సురేఖా వాణి.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించింది. ఏ పాత్రలోనైనా అవలీలగా ఒదిగిపోయే ఈమెకు సుప్రిత అనే కూతురు ఉంది. ఈమె కూడా తల్లి అడుగుజాడల్లోనే నడుస్తూ వెండితెరకు హీరోయిన్‌గా పరిచయం కానుంది. ఈ తల్లీకూతుళ్లు సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తుంటారు. అయితే వారిని కొందరు అదేపనిగా ట్రోల్ చేస్తుంటారు. తాజాగా ఈ ట్రోలింగ్‌పై స్పందించింది నటి.
మొదట్లో భరించలేకపోయా..
ఓ ఇంటర్వ్యూలో సురేఖా వాణి మాట్లాడుతూ.. 'మొగుడు పోయిన తర్వాత విచ్చలవిడిగా మారిందంటూ నన్ను ట్రోల్ చేస్తున్నారు. నాకు 19 ఏళ్లకే డైరెక్టర్ సురేశ్ తేజతో పెళ్లయింది. అప్పుడు పెద్దదానిలా మారిపోయాను. ఇప్పుడు నాకు 42 ఏళ్లు.. ఇరవైఏళ్ల పిల్లలా నా కూతురితో ఎంజాయ్ చేస్తున్నాను. నా భర్త ఉన్నా ఇలాగే ఉండేదాన్ని. మొదట్లో ఈ కామెంట్స్ చూసి భరించలేకపోయాను. తర్వాత వీళ్లు మారరని వదిలేశాను. ప్రతివాడి నోరు మూయించలేం కదా.. నాగురించి వీడియోలు తీస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. సింగిల్ పేరెంట్‌ను, కాబట్టి ఇలాంటి విమర్శలు, ఎత్తిపొడుపులు ఎలాగో ఉంటాయి.
తేజతో మాట్లాడాలనుంది
నా భర్త ఆస్పత్రిపాలైనప్పుడు ఎంత ఏడ్చానో.. ఎంత బాగా చూసుకున్నానో! కానీ అతడి ఆరోగ్యం బాగోలేనప్పుడు నేనసలు పట్టించుకోలేదని తేజ వాళ్ల కుటుంబసభ్యులు తప్పుగా అనుకున్నారు. అతడికి డయాబెటిస్ ఉండటంతో గుండెలో నొప్పి తెలియలేదు. సడన్‌గా హార్ట్ బీట్ ఆగిపోయింది. దేవుడు ఒక గంట అవకాశమిస్తే తేజతో మనసువిప్పి మాట్లాడాలనుంది. కనీసం కలలో అయినా తేజ కనిపిస్తే తనతో మాట్లాడాలనుంది. తనను క్షమించమని అడగాలనుంది. మళ్లీ పెళ్లి చేసుకోమని ఇంట్లోవారు అడిగారు. కానీ నాకు రెండో పెళ్లి ఇష్టం లేదు.
నాకంటూ సొంతిల్లు లేదు
నాకు ఎవరితోనో ఎఫైర్లు ఉన్నాయి. అందుకే లగ్జరీగా బతుకుతున్నానని చాలామంది అనుకుంటున్నారు. అందులో ఏమాత్రం నిజం లేదు. ఈ మధ్యే నా ప్రాపర్టీ కూడా అమ్మేశాను. ఇప్పటివరకు నాకు సొంతిల్లు కూడా లేదు. కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో నన్ను అనవసరంగా ఇరికించారు. అప్పుడు నేను మానసికంగా ఎంత నరకం చూశానో.. నెలరోజులు డిప్రెషన్‌లో ఉండిపోయాను. ముద్ద దిగక.. ఏడుస్తూ కూర్చుండిపోయా.. మీ చెడు తిరుగుళ్ల వల్లే ఇదంతా అని నోటికొచ్చింది తిట్టారు. నేను అమెరికాకు వెళ్తే పారిపోయిందన్నారు. అక్కడికి వెళ్లొచ్చాక ఈ కామెంట్లను పట్టించుకోవడం మానేశాను. ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించమని తిరుమలస్వామివారిని కోరుతూ గుండు చేయించుకున్నాను' అంటూ కంటతడి పెట్టుకుంది సురేఖ.
Comments
Please login to add a commentAdd a comment