పెళ్లింట విషాదం.. భార్యకు పురుగులమందు కలిపి | Nalgonda Crime: Husband And Wife Suicide Attempt After Daughter wedding | Sakshi
Sakshi News home page

పెళ్లింట విషాదం.. భార్యకు పురుగులమందు కలిపి

Published Mon, Oct 21 2024 10:06 AM | Last Updated on Mon, Oct 21 2024 10:06 AM

Nalgonda Crime: Husband And Wife Suicide Attempt After Daughter wedding

సాక్షి,  నల్లగొండ: పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. పురుగులమందు కలిపిన కూల్‌డ్రింక్‌ను భార్యకు తాగించి.. ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఏఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం మొసంగి గ్రామానికి చెందిన బడుగుల వెంకటయ్య(43)– జ్యోతి దంపతులు ఈనెల 16న కుమార్తె వివాహం జరిపించారు. ఆదివారం తమ కుమార్తెను అత్తగారి ఇంటి నుంచి తీసుకురావాల్సి ఉండగా, పురుగుల మందు కలిపిన కూల్‌ డ్రింక్‌ను భార్య జ్యోతికి ఇచ్చి, తాను గదిలోకి వెళ్లి తలుపులు వేసుకొని గడియ పెట్టుకున్నాడు. 

అప్పటికే కొంచెం కూల్‌డ్రింక్‌ తాగిన జ్యోతి పురుగుల మందు వాసన ఉండడంతో పారబోసింది. అనుమానం వచ్చి చుట్టుపక్కల వారిని పిలిచింది. వారు వచ్చి తలుపులు తెరిచారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన నల్లగొండకు తరలించారు. వెంకటయ్య మృతి చెందగా, జ్యోతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.

ఇంగ్లిష్‌ మీడియంలో పాఠాలు అర్థం కావడంలేదని.. 
చిలుకూరు: ఇంగ్లిష్‌ మీడియంలో పాఠాలు అర్థం కావడం లేదని, దీంతో మార్కులు తక్కువ వస్తున్నాయని ఇంటర్‌ విద్యార్థి మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరిధిలోని కవిత జూనియర్‌ కళాశాలలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం సజ్జాపురానికి చెందిన బీమన శేఖర్‌ కుమారుడు బీమన వినయ్‌ (17) చిలుకూరు మండల పరిధిలోని కవిత జూనియర్‌ కళాశాలలో ఎంపీసీ గ్రూప్‌లో చేరాడు. 

10వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివిన వినయ్‌.. ఇంటర్‌లో ఇంగ్లిష్‌ మీడియంలో సబ్జెక్టులు అర్థంకాక మార్కులు తక్కువగా వస్తున్నాయని కొంతకాలంగా బాధపడుతున్నాడు. ఈ క్రమంలో దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన వినయ్‌ తిరిగి కళాశాలకు వెళ్లడానికి ఇష్టపడలేదు. దీంతో తల్లిదండ్రులు సర్ది చెప్పి ఆదివారం అతడిని మేనమామ, బంధువులు తీసుకొని వచ్చి కళాశాలలో విడిచి పెట్టి వెళ్లారు. ఆ సమయంలో స్టడీ అవర్స్‌ నడుస్తుండటంతో విద్యార్థులు, అధ్యాపకులు తరగతి గదుల్లో ఉన్నారు. హాస్టల్‌ గదిలో లగేజీ పెట్టి వస్తానని వెళ్లిన వినయ్‌ అక్కడున్న ఫ్యాన్‌కు టవల్‌తో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

అరగంట తరువాత గమనించిన తోటి విద్యార్థులు, అధ్యాపకులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం కోదాడలోని ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వినయ్‌ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాంబాబు తెలిపారు. దసరా సెలవులు ముగించుకుని తిరిగి వెళ్లిన రోజే ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement