girija
-
కోట్లాది ఆస్తి.. చివరి రోజుల్లో చేయిచాచి అడుక్కునే స్థాయికి..
ఆమె అంబాసిడర్ కారులో తిరుగుతుంటే మహారాణిలా బతుకుతోందనుకున్నారు. పెద్ద పెద్ద సినిమాలు వరుసపెట్టి చేస్తుంటే లెక్కలేనన్ని కోట్లు పోగేసిందనుకున్నారు. బంగ్లాలు కొంటుంటే.. తరాలు తరబడి కూర్చుని తిన్నా తరగని ఆస్తి సంపాదించిందనుకున్నారు. వెండితెరపై నవ్వులు పూయిస్తుంటే తనకు ఏ కష్టాలూ లేకుండా హాయిగా బతుకుతోందనుకున్నారు. కానీ, కంటికి కనిపించేదంతా, చెవులకు వినిపించేదంతా నిజం కాదు! ఇంతకీ ఆ నటి ఎవరో కాదు గిరిజ.. తిరుగులేని హాస్య నటిగా.. బ్లాక్ అండ్ వైట్ జమానాలో స్టార్ కమెడియన్ గిరిజ. మొదట్లో సెకండ్ హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తర్వాత కమెడియన్‌గా రాణించింది. కృష్ణా జిల్లాలోని కంకిపాడులో పుట్టిన ఈమెకు ఆమె తల్లి, నటి దాసరి రామతిలకం అన్ని వేళలా తోడుంది. తల్లి దగ్గరి నుంచి నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకుంది గిరిజ. ఆమె ప్రోత్సాహంతో కమెడియన్ కస్తూరి శివరావు 'పరమానందయ్య శిష్యులు' సినిమాలో హీరోయిన్గా నటించింది. తర్వాత రేలంగికి జోడీగా నటించి తిరుగులేని హాస్యనటిగా కీర్తి పొందింది. పాతాళ భైవరిలో 'నరుడా ఏమి నీ కోరిక' అన్న ఒకే ఒక్క డైలాగుతో జనాలకు కనెక్ట్ అయిపోయింది. 'కాశీకి పోయాను రామాహరి.. గంగ తీర్థంబు తెచ్చాను రామాహరీ..' ఈ పాట విన్నా గిరిజే గుర్తొస్తుంది. గిరిజపై రేలంగి ప్రత్యేక శ్రద్ధ ఆఫ్‌స్క్రీన్‌లో కూడా రేలంగి-గిరిజ సన్నిహితంగా ఉండేవారని అప్పట్లో ప్రచారం నడిచింది. రేలంగి ఆమెకు సినిమా ఆఫర్లు ఇప్పించేవాడు. తనకోసం కోసం ఓ ఇల్లు కూడా కొనిచ్చాడని చెబుతారు. 60వ దశకంలో కొత్త తారల రాకతో గిరిజకు కాస్త అవకాశాలు తగ్గాయి. అయితే నాలుగైదు మేడలు సంపాదించి దర్జాగా కార్లలో తిరిగే గిరిజ జీవితం పెళ్లి తర్వాత అత్యంత దుర్భరంగా మారింది. సన్యాసిరావు అనే వ్యక్తిని ఆమె తిరుపతిలో పెళ్లి చేసుకుంది. భర్త ఖాళీగా ఉంటే బాగోదని అతడి కోసం నిర్మాణ సంస్థ ప్రారంభించింది. అదే గిరిజ చేసిన అతి పెద్ద తప్పు! భర్తతో కలిసి భలే మాస్టారు, పవిత్ర హృదయాలు తీసి తీవ్రంగా నష్టపోపోయింది. ఆర్థికంగా చితికిపోయింది. పెళ్లయినప్పటి నుంచి కష్టాలే! అటు భర్త మాత్రం తన దగ్గరున్న ఆస్తిని నీళ్లలా ఖర్చుచేసేవాడు. ఆమె కొనుక్కున్న లగ్జరీ కార్లలో తిరుగుతూ జల్సాలు చేసేవాడు. తాగిన మైకంలో గిరిజ మీద చేయి చేసుకునేవాడు కూడా! ఒకరోజు అతడు తన చేతికందిన వస్తువుతో కొట్టడంతో గిరిజ తలకు పద్నాలుగు కుట్లు పడ్డాయి. భార్యనే కాదు, కూతురిని కూడా దగ్గరకు చేరదీసిన పాపాన పోలేదు. నాన్న అంటూ దగ్గరకు వెళ్తే కాలితో తన్నేవాడు. భార్యాపిల్లల్ని ముప్పుతిప్పలు పెట్టిన అతడు ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టాక ఒకరోజు ఉన్నట్లుండి చెప్పాపెట్టకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు, మళ్లీ తిరిగి రాలేదు. లంకంత ఇంట్లో ఏసీ రూముల్లో దర్జాగా బతికిన ఆమె తర్వాతి రోజుల్లో అప్పులపాలై తల్లి, కూతురితో కలిసి చెన్నైలో చిన్న గదిలోకి మారాల్సి వచ్చింది. చివరి రోజుల్లో కనీస అవసరాలకు ఇబ్బంది పడాల్సి వచ్చింది. బస్టాప్‌లో విగతజీవిగా ఆమె చివరి రోజులను కళ్లారా చూశానంటాడు డ్యాన్స్ మాస్టర్ సురేశ్ దాస. 'ఓరోజు గిరిజ చేతిలో మూటతో దీనస్థితిలో మా పెద్దమ్మవాళ్లింటికి వచ్చి తలుపు తట్టింది. డోర్ తీసిన నేను ఆమెను గుర్తుపట్టలేదు. దీంతో ఆమె తన పేరు గిరిజ అని చెప్పడంతో ఒక్కసారిగా షాకై.. లోపలకి రమ్మని కూర్చోమన్నాను. ఎంతో వైభవంగా బతికిన ఆమెనేనా ఇలాంటి దీన అవతారంలో ఉందని బాధపడ్డాను. కష్టాల్లో ఉన్నానంటూ పెద్దమ్మను డబ్బులు అడిగి తీసుకుంది. రెండు నెలల తర్వాత ఇలాగే వచ్చి కొంత డబ్బు తీసుకుంది. ఇది జరిగిన వారం రోజులకే ఆమె ఇంటికి దగ్గర్లోని బస్టాప్‌లో చనిపోయి కనిపించింది. ఆమె కూతురు ఎవరినో ప్రేమించి దుబాయ్ వెళ్లిపోయింది. గిరిజ చివరి రోజుల్లో చాలా ఘోరమైన బతుకు బతికింది. తన పరిస్థితిని నేను కళ్లారా చూశాను' అంటూ ఓ ఇంటర్వ్యూలో ఎమోషనలయ్యాడు. ఇండస్ట్రీ నుంచి పరామర్శించిందెవరంటే? అయితే గిరిజ కూతురు శ్రీగంగ మాత్రం ఆమె ఇంట్లోనే మరణించిందని పేర్కొంది. దీంతో ఇప్పటికీ ఆమె మరణం మిస్టరీగానే మిగిలిపోయింది. గిరిజ చనిపోయిన రోజు తనను చూసేందుకు ఇండస్ట్రీ నుంచి ఎవరూ వెళ్లలేదు. కానీ ఆ రోజు రాత్రి శోభన్‌బాబు ఫోన్ చేసి శ్రీగంగతో మాట్లాడారు. ఏ అవసరమున్నా తానున్నానంటూ అభయహస్తమిచ్చారు. ఆ మరుసటి రోజు అల్లు రామలింగయ్య స్వయంగా వెళ్లి పరామర్శించారు. శ్రీగంగ తర్వాతి కాలంలో తన పేరును సలీమాగా మార్చుకుంది. ఆమె తెలుగులో మేఘ సందేశం అనే సినిమా చేసింది. మలయాళంలో కొన్ని సినిమాలు చేసి అనంతరం రియల్ ఎస్టేట్ వైపు వెళ్లిపోయింది. -
'గీతాంజలి' హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?
Girija Shettar Life Story In Telugu: తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ప్రేమకథా చిత్రాల్లో 'గీతాంజలి' సినిమా ముందు వరుసలో ఉంటుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. 1989లో విడుదలైన ఈ సినిమా జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. అంతేకాకుండా మణిరత్నం దర్శకత్వం వహించిన ఒకే ఒక్కతెలుగు సినిమా కూడా ఇదే కావడం విశేషం. నాగార్జున, గిరిజ జంటగా నటించిన ఈ సినిమా హీరో, హీరోయిన్లుగా ఇద్దరికీ ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా అనంతరం గిరిజ తెలుగులో ఎక్కడా కనిపించలేదు. కళ్లతోనే హావభావాలు పలికించి తెలుగు ప్రేక్షకుల మదిలో గీతాంజలిగా చోటు సంపాదించుకున్న గిరిజ పూర్తి పేరు గిరిజా ఎమ్మా జేన్ షెత్తార్. తన పద్దెనిమిదవ ఏటనే భరతనాట్యం నేర్చుకున్న గిరిజ.. క్రికెటర్ శ్రీకాంత్ చెల్లెలితో కలిసి మణిరత్నం, సుహాసినిల పెళ్లికి గిరిజ కూడా అటెండ్ అయ్యింది. పెళ్లిలో గిరిజను చూసిన మణిరత్నం తన సినిమాలో హీరోయిన్గా నటించమని కోరడంతో వెంటనే ఓకే చెప్పిందట. తెలుగులో గిరిజ నటించిన ఒకే ఒక్క చిత్రం గీతాంజలి. కానీ ఒక్క సినిమాతోనే వంద సినిమాలంత స్టార్డంను సంపాదించుకుంది గిరిజ. ఆ సమయంలోనే మలయాళంలో కొన్ని చిత్రాలు కూడా పూర్తి చేసింది. అనంతరం సినిమాలకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పిన గిరిజ ప్రస్తుతం లండన్‌లో రచయితగా స్థిరపడింది. 2005 నుంచి ఆరోగ్యం సంబంధాలపై జర్నలిస్ట్‌గా పనిచేస్తుంది. చదవండి : Trisha: ఆలయంలో చెప్పులు వేసుకున్న త్రిష..భగ్గుమన్న హిందూ సంఘాలు ఆ నమ్మకంతోనే బతికేస్తున్నా..సింగర్ సునీత ఎమోషనల్ పోస్ట్ -
ఇంగ్లిష్లోన మేరేజ్ హిందీలో అర్థము షాది...
ఈ పాటొస్తే మనకు అలనాటి నటి గిరిజ గుర్తుకొస్తారు. ‘కాశీకి పోయాను రామాహరే... గంగలో మునిగాను రామాహరే’ ఈ పాట విన్నా గిరిజే గుర్తుకొస్తారు. ‘సరదా సరదా సిగిరెట్టు’ పాట కూడా ఆమెదే కదా. మార్చి 3 ఆమె 83 వ జయంతి. తెలుగు ప్రేక్షకులు ఆమెను స్మరించుకునే రోజు. తెలుగులో తొలితరం కామెడీ స్టార్స్‌లో ఒకరుగా వెలిగారు గిరిజ. కృష్ణాజిల్లా కంకిపాడు నుంచి చెన్నై వెళ్లి రేలంగి ప్రోత్సాహంతో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. ‘పాతాళభైరవి’లో ఆమె పలికిన ‘నరుడా... ఏమి నీ కోరికా’ పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత అక్కినేని, శివాజీగణేశన్ వంటి హీరోల పక్కన నటించారు. అక్కినేనితో ఆమె పాడిన ‘హాయి హాయిగా జాబిల్లి’.. పాట నేటికీ హిట్. అయితే ఆమె కొద్ది కాలానికే కామెడీ స్టార్‌గా మారారు. ‘భార్యాభర్తలు’, ‘కులగోత్రాలు’, ‘జగదేకవీరుని కథ’, ‘ఆరాధన’, ‘డాక్టర్ చక్రవర్తి’ తదితర సినిమాల్లో కీలకపాత్రలు పోషించారు. ఆ తర్వాతి రోజుల్లో ‘బలిపీఠం’, ‘సెక్రటరీ’, ‘పంతులమ్మ’ సినిమాల్లో వయసు మళ్లిన పాత్రలూ పోషించారు. ‘లవకుశ’లో కీలకమైన రజకుని భార్య వేషం కట్టారు. ‘ఒల్లనోరి మామా’ పాట జనాదరణ పొందింది అందులో. భర్త సన్యాసి రాజుతో కలిసి ‘భలే మాస్టారు’, ‘పవిత్ర హృదయాలు’ సినిమాలు తీసి ఆర్థికంగా నష్టపోయారు. ఆమె కుమార్తె సలీమా మలయాళ సినిమా రంగంలో హీరోయిన్గా పని చేశారు. 1995లో మరణించిన గిరిజ తనదైన నటనతో తెలుగు వారికి గుర్తుంటారు. -
మా అమ్మపై ఇన్ని పుకార్లా
‘నరుడా ఏమి నీ కోరిక’ డైలాగ్ ఆమెదే. ‘సరదా సరదా సిగిరెట్టు ఇది దొరల్ తాగు బలె సిగిరెట్టు’ అని రేలంగి సరదా పడితే ‘కంపుకొట్టు ఈ సిగిరెట్టు కాల్చకోయి నా పై ఒట్టు’ అని కసురుకుంది ఆమే. ‘ఆరాధన’ సినిమాలో అక్కినేనిని, సావిత్రిని తీవ్ర ఇక్కట్లకు తోసింది ఆమె కపటత్వమే. ‘లవకుశ’లో రాముడి వేషం కట్టిన ఎన్టీఆర్‌కు సీతమ్మ వేషం కట్టిన అంజలీ పై మనసు విరిగిపోవడానికి కారణమైన రజకుని భార్య వేషం ఆమెదే. గిరిజ బ్లాక్ అండ్ వైట్ జమానాలో తెలుగు వారి కామెడీ స్టార్. రేలంగికి సరిజోడి. సెకండ్ హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా గిరిజ స్టార్‌డమ్‌ను చూసింది. ‘వెలుగు నీడలు’, ‘జగదేకవీరుని కథ’, ‘ఆత్మబంధువు’, ‘నమ్మినబంటు’, ‘కులగోత్రాలు’, ‘ప్రేమించి చూడు’, ‘భార్యాభర్తలు’... ఎన్నో సినిమాలు ఆమె నటనకు ఆనవాలుగా నిలిచి ఉన్నాయి. వెండితెరపై ఒక వెలుగు వెలిగిన గిరిజ ఆ తర్వాత ఏమైందో ఎవరికీ వివరాలు తెలియదు. సోషల్ మీడియా వాడుకలోకి వచ్చాక గిరిజపై ఆధారాలు లేని కథనాలు ఎన్నో అప్లోడ్ అవుతున్నాయి. తెలుగువారికి ఎంతో ఇష్టమైన ఈ నటి గురించి వాస్తవాలు తెలుసుకోవడానికి ‘సాక్షి’ చేసిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇది. తెలుగువారికి దాదాపుగా తెలియని గిరిజ కుమార్తె, నటి సలీమా మొదటిసారిగా చెన్నై నుంచి ఇలా సాక్షి ద్వారా తెలుగు పాఠకులతో మాట్లాడారు. ఆ వివరాలు. సాక్షి: గిరిజగారు ఎప్పుడు చనిపోయారు? సలీమా: సెప్టెంబర్ 5, 1995న చనిపోయారు. ఆమెకు డయాబెటిస్. కాని అదేం పెద్ద సమస్యగా ఉండేది కాదు. అపోలోలో డాక్టర్ సత్యమూర్తి చూసేవారు. ఆ రోజు అమ్మ టీ తాగి స్నానానికని బాత్రూమ్లోకి వెళ్లింది. కాని బయటకు వచ్చి మంచం మీద వాలిపోయి ప్రాణం విడిచింది. ఆమెకు శ్వాసకు సంబంధించిన తీవ్ర ఇబ్బంది వచ్చిందని డాక్టర్లు చెప్పారు. సాక్షి: గిరిజ మరణించినట్టు పేపర్లలో వార్త వచ్చిందా? సలీమా: నాకు గుర్తు లేదు. ఎవరూ రాసినట్టు లేదు. ఇండస్ట్రీవాళ్లు కూడా ఎవరూ వచ్చి చూడలేదు. అమ్మ చనిపోయిన రోజు అంతిమ సంస్కారాలు ముగిశాక – నాకు టైమ్ కూడా బాగా గుర్తు– రాత్రి 8.45కు శోభన్‌బాబు ఫోన్ చేశారు. నేను శోభన్‌బాబుని... అమ్మ చనిపోయినట్టు తెలిసింది... బాధపడకు... తెలుగు పరిశ్రమ ఎప్పుడూ నీకు తోడు ఉంటుంది.. ఏ కష్టం వచ్చినా రా అన్నారు. ఆయనొక్కరు. ఆ మరుసటి రోజు అల్లు రామలింగయ్య గారు వచ్చి వెళ్లారు. అంతే. సాక్షి: మీ అమ్మ చాలా దీనావస్థలో మరణించారని, నిరుపేద స్థితిలో మరణించారని ఇక్కడ వార్తలున్నాయి. సలీమా: అది తెలుగు జర్నలిస్టుల ఊహాశక్తి అనుకుంటున్నాను. మా అమ్మ చనిపోయే సమయంలో టి.నగర్‌లోని మందిర అపార్ట్‌మెంట్స్‌లో మేం ఉన్నాం. అది నేను కొన్న నా సొంత ఫ్లాట్. ఆ అపార్ట్‌మెంట్స్‌లోనే దర్శకుడు కె.మురళీమోహనరావు, రాజ్ కోటీలలోని రాజ్, హీరోయిన్ రంజిత ఉండేవాళ్లు. మీరు వాళ్లను కూడా అడిగి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సాక్షి: మీ అమ్మమ్మ నటి తిలకం మీ అమ్మ మద్రాసు వచ్చిన మూడేళ్లకే మరణించడం వల్ల మీ అమ్మకు సరైన దిశానిర్దేశం లేకుండా పోయిందని ఇక్కడ ప్రచారం. సలీమా: ఎవరు ఇవన్నీ రాస్తున్నది? మా అమ్మమ్మ తిలకం ఫిబ్రవరి 24, 1995న మరణించారు. ఆమె చనిపోయిన ఆర్నెల్లకు అమ్మ పోయింది. మా నాన్న మమ్మల్ని వదిలిపోయాక మా అమ్మమ్మ, అమ్మ, నేను ఒక గూటి పక్షులుగా పెరిగాం. మా అమ్మమ్మ లేకపోతే మా అమ్మ, నేను ఏమయ్యేవారమో చెప్పలేము. మా అమ్మమ్మకు చిన్న వయసులోనే పెళ్లవడం వల్ల అమ్మ, అమ్మమ్మ అక్కాచెల్లెళ్లలా ఉండేవారు. ఇద్దరూ ఒకే సమయంలో చనిపోయారు. సాక్షి: మీ నాన్న సన్యాసిరాజుగారి వివరాలు చెబుతారా? సలీమా: నాకు ఆయన గురించి ఎటువంటి ఆసక్తి లేదండీ. సాక్షి: మీకు గుర్తున్నవి? సలీమా: నాకు గుర్తున్నంత మటుకు ఆయన మా అమ్మను బాగా హింసించేవాడు. నేను చాలా చిన్నపిల్లను. కాని అంత చిన్నవయసులో కూడా మా అమ్మ సఫరింగ్ తెలిసేది. మా అమ్మకు ఆయనను ఎవరు పరిచయం చేశారో తెలియదు. కాని తిరుపతి వెళ్లి పెళ్లి చేసుకొని వచ్చారు. ఆయన ఖర్చు చేసిన ప్రతి రూపాయి మా అమ్మదే. ఆయనకు పెద్ద గ్యాంగ్ ఉండేది. మా అమ్మకు ఉన్న నీలిరంగు అంబాసిడర్ కారులో వాళ్లతో అర్ధరాత్రి వరకు తిరిగి, తాగి వచ్చేవాడు. మరుసటిరోజు కారు డ్రైవర్ వచ్చి ఆయన కారులో వాంతి చేసుకుంటున్నాడని గోల పెట్టేవాడు. ఒకసారి ఆయన ఏ వస్తువుతోటో మా అమ్మను తల మీద మోదితే పద్నాలుగు కుట్లు పడ్డాయి. నేనొకసారి పరిగెత్తుకుంటూ ‘డాడీ’ అని వెళితే కాలితో తన్నాడు. దొర్లి కింద పడ్డాను. ఆ తర్వాత ఆయన వైపు వెళ్లింది లేదు. ఆయన మంచి భర్త కాదు. మంచి తండ్రి కాదు. ‘నేను ఈ పెళ్లి చేసుకోకపోతే చాలా బాగుండేదాన్ని. వివాహంలో స్త్రీకి సరైన పురుషుడు దొరక్కపోతే ఆమె జీవితం సగం దెబ్బ తిన్నట్టే’ అని మా అమ్మ అనేది. సాక్షి: మీ నాన్న రెండు సినిమాలు తీశారు కదా. సలీమా: అవును. రెంటిలోనూ ఎన్టీఆరే హీరో. ఒకటి ‘భలే మాస్టారు’. రెండు ‘పవిత్ర హృదయాలు’. అందులో ఒక్కరూపాయి కూడా నాన్నది లేదు. అన్నీ అమ్మవే. చాలా గ్యారంటీ సైన్లూ అవీ అమ్మే చేసింది. సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అప్పుల బాధ పెరిగింది. ఒకరోజు పొద్దున నాన్న ఇప్పుడే వస్తానని వెళ్లి మళ్లీ కనిపించలేదు. మా ముఖం ఎప్పటికీ చూడలేదు. అమ్మమ్మ, అమ్మ, నేను... స్ట్రగుల్ అయ్యాం వాస్తవమే కాని పత్రికలు సానుభూతి కథనాలు రాసే స్థాయి కాదు. సాక్షి: మీ పేరు సలీమా అని ఉండటం ఆసక్తి కలిగిస్తోంది. మీరు మతం మారారా? సలీమా: లేదండీ. మా అమ్మ కలకత్తా కాళేశ్వరి దేవి భక్తురాలు. అక్కడకు వెళ్లి మొక్కుకుని వచ్చాక నేను పుట్టానని ఇంట్లో కాళమ్మ అని పిలిచేవారు. కాని ఆ తర్వాత అమ్మకు మౌంట్‌రోడ్‌లో ఉండే దర్గాపై గురి కుదిరింది. ఆ దర్గా ఇప్పటికీ ఉంది. రోడ్డు వైడెనింగ్‌లో ఆ దర్గాను తొలగించాలని ప్రయత్నించినవారు రక్తం కక్కుకు చచ్చారని కథనాలు ఉన్నాయి. అంత పవర్ఫుల్. ఆ దర్గావారు నాకు ఇచ్చిన పేరు సలీమా. నా అధికారిక పేరు, రికార్డ్స్‌లో ఉన్న పేరు సలీమాయే. కాని నాకు మత పట్టింపు లేదు. గుళ్లకు, చర్చిలకు, దర్గాలకు వెళతాను. సాక్షి: మీరు ఏం చదివారు? సలీమా: ఇంటీరియర్ డెకరేషన్లో డిప్లమా చేశాను. కాని ఆ రంగంవైపు వెళ్లలేదు. అమ్మ ఇన్ఫ్లూయెన్స్ నా మీద ఉంది. చిన్నప్పుడే అమ్మ చీరలు కట్టడానికి ట్రై చేసేదాన్ని (నవ్వు). నాకు టీనేజ్ రాగానే మోడలింగ్‌వైపు అవకాశాలు వచ్చాయి. అప్పట్లో టెక్స్టైల్ యాడ్స్ ఫేమస్. సుమంగళి టెక్స్టైల్స్, మహరాణి టెక్స్టైల్స్.. ఇలా దాదాపు 150 యాడ్స్ చేశాను. అక్కినేని నాగేశ్వరరావు కోరితే ‘మేఘసందేశం’ క్లయిమాక్స్‌లో ఆయన కూతురిగా యాక్ట్ చేశాను. ఆ సమయంలోనే అనుకోకుండా ఒక మలయాళ సినిమా మేనేజర్ నన్ను చూసి మలయాళంలో యాక్ట్ చేస్తారా అన్నారు. సరే అన్నాను. అలా టి.చంద్రకుమార్ దర్శకత్వంలో ‘నిజన్ పిరన్నా నట్టిల్’ (1985)లో నటించాను. మోహన్‌లాల్ హీరో. అయితే దానివల్ల గుర్తింపు రాలేదు. నటి కాంచనమ్మ రికమండేషన్‌తో ప్రఖ్యాత దర్శకుడు హరిహరన్ దర్శకత్వంలో ‘నఖక్షతంగళ్’ (1986)లో నటించాను. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. ఇప్పటికీ నన్ను ఆ సినిమా హీరోయిన్గా అక్కడ గుర్తిస్తారు. సాక్షి: మరి హీరోయిన్గా ఎందుకు కొనసాగలేకపోయారు? సలీమా: మలయాళంలో నాలుగేళ్లలో 7 సినిమాలలో నటించాను. ‘సంసారం ఒక చదరంగం’ కన్నడ వర్షెన్‌లో కల్పన రోల్ నేనే వేశాను. కాని ఆ తర్వాత నేను చెన్నైలో రియల్ ఎస్టేట్ వైపు వెళ్లిపోయాను. లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు మలయాళం, తమిళ సినిమాలలో యాక్ట్ చేస్తున్నాను. మొన్న అంజలీ నటించిన ‘లీసా’లో చాలా మంచి రోల్ చేశాను. తెలుగులో అది రిలీజైంది. సాక్షి: మీరు మలయాళంలో చేస్తున్నప్పుడు తెలుగు ఇండస్ట్రీ నుంచి అవకాశాలు రాలేదా? సలీమా: తెలుగు పరిశ్రమతో మాకు పెద్దగా కాంటాక్ట్ లేకపోవడం వల్ల ఏమీ రాలేదు. సాక్షి: గిరిజగారికి ఫీల్డ్‌లో ఎవరు ఫ్రెండ్స్ ఉండేవారు? సలీమా: సావిత్రిగారు మంచి ఫ్రెండ్. ఏ మాత్రం ఖాళీ ఉన్నా మా ఇంటికి వచ్చేవారు. ఆమెకు మా అమ్మమ్మ వంటలు ఇష్టం. నా తొలి బేబీ సైకిల్ ఆమే కొనిపెట్టారు. అమ్మమ్మ అప్పుడప్పుడు రేలంగి గారింటికి తీసుకువెళ్లేది. వాళ్ల భార్య శ్రీదేవమ్మ, కొడుకు బాబుగారు, కోడలు కుమారి గారు వీరు తెలుసు. అమ్మమ్మ చాలాసార్లు నాగేశ్వరరావు గారి గురించి చెప్పేది. సెట్లో కనపడితే మేకప్ కుర్చీలో కూర్చోబెట్టి ‘గుడివాడ తిలకమ్మ గుడిలోకి వచ్చింది’ అని పాడుతూ గిర్రున తిప్పేవారట. ఇద్దరిదీ ఒకే ప్రాంతం కావడంతో ఆయన చాలా అభిమానంగా ఉండేవారు. ఇక ఇండస్ట్రీ ఫంక్షన్స్ అంటే చిరంజీవి గారి పెళ్లికి అమ్మతో కలిసి వెళ్లిన జ్ఞాపకం ఉంది. సాక్షి: గిరిజగారు ఎప్పడైనా తన నట జీవిత విశేషాలు చెప్పేవారా? సలీమా: పెద్దగా లేదు. ఆమె తన వివాహ రోజులను, సినిమా రోజులను మర్చిపోయి జీవించాలి అన్నట్టుగా ఆమెను నేను చూసుకున్నాను. కాని అప్పడప్పుడు ఆమె నటించిన పాట ‘కాశీకి పోయాను రామా హరే’ పాడి ఆట పట్టించేదాన్ని. నిజం చెప్పాలంటే ఆమె పాటల్లో నాకు నాగేశ్వరరావుతో కలిసి నటించిన ‘హాయి హాయిగా జాబిల్లి తొలి రేయి వెండి దారాలల్లి’ చాలా ఇష్టం. సాక్షి: రేలంగి గారు గిరిజగారు చాలా సన్నిహితంగా ఉండేవారని... కాని గిరిజ గారు ఆయనతో అనుబంధం తిరస్కరించారనీ... సలీమా: దాని గురించి నాకు తెలియదు. నా చిన్నప్పుడు అదంతా జరిగిందేమో తెలియదు. సాక్షి: మీరు సింగిల్‌గా ఉండటానికి మీ తల్లిగారి విఫల వివాహ ప్రభావం కారణమా? సలీమా: అలా ఏం లేదు. జీవితంలో మంచి అవకాశాలే వచ్చాయి కానీ పెళ్లి చేసుకోబుద్ధి కాలేదు. నేను మగ ద్వేషిని కాను. నాకు మంచి స్నేహితులు ఉన్నారు. ఇప్పటికైతే పెళ్లి చేసుకోలేదు. మునుముందు చేసుకుంటానేమో తెలియదు. నాకు డాన్స్ వచ్చు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. డ్రైవింగ్ చాలా ఇష్టం. జీవితం నాకు నచ్చినట్టుగా ఉంది. సాక్షి: తెలుగు ఇండస్ట్రీకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? సలీమా: నేను గిరిజమ్మ కూతురుని. మా అమ్మ ఎన్నో తెలుగు సినిమాలు చేసింది. తెలుగు ఇండస్ట్రీ మీద నాకు హక్కు ఉంది. మా అమ్మ అక్కినేనితో పని చేసింది. వారబ్బాయి నాగార్జున ఫీల్డ్‌లో ఉన్నారు. ఎన్.టి.ఆర్తో పని చేసింది. వారబ్బాయి బాలకృష్ణ ఉన్నారు. వీరందరూ నాకూ ఇక్కడ స్థానం కల్పించాలని కోరిక. మంచి అవకాశాలు వస్తే హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలని ఉంది. నేను జీవితంలో చాలా రంగాల్లో పని చేశాను. కాని మేకప్ వేసుకొని కెమెరా ముందు నిలిచినప్పుడు పొందే ఆనందం మరెక్కడా పొందలేదు. ఒక నటి కూతురికి అనువంశికంగా వచ్చే సంపదా, ఆస్తి అదేనేమో. ∙ఖదీర్ -
ఉపాధ్యాయురాలు ఆత్మహత్య
అమరాపురం: అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెందిన గిరిజ అనే ఉపాధ్యాయురాలు తనుంటున్న గదిలోనే ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు తల్లిదండ్రులు విజయలక్ష్మి, క్రిష్ణయ్య, ఏఎస్ఐ రమణ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురం సమీపంలోని ఆకుతోటపల్లికి చెందిన ఎ.గిరిజ (24) 2014 డీఎస్సీలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ)గా ఎంపికైంది. అమరాపురం మండలం యర్రగుంటపల్లి ప్రాథమిక పాఠశాలలో పోస్టింగ్ వచ్చింది. హేమావతి గ్రామంలో గది అద్దెకు తీసుకుని అక్కడి నుంచి పాఠశాలకు వెళ్లి వచ్చేది. ఈమె తలనొప్పితో తీవ్రంగా బాధపడేది. దీనికితోడు చూపు మందగించడంతో ఇటీవల కంటి ఆపరేషన్ కూడా చేయించుకుంది. అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో జీవితంపై విరక్తి చెందింది. సోమవారం రాత్రి తల్లి విజయలక్ష్మి హేమావతి గ్రామానికి వచ్చింది. ఇంటి తలుపు తట్టగా లోపల కూతురు గిరిజ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. ఆందోళనకు గురైన ఆమె వెంటనే తన భర్త క్రిష్ణయ్యకు ఫోన్ ద్వారా సమాచారమందించింది. ఆయన వచ్చిన తర్వాత తలుపు తెరిచి చూస్తే ఇంటి పైకప్పునకు ఉరివేసుకుని వేలాడుతున్న గిరిజ కనిపించింది. ముగ్గురు కూతుర్లలో చివరిదైన గిరిజన ఇలా అర్ధంతరంగా తనువు చాలించడం చూసి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో చనిపోతున్నట్లు ఉపాధ్యాయురాలు రాసిపెట్టుకుని ఉన్న సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మడకశిర ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. ఎంఈఓ సత్యనారాయణ మంగళవారం హేమా వతి గ్రామానికి వెళ్లి గిరిజ మృతదేహంపై పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. దహన సంస్కారాల కోసం రూ.15వేల నగదు అందజేశారు. -
మోదీ స్లోగన్ మేకర్‌గా మిగిలిపోయారు
అసహనం పెరిగిన కొద్దీ మహిళలపై దాడులు మహిళలు పోరాటాలలో ముందుండాలి ఏఐఐఈఏ జాతీయ సహాయ కార్యదర్శి గిరిజ విజయవాడ : దేశ ప్రధాని నరేంద్ర మోదీ కేవలం స్లోగన్ మేకర్‌గా మిగిలిపోయారని, అభివృద్ధి లేదని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ సహాయ కార్యదర్శి గిరిజ అన్నారు. దేశంలో పెరుగుతున్న అసహనానికి నిదర్శనమే ఇటీవల జరుగుతున్న సంఘటనలని ఆమె పేర్కొన్నారు. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్‌కు అనుబంధ ఎల్ఐసీ మహిళా ఉద్యోగుల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రెండో సదస్సు ఆదివారం విజయవాడ నగరంలోని ఓ హోటల్లో జరిగింది. ఈ సదస్సులో అతిథిగా పాల్గొన్న గిరిజ మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అసంఘటిత రంగంలోని కార్మికులను, మహిళా ఉద్యోగులను చైతన్యపరుస్తూ వారిని పోరాటాల్లో ముందుభాగంలోకి తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ కార్పొరేట్లకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. కాగా మహిళా ఉద్యోగులందరూ గర్వపడేలా వేతన సవరణ జరిగిందన్నారు. బెంగళూరు డివిజన్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎస్కే గీత మాట్లాడుతూ దేశంలో అసహనం పెరిగేకొద్దీ, మహిళల మీద దాడులు కూడా పెరుగుతున్నాయన్నారు. ఎల్ఐసీ మహిళా ఉద్యోగుల సమన్వయ కమిటీ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ కామేశ్వరి, కర్నాటక రాష్ట్ర ఎల్ఐసీ మహిళా ఉద్యోగుల సమన్వయ కమిటీ కన్వీనర్ హెచ్ఆర్ గాయత్రి, తెలంగాణ రాష్ట్ర ఎల్ఐసీ మహిళా ఉద్యోగుల సమన్వయ కమిటీ కన్వీనర్ అరుణకుమారి, అసోసియేషన్ నాయకులు జి కిషోర్‌కుమార్, బిబి గణేష్, జేవియర్ దాస్‌తో పాటు రెండు రాష్ట్రాల నుంచి విచ్చేసిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
మంత్రిగారూ.. మాట మరిచారా!
చిన్నారి గిరిజ కుటుంబానికి అందని పరిహారం 50 రోజులు దాటినా నెరవేరని మహేందర్‌రెడ్డి హామీ అధికారులు స్పందించడంలేదంటున్న కుటుంబ సభ్యులు మంచాల: బోరుబావిలో పడి అసువులు బాసిన చిన్నారి గిరిజ కుటుంబానికి ప్రభుత్వం పరిహారమిచ్చి ఆదుకుంటుందన్న మంత్రి మహేందర్‌రెడ్డి హామీ 50 రోజులు దాటినా ఆచరణకు మాత్రం నోచుకోవడంలేదు. పరిహారం విషయమై నిత్యం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం కానరావడంలేదని బాలిక కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తమను అన్నివిధాలా ఆదుకుంటామని మంత్రి మాట ఇచ్చి మరిచిపోయారా అంటూ వారు ఆందోళన చెందుతున్నారు. వివరాలు.. మంచాలకు చెందిన గిరిజ (4), ఆమె అన్న చరణ్‌లు చిన్నమ్మ, అమ్మమ్మతో కలిసి అక్టోబర్ 12న వ్యవసాయ పొలం వద్దకు వెళ్లారు. పొలంలో కుటుంబ సభ్యులు పత్తి తీస్తుండగా గిరిజ ఆడుకుంటూ వెళ్లి సమీపంలోని బోరుబావిలో పడిపోయింది. దీంతో ఆ చిన్నారిని బయటికి తీసేందుకు అధికార యంత్రాంగం జేసీబీలు, హిటాచిల సహాయంతో మూడు రోజుల పాటు బోరు బావికి సమాంతరంగా తవ్వించారు. రాష్ట్ర మంత్రి మహేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ విశ్వేశరరెడ్డి, కలెక్టర్ శ్రీధర్, జేసీ ఎంవీ రెడ్డిలతో పాటు జిల్లా యంత్రాంగమంతా మూడు రోజులు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ చివరికి నిరాశే మిగిలింది. గిరిజ ప్రాణాలు దక్కలేదు. మృతదేహాన్ని బోరుబావిలోంచి బయటకు తీశారు. దీంతో గిరిజ కుటుంబాన్ని ఆదుకుంటామని, పరిహారం అందజేస్తామని మంత్రి మహేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన మాటిచ్చి 50 రోజులు దాటినా పరిహారం అందే జాడే కనిపించడంలేదని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిత్యం అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండాపోతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కలెక్టర్‌ను కలిస్తే జేసీని కలవమని, జేసీ దగ్గరకు వెళితే తహసీల్దార్‌ను కలవమని, తహసీల్దార్‌ను కలిస్తే మంత్రిని కలవాలంటూ తిప్పించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ బాలరాజును వివరణ కోరగా.. మంత్రి మాట ఇచ్చిన మాట వాస్తవమేనన్నారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని తెలిపారు. -
గిరిజ మృతదేహం వెలికితీత
ఇబ్రహీంపట్నం/మంచాల: చిన్నారి గిరిజ మృతి చెందింది. మూడు రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ మంగళవారం రాత్రి ముగిసింది. రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామ సమీపంలోని బోరుబావి నుంచి ఐదేళ్ల చిన్నారి గిరిజ మృతదేహాన్ని రాత్రి 8:15 నిమిషాల ప్రాంతంలో రెస్క్యూటీం బయటకు తీసింది. 56 గంటలపాటు గా కొనసాగిన ఈ ఆపరేషన్ అనంతరం గిరిజ మృతదేహం బయటకు రాగలింది. చిన్నారి మృతిని అధికారికంగా సోమవారం మధ్యాహ్నమే ధ్రువీకరించినా.. మృతదేహం వెలికితీతకు మరింత సమయం పట్టింది. 45 అడుగుల లోతులో కూరుకుపోయి న గిరిజ మృతదేహం ఉబ్బిపోవడం వెలికితీతకు అవరోధం అయింది. చివరకు గిరిజ మృతదేహాన్ని కేసింగ్ పైపుల ద్వారా లాగారు. 50 శాతం శరీర భాగాలను మాత్రమే వెలికితీశారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
ఆగిన శ్వాస.. ఆవిరైన ఆశ
