spinning mill
-
స్పిన్నింగ్ పరిశ్రమపై మాంద్యం దెబ్బ
కొరిటెపాడు (గుంటూరు): కోవిడ్, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించడంతో ఆ ప్రభావం స్పిన్నింగ్ మిల్లుల పరిశ్రమపై తీవ్రంగా ఉంది. కోవిడ్ విపత్తు తర్వాత ఆర్డర్లులేని పరిస్థితుల్లో ముడిసరుకు దూది ధరకంటే నూలు ధర తక్కువ కావడం, ఎగుమతులు క్షీణించడం.. స్వదేశీ మార్కెట్లో డిమాండ్ పడిపోవడం వంటి వరుస పరిణామాలు పరిశ్రమను వెంటాడుతున్నాయి. గత ప్రభుత్వం స్పిన్నింగ్ మిల్లులకు రూ.947 కోట్లు రాయితీలను బకాయి పెడితే కోవిడ్ కష్టాలను గమనించిన ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడేళ్లలో రూ.380 కోట్ల బకాయిలను చెల్లించింది. ఈ రంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా టెక్స్టైల్ పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుండంతో మిల్లులను పూర్తిస్థాయిలో నడపలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో.. మంగళవారం నుంచి 15 రోజుల పాటు స్పిన్నింగి మిల్లులను మూసివేయాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు లంకా రఘురామిరెడ్డి ప్రకటించారు. 50 శాతం ఉత్పత్తి నిలిపివేసినప్పటికీ.. రాష్ట్ర స్పిన్నింగ్, టెక్స్టైల్ పరిశ్రమల అసోసియేషన్ గత సమావేశంలో అప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఉత్పత్తిలో 50 శాతం నిలిపివేయాలని తీర్మానం చేసిందని, కానీ.. ఇప్పుడు పరిస్థితులు మరింత క్షీణించిన దృష్ట్యా మొత్తం అన్ని పరిశ్రమలు పూర్తిగా మూసివేసి, నష్టాలబారి నుంచి బయటపడాలని నిర్ణయించినట్లు రఘురామిరెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ సంస్థలను, ఎంసీఎక్స్‌ను కట్టడిచేసి, పత్తి ధరలు నిలకడగా ఉండేలా చూడాలని కోరారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న బకాయిలను ప్రస్తుత ప్రభుత్వం కరోనా వేళ గతేడాది సెప్టెంబర్‌లో రూ.237 కోట్లు విడుదలచేసి ఆదుకుందన్నారు. అదే విధంగా ప్రస్తుత విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పెండింగ్‌లో ఉన్న అన్ని బకాయిలను విడుదల చేయాలని రఘురామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండున్నర లక్షల మంది ఆధారపడి జీవిస్తున్న ఈ రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలన్నారు. -
కార్మికులపై యాజమాన్యం అమానుష ప్రవర్తన
సాక్షి, పశ్చిమగోదావరి : కరోనా కష్టాలతో చిక్కుకుపోయిన కార్మికులు తమకు భోజనాలు పెట్టడం లేదని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారన్న కారణంతో ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికులపై అమానుషంగా దాడి జరిపిన ఘటన తాడేపల్లిగూడెంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాడేపల్లిగూడెంలోని పెడతాడేపల్లిలో శ్రీ శ్రీనివాస స్పిన్నింగ్ ఫ్యాక్టరీలో ఒడిశా, బీహార్, అస్సాం, ఆంధ్ర రాష్ట్రాల నుంచి 300 మంది కార్మికులు పని చేస్తున్నారు. కరోనా ప్రభావంతో ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఫ్యాక్టరీ యాజమాన్యం స్పిన్నింగ్ మిల్ ప్రొడక్షన్‌ను ఆపేసింది. లాక్డౌన్ నేపథ్యంలో కార్మికులంతా ఫ్యాక్టరీ వదే చిక్కుకుపోయారు. యాజమాన్యం తమను పట్టించుకోవట్లేదని, 300 మంది కార్మికులు ఉంటే 150 మందికి భోజనాలు పంపించి సరిపెట్టుకోవలని