nagabhushanam
-
ఏసీబీ వలలో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): ఎన్టీఆర్జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని కొండపల్లి ఇండ్రస్టియల్ డెవలప్మెంట్ ఏరియా (ఐడీఏ)లో ఏసీబీ అధికారులు బుధవారం ఆకస్మికంగా దాడి చేశారు. స్థానిక సెంటారస్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో నూతన బాయిలర్ ఏర్పాటు అనుమతులకు డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ సత్యనారాయణ అసిస్టెంట్ నాగభూషణం రూ.2.10 లక్షలు నగదు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సెంటారస్ ఫార్మా కంపెనీలో నూతన బాయిలర్ ఏర్పాటుకు కంపెనీ యజమాని బాలిరెడ్డి అర్జీ పెట్టుకోగా అనుమతులు ఇచ్చేందుకు డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రూ.5.50 లక్షలు డిమాండ్ చేశాడు. రూ.3.50 లక్షలు ఇచ్చేందుకు బాలిరెడ్డి ఒప్పందం కుదుర్చుకుని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు ఇచ్చిన నగదు రూ.2.10 లక్షలను సత్యనారాయణ అసిస్టెంట్ నాగభూషణం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ విషయంపై ఏసీబీ అడిషనల్ ఎస్పీ స్నేహిత మాట్లాడుతూ బాయిలర్ ఫిటింగ్ చార్జీలు రూ.లక్ష, అదనంగా మరో 1.10 లక్షలు డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. నాగభూషణం చెప్పిన వివరాల మేరకు సత్యనారాయణను కూడా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు. ఏసీబీ డీఎస్పీ శరత్, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, శివకుమార్ పాల్గొన్నారు. -
మనుషులు చేజారుతారు
‘హమ్ తుమ్ ఏక్ కమరే మే బంద్ హో’.... భారత సినీ ప్రేక్షకుల్ని ఉర్రూతలూపిన ‘బాబీ’ మొన్నటి సెప్టెంబర్ 28కి యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇవాళ్టికీ దేశంలోని అన్ని భాషల్లో ఏదైనా టీనేజ్ ప్రేమకథ తీస్తూంటే గనక అది ఏదో ఒక మేరకు ‘బాబీ’కి కాపీ. ఆ సినిమా ఇచ్చిన ఫార్ములాతో వందలాది కథలు వచ్చాయి. వస్తాయి. ‘మేరా నామ్ జోకర్’ తీసి నిండా మునిగిన రాజ్‌కపూర్‌ను కుబేరుణ్ణి చేసిన సినిమా అది. ఆ సంపద వచ్చిన సందర్భంలోనే రాజ్‌కపూర్ ఒక మనిషిని చేజార్చుకున్నాడు. తెలిశా.. తెలియకనా? ‘బాబీ’ని కనీస ఖర్చుతో తీద్దామనుకున్నాడు రాజ్‌కపూర్. హీరో తన కొడుకే రిషికపూర్. హీరోయిన్ కొత్తమ్మాయి డింపుల్ కపాడియా. ముఖ్య పాత్రలు ప్రేమ్‌నాథ్, ప్రేమ్చోప్రా భార్య తరఫు బంధువులు. లక్ష్మీకాంత్– ప్యారేలాల్ ఇంకా కెరీర్ ప్రారంభంలో ఉండి రాజ్‌కపూర్‌తో మొదటి సినిమా చేయడమే వరం అనుకునే రకం. ఖర్చేముంది? ఒక్కటి ఉంది... ప్రాణ్ రెమ్యూనరేషన్ . ఆ రోజుల్లో ప్రాణ్ సినిమాకు రెండు, మూడు లక్షలు తీసుకుంటున్నాడు. రాజ్‌కపూర్‌తో అప్పటికి నలభై ఏళ్లుగా ప్రాణస్నేహం. ‘ఒక్కరూపాయి తీసుకొని చేస్తా. సినిమా ఆడితే ఇవ్వు. ఆడకపోతే మర్చిపో’ అన్నాడు ప్రాణ్. అన్నమాట ప్రకారం ఒక్క రూపాయికే చేశాడు. సినిమా రిలీజ్ అయ్యింది. ఇరవై పాతిక లక్షలు పెట్టి తీస్తే దేశంలో, బయట కలిపి 30 కోట్లు వచ్చాయి. నేటి లెక్కల ప్రకారం 1200 కోట్లు! రాజ్‌కపూర్ ప్రాణ్‌ని పిలిచి మంచి పార్టీ ఇస్తే బాగుండేది. థ్యాంక్స్ చెప్పి అడిగినంత ఇచ్చి ఉంటే బాగుండేది. ఇవ్వకపోయినా బాగుండేది. కాని రాజ్‌కపూర్ లక్ష రూపాయల చెక్ పంపాడు. లక్ష? తను అడగలేదే? పోనీ తాను అందరి దగ్గరా తీసుకునేంత కూడా కాదే. ప్రాణ్ ఆ చెక్ వెనక్కు పంపాడు. మళ్లీ జీవితంలో రాజ్కపూర్ని కలవలేదు. జారిపోయాడు. ‘షోలే’ రిలీజ్ అయితే మొదటి రెండు వారాలు ఫ్లాప్‌టాక్. రాసిన సలీమ్–జావేద్ ఆందోళన చెందారు. ఫ్లాప్ కావడానికి స్క్రిప్ట్ కారణమనే చెడ్డపేరు ఎక్కడ వస్తుందోనని బెంబేలెత్తారు. మాటల్లో మాటగా దర్శకుడు రమేష్ సిప్పీతో ‘గబ్బర్‌సింగ్ వేషం వేసిన అంజాద్‌ఖాన్ వల్లే సినిమా పోయింది. అతడు ఆనలేదు’ అన్నారు. అప్పటికే తన తొలి సినిమాకు ఇలాంటి టాక్ రావడం ఏమిటా అని చాలా వర్రీగా ఉన్న అంజాద్‌ఖాన్ బ్లేమ్ గేమ్‌లో తనను బలి చేయబోతున్నారని తెలిసి హతాశుడయ్యాడు. తీవ్రంగా కలత చెందాడు. కాని సినిమా కోలుకుంది. ఎలా? అలాంటి కలెక్షన్లు ఇప్పటికీ లేవు. అతి గొప్ప విలన్ గా అంజాద్‌ఖాన్ ఎన్నో సినిమాలు చేశారు. కాని ఒకనాటి మిత్రులైన సలీమ్–జావేద్ రాసిన ఏ స్క్రిప్ట్‌లోనూ మళ్లీ యాక్ట్ చేయలేదు. చేజారిపోయాడు. దాసరి నారాయణరావు తొలి రోజుల్లో నటుడు నాగభూషణాన్ని ఎంతో నమ్ముకున్నాడు. అభిమానించాడు. నాగభూషణం దాసరికి దర్శకుణ్ణి చేస్తానని చెప్పి చాలా పని చేయించుకున్నాడు. చివరి నిమిషంలో వేరొకరిని పెట్టుకున్నాడు. దాసరి ఆ తర్వాత పెద్ద దర్శకుడయ్యి 150 సినిమాలు చేశాడు. వందల పాత్రలు రాశాడు. కాని దాసరి కలం నుంచి ఒక్క పాత్ర కూడా నాగభూషణం కోసం సృజించబడలేదు. దాసరి సినిమాల్లో నాగభూషణం ఎప్పుడూ లేడు. రామానాయుడు అవకాశం ఇస్తే ఎంతో కష్టం మీద ‘ప్రేమఖైదీ’ సినిమాకు దర్శకత్వం వహించాడు ఇ.వి.వి.సత్యనారాయణ. అప్పటికి అతని మొదటి సినిమా ఫ్లాప్. ఈ సినిమా కూడా పోతే భవిష్యత్తు లేదు. ఫస్ట్ కాపీ చూసిన పరుచూరి బ్రదర్స్ ఏ మూడ్‌లో ఉన్నారో ‘మా స్క్రిప్ట్‌ను చెడగొట్టినట్టున్నాడే’ అనే అర్థంలో రామానాయుడు దగ్గర హడావిడి చేశారు. వారు స్టార్‌రైటర్స్. వారి మాట మీద రామానాయుడుకు గురి. ఇ.వి.వి హడలిపోయాడు. స్క్రిప్ట్‌ను తన బుర్రతో ఆలోచించి మెరుగుపెట్టి తీస్తే ఇలా అంటారేమిటి అని సిగరెట్లు తెగ కాల్చాడు. సినిమాను మూలపడేస్తే ఇంతే సంగతులే అని కుంగిపోయాడు. కాని సినిమా రిలీజయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత 51 సినిమాలు తీశాడు ఇ.వి.