వేదికపై పన్నీర్ సెల్వం, పళనిస్వామిలతో ప్రధాని నరేంద్ర మోదీ
సాక్షి, చెన్నై: మోటార్ వాహన ఉత్పత్తిలోనే కాదు, యుద్ధ ట్యాంకర్ల ఉత్పత్తిలోనూ హబ్‌గా తమిళనాడు మారుతోందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భారత ఆర్మీని అపార శక్తివంతంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు. డీఆర్‌డీఓ దేశీయంగా తయారు చేసిన అర్జున్ ప్రధాన యుద్ధ ట్యాంక్(ఎంకే–1ఏ)ను భారతీయ సైన్యానికి అప్పగించారు. చెన్నై నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్, సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వంలతో కలిసి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు.
మెట్రో సేవలు..
రూ.3,770 కోట్లతో పూర్తయిన చెన్నై వాషర్‌మెన్ పేట–విమ్కోనగర్ మధ్య మెట్రో రైలు, రూ.293 కోట్లతో పూర్తి చేసిన చెన్నై బీచ్–అత్తిపట్టు మధ్య 4వ ట్రాక్‌లో, రూ.423 కోట్లతో విద్యుద్దీకరించిన విల్లుపురం–తంజావూరు – తిరువారూర్ మార్గంలో రైలు సేవలకు జెండా ఊపారు. తంజావూరు, పుదుకోట్టైలకు సాగు నీరు అందించడం లక్ష్యంగా రూ. 2,640 కోట్లతో చేపట్టనున్న కళ్లనై కాలువ పునరుద్ధరణ పనులకు, రూ.1000 కోట్లతో చెంగల్పట్టు జిల్లా తయ్యూరు సమీపంలో 163 ఎకరాల్లో నిర్మించనున్న ఐఐటీ డిస్కవరీ క్యాంపస్ పనులకు శంకుస్థాపన చేశారు. చెన్నై ఆవడిలోని ఆర్మీ ఫ్యాక్టరీలో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో 71 సరికొత్త హంగులతో రూపుదిద్దుకున్న అర్జున యుద్ధ ట్యాంకర్‌ను భారత ఆర్మీకి అందించారు. ముందుగా వేదికపై ఏర్పాటు చేసిన దివంగత సీఎంలు ఎంజీఆర్, జయలలిత చిత్ర పటాలకు మోదీ పుష్పాంజలి ఘటించారు.
ఈ దశాబ్దం భారత్‌దేనని, కోవిడ్–19పై పోరు విషయంతో సహా అన్ని విషయాలలో ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోందని ప్రధాని తెలిపారు. ఏప్రిల్ నెలలో తమిళనాడు అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంలతో కలిసి ప్రధాని మోదీ చేతులు పైకెత్తి ప్రజలకు అభివాదం చేశారు. తమిళ సంస్కృతి, సంప్రదాయాలను తన ప్రసంగంలో ప్రధాని కొనియాడారు. తమిళ సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. శ్రీలంక తమిళుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వారి కోసం అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. జాఫ్నాలో పర్యటించిన ఏకైక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తానే కావడం తనకు గర్వకారణమని వ్యాఖ్యానించారు. శ్రీలంకలోని తమిళుల హక్కుల గురించి ఆ దేశంతో చర్చించామని వెల్లడించారు.
దేశీయంగా తయారు చేసిన మార్క్1ఏ ట్యాంక్‌ను ఆర్మీకి అప్పగిస్తున్న సందర్భంగా సైన్యంతో మోదీ
ప్రతి నీటి చుక్క కీలకం..
ఈ వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ తమిళంలో వణక్కం చెన్నై.. వణక్కం తమిళనాడు అంటూ తన ప్రసంగాన్ని మొదలెట్టారు. తమిళనాడు రైతులు ఇక్కడి వనరుల్ని సద్వినియోగం చేసుకుని ఆహార ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తున్నారని కొనియాడారు. ప్రతి నీటి చుక్క కీలకం అని, పొదుపు గురిం చి వివరిస్తూ భావితరాల కోసం జల, వనరుల పరిరక్షణ లక్ష్యంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. తక్కువ జల వినియోగంతో ఎక్కువ దిగుబడి సాధించే దిశగా మరింత కృషి చేయాల్సి ఉందన్నారు. చెన్నై మెట్రో ఫేజ్–2కు బడ్జెట్‌లో రూ. 63 వేల కోట్లను ప్రకటించామని గుర్తుచేశారు. ప్రపంచ దేశాలు భారత వైపు చూస్తున్నాయని, ఇది 130 కోట్ల మంది శ్రమ ఫలితమని పేర్కొన్నారు.
పుల్వామా అమరులకు నివాళి..
రెండేళ్ల క్రితం ఇదే రోజున (ఫిబ్రవరి 14) పుల్వామా దాడి జరిగిందని గుర్తు చేస్తూ, ఆ దాడిలో అమరులైన వీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తమిళ కవి సుబ్రమణ్య భారతియార్ రాసిన ‘ఆయుధం సెయ్‌వోం...(ఆయుధం తయారు చేద్దాం)’ అన్న కవితను గుర్తు చేస్తూ, డిఫెన్స్ కారిడార్‌కు తమిళనాడు ఎంపికైనట్టు తెలిపారు. మోటారు వాహన ఉత్పత్తిలోనే కాదు, యుద్ధట్యాంకర్ల ఉత్పత్తికి హబ్‌గా తమిళనాడు మారిందని పేర్కొంటూ, తాజాగా ఆర్మీకి అంకితం ఇచ్చిన ఎంకే–1ఏ గురించి వివరించారు. భారత ఆర్మీ శాంతియుతంగా సరిహద్దుల్లో దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నదని కొనియాడారు. ప్రపంచ స్థా యి ప్రమాణాలతో ఐఐటీ డిస్కవరీ రూపుదిద్దుకోబోతున్నదని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధానికి బ్రహ్మరథం పట్టే రీతిలో చెన్నైలో ఆహ్వానం లభించింది. ప్రధాని పర్యటన సందర్భం గా చెన్నైలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.
బీపీసీఎల్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ జాతికి అంకితం
కొచ్చి: కేరళలో పలు అభివృద్ధి పథకాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. రూ. 6 వేల కోట్ల విలువైన బీపీసీఎల్‌కు చెందిన పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ను జాతికి అంకితం చేశారు. కొచ్చిన్ పోర్ట్ ట్రస్ట్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్‌ను, మెరైన్ ఇంజినీరింగ్ శిక్షణ కేంద్రం ‘విజ్ఞాన సాగర్’ను ప్రారంభించారు. పెట్రో కెమికల్ ప్రాజెక్టుతో అక్రిలిక్ యాసిడ్, ఆక్సో ఆల్కహాల్, అక్రిలేట్స్ తదితర ఉత్పత్తుల దిగుమతులు తగ్గి గణనీయ మొత్తంలో విదేశీ మారకం ఆదా అవుతుందన్నారు. బోల్‌గట్టి, విలింగ్డన్ ఐలండ్ మధ్య జల మార్గ రవాణా కోసం రెండు నౌకలను ప్రారంభించారు. కేరళలో పర్యాటక రంగ మౌలిక వసతుల కల్పన కోసం కేంద్రం కృషి చేస్తోందన్నారు. కొచ్చిలో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ఏర్పాటు అందులో భాగమేనన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేరళ బీజేపీ నేతలతో మోదీ సమావేశమయ్యారు. ఎన్నికల్లో కేంద్రం అభివృద్ధి పథకాలను ప్రధానంగా ప్రచారం చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment