర్, పువ్వు, మొగ్గలు కుళ్లు తెగులు సోకితే డైథీనియం ఎం.45, ఆకుమచ్చ తెగులు కనిపిస్తే కార్బండజిమ్ మందుల్ని తగిన మోతాదులో వాడాలి. వేరుకుళ్లు తెగులు సోకితే కార్బండిజమ్ మందును లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున కలిపి మొక్కల మొదళ్ల వద్ద పోయాలి. మల్లె తోటల్లో ఆకుమచ్చ తెగులు కనిపించినా, గులాబీ తోటల్లో పూల రేకులు నల్లబడుతున్నా, బూడిద తెగులు కనిపించినా దాదాపు ఇవే మందుల్ని వాడవచ్చు. మరింత సమాచారం కోసం సమీపంలోని ఆర్బీకేలలో ఉద్యాన శాఖ సహాయకుడిని లేదంటే గన్నవరంలోని సమగ్ర కాల్ సెంటర్ నంబర్ 155251కు ఫోన్‌చేసి సంప్రదించవచ్చు. వర్షాలు దెబ్బతీశాయి చామంతి తోటలో నాలుగు రోజులుగా నీళ్లు నిలిచిపోయాయి. తోట ఉరకెత్తే ప్రమాదం ఉంది. ఇప్పటికే రూ.60 వేల వరకు ఖర్చు చేశాను. కార్తీక మాసంలో చామంతికి మంచి గిరాకీ ఉంటుందనుకుంటే వర్షాలొచ్చి దెబ్బతీశాయి. - తమ్మా చెన్నారెడ్డి, ఉండవల్లి, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా -
పంటలకు రక్షణ బమావె ద్రావణం!
వాణిజ్య, ఉద్యాన పంటలు, పండ్ల తోటలను చీడపీడల నుంచి రక్షించే మరో ద్రావణాన్ని వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలం టి.వెలంవారిపల్లెకు చెందిన సేంద్రియ వ్యవసాయ నిపుణుడు, వెన్నెల రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపకులు కొమ్ములూరి విజయకుమార్ రైతులకు పరిచయం చేస్తున్నారు. పల్లెల్లో బీడు భూముల్లో, గట్ల మీద, వాగులు, వంకల దగ్గర, అడవిలో విరివిగా కనిపించే బంకీర పండ్లు, మారేడు కాయలు, వెర్రి పుచ్చకాయలతో తయారు చేసే ఈ ద్రావణానికి ‘బమావె’ ద్రావణం అని పేరు పెట్టారు. పత్తి, మినుము,పెసర, వేరుశనగ, చీనీ(బత్తాయి), మామిడి, సపోటా, జామ, టమాటా, బీర, సొర, కాకర, దోస, కళింగర ఇతర తీగ జాతి పంటలు, పండ్ల, కూరగాయ పంటలను చీడపీడల నుంచి రక్షించుకోవడానికి రైతులకు ఈ ద్రావణం ఉపకరిస్తుందని విజయకుమార్ తెలిపారు. వార్షిక పంటలకు మొలక దశలో ఆశించి నష్టపరిచే మిడతలు, పచ్చదోమ, తెల్లదోమ, వైరస్ తెగుళ్ల నివారణకు ఈ ద్రావణం ఉపయోగపడుతుంది. పురుగులను సమూలంగా నాశనం చేస్తుందన్నారు. పంటలపై ప్రయోగించినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయని ఆయన తెలిపారు. బంకీర పండ్లు బంకీర పండ్లు 10 కిలోలు సేకరించుకొని ఉంచుకోవాలి. ఇవి పొలాల గట్ల మీద, అడవులు, కొండలు, గుట్టలు, వాగులు, వంకలు తదితర చోట్ల పెరుగుతుంటాయి. పండ్లు తెల్లగా ఉంటాయి. విత్తనానికి చుట్టూ బంకతో కూడిన కండ ఉంటుంది. పండు తియ్యగా ఉన్నా తింటే బబుల్ గమ్లాగా నోటికి అంటుకుంటూ ఉంటుంది. మారేడు కాయలు మారేడు కాయలు 5 కిలోలు తీసుకొని