ఎన్నికల సందడి ఒకవైపు కొనసాగుతున్న క్రమంలో స్థానిక ఎంపీడీఓ చౌరస్తా వద్ద మంగళవారం పోలీసుల తనిఖీలో రూ. 50 లక్షలు పట్టుబడ్డాయి.
సిద్దిపేటజోన్, న్యూస్‌లైన్: ఎన్నికల సందడి ఒకవైపు కొనసాగుతున్న క్రమంలో స్థానిక ఎంపీడీఓ చౌరస్తా వద్ద మంగళవారం పోలీసుల తనిఖీలో రూ. 50 లక్షలు పట్టుబడ్డాయి. ఈ విషయం పట్టణంలో కలకలం సృష్టించింది. కరెన్సీని పోలీసు బందోబస్తు మధ్య వన్‌టౌన్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి హుటాహుటిన స్టేషన్‌కు చేరుకుని కరెన్సీపై వివరాలు సేకరించారు. వన్ టౌన్ సీఐ నాగభూషణం కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
ఎన్నికలలో భాగంగా స్థానిక ఎంపీడీఓ చౌరస్తా వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో ఏపీ 23ఏహెచ్ 2655 నంబరు గల కారులో రూ. 50 లక్షల నగదును గుర్తించారు. ఈ నగదుపై విచారించగా కొండపాక మండలం దుద్దెడ శివారులోని స్వాతి స్పిన్నింగ్ మిల్లుకు పత్తిని విక్రయించిన రైతులకు డబ్బులను చెల్లించేందుకు బ్యాంకు నుంచి రూ. 50 లక్షలను డ్రా చేసి తీసుకొస్తున్నట్టు సంబంధీకులు తెలిపారు. సంబంధిత నగదుతో ఉన్న కారును స్టేషన్‌కు తరలించి, విషయాన్ని డీఎస్పీకి వివరించినట్టు సీఐ తెలిపారు. అనంతరం బ్యాంకుకు సంబంధించిన డబ్బు డ్రా ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు.
మరోవైపు పెద్ద ఎత్తున పట్టుబడిన కరెన్సీపై పోలీసులు జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు సిద్దిపేటకు చెందిన సహాయ ఎన్నికల అధికారి, తహశీల్దార్ రాములు స్టేషన్‌కు చేరుకుని పోలీసుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. డబ్బును సీజ్ చేసి సమగ్ర దర్యాప్తు నిమిత్తం పోలీసులు ఆదాయ శాఖకు సమాచారం అందించారు. సీజ్ చేసిన నగదును స్థానిక ఎస్టీఓ కార్యాలయంలో భద్రపరిచారు.