పొలంలోని మట్టినే సేంద్రియ ఎరువుగా, పురుగులనునియంత్రించే ద్రావణం వాడి సత్ఫలితాలు పొందటం ద్వారా ఆరోగ్య దాయకమైన ద్రాక్ష, వరి తదితర పంటలు పండించిన ప్రముఖ రైతు శాస్త్రవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి (సివిఆర్) మరో ద్రావణాన్ని రూ పొందించారు. మట్టి+ఆముదంతో పాటు కుంకుడు రసం కలిపి చల్లితే పంటలకు చీడపీడల నియంత్రణతోపాటు పెరుగుదల బాగుందని గుర్తించారు.
ఈ ద్రావణాన్ని తయారు చేసి మొదట తన పెరట్లోని టొమాటో, మొక్కజొన్న పంటలపై ఆయన ప్రయోగించి చూశారు. కేవలం వారం నుండి 10 రోజుల్లోనే పంటలో విపరీతమైన మార్పును గమనించారు. అంతకు ముందు మొక్కజొన్న ఆకులను పురుగులు తినటం, పంట పసుపు పచ్చగా ఉన్నపుడు ఈ ద్రావణం పిచికారీ చేశారు.
కేవలం వారం నుంచి పది రోజుల్లోనే ఆ పంట పచ్చదనంతో కళకళలాడుతూ, ఆకులు కూడా వెడల్పుగా రావటం అంటే పంటలో మంచి ఎదుగుదలను గమనించారు. మరి కొందరు రైతులు కూడా సత్ఫలితాలు సాధించటంతో ఈ ద్రావణం సామర్థ్యంపై సివిఆర్ నిర్థారణకు వచ్చారు.
మట్టి, ఆముదం, కుంకుడు ద్రావణం తయారీ విధానం
లోపలి మట్టి (బాగా జిగటగా ఉండే మట్టి) 10 కిలోలు (ఒక తట్టెడు) తీసుకొని, గడ్డలు చిదిపి మెత్తని మట్టిని సిద్ధం చేసుకోవాలి. ఆ మట్టిలో 250 మి.లీ. నుంచి 500 మి.లీ. వరకు ఆముదం కలపాలి. 250 నుండి 500 గ్రా. కుంకుడు కాయలు తీసుకొని కొంచెం నీటిలో వాటిని రాత్రంతా నానబెట్టాలి. ఉదయం వాటిని చేతితో పిసికి, విత్తనాలు తీసివేసి, పేస్టులాగా తయారు చెయ్యాలి. అలా తయారైన పేస్టును అంతకు ముందు రోజు ఆముదం కలిపి పక్కన పెట్టిన మట్టిలో వేసి, బాగా కలియ తిప్పాలి. ఈ మిశ్రమాన్ని 200 లీటర్ల నీటి డ్రమ్ములో వేసి కర్రతో బాగా కలపాలి. మట్టి మిశ్రమం అంతా నీటిలో బాగా కలిసిపోయిన తర్వాత కొద్దిసేపటికి నీటిలోని మట్టి రేణువులు నీటి అడుగుకు పేరుకుంటాయి. పైకి తేరుకున్న ద్రావణాన్ని వడకట్టి స్ప్రేయర్లలో పోసుకొని పంటపై పిచికారీ చెయ్యాలి. రైతులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే మట్టి ద్రావణం నీటిలో కలిపిన తర్వాత 4 గంటల్లోగా వంటపై పిచికారీ చేయాలి. అప్పుడే మంచి ఫలితం ఉంటుంది. ఆలన్యం అయితే ఆముదం ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉంది.
కుంకుడుతో పచ్చదనం వస్తోంది!
