మనం ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలను ఆరోగ్యంగా ఉంచాలి. 98% ప్రాణవాయువును మొక్కలే ఇస్తున్నాయి. 80% ఆహారం పంటల ద్వారానే వస్తోంది. భూతాపోన్నతి కారణంగా విజృంభిస్తున్న పురుగులు, తెగుళ్ల వల్ల దిగుబడి 40% మేరకు దెబ్బతింటున్నది.
ఈ నష్టం విలువ ఏడాదికి 22,000 కోట్ల డాలర్లని ఎఫ్.ఎ.ఓ. లెక్కగట్టింది. మన దేశంలో కత్తెర పురుగు, నల్ల తామర పురుగు, రుగోస్ తెల్లదోమ.. వంటివి ఇందుకు ఉదాహరణలు. అయితే, పొలాలు, పర్యావరణ వ్యవస్థలకున్న ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యంపై ఈ నష్టం తీవ్రత ఆధారపడి ఉంటుందని ఎఫ్.ఎ.ఓ. స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో.. సాగు పద్ధతి మార్చుకుంటే వీటి తీవ్రత తగ్గినట్లు ఏపీ రైతు సాధికార సంస్థ అధ్యయనంలో తేలింది. రసాయనిక వ్యవసాయంలో పురుగుల తీవ్రత, దిగుబడి నష్టం 50 శాతం పైగా ఉంటే.. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో 10% మాత్రమే.
ప్రధాన పంట సాగుకు ముందు 30 రకాల పచ్చిరొట్ట (నవధాన్య) పంటలు సాగు చేసే రైతుల జీవవైవిధ్య క్షేత్రాల్లో ఒక్కో ఏడాది గడిచేకొద్దీ చీడపీడల బెడద అంతకంతకూ తగ్గుతోందని కూడా ఈ అధ్యయనం చెబుతోంది. ఈ నెల 12న ‘అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక కథనం.
మన దేశంలో ఇటీవల సంవత్సరాల్లో పంటలకు పెను నష్టం కలుగజేస్తున్న కత్తెర పురుగు, నల్ల తామర పురుగు, రుగోస్ తెల్లదోమ.. వంటి పురుగులే ఇందుకు ఉదాహరణలు. రసాయనిక వ్యవసాయం చేసే రైతులకు ఈ పురుగులు తీవ్ర నష్టం కలిగిస్తుండగా, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించే రైతుల పొలాల్లో ఈ పురుగుల తీవ్రత, నష్టం చాలా తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయాన్ని అమలుచేస్తున్న రైతు సాధికార సంస్థ అధ్యయన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. 30 రకాల పచ్చిరొట్ట పంటలు వేసిన తర్వాత ఆహార/వాణిజ్య పంటలు సాగు చేయటంయటం వల్ల వాతావరణ మార్పులను, చీడపీడలను తట్టుకొని నిలబడి మంచి దిగుబడులను ఇచ్చే శక్తి ప్రకృతి సేద్య క్షేత్రాలకు పెరుగుతున్నట్లు అర్థం అవుతున్నది.
రైతులు వచ్చే ఖరీఫ్‌లో సాగు చేసే ప్రధాన పంటకు చీడపీడల బెడద తక్కువగా ఉండాలన్నా, భూసారం పెరగాలన్నా.. ఇప్పుడే పచ్చిరొట్ట పంటలు సాగు చేయాలి. ఏ జనుమో, జీలుగో వేస్తే చాలదు.. ముప్పై పంటల విత్తనాలను చల్లేయాలి అంటున్నది ఏపీ రైతు సాధికార సంస్థ.
మిత్ర పురుగులే రైతుల సైన్యం
ప్రకృతి సేద్యం దిగుబడి సాధించటంతో పాటు అనేక ఇతర ప్రయోజనాలు కూడా నెరవేరుతున్నాయి. జీవవైవిధ్యం. ఒకే పంట వేయటం కాదు. అనేక పంటలు కలిపి సాగు చేయటం అనేది ప్రకృతి సేద్యంలో ఓ ముఖ్యమైన మూలసూత్రం. బహుళ పంటలు ఉన్న పొలంలో పురుగులు గానీ, తెగుళ్లుగానీ అదుపులో ఉంటాయి.
రకరకాల పంటలున్న చేనులో అనేక రకాల మిత్ర పురుగులు మనుగడ సాధ్యపడుతుంది. రసాయనిక పురుగుమందులు వాడే పొలాల్లో శత్రు పురుగులతో పాటు ఈ మిత్ర పురుగులు కూడా నాశనమవుతాయి. కాబట్టి, చీడపీడలు ఉధృతం అవుతున్నాయి. ప్రకృతి వ్యవసాయంలో మిత్ర పురుగులే రైతుల సైన్యం.
