- స్పిన్నింగ్ మిల్లులకు అసోసియేషన్ సూచన
సాక్షి, అమరావతి
పత్తి ధరలు దిగివచ్చే వరకు ఎగబడి పత్తిని కొనుగోలు చేయవద్దని స్పిన్నింగ్ మిల్లులను ఆంధ్రప్రదేశ్ స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ కోరింది. ఇదే సమయంలో భయపడి తక్కువ ధరకు ఉత్పత్తి చేసిన యార్న్ విక్రయించవద్దని సూచించింది. ఈ సమస్య కేవలం ఒక ప్రాంతానికి సంబంధించింది కాకపోవడంతో కేంద్ర స్థాయిలో తగు నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ చైర్మన్ ధర్మతేజ తెలిపారు.
కేవలం మన రాష్ట్రంలో మిల్లులను మూసివేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదన్న ఉద్దేశంతో మూసివేత అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని బుధవారం రాత్రి జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వ్యక్తిగత ఆర్థిక స్థితిని బట్టి మిల్లులను నడపాలా? ఉత్పత్తిని తగ్గించాలా? లేక పాక్షికంగా కొన్ని రోజులు మూసివేయాలా అన్న నిర్ణయం మిల్లు యజమానులకే వదిలేసినట్లు తెలిపారు. ఈ సమస్యపై దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అసోసియేషన్లు శుక్రవారం కోయంబత్తూరులో సమావేశమవుతున్నాయని, దీని తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నదానిపై స్పష్టత వస్తుందన్నారు. ఈ జాతీయ సమావేశం తర్వాత సమస్యను కేంద్ర జౌళిశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు.
వారం రోజుల్లో మంత్రిని కలిసి సమస్యను వివరించనున్నట్లు ధర్మతేజ తెలిపారు. ఈ లోగా మిల్లులు తొందరపడి పత్తిని కొనుగోలు చేయడం, యార్న్ తక్కువ ధరకు అమ్మకూడదని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మూడు నెలల్లో కేజీ పత్తి ధర రూ. 100 నుంచి రూ. 130 దాటితే ఇదే సమయంలో యార్న్ ధర రూ. 210 నుంచి రూ. 170కి పడిపోయింది. దీంతో ప్రతి మిల్లు రోజుకి సుమారుగా రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలు నష్టపోతోంది. సుమారు 20 మిల్లులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి మూసివేసే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మన రాష్ట్రంలో 110 స్పిన్నింగ్ మిల్స్ ఉండగా.. వీటిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 8 లక్షలమంది ఆధారపడి జీవిస్తున్నారు.