
తింటూ కూర్చుంటే కొండలైనా కరుగుతాయంటారు. తింటేనే కాదు.. అందరికీ పంచిపెడుతూ కూర్చుంటే కూడా చివరికి చేతిలో ఏవీ మిగలకుండా పోతాయి. ఈ స్టార్ కమెడియన్ విషయంలోనూ ఇదే జరిగింది. అటు దానాలు, ఇటు భర్త చేసిన జల్సాలతో డబ్బంతా పోయి రోడ్డునపడింది. ఆమె మరెవరో కాదు.. ఆన్‌స్క్రీన్‌పై నవ్వులు పూయించే గిరిజ.
పెళ్లితో కష్టాలు
తరాలు తరబడి కూర్చుని తిన్నా తరగని ఆస్తి సంపాదించింది గిరిజ (Girija). అడిగినవారికి కాదనకుండా సాయం చేసేది. పెళ్లి అనే నిర్ణయంతో ఆమె జీవితమే తలకిందులైంది. జల్సాగా తిరిగే భర్త ఆస్తిని కర్పూరంలా కరిగించేశాడు. తాగిన మైకంలో ఆమెపై చేయి చేసుకునేవాడు కూడా! ఓసారి చేతికందిన వస్తువుతో కొట్టడంతో ఆమె తలకు పద్నాలుగు కుట్లు పడ్డాయి.
ఆత్మాభిమానం చంపుకుని..
ఖర్చు చేయడానికి ఏమీ మిగల్లేదన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. తర్వాత అప్పులపాలైన గిరిజ విశాలవంతమైన ఇల్లు వదిలేసి చిన్న గదికి షిఫ్ట్ అయింది. చివరి రోజుల్లో తన ఆత్మాభిమానాన్ని చంపుకుని డబ్బు కోసం చేయి చాచి అర్థించింది. అనాథగా బస్టాప్‌లో తనువు చాలించింది. ఆమె మలి జీవితంలో పడ్డ కష్టాలను గుర్తు చేసుకుంది ప్రముఖ నటి వై.విజయ (Y Vijaya).
అలాంటి పరిస్థితి..
తాజాగా ఆమె ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. గిరిజగారు సొంత ఖర్చులతో ఆర్టిస్టులను, స్నేహితులను కలకత్తాలో దేవీపూజకు తీసుకువెళ్లి వచ్చేవారు. అంత పెద్ద, మంచి నటి తర్వాత దయనీయ స్థితిలో బతుకు సాగించారు. చెన్నైలో మా ఇంటికి వచ్చి రూ.50, రూ.100 అడిగేవారు. వాళ్ల అమ్మ వచ్చి.. చీరలేమైనా ఉంటే ఇవ్వండి అని అడిగేవారు. ఎన్నో దానధర్మాలు చేసిన ఆర్టిస్టులు చివరి క్షణాల్లో ఆర్థికంగా చితికిపోయారు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు అని చెప్తూ విజయ భావోద్వేగానికి లోనైంది.
సినిమా
వై. విజయ.. పద్నాలుగేళ్లవయసులో సినీరంగంలో ప్రవేశించింది. నిండు హృదయాలు సినిమాతో వెండితెరపై తెరంగేట్రం చేసింది. విచిత్ర బంధం, గంగ మంగ, మయూరి, ముద్దుల కృష్ణయ్య, నువ్వు వస్తావని, రాజా, బడ్జెట్ పద్మనాభం, ఛత్రపతి, అమ్మోరు, ఎఫ్ 2, ఎఫ్ 3.. ఇలా పలు సినిమాల్లో నటించింది.
చదవండి: అభిమానులపై జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం.. వెళ్లిపోతానంటూ..