కొల్చారం (మహబూబ్‌నగర్) : గొడవపడి పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిన భార్య ఆరు నెలలైనా తిరిగి రాకపోయేసరికి తీవ్ర మనస్తాపానికి గురైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కొల్చారం మండలం పైతర గ్రామంలో సోమవారం ఉదయం వెలుగుచూసింది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం... కుమ్మరి జయరాం(32), సురేఖ దంపతులకు అక్షయ, శైలజ అనే కూతుళ్లు ఉన్నారు. జయరాం వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
అయితే ఆరు నెలల క్రితం భర్తతో గొడవపడి సురేఖ పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి జయరాం ఒంటరిగా ఉంటున్నాడు. ఆరు నెలలు గడుస్తున్నా భార్య తిరిగి రాకపోవడంతో ఆదివారం రాత్రి ఇంట్లోనే చీరతో ఉరి వేసుకున్నాడు. మరో ఇంట్లో ఉంటున్న అతని తల్లి దుర్గమ్మ సోమవారం ఉదయం వెళ్లి చూడగా అతడు ఉరికి వేలాడుతున్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.