ద్రావణాన్ని కలియతిప్పుతున్న రైతు శాస్త్రవేత్త విజయకుమార్ ,మారేడు కాయలు, బంకీర పండ్లు, వెర్రిపుచ్చ కాయలు
వాణిజ్య, ఉద్యాన పంటలు, పండ్ల తోటలను చీడపీడల నుంచి రక్షించే మరో ద్రావణాన్ని వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలం టి.వెలంవారిపల్లెకు చెందిన సేంద్రియ వ్యవసాయ నిపుణుడు, వెన్నెల రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ వ్యవస్థాపకులు కొమ్ములూరి విజయకుమార్ రైతులకు పరిచయం చేస్తున్నారు. పల్లెల్లో బీడు భూముల్లో, గట్ల మీద, వాగులు, వంకల దగ్గర, అడవిలో విరివిగా కనిపించే బంకీర పండ్లు, మారేడు కాయలు, వెర్రి పుచ్చకాయలతో తయారు చేసే ఈ ద్రావణానికి ‘బమావె’ ద్రావణం అని పేరు పెట్టారు.
పత్తి, మినుము,పెసర, వేరుశనగ, చీనీ(బత్తాయి), మామిడి, సపోటా, జామ, టమాటా, బీర, సొర, కాకర, దోస, కళింగర ఇతర తీగ జాతి పంటలు, పండ్ల, కూరగాయ పంటలను చీడపీడల నుంచి రక్షించుకోవడానికి రైతులకు ఈ ద్రావణం ఉపకరిస్తుందని విజయకుమార్ తెలిపారు. వార్షిక పంటలకు మొలక దశలో ఆశించి నష్టపరిచే మిడతలు, పచ్చదోమ, తెల్లదోమ, వైరస్ తెగుళ్ల నివారణకు ఈ ద్రావణం ఉపయోగపడుతుంది. పురుగులను సమూలంగా నాశనం చేస్తుందన్నారు. పంటలపై ప్రయోగించినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయని ఆయన తెలిపారు.
బంకీర పండ్లు
బంకీర పండ్లు 10 కిలోలు సేకరించుకొని ఉంచుకోవాలి. ఇవి పొలాల గట్ల మీద, అడవులు, కొండలు, గుట్టలు, వాగులు, వంకలు తదితర చోట్ల పెరుగుతుంటాయి. పండ్లు తెల్లగా ఉంటాయి. విత్తనానికి చుట్టూ బంకతో కూడిన కండ ఉంటుంది. పండు తియ్యగా ఉన్నా తింటే బబుల్ గమ్‌లాగా నోటికి అంటుకుంటూ ఉంటుంది.
మారేడు కాయలు
మారేడు కాయలు 5 కిలోలు తీసుకొని బాగా పచ్చడి పచ్చడిగా దంచి సిద్ధం చేసుకోవాలి. ఈ చెట్లు దేవాలయాల వద్ద, పొలాల గట్లు, అటవీ ప్రాంతాల్లో విరివిగా ఉంటాయి. ఎలాంటి చీడపీడలు ఆశించని చెట్టు ఇది. బాగా మాగి ఉన్న కాయలు సేకరిస్తే మరీ మంచిది.
వెర్రి పుచ్చ కాయలు
వెర్రి పుచ్చకాయలు రెండున్నర కిలోలు సేకరించి మెత్తగా దంచి ఉంచాలి. ఈ కాయలు చెరువుల వద్ద గ్రామాల్లో వంకలు, వాగులు, గుట్టల సమీపంలో విరివిగా తీగలకు కాస్తుంటాయి. ఇవి బాగా మాగితే పసుపు పచ్చగా ఉంటాయి. ముఖ్యంగా చెరువులు, వంకలు, వాగుల వద్ద దొరుకుతాయి. వెర్రిపుచ్చ తీగలకు ఎలాంటి పురుగులు, తెగుళ్లు ఉండవు. కాయలు పచ్చగా నిగనిగలాడుతుంటాయి. కాయలు పండుబారి కొద్ది రోజులకు నశించి మళ్లీ కొత్త తీగలు అదే కాండం నుంచి పుడతాయి.
ద్రావణం తయారీ ఎలా?
200 లీటర్ల నీరు పట్టే డ్రమ్ములో.. దంచి పెచ్చుకున్న 10 కిలోల బంకీరపండ్లు, 5 కిలోల మారేడు కాయలు, రెండున్నర కిలోల వెర్రి పుచ్చకాయలను వేసి బాగా కలియతిప్పాలి. డ్రమ్మును నీడలో ఉంచాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో కర్రతో కలియబెడుతుండాలి. గొనె సంచి కప్పి 8 రోజులు మురగబెడితే ‘బమావె’ ద్రావణం వాడకానికి సిద్ధమవుతుంది.
పిచికారీ ఎలా?
► పత్తి, టమాటా, మిరప, అన్ని రకాల కూరగాయ తోటలతో పాటు ఆముదం పంటకు, చీనీ, సపోట, జామ, దానిమ్మ, మామిడి, ఇతర పండ్ల తోటలకు ‘బమావె’ ద్రావణాన్ని నెలలో నాలుగు సార్లు పిచికారీ చేసుకోవాలి. ఏ పంటకైనా సరే.. మొదటిసారి– 10 లీటర్ల నీటికి 1 లీటరు ద్రావణం, 2వ సారి– 10 లీటర్ల నీటికి 1.25 లీటర్లు, 3వ సారి– 10 లీటర్ల నీటికి 1.5 లీటర్లు, 4వ సారి– 10 లీటర్ల నీటికి 2 లీటర్ల ద్రావణం కలిపి పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుందని విజయకుమార్ చెబుతున్నారు.
► ఉదయం 5.30 గంటల నుంచి 9 గంటల లోపల, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్య ఈ ద్రావణాన్ని పిచికారీ చేయాలి.
► పంటకు పూత వచ్చినా, రాకపోయినా ద్రావణం పిచికారీని మరువకూడదు.
► లేత పంటను ఆశించే పచ్చ, తెల్లదోమ, ఆకులు తినే దాసరి పురుగు, మిడతలను ఇది నశింపజేస్తుంది.
► పూతను ఆశించే ఎటువంటి పురుగునైనా ఇది మట్టుబెడుతుంది. వైరస్‌ను మోసుకు వచ్చే పురుగులను పంట దరి చే రనీయదు.
► పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు.. పావు లీటరు నుంచి అర లీటరు పశువుల మూత్రం కలుపుకొని పిచికారీ చేసుకుంటే సరిపోతుంది.
► అరటిలో పండు ఈగ రైతు ఆదాయాన్ని కోల్పోయేలా చేస్తుంది. దీని నివారణకు అరటి గెల వేసే సమయంలోనే ‘బమావె’ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. గెల పూర్తిగా పెరిగే వరకు నాలుగు సార్లు పిచికారీ చేసుకోవాలి.
► మిరప తోటలను ఆకుముడత వేధిస్తుంటుంది. ముడత ఆశిస్తే పంట దున్నేయాల్సిందేనని రైతులు చెబుతుంటారు. ముడత నివారణకు ‘బమావె’ ద్రావణం అద్భుతంగా పనిచేస్తుంది.
► వరి పంటను దుంప కుళ్లు, ఉల్లికోడు, అగ్గి తెగులు, కాండం కుళ్లు తెగులు, రెల్లా పురుగులు ఆశించి నష్టపరుస్తుంటాయి. వీటి నివారణకు చక్కని మార్గం ‘బమావె’ ద్రావణం పిచికారీ చేసుకోవాలి. మొలక దశ నుంచి కంకులు వేసే దశ వరకు పిచికారీ చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.
► బంకీర పండ్లు, మారేడు కాయలు, వెర్రి పుచ్చకాయలు కేవలం మే, జూన్ నెలల్లో మాత్రమే లభిస్తాయి. ఈ సీజన్‌లో వీటిని సేకరించుకొని ద్రావణం తయారు చేసి పెట్టుకుంటే.. ఏడాది పొడవునా పంటలకు పిచికారీ చేసుకోవచ్చని విజయకుమార్(98496 48498,79814 07549) తెలిపారు.
– మాచుపల్లె ప్రభాకరరెడ్డి, సాక్షి, వ్యవసాయం, వెఎస్సార్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment