kolcharam
-
తవ్వేకొద్దీ అక్రమాలు!
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఖాజీపల్లిలోని అసైన్డ్ భూమి వ్యవహారంలో తవ్వేకొద్దీ అక్రమాలు బయట పడుతున్నాయి. ఈ దందాలో అప్పటి తహసీల్దార్, ప్రస్తుతం సస్పెండైన కామారెడ్డి ఆర్డీఓ నరేందర్ కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. అసైన్డ్, సీలింగ్ భూములతో పాటు వివాదాస్పద భూముల్లో కూడా ఆయన జోక్యం ఉందని చెబుతున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఖాజీపల్లిలో సుమారు రూ.80 కోట్ల విలువ చేసే అసైన్డ్ భూమికి ఎసరు పెట్టారని సాక్షిలో ప్రచురితమైన కథనం సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. అప్పటి జిన్నారం తహసీల్దార్, ప్రస్తుత కామారెడ్డి ఆర్డీఓ నరేందర్, మరొక అధికారిని సస్పెండ్ చేసింది. అలాగే.. మరో ఆరుగురు ఉద్యోగులు, నలుగురు మాజీ సైనికులపై క్రిమినల్ చర్యలకు ఆదేశించింది. 2012–13లో నరేందర్ జిన్నారం తహసీల్దార్‌గా ఉన్న సమయంలో అన్నారంలోని 261 సర్వే నంబర్లోని అసైన్డ్ భూములను కూడా పట్టాలుగా మార్చి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా కొనసాగాయి. మాదారంలోని అసైన్డ్ స్థలాన్ని గుట్టుచప్పుడు కాకుండా పట్టాగా మార్చినట్లు సమాచారం. అలాగే.. కొర్లకుంట గ్రామంలోని 35 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూములకు సంబంధించి అధికారులు రికార్డులు తారుమారు చేశారనే విమర్శలు వస్తున్నాయి. ఖాజీపల్లిలోని 180 సర్వే నంబర్లో సీలింగ్ భూమిని ఇతరులకు అమ్మినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ భూమిలో ఫ్యాక్టరీ నిర్మాణం కూడా జరుగుతున్నట్లు సమాచారం. నరేందర్ తహసీల్దార్‌గా ఉన్న సమయంలో జరిగిన స్థలాల మార్పిడి, ఇతర రెవెన్యూపరమైన అంశాలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. మాజీ సైనికులకు నోటీసులు! అసైన్డ్ భూ దందాలో భాగస్వాములైన మాజీ సైనికులు తోట వెంకటేశ్వర్లు, ఉప్పు రంగ నాయకులు, ఎం.మధుసూదన్, ఎన్.గంగాధర్ రావులకు సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఖాజీపల్లిలోని 180 సర్వేనంబరు అసైన్డ్ భూమిని మీకు ఏ సంవత్సరంలో అప్పగించారు, ఎప్పటి నుంచి రికార్డులలో మీ పేరుంది? వాస్తవానికి ఈ భూమి ప్రభుత్వం మీకు ఇవ్వడానికి అర్హత ఉందా..? ఈ భూ కుంభకోణంలో మీ పాత్ర ఎంత ఉంది..? చనిపోయిన తహసీల్దార్ సంతకంతో మీకు పట్టాలు ఎవరిచ్చారు..? తదితర ప్రశ్నలకు 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నట్లు తెలిసింది. నోటీసులకు సరైన, సంతృప్తికరమైన సమాధానం రాకపోతే ఈ భూమిని ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోరాదనే అంశంపై కూడా వివరణ ఇవ్వాలని పేర్కొన్నట్లు సమాచారం. కొల్చారం తహసీల్దార్‌కూ లింకు! కొల్చారం: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఖాజీపల్లిలోని అసైన్డ్ భూముల వ్యవహారంలో ప్రస్తుత కొల్చారం తహసీల్దార్ పాత్ర ఉందని తేలింది. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన ఆయన.. ఈ నెల 14వ తేదీ నుంచి సెలవుపై వెళ్లినట్లు తెలిసింది. అప్పట్లో సహదేవ్ జిన్నారం తహసీల్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేశారు. భూ దందాల్లో కూడా సహదేవ్ పాత్ర ఉందని, ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి కలెక్టర్‌కు సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశించారు. కాగా, రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి సంబంధించిన సర్వే నంబర్ 297లో గల 0.13 గుంటల భూమికి సంబంధించి ప్రస్తుతం హైకోర్టులో సహదేవ్ విచారణ ఎదుర్కొంటున్నారు. -
మస్తు తాగిండ్రు..
సాక్షి, కొల్చారం(నర్సాపూర్): ఎన్నికలు వచ్చాయంటే ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతుంది. ఆ దిశగానే ప్రతీ పార్టీ మద్యాన్ని ఎన్నికల్లో ఏరుల్లా పారిస్తుంది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గడిచిన ఐదు రోజుల వ్యవధిలోనే మెదక్ జిల్లావ్యాప్తంగా ఏకంగా రూ.20.84కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయంటే ఎంతమేర పంపిణీ చేశారో అర్థం చేసుకోవచ్చు. కొల్చారం మండలం చిన్నఘణాపూర్ శివారులోని మద్యం ఆధారిత నిల్వ కేంద్రం(ఐఎంఎల్) ద్వారా జిల్లాలోని 108 మద్యం దుకాణాలకు, బార్లకు ఇక్కడి నుంచి మద్యం పంపిణీ జరుగుతుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నవంబర్ 15న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి డిసెంబర్ 3వ తేది వరకు రూ.44.41కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అనంతరం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా 16 రోజుల వ్యవధిలో రూ.56.75కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ నెల 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నాలుగు రోజులు ఐఎంఎల్ డిపోకు సెలవులు పోగా మిగిలిన ఐదు రోజుల్లో లిక్కర్ 12615 కేసులు, మద్యం విలువ రూ.14కోట్ల 90లక్షలు కాగా, బీరు 1848 కేసులు.. విలువ రూ.5కోట్ల 93లక్షలు అమ్ముడయ్యాయి. మొత్తంగా అమ్ముడైన మద్యం విలువ రూ.20 కోట్ల 84లక్షల 289లు. ఇంతపెద్ద మొత్తంలో మద్యం అమ్మకాలు జరగడం పరిశీలిస్తే ఎన్నికల్లో మద్యం ప్రభావం ఎంతన్నది తెలుస్తుంది. -
ధూంధాం కళాకారుడు మృతి
కొల్చారం(నర్సాపూర్) : కొల్చారం మండలం ఎనగండ్లకు చెందిన ధూంధాం కళాకారుడు పెద్ద రమేశ్(35) అనారోగ్యంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. రమేశ్ కొన్ని రోజులుగా మూత్ర సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించగా ఆరోగ్య పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందినట్లు లయా కళాబృందం సభ్యుడు శేఖర్‌గౌడ్ తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో డప్పు కళాకారుడిగా రమేశ్ పోషించిన పాత్ర మరవలేనిదని తోటి కళాకారులు గుర్తు చేసుకున్నారు. ఆయన మృతిపై స్థానిక టీఆర్ఎస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. -
కొల్చారం.. రండి చూసొద్దాం
కొల్చారం(నర్సాపూర్) : కొల్చారం మండల పరిసర ప్రాంతాలు పురాతన కట్టడాలకు, ప్రకృతి రమణీయతకు పేరుగాంచాయి. ఇక్కడ భూమిలో ఎక్కడ తవ్వినా.. కట్టడాలు, విగ్రహాలే దర్శనమిస్తాయి.ప్రస్తుతం కొల్చారంలో దర్శనీయ స్థలాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కొల్చారం పూర్వపు నామం కోలాచలం. కోలాచలం కాస్త కొలిచెలిమగా మారి రానురాను అది కొల్చారంగా రూపుదిద్దుకుంది. ఇక్కడి చరిత్రను తెలుసుకోవాలంటే తప్పనిసరిగా కొల్చారంను దర్శించాల్సిందే. కాకతీయుల ఆనవాళ్లు.. మండల కేంద్రానికి పురాతనమైన చరిత్ర ఉంది. ఎన్నో రాజవంశాలు ఈ నేలను పరిపాలించాయి. కొ ల్చారం గ్రామం చుట్టూ భవన నిర్మాణాల కోసం ఎక్క డ తవ్వినా ఏదో ఒక దేవత విగ్రహం, కట్టడాలకు సం బంధించిన ఆనవాళ్లు దర్శనమిస్తున్నాయి. కాకతీయు ల కాలం మొదలుకుని నిజాం కాలం వరకు ఇక్కడి విగ్రహాలు, శాసనాలు నాటి చరిత్రను తెలియజేస్తున్నాయి. ప్రకృతి రమణీయతకు నిలయం.. చూడదగ్గ మరో ప్రదేశం తిరుమలయ్యగుట్ట. కొల్చారం నుంచి వరిగుంతానికి వెళ్లే ఎడమవైపు ఈ గుట్ట దర్శనమిస్తుంది. పచ్చని ప్రకృతి రమణీయతను చాటుతూ గుట్టపైకి వెళ్తే తిరుమలేశుని దర్శించుకోవచ్చు. ఈ గుట్టకూ ఓ ప్రత్యేకత ఉంది. క్లిష్టమైన వ్యాఖ్యాన ప్రక్రియకు ప్రాణం పోసి కాళిదాసు రచించిన పంచకావ్యాలకు వ్యాఖ్యానం చేసిన సాహితీ వేత్త కోలిచాల మల్లినాథసూరి జ్ఞానసముపార్జన పొందిన స్థలం ఈ గుట్ట. ఇంతటి చరిత్రను తనలో ఉంచుకున్న కొల్చారంను దర్శించడం తప్పనిసరి. మరి ఆలస్యం ఎందుకు నేడే దర్శించుకునేందుకు బయలుదేరండి మరీ. మతసామరస్యానికి ప్రతీక.. ఇక్కడ పురాతనమైన దర్గా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇక్కడ ముస్లింల పరిపాలన కొనసాగిందనడానికి షేక్షాబొద్దిన్ దర్గా నిదర్శనం. ఇక్కడ వారంలో ఆరు రోజులు పెద్ద ఎత్తున భక్తులు మతాలకు అతీతంగా వచ్చి దర్శించుకుంటారు. తొమ్మిదిన్నర అడుగుల ఏకశిలా విగ్రహం.. 1984లో వీరభద్రస్వామి ఆలయం పక్కన ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు చేపట్టగా శెల్యరాతితో చెక్కిన ఏకశిలతో దిగంబరంగా తలపై ఏడు సర్పాలు పడగకప్పి ఉన్న విగ్రహం బయటపడింది. తొమ్మిదిన్నర అడుగులున్న ఈ విగ్రహం 11వ శతాబ్దానికి చెందిన కళ్యాణి చాళుక్యుల కాలం నాటిదిగా గుర్తించారు. ఆనాటి రాజైన త్రిభువన ఈ శిలావిగ్రహాన్ని చెక్కించినట్లుగా, ఇది జైన గురువైన 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడి విగ్రహంగా చరిత్రకారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ విగ్రహాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన జైన ఆలయంలో ప్రతిష్ఠించారు. దేశంలో శ్రావణబెలగొళలోని గోమటేశ్వరుని విగ్రహం తర్వాతి స్థానాన్ని ఈ ఏకశిలా విగ్రహం దక్కించుకుంది. పూర్తి ప్రకృతి రమణీయత ప్రతిబింబించేలా ప్రశాంత వాతావరణంలో దేవాలయం నిర్మించడంతో చాలామంది పర్యాటకులు ఈ దేవాలయాన్ని దర్శించేందుకు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. -
తప్పిన పెను ప్రమాదం
కొల్చారం(నర్సాపూర్): మెదక్ వైపు నుంచి వచ్చిన ఎక్స్‌ప్రెస్ బస్సు ప్రయాణికులను దించడానికి గేటు వద్ద ఆగింది. బస్సులో ఎక్కేవారు ఎక్కుతున్నారు... దిగేవారు దిగుతున్నారు... ఈ క్రమంలో బస్సు ఇంజన్ ముందు భాగంలో చిన్నపాటి మంటలు చెలరేగాయి. గమనించిన చుట్టుపక్కలవారు డ్రైవర్‌ను, బస్సులోని ప్రయాణికులను అప్రమత్తం చేశారు. మంటలు మరింతగా చెలరేగడంతో ప్రయాణికులు ఎలాగోలా