కర్నూలు: ఎర్ర బంగారం ధగధగ మెరుస్తోంది. ఈ ఏడాది ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు ఊరట చెందుతున్నారు. కర్నూలు జిల్లాలో మిర్చి సాధారణ సాగు విస్తీర్ణం 17 వేల హెక్టార్లు కాగా.. ఈ ఏడాది అత్యధికంగా 23,670 హెక్టార్లలో సాగు చేశారు. ప్రత్యేకంగా ఎండు మిరప కోసం జిల్లా వ్యాప్తంగా 28,368 ఎకరాల్లో సాగు చేశారని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు, నంద్యాల, కోవెలకుంట్ల, రుద్రవరం, శిరివెళ్ల, సంజామల, జూపాడుబంగ్లా, నందికొట్కూరు, మిడ్తూరు, పగిడ్యాల, పాములపాడు, కొత్తపల్లి ప్రాంతాల్లో విస్తారంగా సాగు చేశారు. పంట సాగు చేసినప్పటి నుంచి బింగి, నల్ల తామర వైరస్ తెగుళ్లు వ్యాపించటంతో పంటను కాపాడుకునేందుకు రైతులు కష్టాలు పడ్డారు.
చదవండి: వెంగమ్మ పేణీలు.. రుచి మామూలుగా ఉండదు!
రసాయన మందుల పిచికారీతో పాటు ఎరువుల కోసం ఎకరాకు రూ. 80 వేల నుంచి రూ. లక్ష వరకు వెచ్చించారు. సాధారణంగా ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా చీడపీడలు, వాతావరణ పరిస్థితులు అనుకూలించగా 12 నుంచి 15 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ మొదటి కోత పూర్తయింది. దిగుబడి తగ్గినా ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు కొంత ఊరట చెందుతున్నారు. గతేడాది క్వింటా రూ.8,000 – రూ.10,000 వరకు మాత్రమే పలికింది. ప్రసుత్తం గుంటూరు మిర్చి మార్కెట్ యార్డులో సూపర్ –10 రకం ధర క్వింటా రూ.16,000, 116 రకం రూ. 15,000 పలుకుతోంది. బ్యాడిగ రకం క్వింటా రూ. 18,000 వరకు పలుకుతుందని రైతులు చెబుతున్నారు.
జిల్లాలో మిర్చి కొనుగోలుకు ప్రత్యేక కేంద్రాలు లేకపోవడంతో గుంటూరు యార్డుకు, కర్ణాటకలోని బ్యాడిగ మార్కెట్‌కు తరలిస్తున్నారు. కర్నూలు మార్కెట్ యార్డులో కొంత మేర కొనుగోళ్లు జరుగుతున్నా ధరలో చాలా వ్యత్యాసం ఉండటంతో రైతులు వ్యయప్రయాసలతో గుంటూరు మార్కెట్‌కు తరలిస్తున్నారు. నంద్యాలకు మంజూరైన మిర్చి మార్కెట్ యార్డు త్వరలో అందుబాటులోకి వస్తే రైతుల కష్టాలు తొలగిపోతాయి.
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
నేను ఆరు ఎకరాల్లో పండు మిరప సాగు చేశాను. ప్రస్తుతం మొదటి కోత పండు మిరపను తెంపగా ఎకరాకు 6 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇంకా రెండు కోతలు పడే అవకాశం ఉంది. మొత్తంగా ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. పంటను అమ్మేందుకు గుంటూరు తీసుకెళ్లాలంటే చాలా కష్టంగా ఉంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. – వీరనారాయణ, రైతు, భాస్కరాపురం, కర్నూలు జిల్లా
ధరలు నిలకడగా ఉంటే మేలు
నేను రెండు ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశాను. మొదటి కోత కోయగా ఎకరాకు 7 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం క్వింటా ధర రూ.16 వేలు పలికింది. వ్యాపారులు స్థానికంగా ధరలు తగ్గించి అడుగుతున్నారు. పండించిన పంటను గుంటూరుకు తీసుకెళ్లి విక్రయించుకోవాల్సి ఉంది. ధరలు ఇలాగే నిలకడగా ఉంటే రైతులకు ఆదాయం వస్తోంది. – జూటూరు నారాయణ, రైతు, భాస్కరాపురం, కర్నూలు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment