వ్యవసాయ శాఖ సరఫరా చేస్తున్న ‘ట్రైకోడెర్మావిరిడి’ ప్యాకెట్లు
- పంటలకు జీవౌషధం.. ‘ట్రైకోడెర్మావిరిడి’
- వాతావరణ కాలుష్యానికి చెక్
- ఆరోగ్యకరమైన పంటలకు సోపానం
- దీని వాడకం ద్వారా అనేక తెగుళ్ల నివారణ
- గజ్వేల్ ఏడీఏ శ్రావణ్‌కుమార్ సలహా సూచనలు
- దీనిని వాడేముందు భూమిలో తగినంత తేమ ఉండే విధంగా చూసుకోవాలి. లేదా వాడిన వెంటనే మొక్కలకు నీరు పెట్టాలి.
- కంపోస్టు, ఇతర పశువుల ఎరువులు, జీవసంబంధమైన పదార్థాలతో కలిపి ఈ మందును వాడుకోవచ్చు.
- చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయరాదు.
- తయారు చేసిన ట్రైకోడెర్మావిరిడి కల్చరును ఆరు నెలలలోపు వాడుకోవచ్చు.
గజ్వేల్: రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలు విచక్షణారహితంగా వాడటం వల్ల దుష్ఫలితాలు కలుగుతున్నాయి. పురుగులు, తెగుళ్లు రోగ నిరోధక శక్తిని పెంచుకొని ఏ మందులకూ లొంగకుండాపోతున్నాయి. దీంతో సమస్య జఠిలమవుతున్నది. ఈ తరుణంలో రైతులు జీవనియంత్రణ పద్ధతులను పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చని గజ్వేల్ ఏడీఏ శ్రావన్‌కుమార్ (సెల్: 7288894469) చెబుతున్నారు.
జీవ నియంత్రణ పద్ధతుల వల్ల వ్యవసాయంలో ఖర్చును తగ్గించుకొని లాభసాటిగా మార్చుకోవచ్చని ఆయన అంటున్నారు. ఇందుకోసం ప్రభుత్వం పలుచోట్ల జీవనియంత్రణ ప్రయోగశాలలను ప్రారంభించిందని చెప్పారు. వీటి ద్వారా ట్రైకోడెర్మా విరిడి, సుడోమోనాస్‌ను తయారుచేసిన రైతులకు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రైకోడెర్మావిరిడి వాడకం, దీనివల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆయన వివరించారు.
ట్రైకోడెర్మావిరిడి
మనం పండించే వివిధ పంటలను వేరుకుళ్లు, మాగుడు తెగులు, ఎండు తెగులు, ఆశించి విపరీత నష్టాన్ని కలుగజేస్తున్నాయి. పంటభూముల్లో అనేక శిలీంధ్రాలు ఉంటాయి. వీటిలో స్లీ్కరోషియం, ఫిథియం, ఫైటోఫ్తరా, పుజేరియం, పైరికులేరియం వంటివి మొక్కలకు తెగుళ్లను ఆశించేలా చేసి నష్టాన్ని కలుగజేస్తున్నాయి. వీటిని నాశనం చేయడంలో ట్రైకోడెర్మావిరిడి బాగా పనిచేస్తుంది.
ఇది భూమిలో అతి త్వరగా వృద్ధి చెందుతుంది. దీనికి ఆమ్ల నేలలు, తటస్థ నేలలు అనుకూలం. వేరుశనగ, పప్పుధాన్యపు పైర్లు, కూరగాయలు, పత్తి, నిమ్మ, కొబ్బరి, అరటి, పొగాకు, మిరప మొదలైన పంటలకు తీవ్రంగా నష్టం కలిగించే వేరుకుళ్లు, కాండం కుళ్లు, మాగుడు తెగులు, ఎండుతెగులు నివారణకు ఇది ఉపయోగపడుతుంది.
దీనిని వాడినపుడు వేరు చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. ఇది విత్తనశుద్ధి చేయడానికి, సేంద్రియ ఎరువులతో కలిపి నేలలో వేయడానికి పనికి వస్తుంది. ట్రైకోడెర్మావిరిడిని పురుగు మందులతో కలిపి వాడకపోడం శ్రేయస్కరం. ఈ విషయాన్ని రైతులు గుర్తించాలి.
తెగుళ్ల నివారణ ఇలా..
కాండం తెగులు: టమాటా, వేరుశనగలో వచ్చే కాండం తెగులు నివారణకు ట్రైకోడెర్మావిరిడిని విత్తనశుద్ధి లేదా సాళ్లల్లో వేసే విధానంలో వాడవచ్చు.
విత్తనకుళ్లు: కూరగాయలు, పొగాకు పంటలకు ఆశించే విత్తనకుళ్లు, వడల తెగులుకు విత్తనశుద్ధి లేదా మట్టితో కలిపే విధానంలో వాడవచ్చు.
కుళ్లు తెగులు: శనగ, కంది, పత్తి, టమటా పంటలను ఆశించే ఈ తెగులు నివారణకు విత్తనశుద్ధి లేదా మట్టితో కలపడం వంటి పద్ధతుల ద్వారా నివారించవచ్చు.
వేరుకుళ్లు: శనగ, పత్తి, టమటా పంటలను ఇది ఆశిస్తుంది. దీని నివారణకు విత్తన శుద్ధి లేదా నేలల్లో వేయడం పద్ధతుల ద్వారా నివారించవచ్చు.
ఎర్రకుళ్లు: చెరకు పంటను ఆశించే ఈ తెగులు నివారణకు చెరకు గడ ముక్కలను ముంచడం ద్వారా నివారించవచ్చు.
విత్తన శుద్ధి పద్ధతి
1 కిలో విత్తనానికి 8-10 గ్రాముల పొడి మందు సరిపోతుంది. 500 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి పొడిని వంద లీటర్ల నీటితో కలిపి ఉపయోగించుకోవాలి.
భూమిలో వేసే విధానం:
ఎకరాకు 2-3 కిలోలు దుక్కిలో వేయాలి. ట్రైకోడెర్మా విరిడి 1 కిలో, వేప పిండి 10 కిలోలు, పశువుల ఎరువు 90 కిలోలను మిశ్రమంగా చేసి కావాల్సినంత తేమను అందించి వారం రోజుల పాటు నీడలో ఉంచిన తర్వాత దుక్కిలో వేసుకోవాలి.
మోతాదు:
వేరుశనగ, పత్తి, పొద్దుతిరుగుడు, అపరాలు, పొగాకు, తమలపాకు, వంగ, బెండ, ఉల్లి, బంగాళదుంప, మిరప, పుచ్చ, వరి పంటలకు సంబంధించి 1 కిలో విత్తనానికి 8-10 గ్రాములు వేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఎకరాకు 2 కిలోలు దుక్కిలో వేయాల్సి ఉంటుంది. చెరుకు, అల్లం, పసుపు పంటలకు సంబంధించి ఎకరాకు 500 గ్రాములతో విత్తనశుద్ధి చేస్తే సరిపోతుంది. అదేవిధంగా 2-3 కిలోలు దుక్కిలో వేయాల్సి ఉంటుంది.
కొబ్బరికి సంబంధించి మొక్క నాటినప్పుడు దాని వద్ద 25-50 గ్రాములు వేయాల్సి ఉంటుంది. ప్రతి ఆరు నెలలకోసారి మొక్కకు 50-70 గ్రాములు వేస్తే మంచి ఫలితాలుంటాయి. అరటిలో మొక్కనాటేటప్పుడు దాని వద్ద 2-3 గ్రాములు వేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఆరు నెలలకోసారి మొక్క మొదలు దగ్గర వేయాలి. నిమ్మ, నారింజ తోటలకు సంబంధించి మొక్క నాటేటప్పుడు 10 గ్రాములు, ప్రతి ఆరు నెలలకోసారి 20-30 గ్రాములు మొక్క మొదళ్ల వద్ద వేయాల్సి ఉంటుంది.
ట్రైకోడెర్మావిరిడి వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ట్రైకోడెర్మావిరిడి లభ్యమయ్యే ప్రదేశాలు
జీవనియంత్రణ ప్రయోగశాలలు, జిల్లాలోని అన్ని వ్యవసాయశాఖ కార్యాలయాలు