
న్యూఢిల్లీ: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ రూపొందించుకున్న ట్యాంక్ విధ్వంసక గైడెడ్ క్షిపణి నాగ్ మార్క్-2(Nag MK-2) పరీక్ష విజయవంతమైంది. రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో సోమవారం పరీక్షను నిర్వహించారు. అత్యంత కచ్చితమైన లక్ష్యాలను ఇది చేధించడంలో విజయవంతమైందని భారత రక్షణ పరిశోధన సంస్థ(DRDO) ప్రకటించింది.
ఇది మూడోతరం(Third Generation) ‘ఫైర్ అండ్ ఫొర్గెట్’ క్షిపణి. లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. అలాగే.. లక్ష్యాలను చేధించడంలో క్షిపణి కనిష్ఠ, గరిష్ఠ పరిధి నిర్ధారణ అయింది. మొత్తం మూడుసార్లు ఇది విజయవంతంగా లక్ష్యాన్ని తాకిందని అధికారులు తెలిపారు. నాగ్ క్షిపణికి సంబంధించిన క్యారియర్ వెర్షన్(NAMICA) -2ని కూడా పరీక్షించినట్లు తెలిపారు.
‘‘ఈ పరీక్షలతో నాగ్ ఆయుధ వ్యవస్థ మొత్తం.. భారత సైన్యం(Indian Army)లో ప్రవేశించేందుకు సిద్ధమైంది’’ అని రక్షణ మంత్రిత్వశాఖ ఒక అధికార ప్రకటనలో పేర్కొంది.