వి. ఒక్కదానికీ గురు సమానులైన పరుచూరి సోదరుల స్క్రిప్ట్ వాడాలనుకోలేదు. బాగా చనువుగా, ఆత్మీయంగా ఉండే మనుషుల పట్ల కొందరికి హఠాత్తుగా చిన్నచూపు వస్తుంది. ఆ.. ఏముందిలే అనుకోబుద్ధవుతుంది. వారితో మనం ఎలా వ్యవహరించినా చెల్లుబాటవుతుందిలే అనిపిస్తుంది. వారితో చెప్పకుండా ఫలానా పని చేద్దాం... శుభలేఖ ఆఖరున పంపుదాం... కష్టంలో ఉన్నారని తెలిసినా చూసీ చూడనట్టు ఉందాం... ఇచ్చిన మాటను తేలిగ్గా తీసుకుందాం... వారి వీపు మీద విస్తరి పరిచి భోం చేద్దాం... అనుకుంటే ఆ క్షణంలో ఆ సదరు వారు మనం చెప్పింది విన్నట్టుగా కనపడతారు. నవ్వుతున్నట్టే ఉంటారు. కాని వారి లోపల మనసు చిట్లుతున్న చప్పుడు మన చెవిన పడకుండా జాగ్రత్త పడతారు. ఆ తర్వాత వారు మనకు కనిపించరు. జారిపోతారు. చేజారిపోతారు. మనుషులు చేజారితే ఏమవుతుంది? వారితో మాత్రమే సాధ్యమయ్యే జీవన సందర్భాలన్నీ నాశనమవుతాయి. వారితో నిర్మించుకున్న గతం తుడిచిపెట్టుకుపోతుంది. వారితో వీలైన భవిష్యత్తు నష్టమవుతుంది. ఉంటే బాగుండు అనుకునే క్షణాల్లో వారు ఉండరు. డబ్బు, దస్కం, పలుకుబడి, క్షమాపణ ఏదీ వారిని మళ్లీ వెనక్కు తీసుకురాదు. హాయ్, హలో బాపతు సవాలక్ష దొరుకుతారు. ఈ నిజమైన ఆత్మీయులను కాపాడుకుంటున్నారా? అసలు మీరెంత మందిని చేజార్చుకున్నారో ఎప్పుడైనా లెక్క చూసుకున్నారా? -
అందరికీ ఒక్కడే దేవుడు!
అది 50 ఏళ్ళ క్రితం సంగతి. తెలుగునాట ఓ కాలేజీలో విభిన్న మతాల విద్యార్థుల మధ్య ఘర్షణ రేగింది. సమ్మె జరిగింది. మతవిద్వేషాల మధ్య చివరకు ఆ కాలేజీని కొంతకాలం తాత్కాలికంగా మూసేశారు. మమతలు పెంచవలసిన మతాలు, మనుషులను విడదీస్తున్న సరిగ్గా అదే సమయంలో యాదృచ్ఛికంగా ఓ సినిమా వచ్చింది. సీనియర్ క్యారెక్టర్ నటుడు నాగభూషణం స్వయంగా ఓ కీలకపాత్ర పోషిస్తూ, ఓ సినిమాను సమర్పించారు. అదే పెద్ద ఎన్టీయార్ హీరోగా చేసిన – ‘ఒకే కుటుంబం’. ఈ క్రిస్మస్తో స్వర్ణోత్సవం (రిలీజ్ తేదీ 1970 డిసెంబర్ 25) పూర్తి చేసుకున్న ప్రబోధాత్మక చిత్రం. ఎన్టీఆర్ సినీ కుటుంబం: హిందువైన రాముగా పుట్టి, అనుకోకుండా ఓ ముస్లిమ్ ఇంట రహీముగా పెరిగి, ఓ క్రైస్తవ అమ్మాయి మేరీని ప్రేమించి, పెళ్ళాడిన ఓ యువకుడి (ఎన్టీఆర్) కథ ఇది. ఆ యువకుడి కన్నతండ్రి దుర్మార్గుడైన వజ్రాల వర్తకుడు (నాగభూషణం). కుమారుడని తెలియక, హీరో మీదే యాసిడ్ దాడి చేయిస్తాడు. అలా ముఖం అందవిహీనంగా మారే హీరో పాత్రను ఎన్టీఆర్ పోషించారు. ఆ తరువాత పుట్టుకతో వికారమైన ముఖం ఉన్న హీరో పాత్ర తమిళ, తెలుగు తెరపై అనేకం వచ్చాయి. శివాజీగణేశన్ సూపర్ హిట్ ‘దైవ మగన్’ (తెలుగులో ‘కోటీశ్వరుడు’) లాంటివి అందుకు ఉదాహరణ. (చదవండి: వెండితెర సోగ్గాడు @45 ఇయర్స్) ఆ రోజుల్లో ఎన్టీఆర్‌తో నాగభూషణానికి అనుబంధం ఉండేది. ఎన్టీఆర్ ‘ఉమ్మడి కుటుంబం’, ‘కోడలు దిద్దిన కాపురం’, ‘వరకట్నం’ లాంటి తన సొంత చిత్రాలు చాలావాటిలో పాత్రలను ఎస్వీఆర్ అందుబాటులో లేనప్పుడల్లా, నాగభూషణానికి ఇచ్చేవారని పాత సినీ పరిశీలకుల మాట. అలాగే, ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఎంతో పెద్ద హీరో అయినా... సినీపరిశ్రమలోని తోటి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు సొంతంగా సినిమాలు తీసుకుంటామంటే, వారికి డేట్లిచ్చి, ప్రోత్సహించేవారు. తోటివారికి అలా చాలా సినిమాలు చేసిన ఏకైక హీరో ఆయనే. ఆ క్రమంలోనే నాగభూషణానికి ఎన్టీఆర్ ఈ ‘ఒకే కుటుంబం’ చేశారు. మంచి సినిమాల మన భీమ్ సింగ్: తమిళంలో అగ్ర దర్శకుడైన ఎ. భీమ్‌సింగ్ ఈ ‘ఒకే కుటుంబం’కి రూపకర్త. ఎన్టీఆర్ హీరోగా భీమ్‌సింగ్ దర్శకత్వంలో తొలి సినిమా ఇదే. తమిళంలో అగ్ర హీరో శివాజీ గణేశన్‌తో అనేక సూపర్ హిట్లు తీసి, హిందీలో కూడా పలు చిత్రాలు దర్శకత్వం వహించిన ఘనత భీమ్సింగ్ది. తమిళనాట ఎంతో పేరున్న భీమ్‌సింగ్ నిజానికి అచ్చంగా మన తెలుగువారే. తిరుపతి దగ్గర రాయలచెరువు ఆయన స్వస్థలం. ఏసుక్రీస్తుపై విజయచందర్ నిర్మించిన ‘కరుణామయుడు’కు కూడా దర్శకుడు భీమ్సింగే. ఆ చిత్రం తీస్తున్నప్పుడే అస్వస్థతకు గురై, భీమ్‌సింగ్ మరణించారు. 1980 – 90లలో తెలుగులో మనకు దాసరి – రాఘవేంద్రరావుల లాగా, వాళ్ళ కన్నా చాలాముందే తమిళ వెండితెరను ఇద్దరు ప్రముఖ దర్శకులు – భీమ్‌సింగ్, శ్రీధర్ ఏలారు. సూపర్ హిట్లిచ్చి, తమిళ సినీచరిత్రలో వారిద్దరూ భాగమయ్యారు. తమిళ సినీరంగం ఇప్పటికీ తలుచుకొనే ఆ ఇద్దరూ తెలుగువాళ్ళే కావడం విశేషం. దాసరి వర్సెస్ నాగభూషణం?: ‘ఒకే కుటుంబం’కి భీమ్‌సింగ్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్ దాసరి నారాయణరావు. ఈ సినిమాకు ఆయన ఓ పాట కూడా రాశారు. అప్పట్లో తమిళ, హిందీ చిత్రాల బిజీతో ఉన్న భీమ్ సింగ్ కు కుదరనప్పుడు ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలను దాసరే డైరెక్ట్ చేయడం విశేషం. ఆ చిత్రీకరణ సమయంలో ఏమైందో, ఏమో కానీ దర్శకుడిగా మారాలన్న ప్రయత్నంలో ఉన్న దాసరికీ, నటుడు – నిర్మాత నాగభూషణానికీ ఎక్కడో తేడా వచ్చింది. సినిమా అయిపోయినా, ఆ తరువాత కూడా వారి మధ్య ఆ పొరపొచ్చాలు సమసిపోయినట్టు లేవు. అందుకేనేమో... ఆ తరువాత దాసరి దర్శకుడై, అనేక చిత్రాలు రూపొందించినా ఆయన సినిమాల్లో నాగభూషణం కనిపించరు. ఎన్టీఆర్ సరసన లక్ష్మి నటించారీ చిత్రంలో. కాంతారావు, రాజశ్రీ మరో జంట. మతసామరస్యానికి ప్రతీకగా..: ఒక మతం ఎక్కువ, మరో మతం తక్కువ కాదంటూ... మతసామరస్యం బోధించే ఈ సినిమా కథకు తగ్గట్టుగా... టైటిల్‌కు పక్కనే గుడి, మసీదు, చర్చి శిలువ – మూడూ ఉండేలా అర్థవంతమైన డిజైన్ చేశారు ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్. ఈ సినిమాకు ప్రభుత్వం వినోదపన్ను మినహాయింపు ఇవ్వాలని కూడా అప్పట్లో కొందరు సినీ విమర్శకులు అభిప్రాయపడడం విశేషం. మూడు వేర్వేరు మతాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఈ సినిమాలో కనిపిస్తారు. తొలి తరం అగ్ర హీరో నాగయ్య చుట్టుపక్కల అందరికీ మంచి చేసే ముస్లిమ్ పెద్ద ఇస్మాయిల్ పాత్రలో, అలాగే మరో తొలినాళ్ళ హీరో సిహెచ్. నారాయణరావు క్రైస్తవ ఫాదర్ జేమ్స్ పాత్రలో నటించారు. ఆకాశవాణిలో ‘రేడియో బావగారు’గా సుప్రసిద్ధులైన ప్రయాగ నరసింహశాస్త్రి ఈ చిత్రంలో హిందువైన శాస్త్రి పాత్రలో కనిపిస్తారు. ఎస్పీ కోదండపాడి సంగీతంలో దాశరథి రాయగా, ఎన్టీఆర్ పై చిత్రీకరించిన ‘అందరికీ ఒక్కడే దేవుడు’ పాట ప్రబోధాత్మకంగా సాగుతుంది. ఒకప్పుడు తరచూ రేడియోల్లో వినిపించిన ‘మంచిని మరచి వంచన చేసి’ అనే పాట సమాజంలోని పరిస్థితులను స్ఫురింపజేస్తూ, 50 ఏళ్ళ తరువాత ఇవాళ్టికీ సరిగ్గా సరిపోవడం విశేషం. మిస్సయిన సెంచరీ! ‘ఒకే కుటుంబం’కి మాటలు రాసింది ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు. తెలుగుదనం ఉట్టిపడేలా రాసిన ఆయన మాటలు, మరీ ముఖ్యంగా వినోదభరితమైన విలనీ పండిస్తూ నాగభూషణం పోషించిన మార్తాండం పాత్రకు రాసిన డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. నాగభూషణం పక్కన ఉండే అల్లు రామలింగయ్యతో ఈ సినిమాలో ‘శివాయ విష్ణు రూపాయ, శివ రూపాయ విష్ణవే’ అనే శ్లోకానికి శివుడు, విష్ణువు అంతా రూపాయిలోనే కనిపిస్తారు అంటూ చేసిన సోషల్ సెటైర్ డైలాగ్ అప్పట్లో అందరికీ తెగ నచ్చింది. అప్పట్లో జనాదరణ పొందిన ఈ చిత్రం నిజానికి శతదినోత్సవం జరుపుకోవాల్సిందే. అయితే, అప్పట్లో సినిమా వందరోజులు ఆడితే థియేటర్లలో వర్కర్లకు బోనస్ ఇచ్చే పద్ధతి ఉండేది. దాంతో, వర్కర్లకు బోనస్ ఇవ్వాల్సి వస్తుందని సరిగ్గా 97 రోజులకు ‘ఒకే కుటుంబం’ చిత్రాన్ని నిర్మాతలు హాలులో నుంచి తీసేయడం విచిత్రం. – రెంటాల జయదేవ -
నవరసాల నటి సీతాదేవి కన్నుమూత
ప్రముఖ సీనియర్ నటి, దివంగత విలక్షణ నటుడు నాగభూషణం సతీమణి పొట్నూరి సీతాదేవి (87) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం ఉదయం తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1933 అక్టోబర్ 14న కాకినాడలో రామస్వామి దంపతులకు జన్మించారు సీతాదేవి. సమీప బంధువు నీలాబాయి భర్త రాజా శాండో ఫిల్మ్ మేకర్ కావడంతో సీతని కాకినాడ నుంచి మదరాసుకు దత్తపుత్రికగా తీసుకెళ్లారు. బాల్యం నుంచే నృత్యాలపట్ల మక్కువ పెంచుకుని అభ్యాసన మొదలెట్టారామె. 1947లో కేవీ రెడ్డి దర్శకత్వం వహించిన ‘యోగి వేమన’లో బాలనటిగా కనిపించారు సీత. కేవీ రెడ్డి రూపొందించిన ‘మాయాబజార్, గుణసుందరి కథ, పెళ్లినాటి ప్రమాణాలు, పెద్దమనుషులు’ తదితర చిత్రాల్లో హాస్యపాత్రలు, చెలికత్తె పాత్రలు చేశారామె. కేవలం హాస్యమే కాకుండా తనలోని నటిని అన్ని రసాల్లో ఆవిష్కరించారు సీత. 1940 నుండి ప్రారంభమైన ఆమె సినీ ప్రస్థానం 2002లో ‘నేనేరా పోలీస్’ వరకూ సాగింది. దాదాపు 250 చిత్రాల్లో నటించారామె. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే నటుడు నాగభూషణంతో కలిసి ‘రక్తకన్నీరు, పాపం పండింది, ఇనుప తెరలు, అందరూ బతకాలి’ లాంటి నాటకాలు దాదాపు 2వేల ప్రదర్శనలిచ్చారు. ‘లవంగి, జయసింహ, పల్లెటూరిపిల్ల, గుణసుందరి కథ, స్వర్ణసుందరి, స్వప్నసుందరి, పరమానందయ్య శిష్యులు, పల్నాటియుద్ధం, పంతులమ్మ, నలదమయంతి, గృహప్రవేశం, సతీతులసి, అత్తా ఒకింటి కోడలే, ఋష్యశృంగ, సత్యహరిశ్చంద్ర, సంతోషిమాత వ్రతం, దేవదాసు, మాయాబజార్’ వంటి గొప్ప చిత్రాల్లో నటించి తన ప్రతిభ చాటారు సీత. ‘ఋతురాగాలు’ టీవీ సీరియల్లో నటించారు. ఆ తర్వాత పలు సీరియల్స్‌లో నటించి బుల్లితెరపైనా మంచి పేరు తెచ్చుకున్నారు. ‘రక్తకన్నీరు’ నాటకం అనేక ప్రాంతాల్లో తిరిగి ప్రదర్శించే సమయంలో నటుడు నాగభూషణాన్ని 1956లో వివాహం చేసుకున్నారు సీత. పెళ్లయ్యాక దాదాపు కుటుంబానికే పరిమితమయ్యారు. హిందీలో రూపొందించిన ‘అల్బేలా’ చిత్రాన్ని నాగభూషణం తెలుగులో ‘నాటకాల రాయుడు’గా రూపొందించారు. ఆ చిత్రంలో ఆయన వదిన పాత్రలో విషాద ఛాయలు పలికిస్తూ సీత చేసిన నటన అందర్నీ కదిలించింది. ఓ హాస్యనటి జీవితంలో ఓ విలక్షణమైన పాత్రగా అందరూ అభివర్ణించారు. నాగభూషణం, సీతాదేవి దంపతులకు కూతురు భువనేశ్వరి, కొడుకు సురేందర్ ఉన్నారు. వారికి పెళ్లిళ్లు అయ్యాక తనకు వీలు కుదిరినప్పుడల్లా సినిమాల్లో నటించేవారు ఆమె. సినిమా పరిశ్రమలో ఉన్న అనేకమందితో పాటు బంధువుల కష్టాలను విని గుప్తదానాలు ఎన్నో చేశారు సీత. రేలంగితో అనేక హాస్య పాత్రల్లో నటించిన సీతకు ‘యువ కళావాహిని’ సంస్థ వారు రేలంగి పురస్కారం ప్రదానం చేశారు. మంచి నటిగా పేరు తెచ్చుకున్న ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. హైదరాబాద్‌లోని మహా ప్రస్థానంలో సోమవారం ఆమె అంత్యక్రియలు ముగిశాయి. ‘మాయాబజార్’ చిత్రంలో సావిత్రితో... నా తొలినాళ్ల గురువు సీతాదేవి నేను అప్పుడప్పుడే డ్యా¯Œ ్స నేర్చుకుంటున్నాను. ‘రక్తకన్నీరు’ నాటకంలో నటించడానికి ఓ మంచి నటి కావాలని మామ సత్యం అనే మా ఇంటిపక్కనున్న ఓ టెక్నీషియన్ మా అమ్మను, నన్ను నాగభూషణంగారి ఇంటికి తీసుకువెళ్లారు. అప్పుడే సీతగారు నన్ను తొలిసారి చూశారు. నువ్వేమీ భయపడకు, స్టేజీపై మేము ఉంటాం కదా! చక్కగా నటించాలి అని ప్రోత్సహించారు. అలాగే ‘ఎక్కువకాలం మా గ్రూపులో ఉండవు.. పెద్ద హీరోయి¯Œ అయిపోతావు’ అని చెప్పారామె. నా కెరీర్ తొలినాళ్లలో దొరికిన ఓ అద్భుతమైన గురువు ఆమె. – వాణిశ్రీ, నటి -
కడుపు నొప్పి తాళలేక..
బెళుగుప్ప (ఉరవకొండ) : మండలంలోని విరుపాపల్లి గ్రామానికి చెందిన హరిజన నాగభూషణం(32) కడుపునొప్పి తాళలేక ఆదివారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ నాగస్వామి వివరాల మేరకు.. నాగభూషణం కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతుండేవాడు. పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నా నయం కాకపోవడంతో.. ఆదివారం తెల్లవారుజామున ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు గమనించి అతడిని కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. అతడికి భార్య ధనలక్ష్మి, నాలుగు సంవత్సరాల వయస్సున్న కూతురు మహాలక్ష్మి ఉంది. అతడి తండ్రి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ తెలిపారు. -
చీఫ్ ఇంజనీర్ ఆస్తులు 100 కోట్లకు పైనే!