చిన్నారి గిరిజ బతికొస్తుందనుకున్నవారికి నిరాశే మిగిలింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. గిరిజ మృత్యువాత పడిందన్న వార్త ఆమె కుటుంబీకులనే కాదు.. మూడు రోజులుగా ఎదురు చూస్తున్న లక్షలాది మందిని తీవ్ర విషాదంలో ముంచింది. ఆదివారం ఉదయం బోరుబావిలో పడి మృతి చెందిన చిన్నారి గిరిజను అధికారులు మంగళవారం రాత్రి 8:15కు బయటకు తీశారు. 56 గంటలపాటు శ్రమించిన యంత్రాం గం.. 45 అడుగుల లోతులో కూరుకుపోయిన గిరిజ మృతదేహాన్ని ఎట్టకేలకు బయటకు తీసుకురాగలిగింది. కలెక్టర్ శ్రీధర్, జేసీ ఎంవీ రెడ్డిలతోపాటు మంత్రి మహేందర్‌రెడ్డి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. గిరిజ అంత్యక్రియలు మంగళవారం రాత్రి 9.30కు ఆమె స్వగ్రామమైన ఎంపీపటేల్‌గూడలో నిర్వహించారు. ఏడాదిన్నర క్రితం ఆత్మహత్య చేసుకున్న ఆమె తల్లి సునీత సమాధి పక్కనే గిరిజ భౌతికకాయాన్ని ఖననం చేశారు. ఇబ్రహీంపట్నం/ మంచాల: భయపడినంత దారుణం జరిగిపోయింది. నిర్లక్ష్యం చిన్నారి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.. నీళ్లు పడకపోవడంతో పూడ్చకుండా వదిలేసిన బోరుబావి ఐదేళ్ల చిన్నారి గిరిజ పాలిట మృత్యుకుహరంగా మారింది.. బోరుబావిలో పడిపోయిన గిరిజను రక్షించేం దుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యా యి. దాదాపు 56 గంటలపాటు కొనసాగిన సుధీర్ఘ శ్రమ అనంతరం గిరిజ బోరుబావిలోనే తుదిశ్వాస విడిచిందన్న సమాచారాన్ని మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటల తరువాత అధికారికంగా ధృవీకరించారు. రంగారెడ్డి జిల్లా మంచాలలో ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన చివరకు విషాదంగానే ముగిసింది. ఫలించని అధికారుల ప్రయత్నాలు.. చిన్నారి గిరిజను ప్రాణాలతో సురక్షితంగా కాపాడేందుకు జిల్లా అధికార యంత్రాంగం చివరి దాకా చేసిన ప్రయత్నాలు నిష్ఫలమయ్యాయి. చిన్నారి గిరిజ బోరుబావిలో పడిం దన్న సమాచారం తెలిసిన వెంటనే.. అధికార యంత్రాంగం మొత్తం మంచాల గ్రామానికి కదిలింది. ఆపదలో ఉన్న చిన్నారిని కాపాడేం దుకు సర్వశక్తులను ఒడ్డి ప్రయత్నాలు కొనసాగాయి. విధి వక్రీకరించింది.. మానవ ప్రయత్నాలేవి ఫలించలేదు.. గిరిజను కాపాడే అన్ని ప్రయత్నాలు.. గిరిజ ప్రాణాలపై ఆమె బంధువులు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యే విధంగా ఫలితం వచ్చింది. ప్రాణాపాయం నుంచి బయటపడుతుందని భావించిన చిన్నారి గిరిజ.. విగతజీవిగా బోరుబావిలోంచి బయటపడుతుందన్న చేదు నిజం చిన్నారి బంధువులతోపాటు అధికార యంత్రాంగాన్ని కూడా విషాదంలోకి నెట్టింది. గిరిజ బోరుబావిలో పడిపోయిందన్న సమాచారం తెలిసినప్పటి నుంచి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిన ఆమె అమ్మమ్మ అయిలమ్మ, తండ్రి అయిలయ్య ఇతర బంధువులు మరింత కుంగిపోయారు. నిద్రాహారాలు మాని.. బోరుబావిలో పడిపోయిన చిన్నారి గిరిజను ప్రాణాలతో కాపాడేందుకు ఉన్నతాధికారులు నిద్రాహారాలు మాని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ ఎంవీ.రెడ్డి కనబర్చిన శ్రద్ధ ఇతర ఉద్యోగలకు ఆదర్శంగా నిలి చింది. దాదాపు రెండు రోజుల పాటు జేసీ అర్ధరాత్రి దాటిన తరువాత కూడా రెస్క్యూటీంకు అందుబాటులో ఉన్నారు. రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మం చిరెడ్డి కిషన్‌రెడ్డి, కలెక్టర్ శ్రీధర్ సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. అడుగడుగునా ఆటంకాలే.. బోరుబావిలో ఉన్న గిరిజ పరిస్థితిని తెలుసుకునేందుకు దాదాపు రెండు రోజుల పాటుగా ఉత్కంఠ తప్పలేదు. బోరుబావిలో ఉన్న గిరిజ ను సురక్షితంగా కాపాడేందుకు చేపట్టిన తవ్వకాల్లో అడుగడునా ఆటంకాలే ఎదురయ్యాయి. దాదాపు 45 అడుగుల లోతులో గిరిజ పడిపోయిందని ధృవీకరించుకుని ప్రారంభించిన రెస్క్యూ ఆపరేషన్ సోమవారం ఉదయం వరకే కొలిక్కి వస్తుందని అందరూ భావించారు. 35 అడుగుల మేరకు తవ్వకాలు జరిపిన తరువాత బండరాయి అడ్డురావడంతో తవ్వకాలకు అం తరాయం ఏర్పడింది. 50 అడుగులకంటే అధికంగా సమాంతర తవ్వకాలు చేపడితే గిరిజను బయటకు తీయవచ్చని నిర్ధారణకు వచ్చి తవ్వకాలను ప్రారంభించిన రెస్క్యూటీంకు 41 అడుగుల తవ్వకాల అనంతరం మళ్లీ బండరాయి అడ్డుతగలడంతో మరో రెండు గంటల్లో పని పూర్తవుతుందనుకుంటున్న తరుణంలో మరిం త జాప్యం ఏర్పడింది. -
'చిన్నారి కుటుంబాన్ని ఆదుకుంటాం'
హైదరాబాద్: బోరుబావిలో పడ్డ చిన్నారి కుటుంబాన్ని ఆదుకుంటామని తెలంగాణ రాష్ట్ర మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. మరో కొద్ది సేపట్లో చిన్నారి మృతదేహాన్ని వెలికితీస్తామన్నారు.తెలంగాణ రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న బోరుబావులను వెంటనే మూసివేయాలని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. చిన్నారి పడిన బోరుబావి స్థల యజమానిపై కేసు నమోదు చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాల్టా చట్టాన్ని అమలు చేస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామంలో బోరుబావిలో పడిన చిన్నారి గిరిజ మృతిచెందినట్లు అధికారులు నిర్ధారించారు. బావిలో 45 అడుగుల వద్ద ఆమె మృతదేహాన్ని గుర్తించినట్లు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంవీ రెడ్డి చెప్పారు. -
బోరుబావిలో పడిన చిన్నారి గిరిజ మృతి
-
బోరుబావిలో పడిన చిన్నారి గిరిజ మృతి
రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామంలో బోరుబావిలో పడిన చిన్నారి గిరిజ మృతిచెందినట్లు అధికారులు నిర్ధారించారు. బావిలో 45 అడుగుల వద్ద ఆమె మృతదేహాన్ని గుర్తించినట్లు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంవీ రెడ్డి చెప్పారు. దాదాపు మరో గంట సమయంలో మృతదేహాన్ని వెలికి తీస్తామని ఆయన తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ''బోరుకు సమాంతరంగా మేం ఒక సొరంగం తవ్వేందుకు ఏర్పాట్లు చేశాం. 41 అడుగుల దగ్గర రాయి వచ్చింది. దాన్ని పగలగొట్టాం. అందుకే ఆలస్యమైంది. పాప ప్రాణాలకు ప్రమాదం వాటిల్లకుండా 41 అడుగుల స్థాయిలోనే పాపను గుర్తించాం. ఖమ్మానికి చెందిన సింధూర ఎలక్ట్రానిక్స్ వాళ్లు అందించిన కెమెరాను ఉపయోగించాం. పాప మృతదేహం 45 అడుగుల లోతులో ఉంది. 41 అడుగుల ప్రాంతంలో ఉన్న సొరంగం ద్వారా కెమెరా పంపించి, మరోసారి నిర్ధారించుకుని పాపను పుల్ చేయాలి. అందుకు కావల్సిన హుక్‌లు తెప్పించాం. అయితే, అక్కడ పనిచేసేందుకు సరిపోయేంతగా ప్రదేశం లేదు. అక్కడ సొరంగం తవ్వడం కూడా చాలా కష్టం అవుతోంది. అందుకే ఎక్కువ సమయం పడుతోంది. బహుశా ఒక గంట సమయంలో పాప మృతదేహాన్ని బయటకు తీస్తామని భావిస్తున్నాం'' అని ఆయన తెలిపారు. -
ఇంకా బోరుబావిలోనే గిరిజ
మంచాల : రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామంలో బోరుబావిలో పడిన చిన్నారి గిరిజను బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే రిస్క్యూ ఆపరేషన్‌కు బండరాళ్లు అడ్డంకిగా మారుతున్నాయి. మంచాల సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో నాలుగేళ్ల గిరిజ ఆదివారం ఉదయం బోరు బావిలో పడిన విషయం తెలిసిందే. ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి మైన్స్ టీంలు నిర్విరామంగా పనిచేస్తున్నా మంగళవారం ఉదయం వరకూ కూడా బాలికను కనుగొనలేకపోయారు. 45 అడుగుల లోతులో చిన్నారి ఉందని భావిస్తున్న అధికారులు బోరుబావికి సమాంతరంగా జేసీబీల సాయంతో తవ్వకం చేపట్టారు. బోరుబావిలోకి ఆక్సిజన్ పంపిస్తున్నారు. మరోవైపు చిన్నారి కోసం ఆమె తల్లిదండ్రులు, బంధువులు విలపిస్తున్నారు. గిరిజ క్షేమంగా బయటకు రావలని ప్రార్థనలు చేస్తున్నారు. -
విశ్వ ప్రయత్నం...
చిన్నారి గిరిజ కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. అభంశుభం తెలియని ఆ చిట్టితల్లి ప్రాణాలతో బయటపడాలని అందరూ కోరుకుంటున్నా.. రెస్య్కూ ఆపరేషన్ ఆలస్యమవుతున్న కొద్దీ ఆశలు సన్నగిల్లుతున్నాయి. మంచాల సమీపంలో ఆదివారం ఉదయం గిరిజ అనే చిన్నారి బోరుబావిలో పడిన విషయం తెలిసిందే. బాలిక కోసం బంధువులు రెండు రోజులుగా అన్నపానీయాలు మాని ఘటనా స్థలంలోనే గుండెలవిసేలా రోదిస్తున్నారు. మరోవైపు అధికార యంత్రాం గం చిన్నారిని వెలికి తీసేందుకు నిర్విరామంగా కృషి చేస్తోంది. సింగరేణి నుంచి వచ్చిన టీంతోపాటు ఎన్డీఆర్ఎఫ్ కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటోంది. తవ్వకాల్లో పెద్ద బండరాళ్లు బయల్పడుతుండడంతో అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. కలెక్టర్ శ్రీధర్ రెండు రోజులుగా ఘటనా స్థలంలోనే ఉండి పనులను సమీక్షిస్తున్నారు. బాలిక కోసం కొనసాగుతున్న రెస్య్కూ ఆపరేషన్ * బోరుబావిలోనే చిన్నారి గిరిజ.. * ముమ్మరంగా సాగుతున్న సహాయక చర్యలు * పర్యవేక్షించిన కలెక్టర్, ఎమ్మెల్యే * వివరాలు సేకరించిన ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి ఇబ్రహీంపట్నం/మంచాల: చిన్నారి గిరిజను బోరుబావిలోంచి వెలికితీసేందుకు యంత్రాంగం సహాయక చర్యలను కొనసాగిస్తూనే ఉంది. ఆదివారం ఉద యం 10:30 గంటల సమయంలో మంచాలకు చెందిన చిన్నారి గిరిజ(4) పొలం వద్ద తన అన్న చరణ్‌తో కలిసి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు తెరిచిఉన్న బోరుబావిలో పడిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన కొద్దిసేపట్లోనే అక్కడికి చేరుకున్న యంత్రాంగం ముమ్మరంగా సహాయక చర్యలను కొనసాగిస్తోంది. ఆదివా రం రాత్రి జేసీబీ, హిటాచీలతో బోరుబావికి సమాంతరంగా గుంతలు తవ్వినా ఫలితం లేకుండా పోయింది. సహాయక చర్యలకు ఆటంకం... బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు జరుపుతున్న భూమి గట్టిగా ఉండడంతో పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. మొదటగా చిన్నారి దాదాపు 35 అడుగుల లోతులో ఉందని గమనించిన అధికారులు ఆదిశగా తవ్వకాలను ప్రారంభించారు. 40 అడుగులు దాటిన తర్వాత రాయి రావడంతో తవ్వకాలకు ఆటంకం ఏర్పడింది. యంత్రాంగం రాయిని డ్రిల్‌చేసి ముందకు కొనసాగారు. అధికారుల దృఢ సంకల్పం.. చిన్నారి గిరిజను ఎలాగైనా కాపాడాలనే కృతనిశ్చయంతో యంత్రాంగం ముందుకు సాగుతోంది. చిన్నారి శ్వాసకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వైద్య సిబ్బంది నిరంతరం గొట్టాల ద్వారా ఆక్సీజన్ అందిస్తూనే ఉంది. బంధువుల జాగారం.. బోరుబావిలో పడిపోయిన తమ చిన్నారి ఎలాగైనా ప్రాణాలతో బయటపడుతుందని బంధువులు, కుటుంబీకులు కొండంత నమ్మకంతో ఉన్నారు. ఆదివారం ఉదయం ఘటన జరిగినప్పటి నుంచి వారు అక్కడే ఉన్నారు. నిద్ర, తిండీతిప్పలు లేకుండా బోరుబావి వద్దే జాగారం చేస్తున్నారు. బాలిక అమ్మమ్మ ఐల మ్మ, తండ్రి ఐలయ్యలు రోదిస్తూనే ఉన్నారు. సోమవారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు సహాయక చర్యలను పరిశీలించారు. మంచాల గ్రామానికి చెందిన కోట్ల సుధీర్‌రెడ్డి అధికార యంత్రాంగానికి భోజనవసతి ఏర్పాటు చేసి ఔదార్యం చాటుకున్నారు. ఆదివారం సాయంత్రమే ఎన్డీ ఆర్ఎఫ్ టీం రంగంలోకి దిగింది. అదే రాత్రి మైన్స్ రెస్క్యూ టీం కూడా వచ్చింది. సోమవారం సాయంత్రం 4:20 గంటల సమయంలో ఎన్డీఆర్ఎఫ్, మైన్స్ రెస్క్యూ టీంలు బోరుబావికి అడ్డంగా ప్లేటు వేయాడానికి తవ్వకాలు ప్రారంభించారు. పలు ఆటంకాలు ఎదురైనా అధికారులు మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నారు. సోమవారం రాత్రి లైటింగ్ ఏర్పాటు చేసి సహాయక చర్యలను సాగిస్తున్నారు. ఆదివారం రాత్రి పొద్దుపోయాక వెళ్లిపోయిన కలెక్టర్ శ్రీధర్ తిరిగి సోమవారం ఉదయం 11:45 గంటలకు ఘటనా స్థలానికి చేరుకొని పర్యవేక్షించారు. ఆయన మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తిరిగి వెళ్లిపోయారు. జేసీ ఎంవీ రెడ్డితో పాటు జిల్లా యంత్రాంగం అక్కడే ఉన్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు స్థానిక ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి వచ్చారు. పనులు వేగవంతం చేయాలని ఆయన యంత్రాగాన్ని కోరారు. తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్తుండగా ఎమ్మెల్యే ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడుతుండ గా పక్కన ఉన్న వాళ్లు ఆయనను పట్టుకున్నారు. డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి కంజర్ల శేఖర్‌రెడ్డి సాయంత్రం బోరుబావి వద్దకు వచ్చారు. వేలాదిమంది ప్రజలు ఘటనా స్థలంలో చిన్నారి రాకకోసం నిరీక్షిస్తున్నారు. వివరాలు సేకరించిన ఎంపీ ఆదివారం రాత్రి 10 గంటలకు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. చిన్నారి గిరిజ కుటుంబసభ్యులతో ఆయన మాట్లాడారు. బాలికను సురక్షితంగా వెలికితీసే వరకు యంత్రాంగం, నాయకులు కృషిచేస్తారని ఆయన భరోసా కల్పించారు. క్షణక్షణం ఉత్కంఠ.. ఆదిబట్ల: చిన్నారి ఆచూకీ కోసం క్షణక్షణం ఉత్కంఠ సాగుతోంది. ఘటనా స్థలంలో భారీగా జనం పోగయ్యారు. జనం కిక్కిరిసిపోవడంతో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచాల మండలంలో ఎవరిని కదిలించినా చిన్నారి బోరుబావిలో పడిన విషయమే మాట్లాడుతున్నారు. -
గిరిజ కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు
మంచాల : బోరుబావిలో పడిపోయిన చిన్నారి గిరిజను రక్షించేందకు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా మంచాలలో ఆడుకుంటూ ఆదివారం ప్రమదవశాత్తూ చిన్నారి బోరుబావిలో పడిపోయిన విషయం తెలిసిందే. దాంతో రంగంలోకి దిగిన అధికార బృందాలు నుంచి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అయితే ఇప్పటివరకూ గిరిజ జాడ తెలియలేదు. ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది ప్రత్యేక పరికరాలతో డ్రిల్లింగ్ చేస్తున్నారు. అయితే సహాయక చర్యలకు బండరాళ్లు అడ్డుపడుతున్నాయి. ఇప్పటివరకూ నలభై అడుగుల మేర తవ్వకాలు జరిపారు. మరోవైపు బోరులో 40 అడుగుల వద్ద నీరు ఉన్నట్లు గుర్తించారు. -
అయ్యో.. గిరిజ!
కళ్ల ఎదుటే బోరు బావిలో పడిన చిన్నారి ఆడుతూ.. పాడుతూ..అంతలోనే విషాదం! రంగారెడ్డి జిల్లా మంచాలలో ఘటన మంచాల: నాలుగేళ్ల చిన్నారి బోరుబావిలో పడిన విషాదకర సంఘటన రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో చోటు చేసుకుంది. గిరిజ అనే బాలిక ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లింది. అమ్మమ్మ, చిన్నమ్మలు పొలం పనుల్లో ఉండగా...గిరిజ ఆడుకుంటూ ముందుకు వెళ్లి తెరిచి ఉన్న బోరు బావిలో పడిపోయింది. విషయం గమనించిన బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా...ఏసీపీ రాములు తన సిబ్బందితో హుటాహుటిన తరలివచ్చారు. జేసీబీలు సాయంతో బోరుచుట్టూ గుంతలు తవ్వారు. అయినా ఫలితం లేకపోయింది. బోరు 320 అడుగుల లోతుండగా...చిన్నారి దాదాపు 45 అడుగుల లోతులో పడినట్లు గమనించారు. అక్కడ నీరున్నట్లుగా గుర్తించారు. రెండు జేసీబీలతో పనులు వేగవంతం కాకపోవడంతో మరో రెండు జేసీబీలను తీసుకువచ్చారు. పరిస్థితిని గమనించి ఉన్నతాధికారులతో మాట్లాడారు. పాపను రక్షించేందుకు పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం 1.15కు కలెక్టర్ శ్రీధర్‌తోపాటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఘటనా స్థలానికి వచ్చారు. దాదాపు రెండున్నర గంటలకుపైగా అక్కడే ఉండి పనులు పర్యవేక్షించారు. బోరు బావిలోంచి పాపను కాపాడేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. సాయంత్రం కావడంతో మరో రెండు హిటాచీలు తీసుకొని వచ్చి పనులు వేగవంతం చేశారు. సాయంత్రం ఆరు గంటలు గడిచినా ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. బాలిక పరిస్థితి గురించి తెలియరాలేదు. -
బోరు బావిలో బాలిక, కొనసాగుతున్న రెస్క్యూ..!
-
బోరుబావిలో పడ్డ నాలుగేళ్ల చిన్నారి
-
బోరుబావిలో పడ్డ నాలుగేళ్ల చిన్నారి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంచాల వ్యవసాయ క్షేత్రంలో నాలుగేళ్ల చిన్నారి బోరు బావిలో పడింది. గిరిజ అనే అమ్మాయి ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తూ బోరుబావిలోకి పడిపోయింది. బాలిక కుటుంబ సభ్యులతో పాటు రెవెన్యూ అధికారులు, 108 సిబ్బంది అక్కడికి చేరుకుని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. బోరుబావిలోకి ఆక్సిజన్ అందిస్తున్నారు. బోరుబావికి సమాంతరంగా మరో గొయ్యి తవ్వితున్నారు. బాలికను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.