ప్రముఖ సీనియర్ నటి, దివంగత విలక్షణ నటుడు నాగభూషణం సతీమణి పొట్నూరి సీతాదేవి (87) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం ఉదయం తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1933 అక్టోబర్ 14న కాకినాడలో రామస్వామి దంపతులకు జన్మించారు సీతాదేవి. సమీప బంధువు నీలాబాయి భర్త రాజా శాండో ఫిల్మ్ మేకర్ కావడంతో సీతని కాకినాడ నుంచి మదరాసుకు దత్తపుత్రికగా తీసుకెళ్లారు. బాల్యం నుంచే నృత్యాలపట్ల మక్కువ పెంచుకుని అభ్యాసన మొదలెట్టారామె.
1947లో కేవీ రెడ్డి దర్శకత్వం వహించిన ‘యోగి వేమన’లో బాలనటిగా కనిపించారు సీత. కేవీ రెడ్డి రూపొందించిన ‘మాయాబజార్, గుణసుందరి కథ, పెళ్లినాటి ప్రమాణాలు, పెద్దమనుషులు’ తదితర చిత్రాల్లో హాస్యపాత్రలు, చెలికత్తె పాత్రలు చేశారామె. కేవలం హాస్యమే కాకుండా తనలోని నటిని అన్ని రసాల్లో ఆవిష్కరించారు సీత. 1940 నుండి ప్రారంభమైన ఆమె సినీ ప్రస్థానం 2002లో ‘నేనేరా పోలీస్’ వరకూ సాగింది. దాదాపు 250 చిత్రాల్లో నటించారామె.
ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే నటుడు నాగభూషణంతో కలిసి ‘రక్తకన్నీరు, పాపం పండింది, ఇనుప తెరలు, అందరూ బతకాలి’ లాంటి నాటకాలు దాదాపు 2వేల ప్రదర్శనలిచ్చారు. ‘లవంగి, జయసింహ, పల్లెటూరిపిల్ల, గుణసుందరి కథ, స్వర్ణసుందరి, స్వప్నసుందరి, పరమానందయ్య శిష్యులు, పల్నాటియుద్ధం, పంతులమ్మ, నలదమయంతి, గృహప్రవేశం, సతీతులసి, అత్తా ఒకింటి కోడలే, ఋష్యశృంగ, సత్యహరిశ్చంద్ర, సంతోషిమాత వ్రతం, దేవదాసు, మాయాబజార్’ వంటి గొప్ప చిత్రాల్లో నటించి తన ప్రతిభ చాటారు సీత. ‘ఋతురాగాలు’ టీవీ సీరియల్‌లో నటించారు. ఆ తర్వాత పలు సీరియల్స్‌లో నటించి బుల్లితెరపైనా మంచి పేరు తెచ్చుకున్నారు.
‘రక్తకన్నీరు’ నాటకం అనేక ప్రాంతాల్లో తిరిగి ప్రదర్శించే సమయంలో నటుడు నాగభూషణాన్ని 1956లో వివాహం చేసుకున్నారు సీత. పెళ్లయ్యాక దాదాపు కుటుంబానికే పరిమితమయ్యారు. హిందీలో రూపొందించిన ‘అల్‌బేలా’ చిత్రాన్ని నాగభూషణం తెలుగులో ‘నాటకాల రాయుడు’గా రూపొందించారు. ఆ చిత్రంలో ఆయన వదిన పాత్రలో విషాద ఛాయలు పలికిస్తూ సీత చేసిన నటన అందర్నీ కదిలించింది. ఓ హాస్యనటి జీవితంలో ఓ విలక్షణమైన పాత్రగా అందరూ అభివర్ణించారు. నాగభూషణం, సీతాదేవి దంపతులకు కూతురు భువనేశ్వరి, కొడుకు సురేందర్ ఉన్నారు. వారికి పెళ్లిళ్లు అయ్యాక తనకు వీలు కుదిరినప్పుడల్లా సినిమాల్లో నటించేవారు ఆమె. సినిమా పరిశ్రమలో ఉన్న అనేకమందితో పాటు బంధువుల కష్టాలను విని గుప్తదానాలు ఎన్నో చేశారు సీత. రేలంగితో అనేక హాస్య పాత్రల్లో నటించిన సీతకు ‘యువ కళావాహిని’ సంస్థ వారు రేలంగి పురస్కారం ప్రదానం చేశారు. మంచి నటిగా పేరు తెచ్చుకున్న ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. హైదరాబాద్‌లోని మహా ప్రస్థానంలో సోమవారం ఆమె అంత్యక్రియలు ముగిశాయి.
‘మాయాబజార్’ చిత్రంలో సావిత్రితో...
నా తొలినాళ్ల గురువు సీతాదేవి
నేను అప్పుడప్పుడే డ్యా¯Œ ్స నేర్చుకుంటున్నాను. ‘రక్తకన్నీరు’ నాటకంలో నటించడానికి ఓ మంచి నటి కావాలని మామ సత్యం అనే మా ఇంటిపక్కనున్న ఓ టెక్నీషియన్ మా అమ్మను, నన్ను నాగభూషణంగారి ఇంటికి తీసుకువెళ్లారు. అప్పుడే సీతగారు నన్ను తొలిసారి చూశారు. నువ్వేమీ భయపడకు, స్టేజీపై మేము ఉంటాం కదా! చక్కగా నటించాలి అని ప్రోత్సహించారు. అలాగే ‘ఎక్కువకాలం మా గ్రూపులో ఉండవు.. పెద్ద హీరోయి¯Œ అయిపోతావు’ అని చెప్పారామె. నా కెరీర్ తొలినాళ్లలో దొరికిన ఓ అద్భుతమైన గురువు ఆమె.
– వాణిశ్రీ, నటి
Comments
Please login to add a commentAdd a comment