బస్సులో నుంచి దిగి ప్రాణాలను కాపాడుకునకున్న సంఘటన కొల్చారంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... బాన్సువాడ డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు బోదన్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తోంది. కొల్చారంలోని బస్టాండ్ సమీపంలోకి వచ్చి ప్రయాణికులను దించేందుకు డ్రైవర్ బస్సును నిలిపాడు. ఇంజన్ ముందు భాగంలో చిన్నపాటి మంటలు చెలరేగడంతో అటువైపుగా హోటళ్లలో వారు అదిగమనించి కేకలు వేశారు. దీంతో డ్రైవర్, ప్రయాణికులు లగేజీని బస్సులోనే వదిలి ఉరుకులు, పరుగులు పెట్టారు. మంటలు పెద్దగా మారి బస్సు ఇంజన్ భాగంలో పూర్తిగా కాలిపోయింది. బస్సులో దట్టమైన నల్లటిపొగ కమ్ముకోవడం గమనించిన చుట్టుపక్కల యువకులు, హోటళ్లకు చెందిన వారు మంటలను ఆర్పేందుకు ఇసుక చల్లారు. నీళ్లను కూడా ఉపయోగించడంతో పెనుప్రమాదం తప్పింది. బస్సు ముందు భాగంమాత్రం పూర్తిగా దెబ్బతింది. బస్సు నడుస్తున్నప్పుడు ప్రమాదం జరిగితే ప్రాణనష్టం వాటిల్లే అవకాశాలు ఉండేవని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి బస్సు మరింత కాలిపోకుండా సహాయక చర్యలు చేపట్టారు. -
వరికి తెగులు
పునల్లితో రైతుల్లో ఆందోళన నివారణే ముఖ్యం: కొల్చారం ఏఓ యాదగిరి కొల్చారం: సకాలంలో వర్షాలు లేక ఖరీఫ్ పంటలు చాలావరకు దెబ్బతిన్నాయి. సీజన్ చివరలో భారీ వర్షాలు కురవడంతో చేతికొచ్చే పంటలకు సైతం నష్టం వాటిల్లింది. వరికి గింజ తొడిగే సమయంలో భారీ వర్షాలు రావడంతో కంపునల్లి మరో రూపంలో రైతును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వరికి కంపునల్లి సోకడంతో గింజల్లోని పాలు పీల్చడంతో పొట్టుగా మారడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొల్చారం మండలం రంగంపేట, పైతర గ్రామాల్లో వరికి కంపునల్లి సోకడంతో ప్రస్తుతం రైతులు ఆ పంటను రక్షించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయాధికారులు స్పందించి తగిన సూచనలు చేయాలని లేదంటే చేతికొచ్చిన పంట నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కంపునల్లి నుంచి తీసుకునే జాగ్రత్తలను కొల్చారం ఏఓ యాదగిరి వెల్లడించారు. ఆ వివరాలు మీకోసం... కంపునల్లి లక్షణాలు పిల్ల తల్లి పురుగులు అభివృద్ధి చెందిన గింజల నుంచి పాలను పీల్చుకుంటాయి. గింజలు ఏర్పడే తొలి దశలో కాండం నుంచి కూడా రసం పీల్చుకుంటుంది. వరి గింజ మొక్క రంగు నలుపుగా మారడంతోపాటు సగం పాలు పోసుకున్న గింజలు తాలు గింజలుగా మారి పంట కనిపిస్తుంది. నల్లి సోకినటువంటి వరి కాండాలను వాసన చూస్తే కుళ్లిపోయిన వాసన వస్తుంది. నివారణ చర్యలు ముందస్తుగా గట్ల వెంట పొలంలో కలుపు మొక్కలను ఏరివేయాలి. అనంతరం రసాయన చర్యల్లో భాగంగా మలాథియాన్ 5శాతం పొడిమందును ఎకరానికి 8కిలోల చొప్పున లేదా మలాథియాన్ 50ఈసీ రెండు మిల్లీలీటర్ల మందును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 270 లీటర్ల మందు ఎకరానికి సరిపోతుంది. -
పదేళ్లుగా శిథిలావస్థ
కూలేందుకు సిద్ధంగా ఉన్న ఏటిగడ్డ మాందాపూర్ పాఠశాల కొల్చారం: పదేళ్లుగా శిథిలావస్థలో ఉన్న కొల్చారం మండలం ఏటిగడ్డ మాందాపూర్ పాఠశాల పరిస్థితి దారుణంగా తయారైంది. ఏ క్షణంలోనైనా కూలేందుకు సిద్ధంగా ఉంది. పదేళ్ల నుంచి గ్రామస్తులు ఇక్కడ నూతన పాఠశాల నిర్మించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తులు చేస్తున్నా ఫలితం లేదు. పాఠశాల స్థితిగతులపై సాక్షి దినపత్రిక పలుమార్లు హెచ్చరిస్తు వస్తున్నా అధికారుల్లో మాత్రం చలనం లేదు. దీంతో గ్రామస్తులు గత నాలుగు రోజుల నుంచి పాఠశాలను మూసివేయించారు. నూతన పాఠశాల భవనం నిర్మించే వరకు పాఠశాలను కొనసాగించేది లేదంటూ డిమాండ్ చేస్తున్నారు. -
ఎట్టకేలకు చిక్కింది..
-
ఎట్టకేలకు చిక్కింది..
కొల్చారం: మెదక్ జిల్లా కొల్చారం మండలం చుక్కాపూర్లో మంగళవారం ఉదయం నుంచి కలకలం సృష్టించిన చిరుత ఎట్టకేలకు అటవీ సిబ్బంది వలలో చిక్కింది. చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు చేసిన రెండో ప్రయత్నంలో సఫలీకృతులయ్యారు. తొలి ప్రయత్నంలో నాసిరకం వల విసరడంతో ఎంతో నేర్పుతో చిరుత తప్పించుకున్న విషయం తెలిసిందే. అటవీశాఖ అధికారులను ముప్పుతిప్పులు పెట్టి మూడు చెరువల నీళ్లు తాగించిన చిరుత తమ వలలో చిక్కడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. గ్రామంలో చిరుతపులి సంచరించడంతో ఉదయం నుంచి బిక్కుబిక్కుమంటున్న చుక్కాపూర్ వాసులు.. చిరుత పట్టివేతపై హర్షం వ్యక్తం చేశారు. నేటి ఉదయం గ్రామంలో ప్రవేశించిన చిరుత ఆరుగురు వ్యక్తులపై దాడి చేసి గాయపరిచింది. గాయాలపాలైనవారు మెదక్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స విషయం అందరికీ విదితమే. -
భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్య
కొల్చారం (మహబూబ్‌నగర్) : గొడవపడి పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిన భార్య ఆరు నెలలైనా తిరిగి రాకపోయేసరికి తీవ్ర మనస్తాపానికి గురైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కొల్చారం మండలం పైతర గ్రామంలో సోమవారం ఉదయం వెలుగుచూసింది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం... కుమ్మరి జయరాం(32), సురేఖ దంపతులకు అక్షయ, శైలజ అనే కూతుళ్లు ఉన్నారు. జయరాం వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే ఆరు నెలల క్రితం భర్తతో గొడవపడి సురేఖ పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి జయరాం ఒంటరిగా ఉంటున్నాడు. ఆరు నెలలు గడుస్తున్నా భార్య తిరిగి రాకపోవడంతో ఆదివారం రాత్రి ఇంట్లోనే చీరతో ఉరి వేసుకున్నాడు. మరో ఇంట్లో ఉంటున్న అతని తల్లి దుర్గమ్మ సోమవారం ఉదయం వెళ్లి చూడగా అతడు ఉరికి వేలాడుతున్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
అప్పులబాధతో రైతు ఆత్మహత్య
కొల్చారం (నల్గొండ జిల్లా) : తనకున్న రెండెకరాల భూమిని సాగులోకి తేవాలని అప్పు చేసి రెండు బోర్లు వేసినా చుక్క నీరు పడకపోగా.. ఆరుతడి పంటలు వేసైనా బోర్ల కోసం తెచ్చిన అప్పు తీర్చాలనుకున్న ఆ రైతుకు కాలం కలిసి రాకపోవడంతో చావే శరణ్యమైంది. దీంతో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించాడు. ఈ ఘటన కొల్చారం మండలం సంగాయిపేట గిరిజన తండాలో గురువారం వెలుగుచూసింది. బాధిత కుటుంబీకుని భార్య చెమ్లి, తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం... తండాకు చెందిన రైతు లంబాడి విఠల్(46) తండాకు సమీపంలో రెండెకరాల పొలం ఉంది. కొన్నేళ్ళుగా వర్షాధారంతోనే పంట సాగు చేస్తూ వచ్చాడు. కాగా గత రెండేళ్ళుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో భూమి బీడుగా ఉంటూ వచ్చింది. దీంతో ఎలాగైనా భూమిని సాగులోకి తేవాలనుకున్న విఠల్ బ్యాంక్ ద్వారా, ఇతర ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పుగా డబ్బులు తీసుకువచ్చి రెండు బోర్లు వేసినట్లు తెలిపారు. బోర్లు వేసినా నీరు పడకపోవడంతో అటు సాగులోకి భూమి రాక తెచ్చిన అప్పులు తీర్చే మార్గం కనిపించకుండాపోయింది. మరోవైపు రుణమాఫీకి సంబంధించిన డబ్బుల కోసం గత రెండు రోజుల నుంచి స్థానిక రంగంపేట ఎస్‌బిహెచ్ బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ బ్యాంక్ రుణం పూర్తిగా రెన్యువల్ చేస్తే మాఫీ డబ్బులు ఇస్తామని చెప్పడంతో విఠల్ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తయారైంది. ఆరుతడి పంటకింద వేసిన మొక్కజొన్న సైతం వర్షాలు కురవక ఎండుముఖం పడుతుండడంతో ఇక అప్పులు తీర్చేమార్గం కనిపించకపోవడంతో గత కొన్ని రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం 5గంటల ప్రాంతంలో పొలం వద్దకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి పొలానికి కొద్ది దూరంలో వేపచెట్టుకు ఉరివేసుకున్నాడు. విఠల్‌కు దాదాపు 3లక్షల వరకు బ్యాంక్, ప్రైవేటు అప్పులు ఉన్నట్లు తెలిసింది. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబీకులు కొల్చారం పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు విఠల్‌కు ఇద్దరు కుమారులు శ్రీను, కిషన్ ఉన్నారు. -
'నిరక్షరాస్యతతోనే మూఢనమ్మకాలు'
కొల్చారం (మెదక్ జిల్లా) : గ్రామాల్లో నిరక్షరాస్యతతోనే మూఢనమ్మకాలు ప్రబలి ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారని మెదక్ డీఎస్పీ రాజారత్నం తెలిపారు. కొల్చారం మండలం వరిగుంతంలో గత ఆదివారం గ్రామస్థులు బాణామతి నెపంతో గ్రామానికి చెందిన దంపతులను పంచాయతీ పెట్టి బెదిరించి జరిమానా విధించారు. దీంతో బాధితులు పోలీస్టేషన్‌ను ఆశ్రయించారు. పంచాయతీ నిర్వహించిన గ్రామపెద్దలపై సోమవారం కొల్చారం ఎస్సై రమేష్‌నాయక్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. గ్రామంలో నెల క్రితం పోలీసుల ఆధ్వర్యంలో మూఢనమ్మకాలపై కళాజాత నిర్వహించారు. అయినా గ్రామంలో ప్రజలు మూఢనమ్మకాలను నమ్ముతుండడంతో మరోసారి ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశ్యంతో మంగళవారం గ్రామంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. స్థానిక సర్పంచ్ లక్ష్మయ్య అధ్యక్షతన జరిగిన సదస్సుకు మెదక్ డీఎస్పీ రాజారత్నం హాజరయ్యారు. డీఎస్పీ సదస్సునుద్దేశించి మాట్లాడుతూ.. ప్రస్తుతం శాస్త్ర సాంకేతిక రంగంలో అడుగిడుతున్న పరిస్థితుల్లో ప్రజల్లో మూఢనమ్మకాలు ఇంకా పెనవేసుకొని ఉండడం దురదృష్టకరమన్నారు. సమాజంలో ఎక్కడా చేతబడి, బాణామతి లేదని మానసిక రోగాలకు లోనైన వ్యక్తుల కారణంగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయన్నారు. అనుమానం పెనుభూతం లాంటిదని.. ఇది నమ్మితే ఇబ్బందుల్లోకి వెళ్లడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా మహిళలు ఇలాంటివాటిని నమ్మడంతో ఆ కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయన్నారు. ప్రతి వ్యక్తి చదువుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం వల్ల ఇలాంటి ఘటనలు దూరమవుతాయన్నారు. అనారోగ్యం పాలైన వ్యక్తులు భూతవైద్యులను ఆశ్రయించకుండా ఆస్పత్రిలోనే వైద్యం చేయించుకోవాలని సూచించారు. బాణామతి నెపంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని దాడులకు, ఇతరత్రా వాటికి పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇకపై ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా గ్రామస్థులు పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తహశీల్దార్ నిర్మల మాట్లాడుతూ.. మూడనమ్మకాలను దరిచేరనివ్వద్దన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ రూరల్ సీఐ రామక్రిష్ణ, ఎస్సై రమేష్‌నాయక్, గ్రామ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అడివప్ప, గ్రామస్థులు పాల్గొన్నారు. -
తవ్వుకున్నోడికి.. తవ్వుకున్నంత
కొల్చారం : అధికారుల నిర్లక్ష ్యంతో ఇసుక అక్రమార్కులు తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత అన్న నానుడి నిజం చేస్తూ మంజీరా నదిని జల్లెడ పడుతున్నారు. అధికారులు అటు వైపు చూడక పోవడంతో ఇ దే అదనుగా భావించి ఇసుక అక్రమ రవాణాను జోరుగా సాగిస్తున్నారు. వా ల్టా చట్టం ఇక్కడ ఏ కోశాన కనిపించదు. దీంతో దోపిడీదారుల రాజ్యంగా మారిం ది. మండలంలోని ఎనగండ్ల, కోనాపూర్, వై మాందాపూర్, పైతర, తుక్కాపూర్ల మీదుగా మంజీరా నది ప్రవహిస్తోంది. నదీ ప్రవాహం సమయంలో పెద్ద ఎత్తున ఇసుక తెట్టలు నదిలో పేరుకు పోయి ఉంటాయి. ఇదే సమయంలో ప్రధానంగా కోనాపూర్, మాం దాపూర్, తుక్కాపూర్ గ్రామాలకు చెంది న కొందరు అక్రమార్కులు ధనార్జనే ధ్యేయంగా నది నుంచి ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ట్రాక్టర్లు, లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వీరి ఇసుక అక్రమ రవాణాకు గ్రామ సేవకులతో పాటు రెవె న్యూ అధికారులు సైతం అండగా నిలుస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇసుక అక్రమ రవాణాకు ట్రాక్టర్ల యజమాను లు ఏకంగా నదిలోకి రహదారినే ఏర్పా టు చేశారంటే ఎంత దర్జాగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. వై.మాందాపూర్, కోనాపూర్ పరి సరాల్లో పెద్ద ఎత్తున ఇసుక డంపులను ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి వేళల్లో లారీల్లో హైదరాబాద్ వంటి పెద్ద నగరాలకు దుంపలకుంట చౌరస్తా మీదుగా తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్న మండల రెవెన్యూ అధికారులుగాని, గ్రామ పంచాయతీ అధికారులు, గ్రామసేవకులు కూడా పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే నదిలో ఇసుక మేటలు అంతరించి భూగర్భ జలాలు తగ్గడంతో పాటు వ్యవసాయ బోర్లపై ఆధారపడ్డ తాము తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్టవేయా లని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
కబడ్డీ పోటీలకు రంగంపేట విద్యార్థిని
కొల్చారం, న్యూస్‌లైన్: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు రంగంపేట ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.వినోద ఎంపికైనట్టు ఆ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు ఎండీ గౌసొద్దీన్ తెలిపారు. మంగళవారం సంగారెడ్డిలో జరిగిన జిల్లాస్థాయి బాలికల కబడ్డీ పోటీలో వినోద ప్రతిభ కనబర్చడంతో రాష్ట్రస్థాయికి ఎంపికైనట్టు ఆయన పేర్కొన్నారు. ఈనెల 15న కృష్ణా జిల్లా గుడివాడలో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థినిని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించారు. -
పోలీసులను ఆశ్రయించిన నవదంపతులు
కొల్చారం, న్యూస్‌లైన్: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ ప్రేమజంట రక్షణ కల్పించాలని మంగళవారం కొల్చారం పోలీసులను ఆశ్రయించారు. స్థానిక ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం...కొల్చారం గ్రామానికి చెందిన బోరంపేట దుర్గయ్య కుమారుడు శేఖర్, చిన్నఘణాపూర్ గ్రామానికి చెందిన శేరిపల్లి కమలమ్మ కూతురు మాధవి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురికీ బం ధుత్వం ఉన్నప్పటికీ వీరి వివాహానికి శేఖర్ తల్లి అభ్యం తరం తెలిపింది. దీంతో శేఖర్, మాధవిలు అక్టోబర్ 29వ తేదీన ఏడుపాయల దేవస్థానంలో పెళ్లి చేసుకున్నారు. తిరిగి సోమవారం ఇంటికి రాగా, దంపతులను శేఖర్ తల్లి వెళ్లగొట్టింది. దీంతో నవదంపతులు కొల్చారం పోలీసులను ఆశ్రయించడంతో స్పందించిన ఎస్ఐ ఇరుకుటుం బాలవారినీ పిలిపించి నచ్చజెప్పేందుకు ప్రయత్నించా రు. అయితే శేఖర్ తల్లి ఒప్పుకోకపోవడంతో మేజర్లయిన వీరికి చట్ట ప్రకారం రక్షణ కల్పిస్తామని ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు శేఖర్, మాధవిల నుంచి ఫిర్యాదు స్వీకరించారు.