ప్రకృతి సేద్యం చేయటంతోపాటు.. ఏడాది పొడవునా ఇటువంటి బహుళ పంటలతో భూమిని కప్పి ఉంచితే (365 డేస్ గ్రీన్ కవర్) ఇంకా మంచిది. ఈ పద్ధతులు పాటించే ప్రకృతి సేద్య క్షేత్రాల్లో చీడపీడల సమస్య చాలా తక్కువగా కనిపిస్తోందని ఏపీ రైతు సాధికార సంస్థ తెలిపింది. ముఖ్యంగా, కత్తెర పురుగు, నల్లతామర వంటి పురుగుల విషయంలో ఇది ప్రస్ఫుటంగా నమోదైంది.
90% తగ్గిన కత్తెర పురుగు
విజయనగరం, ప.గో., గుంటూరు జిల్లాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్న 49 ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు, మరో 49 రసాయనిక వ్యవసాయ క్షేత్రాల్లో కత్తెర పురుగు తీవ్రతపై ఏపీ రైతు సాధికార సంస్థ అధ్యయనం చేసింది. కత్తెర పురుగు తీవ్రత పురుగుమందులు చల్లిన పొలాల్లో 5% మాత్రమే తగ్గితే, ప్రకృతి సేద్య పొలాల్లో 90% తగ్గిందని ఈ అధ్యయనంలో తేలింది.
నల్ల తామర:
ఇక్కడ 9.87% అక్కడ 57% లక్షల ఎకరాల్లో మిరప పంటకు గతంలో నష్టం కలిగింది. రసాయనిక పురుగుమందులు ఎన్ని వాడినా నల్లతామర తగ్గలేదు. కానీ ప్రకృతి వ్యవసాయంలో నియంత్రణలోకి వచ్చింది. ఏపీ రైతుసాధికార సంస్థ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లోని 70 ప్రకృతి వ్యవసాయ మిరప తోటల్లో, 73 రసాయనిక మిరప తోటల్లో అధ్యయనం చేసింది.
నల్లతామర కలిగించిన నష్టం ప్రకృతి సేద్య మిరప పొలాల్లో 9.87% కాగా, రసాయనిక మిరప పొలాల్లో 57.53% వరకు ఉందని గుర్తించారు. ప్రకృతిసేద్యం చేస్తున్న మిరప పొలాల్లో అక్షింతల పురుగులు, క్రైసోపెర్ల అనే రెక్కల పురుగులు వంటి మిత్ర పురుగులు విస్తారంగా నల్లతామర పురుగుల్ని తింటూ నియంత్రించినట్లు కనుగొన్నారు. రసాయనిక పురుగుమందులు చల్లే మిరప పొలాల్లో ఇవి కనిపించలేదు.
పంటలకొద్దీ మిత్రపురుగులు
పీఎండీఎస్‌లో నవధాన్య పంటలుగా ఎన్ని ఎక్కువ పంటలు సాగు చేస్తే ఆ తర్వాత సీజన్‌లో మిత్రపురుగుల సంఖ్య ఎక్కువగా ఉండి చీడపీడల బెడద తగ్గినట్లు రైతు సాధికార సంస్థ గుర్తించింది. వేర్వేరు జిల్లాల్లో కొన్ని పొలాల్లో 27 రకాలు, మరికొన్ని పొలాల్లో 19 రకాలు, ఇంకొన్ని పొలాల్లో 9 రకాల నవధాన్య పంటలను సాగు చేయించారు. 9,19 రకాలు సాగు చేసిన పొలాల్లో కన్నా 27 రకాలు సాగు చేసిన పొలాల్లో మిత్ర పురుగుల సంఖ్య అత్యధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఎన్ని ఎక్కువ పంటలు సాగు చేస్తే అన్ని ఎక్కువ మిత్రపురుగులుంటాయి.
పీఎండీఎస్‌తో తగ్గుతున్న చీడపీడల తీవ్రత
ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో భాగంగా వానకు ముందే 30 రకాల ఆహార ధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు తదితర పంటల విత్తనాలను (ప్రీ మాన్‌సూన్ డ్రై సోయింగ్– పీఎండీఎస్) వానకు ముందే విత్తితే.. భూమి సారవంతం అవుతుంది. భూమి తేమగా ఉంటే నేరుగా విత్తనాలు వేస్తున్నారు.
తేమ లేకపోతే విత్తనాలకు మట్టి, ఘనజీవామృతం తదితరాలను పట్టించి ‘విత్తన గుళికలు’ (సీడ్ పెల్లెట్స్) తయారు చేసి వేసవిలోనే వానకు ముందే విత్తుతున్నారు. ఇది ఏపీలో ముఖ్యంగా అనంతపురం జిల్లా కేంద్రంగా ప్రకృతి వ్యవసాయదారులు అనుసరిస్తున్న వినూత్న ఆవిష్కరణ. ఈ ఏడాది ఇతర జిల్లాల్లో కూడా ఈ పద్ధతిని రైతులకు ఆర్బీకేల ద్వారా కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు పరిచయం చేస్తున్నారు.
వరుసగా రెండేళ్లు, అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు వేసవిలో 30 రకాల పీఎండీఎస్ పంటలు పండించిన పొలాల్లో ఆ తర్వాత సీజన్‌లో సాగు చేసిన 123 క్షేత్రాల్లో చీడపీడల బెడదపై అధ్యయనం చేశారు. మూడేళ్లుగా వేసవిలో పీఎండీఎస్ పంటలు సాగు చేసిన పొలాల్లో అన్ని రకాల చీడపీడల బెడద రసాయనిక పొలాలతో పోల్చినప్పుడు 66 శాతం తగ్గిపోయినట్లు గుర్తించటం విశేషం.
రైతు దేవుళ్ల చేతుల్లోనే భవిత!
50–60 ఏళ్ల విషపూరిత వ్యవసాయం వల్ల మన భూములు, వాతావరణం, గాలి, నీరు నాశనమయ్యాయి. క్లైమెట్ ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి. ఆరో ప్రళయం రాబోతోంది. పోషకార/ఆహార భద్రతకూ ముప్పు రానుంది. దీని నుంచి రక్షించగల శక్తి ఒక్క రైతు చేతులోనే ఉంది.
రసాయనిక వ్యవసాయం వల్ల వెలువడే కర్బన ఉద్గారాలను తగ్గించడంతో పాటు యావత్తు భూగోళాన్ని చల్లబరిచే శక్తి కూడా ప్రకృతి/పునరజ్జీవ వ్యవసాయానికి ఉంది. రసాయనాలు వాడకుండా పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేయటంతో పాటు.. 30 రకాల నవధాన్య (పీఎండీఎస్) పంటల సాగును వేసవిలో, పంట సీజన్లకు మధ్యలో ప్రతి పొలంలోనూ సాగు చేయాలి. ఇన్ని పంటలు ఎందుకంటే ప్రతి పంట మొక్క వేర్ల దగ్గర వేర్వేరు రకాల మేలు చేసే సూక్ష్మజీవరాశి పెరుగుతోంది. ఎన్ని ఎక్కువ పంటలు వేస్తే అన్ని ఎక్కువ రకాల సూక్ష్మజీవరాశి తిరిగి భూమిలోకి చేరుతున్నది.
మట్టిలో సూక్ష్మజీవుల వైవిధ్యం ఎంత ఎక్కువగా ఉంటే మన భూమి అంత సారవంతమవుతోంది. అంత శక్తివంతమవుతోంది. అంతగా చీడపీడల బెడద తగ్గుతుంది. కరువును, ప్రతికూల పరిస్థితులను తట్టుకొని నిలబడి 20–30% అధిక దిగుబడులు వస్తున్నాయి. ప్రతి పొలంలో పీఎండీఎస్ పంటలు సాగు చేయాలి. వాన నీరు పూర్తిగా పొలాల్లో ఎక్కడికక్కడే పూర్తిగా ఇంకుతుంది. ఇది అనంతపురం రైతు దేవుళ్ల అద్భుత ఆవిష్కరణ.
ఈ ఏడాది ఏపీలో ఇతర జిల్లాల్లో కూడా దీన్ని అమలు చేస్తున్నాం. 10 వేల మంది రైతులను మాస్టర్ ట్రైనర్లుగా తీర్చిదిద్దాలనేది లక్ష్యం. అనేక ఇతర రాష్ట్రాలతో పాటు ప్రపంచ దేశాలు కూడా మన వైపు చూస్తున్నాయి. – టి. విజయకుమార్, ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ, కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ
చిరుధాన్యాల శుద్ధి, విలువ జోడింపు, మార్కెటింగ్‌పై ఈ నెల 18–19 తేదీల్లో పులివెందులలోని ఫుడ్‌సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీ ఆవరణలో ఔత్సాహికులకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్‌మెంట్ (ఐఐపిఎం) శిక్షణ ఇవ్వనుందని లైవ్‌లిహుడ్ ఇంక్యుబేషన్ సెంటర్ కోర్సు డైరెక్టర్ డా. నబీరసూల్ తెలిపారు. ఎఫ్.పి.ఓలు, వ్యవసాయ, ఉద్యాన అధికారులు, చిరుధాన్యాల వ్యాపారులు, గ్రామీణ యువతకు ఇది ఉపయోగకరం. భోజన వసతి సదుపాయాలు ఉన్నాయి. ఫీజు రూ. 5 వేలు. వివరాలకు.. డా. నబీరసూల్ – 630297 72210
-పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
Comments
Please login to add a commentAdd a comment