చెప్తున్నారంటూ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ తనయుడు కొట్టు విశాల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఇంతవరకు తమకు ఇవ్వవలసిన జీతం కూడా చెల్లించలేదంటూ తెలిపారు. కార్మికుల ఫిర్యాదు మేరకు కొట్టు విశాల్ స్పందిస్తూ.. ఫ్యాక్టరీలో ఉండిపోయిన కార్మికులందరికి భోజనాలు ఏర్పాటు చేస్తానని, మీ అందరికి న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. అయితే ఫ్యాక్టరీ యాజమాన్యంపై ప్రజా ప్రతినిధికి ఫిర్యాదు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మేనేజర్ విజయ్ పాల్ నర్సీపట్నంకు చెందిన జుబ్బాల చిన్నా అనే కార్మికుడిపై ఇనుపరాడ్డుతో దాడి చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని కార్మికులు పేర్కొన్నారు. -
దారుణం: యువతిపై అత్యాచారం.. ఇనుప రాడ్లతో
ముంబై: మహారాష్ట్రలో దారుణం జరిగింది. 19 ఏళ్ల యువతిపై యోగిలాల్ (52) అనే వ్యక్తి అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. నాగ్‌పూర్‌లోని పర్ది ఏరియాలో జనవరి 21న చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. యోగిలాల్ అనే వ్యక్తి స్థానికంగా ఉన్న స్పిన్నింగ్ మిల్లులో సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. ఇదే మిల్లులో యోగిలాల్, బాధిత మహిళ, ఆమె సోదరుడితోపాటు మరో బాలిక కూలీలుగా పని చేస్తున్నారు. అయితే జనవరి 21న ఆమె సోదరుడు మరో అమ్మాయి తమ సొంత గ్రామానికి వెళ్లగా.. ఆ యువతి మాత్రమే పనికి వెళ్లింది. పని పూర్తయిన వెంటనే ఒక్కతే ఒంటరిగా ఇంటికి వెళ్లింది.ఇదే అదనుగా భావించిన యోగిలాల్.. గదిలో ఒంటరిగా ఉన్న యువతిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అంతేగాక మహిళపై ఇనుప రాడ్లతో దాడి చేసి.. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాతి రోజు ఇంటికి చేరుకున్న సోదరుడు ఆమె దీనస్థితిని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు. -
స్పిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం
సాక్షి, మేడికొండూరు : విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో స్పిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన మండలంలోని భీమినేనివారిపాలెం సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. భవనం స్పిన్నింగ్ మిల్లు ఫ్రీ ఓపెనర్ ప్లాంట్‌లో బుధవారం పత్తి వేస్తున్న మిషనరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కార్మికులు దీనిని గమనించి వెంటనే మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అదుపు కాకపోవటంతో ఫైరింజన్ సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. కార్మికులు మిషనరీలో పత్తి వేస్తుండగా విద్యుత్ షార్ట్ సర్యూట్‌తో ప్రమాదం జరిగిందని కంపెనీ సిబ్బంది చెబుతున్నారు. ప్రమాదం జరిగిన కాసేపటి వరకు ఎవరికి తెలియక పోవటంతో లోలోపల పత్తి బేళ్లు తగలబడి పోయాయి. సుమారు రూ.40 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని మేడికొండూరు ఎస్సై వినోద్‌కుమార్ పోలీస్ సిబ్బంది పరిశీలించారు. -
స్పిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం
నంద్విడ: కృష్ణా జిల్లా నందివాడ మండలం తమిరిశ గ్రామ శివారులో ఉన్న ఉమా స్పిన్నింగ్ మిల్లులో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రూ.3 కోట్ల పత్తి దగ్ధ్ధమైందని మిల్లు యజమాని చెప్పారు. అగ్నిప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. -
పత్తి ధర తగ్గేవరకూ కొనకండి
- స్పిన్నింగ్ మిల్లులకు అసోసియేషన్ సూచన సాక్షి, అమరావతి పత్తి ధరలు దిగివచ్చే వరకు ఎగబడి పత్తిని కొనుగోలు చేయవద్దని స్పిన్నింగ్ మిల్లులను ఆంధ్రప్రదేశ్ స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ కోరింది. ఇదే సమయంలో భయపడి తక్కువ ధరకు ఉత్పత్తి చేసిన యార్న్ విక్రయించవద్దని సూచించింది. ఈ సమస్య కేవలం ఒక ప్రాంతానికి సంబంధించింది కాకపోవడంతో కేంద్ర స్థాయిలో తగు నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ చైర్మన్ ధర్మతేజ తెలిపారు. కేవలం మన రాష్ట్రంలో మిల్లులను మూసివేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదన్న ఉద్దేశంతో మూసివేత అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని బుధవారం రాత్రి జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వ్యక్తిగత ఆర్థిక స్థితిని బట్టి మిల్లులను నడపాలా? ఉత్పత్తిని తగ్గించాలా? లేక పాక్షికంగా కొన్ని రోజులు మూసివేయాలా అన్న నిర్ణయం మిల్లు యజమానులకే వదిలేసినట్లు తెలిపారు. ఈ సమస్యపై దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అసోసియేషన్లు శుక్రవారం కోయంబత్తూరులో సమావేశమవుతున్నాయని, దీని తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నదానిపై స్పష్టత వస్తుందన్నారు. ఈ జాతీయ సమావేశం తర్వాత సమస్యను కేంద్ర జౌళిశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. వారం రోజుల్లో మంత్రిని కలిసి సమస్యను వివరించనున్నట్లు ధర్మతేజ తెలిపారు. ఈ లోగా మిల్లులు తొందరపడి పత్తిని కొనుగోలు చేయడం, యార్న్ తక్కువ ధరకు అమ్మకూడదని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మూడు నెలల్లో కేజీ పత్తి ధర రూ. 100 నుంచి రూ. 130 దాటితే ఇదే సమయంలో యార్న్ ధర రూ. 210 నుంచి రూ. 170కి పడిపోయింది. దీంతో ప్రతి మిల్లు రోజుకి సుమారుగా రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలు నష్టపోతోంది. సుమారు 20 మిల్లులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి మూసివేసే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మన రాష్ట్రంలో 110 స్పిన్నింగ్ మిల్స్ ఉండగా.. వీటిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 8 లక్షలమంది ఆధారపడి జీవిస్తున్నారు. -
స్పిన్నింగ్ చుట్టూ చిక్కుముళ్లు!!
♦ పత్తి ధర రికార్డు స్థాయికి; పతనమైన యార్న్ ధర ♦ స్పిన్నింగ్ మిల్లుకు రోజుకు రూ. 3- 5 లక్షల నష్టం ♦ కేంద్రం, ఏపీ సబ్సిడీ బకాయిలు రూ.1,500 కోట్లు ♦ తొలుత ఉత్పత్తి తగ్గింపు; పరిస్థితి మారకుంటే మూసివేతే!! ♦ ప్రశ్నార్థకంగా 8 లక్షల మంది భవిష్యత్తు సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్పిన్నింగ్స్ మిల్లుల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఒకవైపు పత్తి ధరలు భారీగా పెరగటం... మరోవైపు యార్న్ ధరలు బాగా తగ్గిపోతుండటంతో మిల్లులు తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతున్నాయి. 110 స్పిన్నింగ్ మిల్లులు... 35 లక్షల స్పిండిల్స్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఏపీలో గడిచిన ఏడాది కాలంలో 3 మిల్లుల మూతపడ్డాయి. పరిస్థితిలానే ఉంటే ఇంకో 20 మిల్లులు మూతపడి కార్మికులు రోడ్డున పడతారని యాజమాన్యాలు వాపోతున్నాయి. సరిగ్గా మూడు నెలల క్రితం పత్తి క్యాండీ (356 కిలోలు) ధర రూ.37,000. ఒక దశలో రూ.50,000 మార్కును తాకి ఇప్పుడు రూ.47,000 పలుకుతోంది. మరోవంక ఉత్పత్తి చేసిన యార్న్ ధర కేజీ రూ.210 నుంచి రూ.170కి పడిపోయింది. గతంలో కేజీ పత్తి ధర రూ.110గా ఉన్నప్పుడు యార్న్ ధర రూ.210 ఉండేదని, ఇప్పుడు పత్తి ధర రూ.130కు పెరిగితే యార్న్ ధర రూ.160-170కి తగ్గిపోయిందని స్పిన్నింగ్ మిల్లు యజమాని సుధాకర్ చౌదరి వాపోయారు. చైనా కొనుగోళ్లు ఆపేయడం యార్న్ ధరలు తగ్గిపోవడానికి ప్రధానకారణమన్నారు. అయితే రాష్ట్రంలో పత్తికి తీవ్ర కొరత రావడమే ధరలు పెరగడానికి కారణమని ఆంధ్రప్రదేశ్ స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ చైర్మన్ ధర్మతేజ చెప్పారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) వ్యవహారశైలే ఈ కొరతకు కారణమన్నారాయన. ‘‘కొన్ని విదేశీ కంపెనీల తరఫున సీసీఐ కొనుగోళ్లు చేయడంతో స్థానిక మిల్లులకు పత్తి లేకుండా పోయింది. పెరిగిన ముడిపదార్థాల ధరలతో మిల్లుకు రోజుకు రూ.3 నుంచి 5 లక్షల వరకు నష్టం వస్తోంది. క్యాండీ ధర రూ.40,000 దిగువకు వస్తే కానీ మిల్లులు ఆర్థికంగా నిలబడలేవు’’ అని ధర్మతేజ వివరించారు. రాష్ట్రంలో పప్పుధాన్యల దిగుబడిని పెంచడానికి పత్తిసాగును ప్రభుత్వం నిరుత్సాహపరచటం కూడా పత్తి ధరలు పెరగటానికి కారణమని మిల్లులు వాపోతున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మిల్లులు మూతపడి మూడు లక్షల మందికి ప్రత్యక్షంగాను, 5 లక్షల మంది పరోక్షంగాను ఉపాధి కోల్పోయే అవకాశాలున్నాయని అవి చెబుతున్నాయి. గడిచిన ఏడాది కాలంలో రాష్ట్రంలో మూడు మిల్లులు మూత పడినట్లు ఇటీవల పార్లమెంటులో కేంద్ర జౌళిశాఖ సహాయమంత్రి అజయ్ టంటా ప్రకటించారు. పేరుకుపోతున్న సబ్సిడీ బకాయిలు: పత్తి ధరలకు తోడు విద్యుత్ చార్జీలూ పెరిగాయి. ప్రభుత్వ సబ్సిడీలు విడుదల కావటం లేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా యూనిట్ విద్యుత్ ధర రూ. 10 ఉంది. యూనిట్‌కు రూ.2 సబ్సిడీ ఇవ్వడానికి ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపినప్పటికీ ఇంత వరకు ఉత్తర్వులు రాలేదు. త్వరలో విడుదల కావొచ్చని ఆంధ్రా చాంబర్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పొట్లూరి భాస్కరరావు చెప్పారు. మరోవంక కేంద్రం, ఏపీ ప్రభుత్వాల నుంచి సబ్సిడీల రూపంలో రావాల్సిన రూ.1,500 కోట్లు రాలేదు. ఈ ఏడాది విద్యుత్ సబ్సిడీ కింద రూ.1,000 కోట్లు ఇవ్వాల్సి ఉండగా... మొదటి విడత కింద రూ.270 కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇంత వరకు ఉత్తర్వులు రాలేదని ధర్మతేజ వాపోయారు. అలాగే టెక్నాలజీ అప్‌గ్రెడేషన్ ఫండ్ కింద కేంద్రం నుంచి రూ. 500 కోట్లు బకాయిలు అలానే ఉన్నాయన్నారు. నేడు అత్యవసర సమావేశం భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను చర్చించేందుకు బుధవారం అత్యవసరంగా సమావేశమవుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఇప్పటికే వారంలో ఒక రోజు మిల్లులకు సెలవు ప్రకటించామని, కాని పరిస్థితిలో మార్పు కనిపించకపోవడంతో తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం జరుపుతున్నట్లు ధర్మతేజ తెలిపారు. కార్మికులను దృష్టిలో పెట్టుకొని పూర్తిగా మూసివేయకుండా ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. కనీసం 25 నుంచి 30 శాతం వరకు తగ్గించే అవకాశాన్ని ఈ సమావేశంలో పరిశీలించనున్నట్లు తెలిపారు. -