-
చీఫ్ ఇంజనీర్ ఆస్తులు 100 కోట్లకు పైనే!
విశాఖపట్నం: ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ ఇంటిపై ఏసీబీ అధికారులు శనివారం దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో భారీగా ఆస్తులు బయటపడుతున్నాయి. ఏపీ ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ ఎం. గంగాధర్‌తో పాటు రోడ్డు కాంట్రాక్టర్ నాగభూషణంపై గత కొన్ని రోజులుగా ఆరోపణలు వస్తుండటంతో.. ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. వీరిద్దరి ఇళ్లతో పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. విశాఖ, నెల్లూరు, కడప, గుంటూరు, చిత్తూరు, విజయవాడ, హైదరాబాద్‌ల్లో సుమారు 20 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 11 చోట్ల ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. కూకట్పల్లి రాంకీ టవర్స్‌లో రూ. 8 కోట్ల విల్లా, కూకట్పల్లి వివేకానందనగర్‌లో ఓ ఇళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కూకట్పల్లి నివాసంలో రూ. 40 లక్షల నగదును అధికారులు సీజ్ చేశారు. ఇప్పటి వరకు వివిధ చోట్ల సోదాల్లో 50 లక్షల విలువైన బంగారం, 5 బ్యాంకు లాకర్లను అధికారులు గుర్తించారు. డాక్యుమెంట్ల ప్రకారం 8 కోట్ల ఆస్తులను కనుగొన్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ. 100 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ వెల్లడించారు. విజయవాడలోని కాంట్రాక్టర్ నగభూషనం ఇంట్లో సైతం రూ. 40 లక్షలు సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. చిత్తూరు జిల్లా పీలేరులోని గంగాధరం బంధువుల ఇళ్లలో జరిపిన సోదాల్లో 19 ఎకరాల వ్యవసాయ భూమిని అధికారులు గుర్తించారు. -
చికిత్స పొందుతూ రైతు మృతి
రాప్తాడు : జిల్లా సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి తాలుకా టీబీ క్రాస్ సమీపంలో గత నెల 22న చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతున్న రైతు నాగభూషణం ఆదివారం మృతిచెందాడు. తాము పండించిన బెండకాయలను ఐచర్ వాహనంలో బెంగళూరుకు తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్న విషయం విదితమే. ఘటనలో హంపాపురానికి చెందిన గొరవ నాగభూషణం (42), మరో 20 మంది రైతులు గాయపడ్డారు. ఎం.బండమీదపల్లికి చెందిన నడిమిదొడ్డి నాగేంద్ర సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగభూషణం ఆదివారం తెల్లవారుజామున మృతిచెందాడు. సాయంత్రం ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు ముగిశాయి. మృతుడికి భార్య నాగేంద్రమ్మ, కుమారుడు మురళిమోహన్, కుతూరు నందినిలు ఉన్నారు. -
రైతు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
-
స్నేహితుడే చంపేశాడు
నల్గొండ: మద్యం మత్తులో ప్రాణ స్నేహితులే బద్దశత్రువులయ్యారు. అప్పటివరకు 'దోస్త్ మేరా దోస్త్ తూహై మేరీ జాన్' అంటూ పాటలు పాడుకున్న వాళ్లే.. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన నల్గొండ జిల్లా సూర్యపేట శివారులోని భగత్‌సింగ్‌నగర్‌లో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన టి.శ్రీను, నాగభూషణం ఇద్దరు గురువారం రాత్రి మద్యం సేవిస్తూ గొడవపడ్డారు. ఘర్షణలో భాగంగా శ్రీను అనే వ్యక్తి నాగ భూషణంపై చేయి చేసుకున్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన నాగభూషణం కొబ్బరి బోండాలు నరికే కత్తితో శ్రీనును నరికి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. నిందితుడు పరారయ్యాడు. -
అబ్బో.. ఎంత డబ్బో
