
నితిన్ రూపొందించిన మల్చింగ్ పరికరం
ఎత్తు మడులపై మల్చింగ్ షీట్ పరిచి ఉద్యాన పంటలు పండించడానికి సాధారణంగా ట్రాక్టర్‌కు అనుసంధానం చేసే పరికరాన్ని ఉపయోగిస్తుంటారు. ఎకరానికి 6 నుంచి 8 మంది కూలీల అవసరం ఉంటుంది. ఒక రోజు నుంచి రోజున్నర సమయం పడుతుంది. అయితే, సులువుగా, తక్కువ ఖర్చుతో మల్చింగ్ షీట్‌ను పరిచే పరికరాన్ని మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన యువకుడు రూపొందించారు. కేవలం ఇద్దరు మనుషులతో, 8 గంటల్లోనే ఎకరంలో మల్చింగ్ షీట్ పరచడానికి ఉపయోగపడే మల్చింగ్ పరికరాన్ని యువ ఉపాధ్యాయుడు, రైతు నితిన్ ఘలే పాటిల్ రూపొందించారు. నాసిక్‌లోని శివాజీ నగర్‌లో గల అభినవ్ బాల్‌వికాస్ మందిర్ పాఠశాలలో నితిన్ ఉపాధ్యాయుడుగా పనిచేస్తూనే వ్యవసాయాన్ని మక్కువతో చేస్తుంటారు.
గత ఏడాది మే నెలలో తన 7 ఎకరాల భూమిలో టమాటో, మిరప, బంతిపూలను సాగు చేయటం కోసం ఎత్తుమడులపై మల్చింగ్ షీట్ పరవాలని అనుకున్నాడు. అయితే, కూలీల కొరత వల్ల సాధ్యంకాలేదు. ఆ క్రమంలో మల్చింగ్ షీట్ పరిచే ప్రక్రియను సులభతరం చేసే పరికరాన్ని తయారు చేసుకునే ప్రయత్నం చేశాడు. తన వద్ద ఉన్న పాత ఇనుము వస్తువులను ఉపయోగించి, సొంత ఆలోచన ప్రకారం వెల్డింగ్ చేయించి ఒక పరికరాన్ని రూపొందించాడు. ట్రాక్టర్‌కు అనుసంధానం చేసి దీన్ని ఉపయోగించే ప్రయత్నం చేశాడు.
మల్చింగ్ షీట్ చిరిగిపోతుండటంతో.. ట్రాక్టర్ లేకుండా మనుషులు ఈడ్చుకుంటూ వెళ్తూ మల్చింగ్ షీట్ పరిచేలా మార్పులు చేశాడు. పరికరం అడుగున చక్రాలను అమర్చటంతోపాటు.. పరిచిన షీట్‌పై మట్టి ఎగదోయడానికి వీలుగా రెండు ఇనుప బ్లేడ్లను అమర్చడంతో ఈ పరికరం సిద్ధమైంది. 15 రోజులు కష్టపడి అనేక విధాలుగా మార్పులు చేస్తూ చివరికి విజయం సాధించారు. తన పొలంలో ఉపయోగించడంతోపాటు మరో ఇద్దరు రైతులకు కూడా ఈ పరికరాన్ని ఇచ్చి పరీక్షించానన్నారు నితిన్.
‘మా ప్రాంతంలో ఎకరంలో మల్చింగ్ షీట్ పరచడానికి 12 మంది కూలీలు అవసరం. వారి కూలి, తిండితో కలిపి రూ. 8 వేల వరకు రైతుకు ఖర్చవుతుంది. నేను ఈ పరికరాన్ని రూ. 10 వేలకే తయారుచేసి ఇస్తున్నాను. ఒక్కసారి కొనుక్కుంటే చాలు. ఇద్దరు మనుషులతో దీనితో మల్చింగ్ షీట్ పరచవచ్చు. ఎకరాన్ని 8 గంటల్లోనే పూర్తి చేయవచ్చు. చిన్న రైతులకు ఇది చాలా బాగా ఉపయోగపడుతోంది. కూలీలతో కూడా పనిలేకుండా రైతు కుటుంబ సభ్యులే దీన్ని ఉపయోగించవచ్చు. సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని కొద్ది రోజుల్లోనే వంద మంది రైతులు ఇది కావాలన్నారు..’ అని నితిన్ (98909 82432) సంతోషంగా చెప్పారు.
తన టొమాటో తోటలో నితిన్ పాటిల్
Comments
Please login to add a commentAdd a comment