ఆటోను ఢీకొన్న లారీ.. మహిళ మృతి
పెరవలి: తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం ముక్కామల వద్ద బుధవారం తెల్లవారుజామున ప్రయాణికులతో వెళుతున్న ఆటోను ఓ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో మణి అనే మహిళ మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో తణుకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం అవిడి గ్రామానికి చెందిన వీరు తణుకులోని బాలబాలాజీ స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్నట్టు సమాచారం. అయితే స్పిన్నింగ్ మిల్లుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. -
బాలకార్మికులు పనికి రావొద్దు
స్పందించిన స్పిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: దశాబ్దాల క్రితం మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటైన పలు స్పిన్నింగ్ మిల్లుల కార్మికుల సంక్షేమం కోసం ఏమాత్రం పట్టించుకోని తీరుపై ‘సాక్షి’లో కథనం వెలువడడంతో మిల్లుల యాజమాన్యాలు అంతర్మథనంలో పడ్డాయి. ఆమనగల్లు, మిడ్జిల్, కల్వకుర్తి, అడ్డాకుల ప్రాంతాల్లో ఉన్న స్పిన్నింగ్ మిల్లుల యజమానులు బాలకార్మికులను పనిలోకి రావద్దంటూ ఆదేశాలు జారీచేశారు. కార్మికులకు ఎవరికైనా పని కావాలంటే తమకు 18 సంవత్సరాలు నిండినట్లుగా ఆధార్ కార్డులో నమోదైతేనే పనిస్తామంటూ నిబంధనలు పెట్టారు. దీంతో సోమవారం ఆయా స్పిన్నింగ్ మిల్లుల్లో బాలకార్మికులు విధులకు హాజరుకాలేదు. అయితే బాలకార్మికుల స్థానంలో కొత్త కార్మికులను పెట్టుకోకపోవడంతో అనేక అనుమానాలకు తావి స్తోంది. కేవలం కొద్దిరోజులు బాలకార్మికులను పక్కనపెట్టి తర్వాత వారినే అదే తక్కువ వేతనంతో పనిలో పెట్టుకోవాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బాలకార్మికులను పనికి రావద్దని చెప్పిన యాజమాన్యాలు.. వారిని ప్రభుత్వానికి అప్పజెప్పకపోవడం, వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు గాని చదువుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గం చూపెట్టకపోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ‘సాక్షి’లో వచ్చిన కథనం వల్ల వందలాది బాలకార్మికులకు మాత్రం పని భారం నుండి విముక్తి లభించినట్లయింది. -
స్పిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం
సిరిసిల్ల: కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం బద్దెనపల్లి గ్రామంలో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక సాయి దామోదర స్పిన్నింగ్ మిల్లులో జరిగిన ఈ ప్రమాదంలో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఇది గుర్తించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమరు రూ. 2 కోట్ల ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలిసింది. -
స్పిన్నింగ్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం
తాండూరు: రంగారెడ్డి జిల్లా తాండూరు మండలం గోపన్నపల్లిలో రాజ్వీర్ స్పిన్నింగ్ మిల్లులో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మిల్లు గోదాములో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో భారీగా మంటలు పైకి లేచాయి. గోదాములో డీజిల్ కూడా నిల్వ ఉంచడంతో మంటలు మరింత ఎగసి పడుతున్నాయి. సమాచారం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది ఫైరింజన్లతో వచ్చి మంటలను విస్తరించకుండా నియంత్రించేందుకు శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో గోదాములో నిల్వ ఉంచిన రూ.2 కోట్ల విలువైన దారం ఉండలు దగ్ధం అయి ఉంటాయని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు. -
స్పిన్నింగ్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం
ప్రత్తిపాడు : గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని ఓ స్పిన్నింగ్ మిల్లులో మంగళవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సాయంత్రం 6 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో మిల్లులో నిల్వ ఉంచిన పత్తిబేళ్లు చాలా వరకు దగ్ధమయ్యాయి. భారీగా ఆస్తినష్టం జరిగి ఉంటుందని అంచనా. అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను కొంత వరకు అదుపు చేయగలిగారు. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. -
స్పిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం
-
పత్తి.. బుగ్గి
బూడిదైన పత్తి బేళ్లు తున్కిఖాల్సా స్పిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం రూ. కోట్ల ఆస్తి నష్టం రెండు నెలల్లో రెండోసారి ప్రమాదం వర్గల్ : ఎగసిన అగ్ని కీలలు పత్తి బే ళ్లను బూడిద చేశాయి. చీకటి వేళ చెలరేగిన మంటలు పరిశ్రమ వద్ద కార్మికులను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. సరిగ్గా రెండు నెలల వ్యవధిలో రెండో సారి అగ్ని ప్రమాదం సంభవించి భారీగా పత్తి బేళ్లు దగ్ధం కాగా రూ. కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి వర్గల్ మండలం తున్కిఖాల్సా సమీప స్పిన్నింగ్ మిల్లులో సంభవించింది. పత్తి బేళ్లు నిల్వచేసిన గోడౌన్లో శుక్రవారం రాత్రి 10.30 గం టల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. యాజమాన్యం వెంటనే సాయం కోసం గౌరా రం పోలీసులకు, అగ్నిమాపక విభాగం అధికారులకు తెలి పారు. వెంటనే జిల్లా అగ్నిమాపకాధికారి శ్రీధర్‌రెడ్డి గజ్వేల్, జీడిమెట్ల, మెదక్ నుంచి అగ్నిమాపక శకటాలతో సిబ్బంది ఘటనాస్థలికి తరలించారు. ఏ మాత్రం ఆలస్యమైనా మంటలు గోడౌన్ పక్కనే ఉన్న జిన్నింగ్ మిల్లుకు వ్యాపించి అపారనష్టం సంభవించేదన్నారు. ప్రమాదానికి కారణం ఏమిటన్నది తేలాల్సి ఉన్నదన్నారు. నష్టం ఏమేర జరిగిందో ఇప్పటికిప్పుడు నిర్ధారించలేమని, మొత్తం మీద రూ. కోట్లలో ఉంటుందని చెప్పారు. ఎన్ఓసీ లేదు..కనీస భద్రత లేదు రెండు నెలల క్రితం మార్చి 15న ఇదే పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించి రూ. కోట్ల నష్టం వాటిల్లినప్పటికి యాజమాన్యం కనీస భద్రత చర్యలు చేపట్టలేదని తమ పరిశీలనలో వెల్లడైందని జిల్లా అగ్నిమాపకాధికారి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. పరిశ్రమలో అగ్ని ప్రమాదాలు నివారించుకునేందుకు సేఫ్టీ కోసం కనీస అగ్ని మాపక పరికరాలు పరిశ్రమ యాజమాన్యం ఏర్పాటు చేయలేదన్నారు. నో ఆబ్జక్షన్ సర్టిఫికేట్ కూడా తీసుకోలేదని వివరించారు. యాజమాన్యం నిర్లక్ష్యం అడుగడుగునా కన్పిస్తున్నదని స్పష్టం చేసారు. మొదట తాము వృత్తి ధర్మంగా మంటలు ఆర్పేందుకు రంగంలోకి దిగి సఫలికృతులమయ్యామని, అనంతరం చర్యల్లో భాగంగా పరిశ్రమ నిర్లక్ష్యం, కనీస భద్రతా ప్రమాణాలు పాటించని వైనంపై కోర్టు ద్వారా ప్రాసిక్యూట్ చేయిస్తామని చెప్పారు. వరుసగా రెండు సార్లు జరిగిన అగ్ని ప్రమాదానికి పరిశ్రమ నిర్లక్ష్యమో మరే కారణమో గాని రూ. కోట్ల ఆస్తి మాత్రమ బుగ్గిపాలైంది. పూర్తి స్థాయిలో మంటలు ఆరిపోయేందుకు మరో రోజు పట్టే అవకాశమున్నట్లు అధికారులు భావిస్తున్నారు. కాగా ఘటనాస్థలిని గౌరారం ఎస్సై మధుసూదన్‌రెడ్డి సందర్శించి పరిశీలించారు. -
స్పిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం
హిందూపురం: జిల్లాలోని హిందూపురం మండలం కొత్తూరు సమీపంలో సూపర్-బి స్పిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనలో స్పిన్నింగ్ మిల్ లో నిల్వ ఉంచిన పత్తి బేళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. దాదాపు రూ.10 లక్షల అస్తి నష్టం వాటిల్లింది. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియ రాలేదు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అబ్బో.. ఎంత డబ్బో
సిద్దిపేటజోన్, న్యూస్‌లైన్: ఎన్నికల సందడి ఒకవైపు కొనసాగుతున్న క్రమంలో స్థానిక ఎంపీడీఓ చౌరస్తా వద్ద మంగళవారం పోలీసుల తనిఖీలో రూ. 50 లక్షలు పట్టుబడ్డాయి. ఈ విషయం పట్టణంలో కలకలం సృష్టించింది. కరెన్సీని పోలీసు బందోబస్తు మధ్య వన్‌టౌన్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి హుటాహుటిన స్టేషన్‌కు చేరుకుని కరెన్సీపై వివరాలు సేకరించారు. వన్ టౌన్ సీఐ నాగభూషణం కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్నికలలో భాగంగా స్థానిక ఎంపీడీఓ చౌరస్తా వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో ఏపీ 23ఏహెచ్ 2655 నంబరు గల కారులో రూ. 50 లక్షల నగదును గుర్తించారు. ఈ నగదుపై విచారించగా కొండపాక మండలం దుద్దెడ శివారులోని స్వాతి స్పిన్నింగ్ మిల్లుకు పత్తిని విక్రయించిన రైతులకు డబ్బులను చెల్లించేందుకు బ్యాంకు నుంచి రూ. 50 లక్షలను డ్రా చేసి తీసుకొస్తున్నట్టు సంబంధీకులు తెలిపారు. సంబంధిత నగదుతో ఉన్న కారును స్టేషన్‌కు తరలించి, విషయాన్ని డీఎస్పీకి వివరించినట్టు సీఐ తెలిపారు. అనంతరం బ్యాంకుకు సంబంధించిన డబ్బు డ్రా ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. మరోవైపు పెద్ద ఎత్తున పట్టుబడిన కరెన్సీపై పోలీసులు జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు సిద్దిపేటకు చెందిన సహాయ ఎన్నికల అధికారి, తహశీల్దార్ రాములు స్టేషన్‌కు చేరుకుని పోలీసుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. డబ్బును సీజ్ చేసి సమగ్ర దర్యాప్తు నిమిత్తం పోలీసులు ఆదాయ శాఖకు సమాచారం అందించారు. సీజ్ చేసిన నగదును స్థానిక ఎస్టీఓ కార్యాలయంలో భద్రపరిచారు. -
కరీంనగర్ జిల్లాలో స్పిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం
సుల్తానాబాద్ మండలం సుగులాంపల్లిలోని సురభి స్పిన్నింగ్ మిల్లులో ఆదివారం ఉదయం అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి. దాంతో భద్రత సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగసిపడి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నకిలీ కావు.. అసలు నోట్లే!
యాలాల, న్యూస్‌లైన్: రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేసిన ఓ స్పిన్నింగ్ మిల్లు యాజమాన్యం నకిలీ నోట్లు పంపిణీ చేసిందంటూ సోమవారం యాలాల మండలంలో వదంతులు వెలువడ్డాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు నోట్లను స్వాధీనం చేసుకుని విచారించి.. అవి నకిలీవి కాదని, అసలువేనని తేల్చేశారు. పోలీసులు, రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి మండలం సయ్యద్‌పల్లి గ్రామానికి చెందిన వెంకట్ రాంక్రిష్ణారెడ్డికి చెందిన లారీలో సుమారు 70 క్వింటాళ్ల పత్తిని యాలాల మండల పరిధిలోని దౌలాపూర్ సమీపంలోని ఓ స్పిన్నింగ్ మిల్లుకు తీసుకొచ్చారు. తూకం అయ్యాక సుమారు రూ. మూడు లక్షల 80వేల నగదును లారీ డ్రైవర్ రాములుకు మిల్లు ప్రతినిధులు అందజేశారు. అయితే ఇచ్చిన నగదులో రూ.500నోట్లపై డ్రైవర్‌కు అనుమానం కలిగింది. నోట్లు నకిలీ కావచ్చుననే అనుమానాన్ని మిల్లు ప్రతినిధులకు తెలియజేశాడు. దీంతో మిల్లు ప్రతినిధులు అనుమానం ఉన్న రూ.500నోట్లు(రూ.58వేల 500)లను తీసుకొని, చెక్కు రూపంలో మిగితా డబ్బులను చెల్లిస్తామని డ్రైవర్‌కు చెప్పారు. ఈ విషయాన్ని లారీ డ్రైవర్ తన యజమానికి ఫోన్లో తెలియజేశాడు. అయితే నకిలీ నోట్లు కావడంతోనే మిల్లు యజమానులు వెనక్కి తీసుకొని ఉండవచ్చుననే అనుమానంతోపాటు స్పిన్నింగ్ మిల్లుకు వచ్చిన పలువురు రైతులు మిల్లులో నకిలీ నోట్లను అందజేస్తున్నారనే అభిప్రాయాలను కొందరు రైతులు వ్యక్తం చేశారు. రైతుల ద్వారా విషయం తెలుసుకున్న యాలాల ఎస్ఐ రాజేందర్‌రెడ్డి సిబ్బందితో మిల్లు వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లడంతో ఘటనా స్థలానికి డీఎస్పీ షేక్ ఇస్మాయిల్, రూరల్ సీఐ రవిలు రాత్రి 9 గంటలకు మిల్లు వద్దకు చేరుకుని విచారణ జరిపారు. మిల్లు యజమానులు మాత్రం ప్రతిరోజు తాము ఓ బ్యాంకు నుంచి నగదును తీసుకువచ్చి, రైతులకు చెల్లింపులు చేస్తామని డీఎస్పీకి వివరణ ఇచ్చారు. సోమవారం కూడా అదే బ్యాంకు నుంచి రూ.40లక్షలు డ్రా చేసి, పత్తి కొనుగోలు చేసిన రైతులకు పంపిణీ చేశామన్నారు. అయితే రైతులకు పంపిణీ చేయగా మిగిలిన రూ.18లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకొని పరిశీలించారు. కాగా పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదులో నకిలీ నోట్లు లేవని నిర్ధారించారు. లారీ డ్రైవర్ పొరపాటు వల్లే ఈ వ్యవహారం కలకలం రేపిందని పోలీసులు వెల్లడించారు. -
స్పిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం
గణపవరం(నాదెండ్ల) న్యూస్‌లైన్: స్పిన్నింగ్ మిల్లులో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం జరిగి రూ.కోటికి పైగా ఆస్తినష్టం సంభవించింది. నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో ఈ ప్రమాదంలో చోటుచేసుకుంది. మిల్లు చైర్మన్ యర్రం శ్రీధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం వైఎస్సార్ స్పిన్సింగ్ మిల్లులోని స్టాక్‌గోడౌన్‌లో మధ్యాహ్నం 2.45 గంటలకు భారీఎత్తున మంటలు చెలరేగాయి. కార్మికులు గమనించి యాజమాన్యానికి, అగ్నిమాపకదళ అధికారులకు సమాచారం ఇచ్చారు. గోడౌన్లో ఉన్న 700 లకు పైగా పత్తి బేళ్లు, వీటిని ఆనుకొని ఉన్న 100 యార్న్ బండిల్స్ దగ్ధమయ్యాయి. మరో 100 యార్న్ బండిళ్ళను కార్మికులు సురక్షితంగా బయటకు తేగలిగారు. విద్యుత్ షార్ట్ సర్య్కూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. చిలకలూరిపేట ఫైర్ ఆఫీసర్ భాస్కరరావు సిబ్బందితో వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలను ఆర్పేందుకు ఐసీఎం, కల్పతరువు, ధనలక్ష్మి, ఎంఎల్ గ్రూపు, తిరుమలకంపెనీలకు చెందిన వాటర్‌ట్యాంకర్లను కూడా ఉపయోగించారు. అర్బన్ సీఐ గొట్టిపాటి చెంచుబాబు, ఎస్సై సాంబశివరావు, పలువురు పారిశ్రామికవేత్తలు వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.