సిద్దిపేటజోన్, న్యూస్‌లైన్: ఎన్నికల సందడి ఒకవైపు కొనసాగుతున్న క్రమంలో స్థానిక ఎంపీడీఓ చౌరస్తా వద్ద మంగళవారం పోలీసుల తనిఖీలో రూ. 50 లక్షలు పట్టుబడ్డాయి. ఈ విషయం పట్టణంలో కలకలం సృష్టించింది. కరెన్సీని పోలీసు బందోబస్తు మధ్య వన్‌టౌన్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి హుటాహుటిన స్టేషన్‌కు చేరుకుని కరెన్సీపై వివరాలు సేకరించారు. వన్ టౌన్ సీఐ నాగభూషణం కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్నికలలో భాగంగా స్థానిక ఎంపీడీఓ చౌరస్తా వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో ఏపీ 23ఏహెచ్ 2655 నంబరు గల కారులో రూ. 50 లక్షల నగదును గుర్తించారు. ఈ నగదుపై విచారించగా కొండపాక మండలం దుద్దెడ శివారులోని స్వాతి స్పిన్నింగ్ మిల్లుకు పత్తిని విక్రయించిన రైతులకు డబ్బులను చెల్లించేందుకు బ్యాంకు నుంచి రూ. 50 లక్షలను డ్రా చేసి తీసుకొస్తున్నట్టు సంబంధీకులు తెలిపారు. సంబంధిత నగదుతో ఉన్న కారును స్టేషన్‌కు తరలించి, విషయాన్ని డీఎస్పీకి వివరించినట్టు సీఐ తెలిపారు. అనంతరం బ్యాంకుకు సంబంధించిన డబ్బు డ్రా ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. మరోవైపు పెద్ద ఎత్తున పట్టుబడిన కరెన్సీపై పోలీసులు జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు సిద్దిపేటకు చెందిన సహాయ ఎన్నికల అధికారి, తహశీల్దార్ రాములు స్టేషన్‌కు చేరుకుని పోలీసుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. డబ్బును సీజ్ చేసి సమగ్ర దర్యాప్తు నిమిత్తం పోలీసులు ఆదాయ శాఖకు సమాచారం అందించారు. సీజ్ చేసిన నగదును స్థానిక ఎస్టీఓ కార్యాలయంలో భద్రపరిచారు. -
హవ్వ.. ఇదేం విచిత్రం!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: క్షేత్రస్థాయి అధికారుల పోస్టుల భర్తీ పట్టించుకోని సమాచార, ప్రజా సంబంధాల శాఖ ఉన్నత స్థాయిలో కొత్త పోస్టుల సృష్టికి ఉబలాటపడుతోంది. జిల్లాస్థాయిలో ప్రస్తుతం ప్రజా సంబంధాల అధికారి(డీపీఆర్ఓ) పర్యవేక్షణలో సమాచార, ప్రజా సంబంధాల శాఖ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. డీపీఆర్ఓ పోస్టును కొనసాగిస్తూనే కొత్తగా డిప్యూటీ డెరైక్టర్(డీడీ) లేదా అసిస్టెంట్ డైరక్టర్(ఏడీ) పోస్టులను సృష్టించారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 12 డీడీ, 13 ఏడీ పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మెదక్ జిల్లాకు ఈ ఇద్దరిలో ఏ హోదా అధికారి వస్తారో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. జిల్లాలో డీపీఆర్‌ఓతో పాటు, ముగ్గురు డివిజనల్ పీఆర్వోలు పనిచేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ పోస్టులన్నీ ఖాళీగా ఉండటంతో రంగారెడ్డి జిల్లా డివిజనల్ పీఆర్వో ప్రణీత్ డిప్యూటేషన్‌పై మెదక్ జిల్లా డీపీఆర్ఓగా పనిచేస్తున్నారు. సిద్దిపేట డివిజనల్ పీఆర్వో ఆరోగ్య కారణాలతో చాలాకాలంగా సెలవులో ఉన్నారు. మెదక్, సంగారెడ్డిలో డివిజనల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల పదవీ విరమణ చేసిన పబ్లిసిటీ అసిస్టెంట్ నాగభూషణంకు పౌర సరఫరాల విభాగం ద్వారా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వేతనం చెల్లిస్తూ మెదక్ డివిజన్ బాధ్యతలు అప్పగించారు. రెండు అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్(ఏపీఆర్ఓ) పోస్టులూ ఖాళీగానే ఉన్నాయి. ఆరుగురు పబ్లిసిటీ అసిస్టెంట్లకు గాను ఇద్దరే జిల్లా కేంద్రంలో పనిచేస్తున్నారు. వీరిలో ఒకరు నల్గొండ జిల్లా నుంచి డిప్యూటేషన్‌పై వచ్చినవారే కావడం గమనార్హం. ఫొటోగ్రాఫర్ లేకపోవడంతో ఆర్వీఎం ద్వారా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఓ వ్యక్తిని నియమించి నెట్టుకొస్తున్నారు. ఉన్న ఒక్క ఆడియో విజువల్ పబ్లిసిటీ అసిస్టెంట్ పోస్టూ ఖాళీగానే ఉంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది నియామకంపై దృష్టి పెట్టని ప్రభుత్వం అధికారుల పోస్టులను మాత్రం ఉదారంగా మంజూరు చేయడంపై విమర్శలు వస్తున్నాయి.