పకృతి నిలయం | Indian homes that embrace the beauty of nature | Sakshi
Sakshi News home page

పకృతి నిలయం

Published Sat, Jul 13 2024 10:57 AM | Last Updated on Sat, Jul 13 2024 10:57 AM

 Indian homes that embrace the beauty of nature

ఇల్లంతా మొక్కల మయం... 
ఇంటి చుట్టూ వివిధ రకాల 
పూలు, పండ్ల మొక్కలు పక్షులకు ఆవాసంగా.. 
అనుకూలంగా.. ప్రకృతి ప్రేమికుడు రాము..

కాంక్రీట్‌ జంగిల్లో చెట్లు నరికి బహుళ అంతస్తుల మేడల నిర్మాణం చేపడుతున్నారు. నగరంలో చెట్ల కన్న అద్దాల భవనాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. పచ్చని మొక్కలు, చెట్లు చూడాలంటే ఏ పల్లెటూరుకో.. నగర శివారుకో.. లేదా రిసార్ట్స్‌కో వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అలాంటిది అతని ఇల్లే పచ్చని మొక్కలతో ఉంది. ఎటు చూసిన మొక్కలతో పచ్చగా కని్పస్తాయి. బాల్కనీ, టెర్రస్‌లోనే కాదు. బెడ్‌రూం, మెట్లు, హాల్లో, పూజ గది ముందు, బాత్రూంలో, కిచెన్‌లో పచ్చని మొక్కలు దర్శనమిస్తాయి. అరే ఈ ప్రాంతంలో కూడా మొక్కలు పెంచవచ్చా అన్నట్లు ఉంటుంది ఆ ఇల్లు. అతనే ఆంజనేయనగర్‌కు చెందిన ప్రకృతి ప్రేమికుడు 
రాము.    – మూసాపేట 

తని అసలు పేరు పత్తిరెడ్డి రామానుంజన్‌రెడ్డి. కానీ అందరూ ప్రకృతి రాము అని పిలుస్తారు. అలాగే గుర్తుపడతారు. పూర్తి పేరు చాలా మందికి తెలియదు. అతని ఇల్లు చూసి పేరు అడిగితే చెట్లు, పక్షులంటే ఇష్టం కాబట్టి ప్రకృతి రాముగా పిలుస్తారేమో అనుకుంటారు. కానీ కొన్ని రోజులు ప్రకృతి సూపర్‌ మార్కెట్‌ నడిపి సేంద్రియ 
ఉత్పతులు విక్రయించడంతో ప్రకృతి రాముగా పేరు స్థిరపడింది. అయితే సహజంగానే ప్రకృతి అంటే మక్కువ. తన ఇంటి పేరు కూడా ప్రకృతి నిలయం అని పెట్టుకోవడం ప్రకృతిపై ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తుంది.

పల్లె వాతవరణం తలపించేలా..
పక్షులు అధికంగా రావాలని వాటి కోసం ప్రత్యేకమైన చెట్లు పెంచుతున్నారు. రామచిలకలు, కోయిలలు, పావురాలు, పల్లెటూరులో కని్పంచే పిట్టలు, రంగుల పిచ్చుకలు,  సీజనల్‌ పక్షులు ఆ ఇంటిపై వాలతాయి. పక్షుల కోసం నీరు, గింజలు కూడా ఏర్పాటు చేస్తారు. సహజంగా తినాలని వాటి కోసం జొన్న కంకులు తీసుకొచ్చి చెట్లకు కడతారు. ఆ మొక్కలపై పక్షుల గూళ్లు కూడా కని్పస్తాయి. ఉదయం పక్షుల కిలకిలరావాలతోనే నిద్రలేస్తారు. పక్షులతోనే ఎక్కువగా 
కాలక్షేపం చేస్తుంటారు.  

పక్షులకు ఆవాసంగా..
ఇంట్లో ఉన్న మొక్కలు.. పక్షులకు ఆవాసంగా ఉంటాయి.. జామ, దానిమ్మ, మామిడి, ఉసిరి, నేరేడు వంటి పండ్ల మొక్కలతో పాటు చెరుకు, బొప్పయి, నిమ్మ చెట్లు ఉన్నాయి. పక్షులకు అవసరమైన జొన్న, వరి మొక్కలు సైతం ఏర్పాటు చేశాడు. పూలమొక్కలైన కనకాంబరం, సన్నమల్లె, జాజి మల్లె, లిల్లి, మందారంలో 5 రకాలు, బొడ్డు మల్లె, ఐదు రకాల గులాబీ పూలు వంటి పూల మొక్కలు. టమాట, వంకాయ, పచ్చి మిరప వంటి కూరగాయలతో పాటు పుదీనా, కొత్తిమీర, పాలకూర, మెంతి, బచ్చలి వంటి ఆకు కూరలు కూడా ఉంటాయి. పేపర్‌ పూలు వంటి షో మొక్కలు అనేకం ఉన్నాయి.  

ఇల్లూ ప్రత్యేకమే...
ఎవరైనా ఇల్లు కట్టుకుంటే కొద్ది స్థలం కూడా వదలకుండా కట్టుకుని కిరాయిలకు ఇచ్చుకుంటాం. కానీ అతని కుటుంబానికి సరిపడ డబుల్‌ బెడ్‌రూం, హాల్, ఓపెన్‌ కిచెన్‌తో పాటు గెస్ట్‌ రూంలు కూడా ఏర్పాటు చేసి మొక్కలకే ఎక్కువ స్థలాన్ని కేటాయించాడు. పెంట్‌హౌస్‌ మాదిరిగా రూంలు ఉండి, ముందు భాగం మొత్తం మొక్కలు ఉంటాయి. ఉదయం లేచి మొక్కల మధ్య కూర్చొని టీ తాగేందుకు, టిఫిన్‌ చేసేందుకు అరుగులు ఏర్పాటు చేశారు. టెర్రస్‌పై సాయం సంధ్య వేళ మొక్కలు కదులుతూ గాలి వీస్తుంటే ఎక్కడో ప్రకృతికి దగ్గరగా ఉన్నట్లు ఉంటుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement