కంపునల్లి సోకిన వరి పంట
పునల్లితో రైతుల్లో ఆందోళన
నివారణే ముఖ్యం: కొల్చారం ఏఓ యాదగిరి
కొల్చారం: సకాలంలో వర్షాలు లేక ఖరీఫ్ పంటలు చాలావరకు దెబ్బతిన్నాయి. సీజన్ చివరలో భారీ వర్షాలు కురవడంతో చేతికొచ్చే పంటలకు సైతం నష్టం వాటిల్లింది. వరికి గింజ తొడిగే సమయంలో భారీ వర్షాలు రావడంతో కంపునల్లి మరో రూపంలో రైతును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వరికి కంపునల్లి సోకడంతో గింజల్లోని పాలు పీల్చడంతో పొట్టుగా మారడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొల్చారం మండలం రంగంపేట, పైతర గ్రామాల్లో వరికి కంపునల్లి సోకడంతో ప్రస్తుతం రైతులు ఆ పంటను రక్షించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.
ఈ పరిస్థితుల్లో వ్యవసాయాధికారులు స్పందించి తగిన సూచనలు చేయాలని లేదంటే చేతికొచ్చిన పంట నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కంపునల్లి నుంచి తీసుకునే జాగ్రత్తలను కొల్చారం ఏఓ యాదగిరి వెల్లడించారు. ఆ వివరాలు మీకోసం...
కంపునల్లి లక్షణాలు
పిల్ల తల్లి పురుగులు అభివృద్ధి చెందిన గింజల నుంచి పాలను పీల్చుకుంటాయి. గింజలు ఏర్పడే తొలి దశలో కాండం నుంచి కూడా రసం పీల్చుకుంటుంది. వరి గింజ మొక్క రంగు నలుపుగా మారడంతోపాటు సగం పాలు పోసుకున్న గింజలు తాలు గింజలుగా మారి పంట కనిపిస్తుంది. నల్లి సోకినటువంటి వరి కాండాలను వాసన చూస్తే కుళ్లిపోయిన వాసన వస్తుంది.
నివారణ చర్యలు
ముందస్తుగా గట్ల వెంట పొలంలో కలుపు మొక్కలను ఏరివేయాలి. అనంతరం రసాయన చర్యల్లో భాగంగా మలాథియాన్ 5శాతం పొడిమందును ఎకరానికి 8కిలోల చొప్పున లేదా మలాథియాన్ 50ఈసీ రెండు మిల్లీలీటర్ల మందును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 270 లీటర్ల మందు ఎకరానికి సరిపోతుంది.