పులివెందులలోని ఇండో–జర్మన్ ఆగ్రోఎకాలజీ అకాడమీ సీనియర్ కన్సల్టెంట్, జాతీయ నూనెగింజల పరిశోధనా సంస్థ పూర్వ సంచాలకులు డాక్టర్ కె.ఎస్. వరప్రసాద్
సాక్షి, హైదరాబాద్: వాతావరణ మార్పుల నేపథ్యంలో మెట్ట పంటల సాగును తక్షణమే ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోకి మార్చుకోవటం అత్యవసరమని పులివెందులలోని ఇండో–జర్మన్ ఆగ్రోఎకాలజీ అకాడమీ సీనియర్ కన్సల్టెంట్, జాతీయ నూనెగింజల పరిశోధనా సంస్థ పూర్వ సంచాలకులు డాక్టర్ కె.ఎస్. వరప్రసాద్ అన్నారు. వర్షాధార ప్రాంతాల పొలాలకు సాగు నీటి సదుపాయం కల్పించటం కన్నా సాగు పద్ధతిని ప్రకృతికి అనుగుణంగా సమూలంగా మార్చటం అవశ్యమని, ఆయన శనివారం నొక్కిచెప్పారు. పంటల ఆరోగ్య యాజమాన్యం– నవ్యత, సుస్థిరత అనే అంశంపై రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నాలుగు రోజులుగా జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు శనివారం ముగిసింది.
ఈ సదస్సులో డా. వరప్రసాద్ ఆసియా పసిపిక్ ప్రాంతంలో సుస్థిర చీడపీడల యాజమాన్యంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అనే అంశంపై ప్రసంగించారు. చీడపీడల యాజమాన్య పద్ధతులను పంటల వారీగా, పురుగుల వారీగా, తెగుళ్ల వారీగా వేర్వేరుగా చూస్తూ వేర్వేరు పరిష్కారాలను వెతకటం కన్నా.. స్థానిక వంగడాల జీవవైవిధ్యంతో కూడిన ప్రకృతి వ్యవసాయం ద్వారా వ్యవస్థాగత పరిష్కారం వెతకడమే మేలన్నారు. ఈ మేరకు నవీనీకరించిన సమీకృత సస్యరక్షణ సూత్రాలను అనుసరించాలని ఆయన సూచించారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో కలసి వాసన్ సంస్థ మన దేశంలోని వర్షాధార ప్రాంతాల్లో సంప్రదాయ సాగు పద్ధతులపై నిర్వహించిన అధ్యయనంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయ అనుభవాలు కూడా ఈ విషయాన్ని ధృవపరుస్తున్నాయన్నారు.
వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ తెగుళ్ల శాస్త్రవేత్త డాక్టర్ పప్పు హనుమంతరావు
రసాయనిక వ్యవసాయ దృష్టికి అతీతంగా ఈ ఫలితాలను శాస్త్రవేత్తలు గమనించాలని సూచించారు. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని వర్షాధార ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయ ఫలితాలు కొత్త పాఠాలు నేర్పుతున్నాయని, అంతర్జాతీయ బృందాలు ఈ నెల 26–29 తేదీల్లో ఏపీలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నాయని డా. వరప్రసాద్ తెలిపారు. స్థానిక ప్రకృతి వ్యవసాయదారుల అనుభవాల ఆధారంగా శాస్త్రవేత్తలు సాగు పద్ధతుల నుంచి చీడపీడల యాజమాన్యం వరకు ఉన్న అంశాలను సరికొత్త దృష్టితో, ముఖ్యంగా వర్షాధార వ్యవసాయం విషయంలో, పరిశీలించాల్సిన తరుణం ఆసన్నమైందని డా. వరప్రసాద్ తెలిపారు. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ తెగుళ్ల శాస్త్రవేత్త డాక్టర్ పప్పు హనుమంతరావు జీనోమ్ ఎడిటింగ్(జన్యు సవరణ) వంటి అత్యాధునిక సాంకేతికతల ద్వారా చీడపీడల యాజమాన్యంలో ప్రతిబంధకాలను అధిగమించవచ్చని, అనేక పంటలకు సంబంధించి పరిశోధనలు జరుగుతున్నాయన్నారు.
జన్యు మార్పిడి సాంకేతికతపై మాదిరిగా జన్యు సవరణ సాంకేతికతపై అభ్యంతరాలు లేవన్నారు. పిజెటిఎస్‌ఎయు కీటక శాస్త్ర నిపుణుడు డా. ఎస్.జె. రహమాన్ ప్రసంగిస్తూ జీవన పురుగుమందులను క్షేత్రస్థాయిలో పునరుత్పత్తి చేసుకునే క్రమంలో నాణ్యతా ప్రమాణాలను పాటించటంలో ఖచ్చితత్వం కొరవడితే వ్యాధి కారక క్రిములతో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మార్కెట్‌లో నకిలీ పంచగవ్య వంటి ద్రావణాలను అధిక ధరలకు విక్రయిస్తున్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని, నియంత్రణ యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు.
సుస్థిర వ్యవసాయాభివృద్ధే లక్ష్యం:
సుస్థిర వ్యవసాయాభివృద్ధి లక్ష్యంగా పరిశోధనలకు శ్రీకారం చుట్టాలని, రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యంతో ప్రధాని మోదీ శాస్త్రవేత్తలకు ఈ మేరకు దిశానిర్దేశం చేశారని ఐసిఎఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డా. ఉదమ్ సింగ్ గౌతమ్ అన్నారు. పంటల ఆరోగ్య యాజమాన్యం– నవ్యత, సుస్థిరత అనే అంశంపై నాలుగు రోజులుగా జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు ముగింపు సభలో శనివారం సాయంత్రం ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. పిపిఎఐ అధ్యక్షులు డా. బి. శరత్‌బాబు, అటారి డైరెక్టర్ డా. షేక్ మీరా తదితరులు పాల్గొన్నారు. ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్వర్ణోత్సవాల సందర్భంగా వెటరన్ శాస్త్రవేత్తలు డా. కృష్ణయ్య, డా. వరప్రసాద్‌లకు జీవన సాఫల్య పురస్కారాలను ప్రదానం చేశారు.
(చదవండి: మంచి వ్యవసాయం పద్ధతులే మేలు! ఐసిఎఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పిలుపు)
Comments
Please login to add a commentAdd a comment