Malching method
-
మల్చింగ్.. ఇక సులభం!
ఎత్తు మడులపై మల్చింగ్ షీట్ పరిచి ఉద్యాన పంటలు పండించడానికి సాధారణంగా ట్రాక్టర్‌కు అనుసంధానం చేసే పరికరాన్ని ఉపయోగిస్తుంటారు. ఎకరానికి 6 నుంచి 8 మంది కూలీల అవసరం ఉంటుంది. ఒక రోజు నుంచి రోజున్నర సమయం పడుతుంది. అయితే, సులువుగా, తక్కువ ఖర్చుతో మల్చింగ్ షీట్‌ను పరిచే పరికరాన్ని మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన యువకుడు రూపొందించారు. కేవలం ఇద్దరు మనుషులతో, 8 గంటల్లోనే ఎకరంలో మల్చింగ్ షీట్ పరచడానికి ఉపయోగపడే మల్చింగ్ పరికరాన్ని యువ ఉపాధ్యాయుడు, రైతు నితిన్ ఘలే పాటిల్ రూపొందించారు. నాసిక్‌లోని శివాజీ నగర్లో గల అభినవ్ బాల్‌వికాస్ మందిర్ పాఠశాలలో నితిన్ ఉపాధ్యాయుడుగా పనిచేస్తూనే వ్యవసాయాన్ని మక్కువతో చేస్తుంటారు. గత ఏడాది మే నెలలో తన 7 ఎకరాల భూమిలో టమాటో, మిరప, బంతిపూలను సాగు చేయటం కోసం ఎత్తుమడులపై మల్చింగ్ షీట్ పరవాలని అనుకున్నాడు. అయితే, కూలీల కొరత వల్ల సాధ్యంకాలేదు. ఆ క్రమంలో మల్చింగ్ షీట్ పరిచే ప్రక్రియను సులభతరం చేసే పరికరాన్ని తయారు చేసుకునే ప్రయత్నం చేశాడు. తన వద్ద ఉన్న పాత ఇనుము వస్తువులను ఉపయోగించి, సొంత ఆలోచన ప్రకారం వెల్డింగ్ చేయించి ఒక పరికరాన్ని రూపొందించాడు. ట్రాక్టర్‌కు అనుసంధానం చేసి దీన్ని ఉపయోగించే ప్రయత్నం చేశాడు. మల్చింగ్ షీట్ చిరిగిపోతుండటంతో.. ట్రాక్టర్ లేకుండా మనుషులు ఈడ్చుకుంటూ వెళ్తూ మల్చింగ్ షీట్ పరిచేలా మార్పులు చేశాడు. పరికరం అడుగున చక్రాలను అమర్చటంతోపాటు.. పరిచిన షీట్‌పై మట్టి ఎగదోయడానికి వీలుగా రెండు ఇనుప బ్లేడ్లను అమర్చడంతో ఈ పరికరం సిద్ధమైంది. 15 రోజులు కష్టపడి అనేక విధాలుగా మార్పులు చేస్తూ చివరికి విజయం సాధించారు. తన పొలంలో ఉపయోగించడంతోపాటు మరో ఇద్దరు రైతులకు కూడా ఈ పరికరాన్ని ఇచ్చి పరీక్షించానన్నారు నితిన్. ‘మా ప్రాంతంలో ఎకరంలో మల్చింగ్ షీట్ పరచడానికి 12 మంది కూలీలు అవసరం. వారి కూలి, తిండితో కలిపి రూ. 8 వేల వరకు రైతుకు ఖర్చవుతుంది. నేను ఈ పరికరాన్ని రూ. 10 వేలకే తయారుచేసి ఇస్తున్నాను. ఒక్కసారి కొనుక్కుంటే చాలు. ఇద్దరు మనుషులతో దీనితో మల్చింగ్ షీట్ పరచవచ్చు. ఎకరాన్ని 8 గంటల్లోనే పూర్తి చేయవచ్చు. చిన్న రైతులకు ఇది చాలా బాగా ఉపయోగపడుతోంది. కూలీలతో కూడా పనిలేకుండా రైతు కుటుంబ సభ్యులే దీన్ని ఉపయోగించవచ్చు. సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని కొద్ది రోజుల్లోనే వంద మంది రైతులు ఇది కావాలన్నారు..’ అని నితిన్ (98909 82432) సంతోషంగా చెప్పారు. తన టొమాటో తోటలో నితిన్ పాటిల్ -
మల్చింగ్ పద్ధతితో పంటలకు మేలు
మల్చింగ్ అంటే.. మొక్కల చుట్టూ నేలను ఏదైనా పదార్థంతో కప్పి పెట్టడాన్ని మల్చింగ్ అంటారు. ఈ పద్ధతిని రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. మొదటి పద్ధతి ఎండుగడ్డి, ఎండిన ఆకులు, వరిపోట్టు, రంపం పొ ట్టులు మొక్క చుట్టూ రెండు నుంచి ఐదు అంగుళాల మందంలో వేయాలి. ఇవి పంటకాలంలో పంటకు మల్చింగ్‌తోపాటు ఆతర్వాత సేంద్రియ ఎరువుగా ఉపయోగపడతాయి. రెండో పద్ధతి... ప్లాస్టిక్ షీట్లను ఉపయోగించి మొక్క చుట్టూ నేలను కప్పి ఉంచుతారు. వేసవిలో నీరు ఎండ వేడిమికి ఆవి రికాకుండా తేమ నిలుపుకొనడం, కలుపు మొక్కలు నివారించబడి పంట ఏపుగా పెరుగుతుంది. పండ్ల తోటలకు ఇలా... మొక్క పాదుకు సరిపడా షీట్‌ను కత్తిరించి మధ్యలో గుండ్రంగా మొక్క కాండానికి సరిపడా రంధ్రం చేసి బయటకు చీలిక చేయాలి. చీలిక గుండా కాండం మధ్యలోకి వచ్చేలా తొడిగి మట్టితో షీట్ అంచులు కప్పాలి. తర్వాత మూడు నాలుగు అర్థచంద్రకారంలో రంధ్రాలు చేస్తే భూమిలోకి నీరు ఇంకుతుంది. కూరగాయల పంటల్లో ... కూరగాయల పంటల్లో మల్చిం గ్ షీట్‌ను పంట విత్తేముందు లేదా మొక్కలు మొలి చిన తర్వాత గానీ వేసుకోవచ్చు. విత్తే ముందు వేయడం ఇలా.. మొక్కల మధ్య, వరుసల మధ్య గల దూరాన్ని బట్టి ముందే షీట్‌కు రంధ్రాలు చేయాలి. రంధ్రాలు చేసిన షీట్‌ను నాగలి సాలు మీద పరిచి, రెండు వైపులా కొనళ్లపై మట్టి ఎగదోస్తే కవర్లు కొట్టుకుని పోకుండా ఉంటాయి. రంధ్రాల్లో 2 నుంచి 3 విత్తనాలు వేసి మట్టిని కప్పాలి. మొలిచిన పంట మీద ఇలా.. మొక్క చుట్టూ వేసేందుకు అనుకూలంగా షీట్‌ను తగిన సైజులో కత్తిరించి, ప్రతి మొక్క మొదటలో వచ్చేలా తొడగాలి. ఉపయోగించుకోవడం ఇలా... మల్చింగ్ షీట్లు చాలా రంగుల్లో, వివిధ రకాల మందంతో మార్కెట్లో లభిస్తాయి. సీజన్, వేసే పంటను బట్టి మల్చింగ్ షీట్లను ఎంపిక చేసుకోవాలి. ఎంత విస్తీర్ణంలో మల్చింగ్ చేసుకోవాలో అందుకు తగ్గట్టుగా సాళ్ల పొడువును బట్టి లెక్క వేయాలి. వర్షాకాలంలో రంధ్రాలున్నవి, తోటలకైతే ఎక్కువ మందంగలవి, వేసవి పంటలకు తెల్లని పురుగుల నివారణకు వెండి రంగు, కలుపు నివారణకు నలుపు రంగు మల్చింగ్ షీట్లను ఉపయోగించాలి. షీట్లను పశువులు తొక్కకుండా చూసుకోవాలి.