బూడిదైన పత్తి బేళ్లు
తున్కిఖాల్సా స్పిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం
రూ. కోట్ల ఆస్తి నష్టం
రెండు నెలల్లో రెండోసారి ప్రమాదం
వర్గల్ : ఎగసిన అగ్ని కీలలు పత్తి బే ళ్లను బూడిద చేశాయి. చీకటి వేళ చెలరేగిన మంటలు పరిశ్రమ వద్ద కార్మికులను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. సరిగ్గా రెండు నెలల వ్యవధిలో రెండో సారి అగ్ని ప్రమాదం సంభవించి భారీగా పత్తి బేళ్లు దగ్ధం కాగా రూ. కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి వర్గల్ మండలం తున్కిఖాల్సా సమీప స్పిన్నింగ్ మిల్లులో సంభవించింది. పత్తి బేళ్లు నిల్వచేసిన గోడౌన్‌లో శుక్రవారం రాత్రి 10.30 గం టల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. యాజమాన్యం వెంటనే సాయం కోసం గౌరా రం పోలీసులకు, అగ్నిమాపక విభాగం అధికారులకు తెలి పారు.
వెంటనే జిల్లా అగ్నిమాపకాధికారి శ్రీధర్‌రెడ్డి గజ్వేల్, జీడిమెట్ల, మెదక్ నుంచి అగ్నిమాపక శకటాలతో సిబ్బంది ఘటనాస్థలికి తరలించారు. ఏ మాత్రం ఆలస్యమైనా మంటలు గోడౌన్ పక్కనే ఉన్న జిన్నింగ్ మిల్లుకు వ్యాపించి అపారనష్టం సంభవించేదన్నారు. ప్రమాదానికి కారణం ఏమిటన్నది తేలాల్సి ఉన్నదన్నారు. నష్టం ఏమేర జరిగిందో ఇప్పటికిప్పుడు నిర్ధారించలేమని, మొత్తం మీద రూ. కోట్లలో ఉంటుందని చెప్పారు.
ఎన్‌ఓసీ లేదు..కనీస భద్రత లేదు
రెండు నెలల క్రితం మార్చి 15న ఇదే పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించి రూ. కోట్ల నష్టం వాటిల్లినప్పటికి యాజమాన్యం కనీస భద్రత చర్యలు చేపట్టలేదని తమ పరిశీలనలో వెల్లడైందని జిల్లా అగ్నిమాపకాధికారి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. పరిశ్రమలో అగ్ని ప్రమాదాలు నివారించుకునేందుకు సేఫ్టీ కోసం కనీస అగ్ని మాపక పరికరాలు పరిశ్రమ యాజమాన్యం ఏర్పాటు చేయలేదన్నారు. నో ఆబ్జక్షన్ సర్టిఫికేట్ కూడా తీసుకోలేదని వివరించారు. యాజమాన్యం నిర్లక్ష్యం అడుగడుగునా కన్పిస్తున్నదని స్పష్టం చేసారు.
మొదట తాము వృత్తి ధర్మంగా మంటలు ఆర్పేందుకు రంగంలోకి దిగి సఫలికృతులమయ్యామని, అనంతరం చర్యల్లో భాగంగా పరిశ్రమ నిర్లక్ష్యం, కనీస భద్రతా ప్రమాణాలు పాటించని వైనంపై కోర్టు ద్వారా ప్రాసిక్యూట్ చేయిస్తామని చెప్పారు. వరుసగా రెండు సార్లు జరిగిన అగ్ని ప్రమాదానికి పరిశ్రమ నిర్లక్ష్యమో మరే కారణమో గాని రూ. కోట్ల ఆస్తి మాత్రమ బుగ్గిపాలైంది. పూర్తి స్థాయిలో మంటలు ఆరిపోయేందుకు మరో రోజు పట్టే అవకాశమున్నట్లు అధికారులు భావిస్తున్నారు. కాగా ఘటనాస్థలిని గౌరారం ఎస్సై మధుసూదన్‌రెడ్డి సందర్శించి పరిశీలించారు.
పత్తి.. బుగ్గి
Published Sun, May 17 2015 12:04 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement