
మనం జీవించి ఉన్నాం, జీవిస్తున్నాం.. అంటే అనుక్షణం ప్రకృతి నుంచి తీసుకుంటూనే ఉన్నామని అర్థం. మనం తీసుకున్నంత తిరిగి ఇవ్వాలని ప్రకృతి కోరుకోదు. విధ్వంసం చేయకపోతే చాలనుకుంటుంది. ప్రకృతి తనను తాను స్వస్థత పరుచుకుంటుంది. కానీ ఆ సమయం కూడా ఇవ్వనంత వేగంగా కాలుష్యభరితం చేస్తున్నాం. ప్రకృతిని పరిరక్షిస్తూ సాగిన మన భారతీయ జీవనశైలిని మర్చిపోయాం. మనం మరిచిపోయిన ఆరోగ్యకరమైన జీవనశైలిని గుర్తు చేయాలి, ఆచరణలోకి తెచ్చే వరకూ చైతన్యవంతం చేస్తూనే ఉండాలనే ఉద్దేశంతో పదిహేనేళ్లుగా గ్రీన్ వారియర్‌గా మారారు సూర్యకళ మోటూరి. జీవనశైలి మార్పు ఇంటి నుంచే మొదలవ్వాలని, అది మహిళ నుంచే ప్రారంభం కావాలని, అందుకోసం ఆమె మహిళలను చైతన్యవంతం చేయడానికి పూనుకున్నారు. గ్రామభారతి అధ్యక్షబాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏకైక మహిళ సూర్యకళ మహిళాదినోత్సవం సందర్భంగా సాక్షితో పంచుకున్న వివరాలివి. – సాక్షి, సిటీబ్యూరో
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన సూర్యకళ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్‌లో పీజీ చేసి నగరంలోని ఓ ఎమ్‌ఎన్‌సీలో ఉద్యోగం చేస్తున్నారు. జాతీయోధ్యమ నాయకుల జీవితగాథలను చదివినప్పుడు ఆ కాలంలో పుట్టనందుకు ఆవేదన చెందేవారామె. రాజీవ్ దీక్షిత్ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు.. ‘దేశం కోసం పని చేయడానికి ఎప్పుడూ ఏదో ఒక సామాజిక అవసరం ఉండనే ఉంటుంది. దానిని తెలుసుకుని పని చేయాలి’ అనే ఆలోచన రేకెత్తింది. సుభాష్ పాలేకర్ శిక్షణలో వాలంటీర్‌గా పని చేసినప్పుడు జరిగిన సంఘటన ఆమెను ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మళ్లించింది. అక్కడికి వచ్చిన ఒక మహిళారైతు ఇచ్చిన కందిపప్పును ఇంటికి తెచ్చుకుని వండుకున్నారు. ఆ రుచి అమృతంలా అనిపించిందన్నారు సూర్యకళ. ప్రతి ఒక్కరూ అలాంటి ఆహారాన్ని తినాలని కోరుకున్నారు. సేంద్రియ వ్యవసాయం, నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ విభాగాల్లో పని చేయసాగారు. ‘శిక్షణా తరగతులు నిర్వహించి సేంద్రియ వ్యవసాయంపై ‘మా గ్రామభారతి స్వచ్ఛంద సంస్థ’ విజయవంతమైంది. కానీ ఆ ఉత్పత్తులకు మార్కెట్ లేకపోతే ఆ రైతు నిలదొక్కుకునేదెలా అనే ప్రశ్నకు సమాధానంగా ఒక వేదికను రూపొందించాను.
ఆర్గానిక్ ఫుడ్ విషయంలో అవగాహన కల్పించడంలో మీడియా చాలా బాగా పని చేస్తోంది. చైతన్యం వచ్చింది కానీ ఉత్పత్తులు అందుబాటులో లేవు. దాంతో ‘మూలసంత’ పేరుతో వాటిని నగరానికి తీసుకొచ్చే బాధ్యత చేపట్టాను. కార్పొరేట్ కంపెనీల్లో మూలసంతలు పెడుతున్నాం. ఇటీవల ఇన్ఫోసిస్‌లో 30 స్టాళ్లతో సంత పెట్టాం. మహిళలను సంఘటిత పరిచి ఆర్గానిక్ ఉత్పత్తులను వారి వంటింటి వరకూ తీసుకెళ్లేలా చేయగలిగాం. నీటి వృథాను అరికట్టడం వంటి విషయాల్లో ఆలోచన రేకెత్తించడం నుంచి పెళ్లి, ఇతర వేడుకల్లో పర్యావరణ హితమైన వేదికల ఏర్పాటు వరకూ కృషి చేశాం. పదిహేనేళ్ల నా ప్రస్థానంలో ఏమి సాధించానని చూసుకుంటే మన వేడుకలు కనిపిస్తాయి. ఆహ్వాన పత్రికల, రిటర్న్ గిఫ్ట్‌లు, భోజనం వడ్డించే ప్లేట్ల వరకూ ప్రతిదీ బయో డీగ్రేడబుల్ థీమ్‌ని అనుసరిస్తున్నారు. మా ప్రయత్నం ఏ మాత్రం వృథా కాలేదు. ఒక మంచి బాట వేయగలిగాం’ అన్నారు సూర్యకళ.
చదవండి: International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా!
చోదకశక్తి మనమే!
ఇంటిని నడిపేది మహిళే. ఇంట్లోకి వచ్చే ఏ వస్తువూ ప్రకృతికి హానికలిగించేదిగా ఉండకూడదు.. అనే నియమాన్ని మహిళలు పాటిస్తే చాలు. ప్రకృతిని కాపాడుకోడం కోసం మేము వేదికల మీద మాట్లాడితే ఆ ప్రయత్నం చైతన్యవంతం వరకే పరిమితం. ఆచరణ ఇంటి నుంచే మొదలు కావాలి, అది మహిళతోనే మొదలు కావాలి. అందుకే సమాజహితమైన ఏ పని అయినా మహిళల నుంచి మొదలైతే అది విజయవంతమవుతుంది. మన పిల్లల భవిష్యత్తు కోసం నిధులు, పొలాలు సమకూరుస్తుంటాం. అంతకంటే ముఖ్యమైన పని పిల్లలకు ఆరోగ్యకరమైన భూమిని అందించడం. మహిని రక్షించే మహిమాని్వతమైన శక్తి మహిళకే ఉంది. మహిళలుగా మనం చేయాల్సిన సమాజసేవ, దేశసేవ ఇది. – సూర్యకళ మోటూరి, గ్రీన్ వారియర్,
అధ్యక్షురాలు, గ్రామభారతి