బాగా పచ్చడి పచ్చడిగా దంచి సిద్ధం చేసుకోవాలి. ఈ చెట్లు దేవాలయాల వద్ద, పొలాల గట్లు, అటవీ ప్రాంతాల్లో విరివిగా ఉంటాయి. ఎలాంటి చీడపీడలు ఆశించని చెట్టు ఇది. బాగా మాగి ఉన్న కాయలు సేకరిస్తే మరీ మంచిది. వెర్రి పుచ్చ కాయలు వెర్రి పుచ్చకాయలు రెండున్నర కిలోలు సేకరించి మెత్తగా దంచి ఉంచాలి. ఈ కాయలు చెరువుల వద్ద గ్రామాల్లో వంకలు, వాగులు, గుట్టల సమీపంలో విరివిగా తీగలకు కాస్తుంటాయి. ఇవి బాగా మాగితే పసుపు పచ్చగా ఉంటాయి. ముఖ్యంగా చెరువులు, వంకలు, వాగుల వద్ద దొరుకుతాయి. వెర్రిపుచ్చ తీగలకు ఎలాంటి పురుగులు, తెగుళ్లు ఉండవు. కాయలు పచ్చగా నిగనిగలాడుతుంటాయి. కాయలు పండుబారి కొద్ది రోజులకు నశించి మళ్లీ కొత్త తీగలు అదే కాండం నుంచి పుడతాయి. ద్రావణం తయారీ ఎలా? 200 లీటర్ల నీరు పట్టే డ్రమ్ములో.. దంచి పెచ్చుకున్న 10 కిలోల బంకీరపండ్లు, 5 కిలోల మారేడు కాయలు, రెండున్నర కిలోల వెర్రి పుచ్చకాయలను వేసి బాగా కలియతిప్పాలి. డ్రమ్మును నీడలో ఉంచాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో కర్రతో కలియబెడుతుండాలి. గొనె సంచి కప్పి 8 రోజులు మురగబెడితే ‘బమావె’ ద్రావణం వాడకానికి సిద్ధమవుతుంది. పిచికారీ ఎలా? ► పత్తి, టమాటా, మిరప, అన్ని రకాల కూరగాయ తోటలతో పాటు ఆముదం పంటకు, చీనీ, సపోట, జామ, దానిమ్మ, మామిడి, ఇతర పండ్ల తోటలకు ‘బమావె’ ద్రావణాన్ని నెలలో నాలుగు సార్లు పిచికారీ చేసుకోవాలి. ఏ పంటకైనా సరే.. మొదటిసారి– 10 లీటర్ల నీటికి 1 లీటరు ద్రావణం, 2వ సారి– 10 లీటర్ల నీటికి 1.25 లీటర్లు, 3వ సారి– 10 లీటర్ల నీటికి 1.5 లీటర్లు, 4వ సారి– 10 లీటర్ల నీటికి 2 లీటర్ల ద్రావణం కలిపి పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుందని విజయకుమార్ చెబుతున్నారు. ► ఉదయం 5.30 గంటల నుంచి 9 గంటల లోపల, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్య ఈ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ► పంటకు పూత వచ్చినా, రాకపోయినా ద్రావణం పిచికారీని మరువకూడదు. ► లేత పంటను ఆశించే పచ్చ, తెల్లదోమ, ఆకులు తినే దాసరి పురుగు, మిడతలను ఇది నశింపజేస్తుంది. ► పూతను ఆశించే ఎటువంటి పురుగునైనా ఇది మట్టుబెడుతుంది. వైరస్‌ను మోసుకు వచ్చే పురుగులను పంట దరి చే రనీయదు. ► పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు.. పావు లీటరు నుంచి అర లీటరు పశువుల మూత్రం కలుపుకొని పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. ► అరటిలో పండు ఈగ రైతు ఆదాయాన్ని కోల్పోయేలా చేస్తుంది. దీని నివారణకు అరటి గెల వేసే సమయంలోనే ‘బమావె’ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. గెల పూర్తిగా పెరిగే వరకు నాలుగు సార్లు పిచికారీ చేసుకోవాలి. ► మిరప తోటలను ఆకుముడత వేధిస్తుంటుంది. ముడత ఆశిస్తే పంట దున్నేయాల్సిందేనని రైతులు చెబుతుంటారు. ముడత నివారణకు ‘బమావె’ ద్రావణం అద్భుతంగా పనిచేస్తుంది. ► వరి పంటను దుంప కుళ్లు, ఉల్లికోడు, అగ్గి తెగులు, కాండం కుళ్లు తెగులు, రెల్లా పురుగులు ఆశించి నష్టపరుస్తుంటాయి. వీటి నివారణకు చక్కని మార్గం ‘బమావె’ ద్రావణం పిచికారీ చేసుకోవాలి. మొలక దశ నుంచి కంకులు వేసే దశ వరకు పిచికారీ చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ► బంకీర పండ్లు, మారేడు కాయలు, వెర్రి పుచ్చకాయలు కేవలం మే, జూన్ నెలల్లో మాత్రమే లభిస్తాయి. ఈ సీజన్లో వీటిని సేకరించుకొని ద్రావణం తయారు చేసి పెట్టుకుంటే.. ఏడాది పొడవునా పంటలకు పిచికారీ చేసుకోవచ్చని విజయకుమార్(98496 48498,79814 07549) తెలిపారు. – మాచుపల్లె ప్రభాకరరెడ్డి, సాక్షి, వ్యవసాయం, వెఎస్సార్ జిల్లా -
వరికి తెగులు
పునల్లితో రైతుల్లో ఆందోళన నివారణే ముఖ్యం: కొల్చారం ఏఓ యాదగిరి కొల్చారం: సకాలంలో వర్షాలు లేక ఖరీఫ్ పంటలు చాలావరకు దెబ్బతిన్నాయి. సీజన్ చివరలో భారీ వర్షాలు కురవడంతో చేతికొచ్చే పంటలకు సైతం నష్టం వాటిల్లింది. వరికి గింజ తొడిగే సమయంలో భారీ వర్షాలు రావడంతో కంపునల్లి మరో రూపంలో రైతును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వరికి కంపునల్లి సోకడంతో గింజల్లోని పాలు పీల్చడంతో పొట్టుగా మారడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొల్చారం మండలం రంగంపేట, పైతర గ్రామాల్లో వరికి కంపునల్లి సోకడంతో ప్రస్తుతం రైతులు ఆ పంటను రక్షించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయాధికారులు స్పందించి తగిన సూచనలు చేయాలని లేదంటే చేతికొచ్చిన పంట నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కంపునల్లి నుంచి తీసుకునే జాగ్రత్తలను కొల్చారం ఏఓ యాదగిరి వెల్లడించారు. ఆ వివరాలు మీకోసం... కంపునల్లి లక్షణాలు పిల్ల తల్లి పురుగులు అభివృద్ధి చెందిన గింజల నుంచి పాలను పీల్చుకుంటాయి. గింజలు ఏర్పడే తొలి దశలో కాండం నుంచి కూడా రసం పీల్చుకుంటుంది. వరి గింజ మొక్క రంగు నలుపుగా మారడంతోపాటు సగం పాలు పోసుకున్న గింజలు తాలు గింజలుగా మారి పంట కనిపిస్తుంది. నల్లి సోకినటువంటి వరి కాండాలను వాసన చూస్తే కుళ్లిపోయిన వాసన వస్తుంది. నివారణ చర్యలు ముందస్తుగా గట్ల వెంట పొలంలో కలుపు మొక్కలను ఏరివేయాలి. అనంతరం రసాయన చర్యల్లో భాగంగా మలాథియాన్ 5శాతం పొడిమందును ఎకరానికి 8కిలోల చొప్పున లేదా మలాథియాన్ 50ఈసీ రెండు మిల్లీలీటర్ల మందును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 270 లీటర్ల మందు ఎకరానికి సరిపోతుంది. -
‘జీవ నియంత్రణ’తో తెగుళ్ల నివారణ
పంటలకు జీవౌషధం.. ‘ట్రైకోడెర్మావిరిడి’ వాతావరణ కాలుష్యానికి చెక్ ఆరోగ్యకరమైన పంటలకు సోపానం దీని వాడకం ద్వారా అనేక తెగుళ్ల నివారణ గజ్వేల్ ఏడీఏ శ్రావణ్‌కుమార్ సలహా సూచనలు గజ్వేల్: రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలు విచక్షణారహితంగా వాడటం వల్ల దుష్ఫలితాలు కలుగుతున్నాయి. పురుగులు, తెగుళ్లు రోగ నిరోధక శక్తిని పెంచుకొని ఏ మందులకూ లొంగకుండాపోతున్నాయి. దీంతో సమస్య జఠిలమవుతున్నది. ఈ తరుణంలో రైతులు జీవనియంత్రణ పద్ధతులను పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చని గజ్వేల్ ఏడీఏ శ్రావన్‌కుమార్ (సెల్: 7288894469) చెబుతున్నారు. జీవ నియంత్రణ పద్ధతుల వల్ల వ్యవసాయంలో ఖర్చును తగ్గించుకొని లాభసాటిగా మార్చుకోవచ్చని ఆయన అంటున్నారు. ఇందుకోసం ప్రభుత్వం పలుచోట్ల జీవనియంత్రణ ప్రయోగశాలలను ప్రారంభించిందని చెప్పారు. వీటి ద్వారా ట్రైకోడెర్మా విరిడి, సుడోమోనాస్ను తయారుచేసిన రైతులకు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రైకోడెర్మావిరిడి వాడకం, దీనివల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆయన వివరించారు. ట్రైకోడెర్మావిరిడి మనం పండించే వివిధ పంటలను వేరుకుళ్లు, మాగుడు తెగులు, ఎండు తెగులు, ఆశించి విపరీత నష్టాన్ని కలుగజేస్తున్నాయి. పంటభూముల్లో అనేక శిలీంధ్రాలు ఉంటాయి. వీటిలో స్లీ్కరోషియం, ఫిథియం, ఫైటోఫ్తరా, పుజేరియం, పైరికులేరియం వంటివి మొక్కలకు తెగుళ్లను ఆశించేలా చేసి నష్టాన్ని కలుగజేస్తున్నాయి. వీటిని నాశనం చేయడంలో ట్రైకోడెర్మావిరిడి బాగా పనిచేస్తుంది. ఇది భూమిలో అతి త్వరగా వృద్ధి చెందుతుంది. దీనికి ఆమ్ల నేలలు, తటస్థ నేలలు అనుకూలం. వేరుశనగ, పప్పుధాన్యపు పైర్లు, కూరగాయలు, పత్తి, నిమ్మ, కొబ్బరి, అరటి, పొగాకు, మిరప మొదలైన పంటలకు తీవ్రంగా నష్టం కలిగించే వేరుకుళ్లు, కాండం కుళ్లు, మాగుడు తెగులు, ఎండుతెగులు నివారణకు ఇది ఉపయోగపడుతుంది. దీనిని వాడినపుడు వేరు చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. ఇది విత్తనశుద్ధి చేయడానికి, సేంద్రియ ఎరువులతో కలిపి నేలలో వేయడానికి పనికి వస్తుంది. ట్రైకోడెర్మావిరిడిని పురుగు మందులతో కలిపి వాడకపోడం శ్రేయస్కరం. ఈ విషయాన్ని రైతులు గుర్తించాలి. తెగుళ్ల నివారణ ఇలా.. కాండం తెగులు: టమాటా, వేరుశనగలో వచ్చే కాండం తెగులు నివారణకు ట్రైకోడెర్మావిరిడిని విత్తనశుద్ధి లేదా సాళ్లల్లో వేసే విధానంలో వాడవచ్చు. విత్తనకుళ్లు: కూరగాయలు, పొగాకు పంటలకు ఆశించే విత్తనకుళ్లు, వడల తెగులుకు విత్తనశుద్ధి లేదా మట్టితో కలిపే విధానంలో వాడవచ్చు. కుళ్లు తెగులు: శనగ, కంది, పత్తి, టమటా పంటలను ఆశించే ఈ తెగులు నివారణకు విత్తనశుద్ధి లేదా మట్టితో కలపడం వంటి పద్ధతుల ద్వారా నివారించవచ్చు. వేరుకుళ్లు: శనగ, పత్తి, టమటా పంటలను ఇది ఆశిస్తుంది. దీని నివారణకు విత్తన శుద్ధి లేదా నేలల్లో వేయడం పద్ధతుల ద్వారా నివారించవచ్చు. ఎర్రకుళ్లు: చెరకు పంటను ఆశించే ఈ తెగులు నివారణకు చెరకు గడ ముక్కలను ముంచడం ద్వారా నివారించవచ్చు. విత్తన శుద్ధి పద్ధతి 1 కిలో విత్తనానికి 8-10 గ్రాముల పొడి మందు సరిపోతుంది. 500 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి పొడిని వంద లీటర్ల నీటితో కలిపి ఉపయోగించుకోవాలి. భూమిలో వేసే విధానం: ఎకరాకు 2-3 కిలోలు దుక్కిలో వేయాలి. ట్రైకోడెర్మా విరిడి 1 కిలో, వేప పిండి 10 కిలోలు, పశువుల ఎరువు 90 కిలోలను మిశ్రమంగా చేసి కావాల్సినంత తేమను అందించి వారం రోజుల పాటు నీడలో ఉంచిన తర్వాత దుక్కిలో వేసుకోవాలి. మోతాదు: వేరుశనగ, పత్తి, పొద్దుతిరుగుడు, అపరాలు, పొగాకు, తమలపాకు, వంగ, బెండ, ఉల్లి, బంగాళదుంప, మిరప, పుచ్చ, వరి పంటలకు సంబంధించి 1 కిలో విత్తనానికి 8-10 గ్రాములు వేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఎకరాకు 2 కిలోలు దుక్కిలో వేయాల్సి ఉంటుంది. చెరుకు, అల్లం, పసుపు పంటలకు సంబంధించి ఎకరాకు 500 గ్రాములతో విత్తనశుద్ధి చేస్తే సరిపోతుంది. అదేవిధంగా 2-3 కిలోలు దుక్కిలో వేయాల్సి ఉంటుంది. కొబ్బరికి సంబంధించి మొక్క నాటినప్పుడు దాని వద్ద 25-50 గ్రాములు వేయాల్సి ఉంటుంది. ప్రతి ఆరు నెలలకోసారి మొక్కకు 50-70 గ్రాములు వేస్తే మంచి ఫలితాలుంటాయి. అరటిలో మొక్కనాటేటప్పుడు దాని వద్ద 2-3 గ్రాములు వేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఆరు నెలలకోసారి మొక్క మొదలు దగ్గర వేయాలి. నిమ్మ, నారింజ తోటలకు సంబంధించి మొక్క నాటేటప్పుడు 10 గ్రాములు, ప్రతి ఆరు నెలలకోసారి 20-30 గ్రాములు మొక్క మొదళ్ల వద్ద వేయాల్సి ఉంటుంది. ట్రైకోడెర్మావిరిడి వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు దీనిని వాడేముందు భూమిలో తగినంత తేమ ఉండే విధంగా చూసుకోవాలి. లేదా వాడిన వెంటనే మొక్కలకు నీరు పెట్టాలి. కంపోస్టు, ఇతర పశువుల ఎరువులు, జీవసంబంధమైన పదార్థాలతో కలిపి ఈ మందును వాడుకోవచ్చు. చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయరాదు. తయారు చేసిన ట్రైకోడెర్మావిరిడి కల్చరును ఆరు నెలలలోపు వాడుకోవచ్చు. ట్రైకోడెర్మావిరిడి లభ్యమయ్యే ప్రదేశాలు జీవనియంత్రణ ప్రయోగశాలలు, జిల్లాలోని అన్ని వ్యవసాయశాఖ కార్యాలయాలు