పైకి పురుగు కనిపిస్తూ ఉంటే గతంలో చెప్పినట్లు మట్టి 20 కిలోలు, ఆముదం పావు కిలో నుంచి అర కిలో వరకు కలిపిన ద్రావణం చల్లితే పురుగుల నియంత్రణ బాగుంటుంది. అయితే, పెరుగుదల ఉండేది కాదు. మొలకల ద్రావణం చల్లాల్సి వచ్చేది. ఇప్పుడు కుంకుడు రసం కలపటం వల్ల ఆ కొరత తీరి పచ్చదనం వస్తోంది. తెగుళ్లు నివారిస్తుంది. పురుగులను గుడ్లు పెట్టనివ్వదు. అనేక పంటల్లో మంచి ఫలితాలు వచ్చాయి. ఇది చల్లిన వారం, పది రోజుల్లోనే పంటలు ఆకుపచ్చని రంగులోకి మారి, గ్రోత్ వేగాన్ని అందుకుంటున్నది. మల్బరీ తప్ప ఏ పంటలోనైనా చల్లొచ్చు. పత్తి రైతులు కాయ పగలటానికి ముందు దశలోనే ఈ ద్రావణం వాడాలి. టొమాటోలో ఏ తెగుళ్లు, పురుగులూ రాలేదు. మిర్చిలో తామర పురుగు నియంత్రణకు మట్టి, ఆముదం, కుంకుళ్లతో పాటు అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కూడా కలిపి తయారు చేసిన ద్రావణం వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ ద్రావణాన్ని వర్షాలు బాగా పడే రోజుల్లో వారానికోసారి చల్లాలి. ఇప్పటి నుంచి పది రోజులకోసారి చల్లితే సరిపోతుంది. ఇది చల్లిన 2 గంటల వరకు వర్షం పడకపోతే చాలు, పనిచేస్తుంది.
– చింతల వెంకటరెడ్డి (98668 83336),
పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఆల్వాల్, సికింద్రాబాద్‌చాలా పంటలపై చల్లా.. రిజల్టు బాగుంది!
మట్టి, ఆముదం, కుంకుడు రసం ద్రావణం వాడిన వారం రోజుల్లోనే చీడపీడల నియంత్రణతో పాటు పంటల్లో పెరుగుదల బాగా కనిపించింది. 10 కిలోల లోపలి మట్టికి 250 ఎంఎల్ ఆముదం కలిపి పెట్టుకోవాలి. కుంకుడు కాయలను గింజలతో ΄ాటు నలగ్గొట్టి, ఉడక బెట్టాలి. నానబెట్టిన దానికన్నా, కుంకుడు విత్తనాలు కూడా పగులగొట్టి ఉడకబెడితే మరింత ప్రయోజనం ఉంటుందని నాకు అనిపించింది. ఆ తెల్లారి కుంకుళ్లను పిసికి రసం తీసుకోవాలి. ఆముదం కలిపిన మట్టిలో ఈ కుంకుడు రసం కలిపి 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. పసుపు, మామిడి, నిమ్మ, అవకాడో, అరటి తదితర పంటలన్నిటిపైనా ఈ ద్రావణాన్ని పిచికారీ చేశాను. వారంలోనే గ్రోత్ చాలా కనిపించింది. నూనెలు చల్లితే గ్రోత్ వస్తుంది. ఇక్కడ ఆముదం వాడుతున్నందున గ్రోత్‌తోపాటు చీడపీడల నియంత్రణ కూడా జరుగుతుంది. మట్టి ద్వారా మినరల్స్ కూడా పంటకు అందుతున్నాయి. 12–15 రోజులకోసారి అన్ని పంటలపైనే పిచికారీ చేస్తున్నా. ఈ రెండు పిచికారీల మధ్య ఒకసారి వేపనూనె పిచికారీ చేస్తే పురుగుల గుడ్లు నశించి మరింత మెరుగైన ఫలితాలుంటాయి.
– పడాల గౌతమ్ (98497 12341), ఎస్టేట్ మేనేజర్, రుషి వ్యాలీ స్కూల్, మదనపల్లి
దివంగత సంజీవరెడ్డి సూచనలతో 2007 నుంచి మా 20 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. 2014లో ‘సాక్షి సాగుబడి’లో సివిఆర్ మట్టి ద్రావణం గురించి చదివినప్పటి నుంచి వంగ, సాంబారు దోస, పూల తోట, వేరుశనగ వంటి అన్ని పంటలకూ లోపలి మట్టి+ ఆముదం ద్రావణం వాడుతూ మంచి ఫలితాలు పొందుతున్నాను. సివిఆర్ కొత్తగా చెప్తున్నట్లు మట్టి, ఆముదంతోపాటు కుంకుడు రసం కూడా కలిపి పత్తి పంట 20 రోజుల దశలో రెండు నెలల క్రితం ఒకసారి, ఆ తర్వాత మరోసారి పిచికారీ చేశాను. పంట ముదురు ఆకుపచ్చగా బలంగా పురుగుల బెడద లేకుండా పెరిగింది. ఇప్పుడు పత్తి తీస్తున్నాను. ఇతర రైతులతో కూడా మట్టి ద్రావణం వాడిస్తున్నాం.
– పి. గిరీష్ గౌడ్ (80732 45976),
ఇనగలూరు,అగళి మండలం, సత్యసాయి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment